తాడిపత్రి: రాయలసీమలోని ఈ మున్సిపాల్టీపై సర్వత్రా ఆసక్తి... జేసీ బ్రదర్స్ పట్టు నిలుపుకొంటారా

జేసీ బ్రదర్స్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఇప్పటికే వార్డు కౌన్సిలర్లు, డివిజన్ కార్పొరేటర్ల పదవులకు విజేతలను ప్రకటించారు.

మేయర్, చైర్ పర్సన్ల ఎంపిక కోసం అంతా సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు గురువారం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ఫలితాలు ప్రకటించిన 74 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు... 11 మున్సిపల్ కార్పొరేషన్లలో... ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ‌లోనే ప్రతిపక్ష టీడీపీకి పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో టీడీపీ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొని స్వల్ప మెజార్టీ దక్కించుకుంది.

అయితే, వైసీపీ కూడా పీఠం కోసం పావులు కదుపుతోంది. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా ఉంది.

తాడిపత్రి మునిసిపల్ కార్యాలయం వద్ద భారీ భద్రత
ఫొటో క్యాప్షన్, తాడిపత్రి మునిసిపల్ కార్యాలయం వద్ద భారీ భద్రత

జేసీ బ్రదర్స్ అడ్డా

తాడిపత్రి సుదీర్ఘ కాలంగా జేసీ బ్రదర్స్ అడ్డాగా ఉంది. 1983 నుంచి రాజకీయంగా ఆ కుటుంబానిదే హవా.

జేసీ దివాకర్ రెడ్డి 2009 వరకు వరుసగా ఏడు సార్లు కాంగ్రెస్ నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనేక సందర్భాల్లో గట్టిపోటీ ఎదురైనా ఆయన గట్టెక్కారు.

రాష్ట్ర విభజన తర్వాత జేసీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన ఎంపీగా అనంతపురం నుంచి పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు.

తాడిపత్రి

మున్సిపాలిటీ‌లో తమ్ముడి హవా

జేసీ దివాకర్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దశలో తాడిపత్రి వ్యవహారాలు ప్రభాకర్ రెడ్డి చూసుకునేవారు. ఆ క్రమంలో ఆయన రెండుసార్లు మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించారు.

2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో మాత్రం కొడుకుని పోటీకి దింపి, పరాజయం రుచిచూశారు.

ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని తాజా మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు జేసీ బ్రదర్స్ ఈసారి గట్టిగా శ్రమించారు.

అధికార పార్టీ కూడా అదే స్థాయిలో..

జగన్ సీఎంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేసీ బ్రదర్స్ గత రెండేళ్లలో అనేక చిక్కులు ఎదుర్కొన్నారు.

పలు కేసుల్లో ఇరుక్కున్నారు. కొత్త కేసులతో పాటుగా పాత కేసులు కూడా తెరమీదకు రావడం వారికి తలనొప్పిగా మారింది. ప్రభాకర్ రెడ్డి పలుమార్లు జైలు పాలయ్యారు.

మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ పాగా వేయాలని చూస్తున్న టీడీపీ‌కి చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ కూడా వ్యూహాలు రచించింది.

అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో.మాత్రం ప్రజలు టీడీపీ కూటమికే ఆధిక్యం కట్టబెట్టారు. టీడీపీ 18, సీపీఐ ఒక్క సీటు గెలుచుకోగా, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులో గెలిచారు. వైసీపీకి 16 వార్డులు వచ్చాయి.

ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉండటంతో వైసీపీ కూడా కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

తాడిపత్రి

ఎక్స్ అఫిషియోలపై వివాదం

తాడిపత్రి మున్సిపాలిటీ‌లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా అవకాశం ఇవ్వాలంటూ వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు దరఖాస్తు చేశారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా ఎక్స్ అఫిషియో గుర్తింపు కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వారికి అవకాశం ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

‘‘మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ ఓటు హక్కు ఉండాలి. కానీ అలా లేకపోవడంతో వైసీపీకి చెందిన నలుగురి దరఖాస్తులు తిరస్కరించాం. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి ఓటు ఉందని చెప్పారు. కానీ ఆయన రాయదుర్గం నుంచి ఎమ్మెల్సీ అని పేర్కొన్నారు. దాంతో ఆయనకి కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం దక్కింది. 36 మంది కౌన్సిల్ సభ్యులు ఇద్దరు ఎక్స్ అఫిషియోలతో కలిపి 38 మందికి ఓటింగ్ ఉంది. 19 మంది కోరం వస్తే ఎన్నికలు జరుపుతాం’’ అని ఆయన వివరించారు.

టీడీపీ నేతల ధీమా

తాడిపత్రి మున్సిపాల్టీ తమకే దక్కుతుందని టీడీపీ చెబుతోంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జేసీ అష్మిత్ రెడ్డి బీబీసీతో ఈ విషయమై మాట్లాడారు.

ఇప్పటికే గెలిచిన వారిని హైదరాబాద్ తరలించిన నేపథ్యంలో చైర్‌పర్సన్ ఎన్నికకు ముందు తాడిపత్రి వచ్చేలా టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

"మేమేం కాంప్ నిర్వహించలేదు. జాగ్రత్తగా ఉంటున్నాం. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ కుటుంబానికి ఆదరణ తగ్గలేదని నిరూపించాం. జగన్‌తో నేరుగా తలబడి నిలిచాం. మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేస్తాం" అంటూ అష్మిత్ ధీమా వ్యక్తం చేశారు.

తాడిపత్రి

వైసీపీ కూడా గట్టి ప్రయత్నాలు

టీడీపీకి స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ చైర్ పర్సన్‌ని గెలిపించుకునేందుకు వైసీపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ విషయమై చర్చలు జరిపారు.

చైర్ పర్సన్ ఎంపికపై ఎమ్మెల్యే కేతిరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ... "మా వ్యూహాలు మాకున్నాయి. అవసరమైన మెజారిటీ ఉంది. రేపు కౌన్సిల్ లో చూస్తారు" అని వ్యాఖ్యానించారు.

తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా స్థానిక డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం కల్లా తాడిపత్రి చైర్ పర్సన్ ఎవరన్న విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)