కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?

కుప్పంలో చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలన్నది వైసీపీ ప్రయత్నం

ఫొటో సోర్స్, GETTY IMAGES/YS Jagan Mohan Reddy/fb

ఫొటో క్యాప్షన్, కుప్పంలో చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలన్నది వైసీపీ ప్రయత్నం
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక ఇప్పుడు వాడి వేడిగా సాగుతోంది. ఆంధ్రాలో జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీ పైనే అందరి దృష్టీ ఉంది.

తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తోన్న చోటు కావడంతో, ఈ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్.

భౌగోళికంగా ప్రత్యేకం

కుప్పం మూడు రాష్ట్రాలకు సరిగ్గా మధ్యలో ఉంటుంది. కుప్పానికి ఒకవైపు కర్ణాటక, మరోవైపు తమిళనాడు, మిగిలిన ప్రాంతం ఆంధ్రలో ఉంటుంది. దీంతో ఇక్కడ తమిళ, కన్నడ ప్రజలు కూడా ఉంటారు.

కొత్త మునిసిపాలిటీ

ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గంలో మునిసిపాలిటీ లేదు. కుప్పం మేజర్ గ్రామ పంచాయితీగా ఉంటూ వచ్చింది. 2019 డిసెంబరులో మొదటిసారి కుప్పాన్ని మునిసిపాలిటీగా మార్చారు. కుప్పం పంచాయితీతో పాటూ చుట్టుపక్కల 7 గ్రామాలను కలపి దీన్ని ఏర్పాటు చేశారు.

మొత్తం 25 వార్డుల్లో 52 వేల జనాభా ఉండగా, వారిలో 39 వేల మంది ఓటర్లు ఉన్నారు. మునిసిపాలిటీ అయ్యాక మొదటి ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి.

వీడియో క్యాప్షన్, కుప్పం మున్సిపల్ పీఠం ఎవరిది?

మారుతున్న సమీకరణలు

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న కుప్పం మునిసిపాలిటీ ప్రాంతంలో చివరగా 2013 లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. కుప్పం పంచాయితీలో తెలుగుదేశం ప్రెసిడెంట్ పదవి గెలుచుకోగా, 16 వార్డులు కూడా గెలుచుకుంది. వైయస్సార్సీపీ 4 వార్డులు గెలుచుకుంది.

ఇక మిగిలిన 7 పంచాయితీల్లో కూడా తెలుగుదేశం ప్రెసిడెంట్ పదవులను గెలుచుకుంది.

అయితే కుప్పంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాల్ని సొంతం చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా ప్రెసిడెంట్ పదవులను సొంతం చేసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తెలుగుదేశం బహిష్కరించింది.

అయినా స్థానికంగా కొందరు పార్టీకి పనిచేశారు. కొందరు ఓట్లేశారు. మొత్తానికి ఆ ఎన్నికలనూ వైసీపీ స్వీప్ చేసింది. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది ఆ పార్టీ.

వైసీపీ పోస్టర్
ఫొటో క్యాప్షన్, వైసీపీ పోస్టర్

పెద్దిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ

కుప్పం నియోజకవర్గంపై చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. తన కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికలనూ ఆయన శ్రద్ధగా చూస్తున్నారు.

తాజాగా మునిసిపిల్ ఎన్నికలు మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా అక్కడే మకాం వేశారు.

కుప్పంలో పెద్దిరెడ్డి ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే, తెలుగుదేశం పార్టీ పోస్టర్లలో చంద్రబాబు ఫోటో పక్కన స్థానిక మునిసిపల్ అభ్యర్థి ఫోటో ఉంటే, జగన్ ఫోటో పక్కన మాత్రం అభ్యర్థి ఫోటో కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఫొటో ఉంటుంది.

జగడమే

''ఇన్నాళ్లూ మా కుప్పంలో జగడాలు తెలియవు. ఇప్పుడు చాలా అవుతున్నాయి.'' అని స్థానికంగా పనిచేసుకునే మెకానిక్ రాజశేఖర్ బీబీసీతో అన్నారు.

కుప్పంలో రెండు పార్టీలూ సై అంటే సై అంటూ పోటీకి దిగడంతో గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన వాతావరణం ఇక్కడ కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

ఎలాగైనా కుప్పాన్ని నిలుపుకోవాలన్న తెలుగుదేశం తాపత్రయం, చంద్రబాబు కోటలో పాగా వేయాలన్న వైసీపీ పట్టుదల ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.

కుప్పంలో గతంలో ఎప్పుడూ ఇంతటి హోరా హోరీ ఎన్నికలు జరగలేదు. ఇంత పోటా పోటీ ప్రచారాలు, బయటి నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చి తిరగడం ఇదంతా వారికి కొత్తగా ఉంది.

కొట్లాటలు, కేసులు, బ్యానర్లు చింపడాలు వంటివి గతంలో ఎన్నడూ జరగనంత స్థాయిలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

వైసీపీ, టీడీపీల మధ్య ప్రచార యుద్ధం జోరుగా సాగుతోంది
ఫొటో క్యాప్షన్, టీడీపీ పోస్టర్

మూడు దశాబ్ధాల బాబు

1989లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.

తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కాకుండా మరో పార్టీ గెలవలేదు. అటువంటి చోట మొదటిసారి వైసీపీ చరిత్ర మార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. శక్తినంతా ఉపయోగిస్తోంది.

నిజానికి 2019 ఎన్నికల ముందు నుంచే వైసీపీ ఈ స్థానంపై దృష్టి పెట్టింది. ఆ ఫలితం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడి మెజార్టీ 30 వేలకు పడిపోయింది. తరువాత స్థానిక ఎన్నికల సంగతి తెలిసిందే..

ఏకగ్రీవంపై టీడీపీ నేతల ఆందోళన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఏకగ్రీవంపై టీడీపీ నేతల ఆందోళన

తెలుగుదేశం నాయకుల అరెస్ట్

14వ వార్డు ఏకగ్రీవం విషయంలో వివాదం వచ్చింది. దీంతో కమిషనర్ ఆఫీసుకు వెళ్లిన తెలుగుదేశం నాయకులు అక్కడ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకుని కుప్పం బయట వదిలిపెట్టారు.

ఈ ఘటన రాత్రికి రాత్రి కుప్పంలో పరిస్థితులను ఆందోళనకరంగా మార్చేసింది. తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, చంద్రగిరికి చెందిన పులవర్తి నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రచారం
ఫొటో క్యాప్షన్, టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రచారం

కుప్పాన్ని కాపాడండి - తెలుగుదేశం

అధికార పార్టీ దౌర్జన్యాలూ, దుర్మార్గాల నుంచి కుప్పాన్ని కాపాడండి అనే ప్రధాన నినాదంతో తెలుగుదేశం ప్రచారం చేస్తోంది.

''మా పార్టీ నాయకులను ఇతర ప్రాంతాల వారు అని చెప్పి పంపేశారు. మరి వైసీపీ వారిని ఏమీ అనలేదు. మీకో న్యాయం, మాకో న్యాయమమా? వారు ఎన్ని కుట్రలు చేసినా కుప్పం ప్రజల గుండెల్లో నుంచి చంద్రబాబును తప్పించ లేరు'' అని తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ బీబీసీతో అన్నారు.

గతంలో సర్పంచిగా పని చేసిన ఆయన ఈసారి చైర్మన్ గా బరిలోకి దిగారు.

''కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చాలా కుట్రలు చేస్తున్నారు. ఇక్కడి మైనింగ్ సంపద దోచుకోవడానికే వారు ప్రణాళిక వేస్తున్నారు. అయినా కుప్పం ప్రజలకు చంద్రబాబు మీద నమ్మకం, ఆదరణ మరింత పెరిగాయి. ఈ ప్రభుత్వాన్ని చూశాక బాబుకీ మిగతా వారికీ తేడా తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు మీద మరింత సానుభూతి ఉంది'' అన్నారు కుప్పం తెలుగుదేశం ఇంఛార్జి మునిరత్నం.

వైసీపీ నేతలు, కార్యకర్తల ప్రచారం
ఫొటో క్యాప్షన్, వైసీపీ నేతలు, కార్యకర్తల ప్రచారం

ఆగ్రహమే అనుగ్రహం - వైయస్సార్సీపీ

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చంద్రబాబు అనుచరులపై వ్యతిరేకత ప్రధాన అంశాలుగా వైసీపీ ప్రచారం సాగుతోంది.

''కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అనుచరుల అరాచకాలు, దుర్మార్గాలూ అన్నీ ఇన్నీ కావు. వారి మీద ప్రజలకు పీకల దాకా కోపం ఉంది. ఆ ఆగ్రహమే మాకు అనుగ్రహం అవుతుంది.'' అని వైసీపీ చైర్మన్ అభ్యర్థి డా. సుధీర్ బీబీసీతో అన్నారు.

సుధీర్ వైద్య రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ''నేను గతంలో గుడ్ మాణింగ్ కుప్పం కార్యక్రమం చేపట్టినప్పుడు ఎందరో తమకు అందుతున్న సంక్షేమ పథకాలపై కృతజ్జతలు తెలిపారు'' అన్నారు సుధీర్.

''ఓడిపోతామన్న భయంతోనే తెలుగుదేశం వారు ఆరోపణలు చేస్తున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. పెద్ది రెడ్డన్న ఇక్కడెంతో కష్టపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా గెలిచినట్టే కుప్పంలో కూడా వైయస్సార్సీపీ గెలుస్తుంది'' అని తిరుపతి ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.

బయటి వారితో గొడవలు

''కుప్పానికి బయటి నుంచి వస్తున్న వారి వల్లే గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఇన్ని గొడవలు చూడలేదు'' అని ఆటో డ్రైవర్ శరవణన్ బీబీసీతో అన్నారు.

''ఇప్పుడంతా మారిపోయింది. ఎవరొచ్చినా కుప్పానికి మేలు చేస్తే చాలు.'' అన్నారు తమలపాకులు అమ్ముకునే మలర్.

నవంబర్ 15న కుప్పంలో పోలింగ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)