ఐవీఎఫ్: బిడ్డ నల్లగా పుట్టిందనే అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేయించిన ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే...

అలెగ్జాండర్ కార్డినల్, డాఫ్నా

ఫొటో సోర్స్, Peiffer Wolf Carr Kane & Conway

ఫొటో క్యాప్షన్, అలెగ్జాండర్ కార్డినల్, డాఫ్నా

ఐవీఎఫ్ ప్రక్రియలో జరిగిన పొరపాటు వల్ల కాలిఫోర్నియాకు చెందిన మహిళ పరాయి బిడ్డకు జన్మనిచ్చింది.

కాలిఫోర్నియాకు చెందిన డాఫ్నా కార్డినల్, ఆమె భర్త అలెగ్జాండర్ కార్డినల్‌లకు మొదటి సంతానం ఒక ఆడపిల్ల. 2018లో వీళ్లు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా రెండో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.

2019 సెప్టెంబర్‌లో డాఫ్నా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. కానీ, ఆ పిల్లకు తమ పోలికలు లేకపోవడంతో అలెగ్జాండర్ కార్డినల్‌కు సందేహం వచ్చింది.

ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఐవీఎఫ్ ప్రక్రియలో మహిళ అండాలను లాబొరేటరీలో పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఫలదీకరణం చెందిన అండాలను ఆ తర్వాత మహిళ గర్భాశయంలో ప్రవేశపెడతారు.

ఇలా చేసే క్రమంలో వేరొక పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చెందిన అపరిచిత మహిళ అండాన్ని డాఫ్నా గర్భాశయంలో ప్రవేశపెట్టారు.

ఐవీఎఫ్ ప్రక్రియ సమయంలో అండాలు తారుమారవ్వడం ఇదే మొదటిసారి కాదు.

కొంతకాలం కిందట బాలీవుడ్‌లో ఈ గందరగోళంపై అక్షయ్ కుమార్, కరీనాకపూర్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా కూడా వచ్చింది.

నలుపురంగులో ఉన్న ఆడపిల్లను చూసిన తర్వాత తన భర్త నోటివెంట మాట రాలేదని, షాక్‌లో వెనక్కు నడుచుకుంటూ వెళ్లిన ఆయన గోడవద్ద కూలబడ్డారని డాఫ్నా తెలిపారు.

వేరొక మహిళ బిడ్డకు తాను జన్మనివ్వడం, నాలుగు నెలల పాటు ఆ బిడ్డకు పాలిచ్చి, తర్వాత వదులుకోవాల్సి రావటం వంటివి మానసికంగా తమను ఎంతో కుంగదీశాయని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్‌లో ఈవీఎఫ్

ఐవీఎఫ్ ల్యాబ్‌పై కేసు

కార్డినల్ దంపతులు లాస్ ఏంజెల్స్‌కు చెందిన ది కాలిఫోర్నియా సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్ (సిసిఆర్‌హెచ్), అండాన్ని ఫలదీకరణం చేసే విట్రోటెక్ ల్యాబ్స్‌పై కేసు పెట్టారు.

ఈ రెండు సంస్థలూ వైద్యపరమైన అవకతవకలకు పాల్పడ్డాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, మోసపూరితంగా నిజాలను దాచిపెట్టాయని ఆరోపించారు.

అయితే, రెండు సంస్థలూ బీబీసీ ప్రశ్నలకు స్పందించలేదు.

"మా కుటుంబం పడిన వేదన, అయోమయాన్ని తక్కువగా అంచనా వేయొద్దు" అని విలేకరుల సమావేశంలో డాఫ్నా అన్నారు.

"నా సొంత బిడ్డను ఎవరికో అప్పగించారు అనే నిజంతో బిడ్డను కన్న ఆనందం, ప్రసవానికి సంబంధించిన జ్ఞాపకాలు చెదిరిపోయాయి.

నేను జన్మనిచ్చిన బిడ్డను నా దగ్గర ఉంచుకునేందుకు ఆ బిడ్డ నా బిడ్డ కాదు.

నా సొంత బిడ్డను నవమాసాలూ మోసే అవకాశాన్ని నా నుంచి లాగేసుకున్నారు" అని డాఫ్నా అన్నారు.

తమ రెండో బిడ్డ కూడా.. మొదటి బిడ్డలాగే తెలుపు రంగులో పుడుతుందని అనుకున్నామని, కానీ, నల్లని రంగుతో పుట్టిన బిడ్డను చూసి ఆశ్చర్యానికి గురైనట్లు కార్డినల్ దంపతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు.

ఈ పరీక్షల్లో ఆ బిడ్డ వారి బిడ్డ కాదని తేలింది.

వీడియో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

పిల్లల్ని మార్చుకునేందుకు అంగీకారం..

డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే "ఆ గది కూలిపోయినట్లు, తల తిరిగిపోయినట్లు అనిపించింది. ఏం మాట్లాడాలో తెలియలేదు" అని అలెగ్జాండర్ కార్డినల్ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు.

కార్డినల్ దంపతులకు బిడ్డ పుట్టిన వారంలోనే మరొక బిడ్డకు జన్మనిచ్చిన దంపతుల వివరాలను సేకరించేందుకు సిసిఆర్‌హెచ్ సహాయం చేసింది.

అలా వారు తమ సొంత బిడ్డ గురించి తెలుసుకోగలిగారు.

అయితే, అప్పటికి బిడ్డ పుట్టి నాలుగు నెలలు దాటింది.

రెండు జంటల మధ్యా అనేక చర్చలు జరిగాయి. ఒకరు కన్న బిడ్డను మరొకరు అధికారికంగా మార్చుకునేందుకు 2020 జనవరిలో అంగీకారం కుదిరింది.

"నా బిడ్డకు పాలిచ్చే బదులు, వేరొకరికి పాలిచ్చి బంధం ఏర్పరుచుకున్నాను. తర్వాత ఆ బిడ్డను ఇచ్చేయాల్సి వచ్చింది" అని పత్రికా సమావేశంలో డాఫ్నా చెప్పారు.

తమ మొదటి సంతానం అయిన ఏడేళ్ల పెద్ద కూతురికి ఈ సంఘటన అర్ధం చేసుకోవడం చాలా కష్టమయిందని తెలిపారు.

"ఈ పరిస్థితి మిగిల్చిన భయాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు" అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

డాఫ్నా ఒక లైసెన్స్డ్ థెరపిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త అలెగ్జాండర్ పాటల రచయత. ఈ సంఘటన తర్వాత ఆందోళన, ఒత్తిడి, పీటీఎస్‌డి లాంటి సమస్యలకు మానసిక ఆరోగ్య చికిత్స తీసుకున్నట్లు వారిద్దరూ వెల్లడించారు.

అయితే, ఈ వ్యవహారంలో బాధితులైన మరో జంట కూడా కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు కార్డినల్ దంపతుల తరుపున కేసు వాదిస్తున్న న్యాయవాది ఆడం బి వోల్ఫ్ చెప్పారు. అయితే, ఆ జంట వివరాలను గోప్యంగా ఉంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

2019లో సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది.

కాలిఫోర్నియాకు చెందిన దంపతులు తమ బిడ్డ న్యూ యార్క్‌లో పుట్టినట్లు తెలుసుకున్నారు.

ఆ బిడ్డను కన్న తల్లి వీరికి బిడ్డను అప్పగించేందుకు అంగీకరించలేదు. దీంతో కాలిఫోర్నియా దంపతులు ఆమెపై కేసు వేశారు.

ఆ కేసులో అసలైన తల్లితండ్రులకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)