21 వారాలకే పుట్టాడు.. అర కిలో బరువు కూడా లేడు

కర్టిస్ మీన్స్

ఫొటో సోర్స్, UNIVERSITY OF ALABAMA AT BIRMINGHAM

ఫొటో క్యాప్షన్, నెలలు నిండకుండానే దాదాపు 19 వారాల ముందే కర్టిస్ మీన్స్ జన్మించాడు

నెలలు పూర్తిగా నిండకుండానే 21 వారాల ఒక రోజుకే పుట్టాడు కర్టిస్ మీన్స్. పుట్టినప్పుడు కేవలం 420 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాడు. అంటే అర కిలో కంటే తక్కువ.

గతేడాది అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో పుట్టిన కర్టిస్.. వరల్డ్ మోస్ట్ ప్రీమెచ్యూర్ శిశువుగా రికార్డు సృష్టించాడు.

కర్టిస్ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. ప్రస్తుతం కర్టిస్‌ వయసు 16 నెలలు.

సాధారణంగా గర్భం దాల్చిన 40 వారాల తర్వాత శిశువులు జన్మిస్తారు. అయితే కర్టిస్ దాదాపు 19 వారాల ముందు నెలలు పూర్తిగా నిండక ముందే జన్మించాడు.

కర్టిస్ మీన్స్

ఫొటో సోర్స్, UNIVERSITY OF ALABAMA AT BIRMINGHAM

ఫొటో క్యాప్షన్, తల్లి మిచెల్ బట్లర్‌తో కర్టిస్(ఎడమ), నియోనాటాలజిస్ట్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్‌తో కర్టిస్ (కుడి)

2020 జులై 4న అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో కర్టిస్‌ తల్లి మిచెల్ బట్లర్‌కి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ మరుసటి రోజే.. కర్టిస్, సి'అస్య అనే కవలలకు మిచెల్ బట్లర్‌ జన్మనిచ్చారు.

సి'అస్య ఒక రోజు తరువాత మరణించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులలో.. వీలైనంత వరకు పిల్లలను తల్లి వద్దే ఉంచడానికి వీలు కల్పిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

కానీ బతకడానికి ఒక శాతం కంటే తక్కువ అవకాశం ఉన్నందున, కర్టిస్ ఇంటెన్సివ్ కేర్‌కే ఎక్కువగా పరిమితమయ్యాడు.

మూడు నెలల తర్వాత కర్టిస్‌కు వెంటిలేటర్‌ అవసరం తీరడంతో దాన్ని తీసేశారు. ఆసుపత్రిలో 275 రోజుల చికిత్స అనంతరం ఈ ఏప్రిల్‌లో డిశ్చార్జ్ చేశారు.

శ్వాస ఎలా తీసుకోవాలో కర్టిస్‌ నేర్చుకోవడానికి థెరపిస్ట్‌లు సహాయం చేయాల్సి వచ్చింది. తినడానికి నోటిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్పించారు.

కర్టిస్ మీన్స్

ఫొటో సోర్స్, UNIVERSITY OF ALABAMA AT BIRMINGHAM

ఫొటో క్యాప్షన్, కర్టిస్‌కి ఇంకా సప్లిమెంటల్ ఆక్సిజన్, ఫీడింగ్ ట్యూబ్‌ అవసరం పడుతోంది

"చివరికి కర్టిస్‌ని ఇంటికి తీసుకెళ్లడం, నా మిగతా పిల్లలకు వారి తమ్ముడిని చూపిస్తూ ఆశ్చర్యపరచడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని అలబామాలోని యుటావ్‌కి చెందిన మిచెల్ బట్లర్‌ అన్నారు.

కర్టిస్‌కు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. సప్లిమెంటల్ ఆక్సిజన్, ఫీడింగ్ ట్యూబ్‌ల అవసరం ఇంకా ఉంది. అయితే కర్టిస్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు చెప్పారు.

"నేను వైద్యవృత్తిలో దాదాపు 20 సంవత్సరాలుగా ఉన్నాను. కానీ ఈ చిన్న పిల్లాడి అంత దృఢంగా మరొకరు ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. కర్టిస్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది" అని డెలివరీని పర్యవేక్షించిన నియోనాటాలజిస్ట్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో అన్నారు.

కర్టిస్ మీన్స్

ఫొటో సోర్స్, UNIVERSITY OF ALABAMA AT BIRMINGHAM

ఇంతకు ముందు విస్కాన్సిన్‌కు చెందిన బాలుడు రిచర్డ్ హచిన్సన్ పేరిట ఉన్న 21 వారాల రెండు రోజుల రికార్డును ఒక నెల వ్యవధిలోనే కర్టిస్ చెరిపేశాడు.

రిచర్డ్‌ కంటే ముందు 21 వారాల ఐదు రోజులతో ఈ రికార్డు కెనడాలోని ఒట్టావాకు చెందిన బాలుడి పేరిట ఉండేది. ఈ రికార్డును దాదాపు 34 సంవత్సరాలపాటూ ఎవరూ అధిగమించలేకపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)