తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

తిరుమల

ఫొటో సోర్స్, ugc

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన తర్వాత తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది.

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపిస్తోంది. దక్షిణాంధ్రతో పాటుగా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

తిరుపతిలో తీవ్రంగా...

భారీ వర్షాలతో తిరుపతి తల్లడిల్లిపోతోంది. గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడుతున్నాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని కాలనీల్లో నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా సతమతమవుతున్నారు.

ఇప్పటికే విరిగిపడిన చెట్లు తొలగించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు కొనసాగుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కూడా తిరుపతిలో భారీ వర్షం కురిసింది.

తిరుపతి

ఫొటో సోర్స్, UGC

తిరుమల దారులు మూసివేత

భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కొండ చెరియలు విరిగిపడుతున్నాయి. ఈ సమస్య తీవ్రమయితే ముప్పు తప్పదని గ్రహించిన టీటీడీ అధికారులు గురువారం రాత్రి సమయంలో ఘాట్ రోడ్లు మూసివేశారు. అలిపిరి నడక దారిలో కూడా అనుమతి రద్దు చేశారు. శుక్రవారం ఉదయం కూడా వర్షాలు కొనసాగుతుండడంతో వాహనాల విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

జాతీయ రహదారిపైనా వరద

వర్షాల తాకిడితో వరద జలాలు జాతీయ రహదారిపైకి చేరాయి. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని తడ సమీపంలో ఎన్ హెచ్ 16పైకి వరద నీరు చేరడంతో రవాణాకి ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల వాహనాలు నిలిపివేశారు.

పంట పొలాల్లోకి కూడా వర్షపు నీరు చేరింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటుగా కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో కూడా వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే పలు చోట్ల పంట పొలాల్లోకి వరద నీరు చేరింది.

తిరుమల

ఫొటో సోర్స్, UGC

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్

వాయుగుండం తాకిడితో ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందలు రంగంలో దిగాయి. చిత్తూరు , నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వాటితో పాటుగా ఎస్డీఆర్డీఎఫ్ కూడా రంగంలో దిగిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. వాయుగుండం తీరని దాటిన నేపథ్యంలో శనివారం అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనా వేశారు.

వర్షాలు కొనసాగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

వీడియో క్యాప్షన్, సైక్లోన్ ఆంఫన్: తుపాను హెచ్చరికలకు అర్థమేంటి?
వీడియో క్యాప్షన్, తెలుగు రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుపాను

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)