టీవీ డిబేట్‌లో చెప్పు విసిరిన వివాదం: అసలు గొడవ ఎక్కడ మొదలైంది.. ఎవరేమంటున్నారు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు వార్తా చానల్ ‘ఏబీన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఒక ప్యానలిస్ట్, తోటి ప్యానలిస్ట్‌పై చెప్పు విసరడం సంచలనం అయింది.
అమరావతి జేఏసీకి చెందిన డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన రెడ్డిపై చెప్పు విసిరారు. అయితే తాను తప్ప చేయలేదని, క్షమాపణ చెప్పబోనని అంటున్నారు శ్రీనివాస రావు.
అమరావతిలో అసంపూర్ణంగా మిగిలిపోయిన కొన్ని భవనాలను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 3 వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానల్ నిర్వహించిన చర్చలో శ్రీనివాసరావు, విష్ణువర్ధన రెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు.
అమరావతి నిధుల విషయంలో గత ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగారు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి అన్నప్పుడు, మీరు నాన్సెన్స్ మాట్లాడుతున్నారు అంటూ శ్రీనివాసరావు విభేదించారు. ఇది సందర్భం కాదని ఆయన అన్నారు.
అందుకు ప్రతిగా విష్ణువర్థన్ రెడ్డి 'మీరు తెలుగుదేశం కండువా వేసుకుని మాట్లాడాలి' అన్నారు.
నాన్సెన్స్ అని శ్రీనివాసరావు అంటే, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని విష్ణు అన్నారు. అలా వాదన పెరిగింది.
అంతలోనే శ్రీనివాసరావు తన చెప్పును చేతితో తీసి విష్ణువర్థన్ రెడ్డికి చూపించడంతో పాటు వెంటనే దాన్ని ఆయనపైకి విసిరారు.
వాస్తవానికి తమ ఇద్దరికీ గతంలో వ్యక్తిగత పరిచయం లేదని ఇద్దరూ 'బీబీసీ'తో చెప్పారు.
కానీ ఆ చర్చలో చెప్పు విసరడం సంచలనం, చర్చనీయం అయింది. ఆ చానల్‌లో చర్చ నిర్వహించిన పాత్రికేయుడు వెంకటకృష్ణ కూడా తరువాత వివరణ ఇచ్చారు.
అయితే, చెప్పుతో కొట్టిన శ్రీనివాసరావు తన చర్య గురించి మాట్లాడుతూ.. ''అమరావతి కోసం ఆందోళన చేస్తోన్న వారిని విమర్శించే వారికి సరైన సమాధానం చెప్పాను' అన్నారు.

''నేను పరిచయం లేదంటూనే నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు విష్ణు. ఆరోజు నా స్పందనకు ఒక కారణం ఉంది. 430 రోజులకు పైగా అమరావతి ఉద్యమాన్ని వైయస్సార్సీపీ, జగన్ అవమానిస్తున్నారు. రైతులు పెయిడ్ ఆర్టిస్టులు, అది పెయిడ్ ఉద్యమం అంటూ వారి త్యాగాలనూ, పోరాటాన్నీ తక్కువ చేసి, అవహేళన, అవమానం చేసిన నేపథ్యం ఉంది. ప్రత్యేకంగా ఇదే విష్ణువర్ధన రెడ్డి, రైతుల్ని, మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మహిళలు 50 వేల రూపాయల చీరలు కట్టుకుంటున్నారనీ, ఐఫోన్ పట్టుకున్నారనీ, వీళ్లేం రైతులని అన్నారు. అమరావతి ఉద్యమాన్ని అవహేళన చేసిన వారిలో విష్ణు ప్రధాన వ్యక్తి. పైగా ఆరోజు అసలు చర్చ వదిలేసి వేరే అంశం మాట్లాడారు. అసలు టాపిక్ వదిలేసి చర్చను తప్పుదారి పట్టించారు'' అన్నారు శ్రీనివాసరావు.
''ఎప్పుడైతే పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారో ఆ అవమానం, అవహేళన, నిందలకు… ఆవేశం, ఆక్రందన కలిపిన నా స్పందనగా నేను అలా చేశాను. అది ముందుగా అనుకున్నది కాదు. ఆయన అన్నది నన్ను మాత్రమే కాదు, నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న అమరావతి ఉద్యమాన్నీ, అందులో ఉన్న ప్రతీ వ్యక్తినీ అన్నట్టే. ఆరోజు అతను బాడీ లాంగ్వేజ్ వ్యంగ్యంగా ఉంది. ఆత్మ గౌరవం ఉన్న ఎవరూ సహించలేరు.'' అన్నారాయన.
అయితే ఆ చర్యను శ్రీనివాస్ సమర్థించుకుంటున్నారు. ''నేనే తప్పూ చేయలేదు. ఆత్మగౌరవ పోరాటాన్ని, మహిళా రైతులు ఎన్నో త్యాగాలతో చేస్తోన్న పోరాటాన్ని అవమానిస్తూ మాట్లాడిన వ్యక్తికి తగిన సమాధానం చెప్పాను. 'అమరావతి ఉద్యమాన్ని అవమానించే ఎవరికైనా ఇదే సమాధానం' అనే పాఠం నేను చెప్పాను అని భావిస్తున్నాను. నేను ఎలాంటి తప్పూ చేయలేదు'' అని బీబీసీతో చెప్పారు శ్రీనివాసరావు.
''నేను చేసింది భౌతిక దాడి అనుకుంటే, విష్ణు వ్యాఖ్య అంతకంటే పదునైన మానసిక గాయం చేసింది. అది నా ఆత్మగౌరవం మీద దాడి. నేను డబ్బు తీసుకుని మాటాడుతున్నానా? కొంతమంది నాకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని సూచించారు. కానీ అతనేమీ కులం పేరు వాడలేదు. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని నేను కేసు పెట్టలేదు. కానీ మా ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగించే పని ఎవరు చేసినా సమాధానం ఇలానే ఉంటుంది.'' అని బీబీసీతో అన్నారు శ్రీనివాస్.

ఫొటో సోర్స్, Somu veerraju/fb
ఈ ఘటనపై అటు బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందించింది. బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు సహా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆంధ్రా వ్యవహారాలు చూసే దిల్లీ పెద్దలంతా ఈ ఘటనపై స్పందించారు. మొదటి రోజు ఆ పార్టీ ఈ చర్యను ఖండించింది.
''ఆ చానెల్ వారు దీనికి బాధ్యత తీసుకోవాలి. వారే దీనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలి.'' అని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
అయితే ఆ ఘటన జరిగిన మరునాడు తిరిగి శ్రీనివాస్‌ను అదే చానల్ చర్చకు ఆహ్వానించడంతో బీజేపీ ఇంకా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చానెల్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. రెండోసారి చర్చకు పిలవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ విజయవాడ విభాగం దీనిపై ఆందోళన కూడా చేసింది.
ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలుగుదేశం హస్తం ఉందనీ, తెలుగుదేశమే కావాలని ఇదంతా చేయిస్తోందనీ బీజేపీ ఆరోపిస్తోంది.

''తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా తమకు కావల్సిన వ్యక్తలును టీవీల్లో డిబేట్లకు పంపిస్తోంది. ఇలాంటి చేష్టలతో మా పార్టీని, వ్యక్తులను కుంగదీయాలని చిల్లర ఎత్తుగడ వేస్తున్నారు. ఇలాంటివి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేవు. మేం ప్రజల గొంతును వినిపిస్తూనే ఉంటాం.'' అని బీబీసీతో అన్నారు విష్ణువర్ధన రెడ్డి.
''దీనికి చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి. ఇలాంటి చర్యలతో మా పార్టీని ఆపలేరు. వ్యక్తుల స్థైర్యాన్ని దెబ్బతీయలేరు. దీంతో మా స్థైర్యం ఇంకా బలపడుతుంది. చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలి. తెలుగుదేశమే పూర్తి బాధ్యత వహించాలి. ఇది కుట్రపూరితంగా బీజేపీపై తెలుగుదేశం దాడిగా చూస్తున్నాం.'' అన్నారు విష్ణు వర్ధన రెడ్డి.
''నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. అదే మొదటిసారి. అతని మెడలో అమరావతి కండువా లేదు. పైగా, నేను చంద్రబాబు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను స్పందించారు'' అని చెప్పారు విష్ణు.
''ఇది ఒక వికృతమైన సంఘటన. చానళ్లలో నేను కూడా ఎన్నో విమర్శలు చేస్తాను. రాజకీయాలు మాట్లాడవచ్చు. కానీ ఇలా కాదు. ఇంకా దారుణం ఏంటంటే, దాన్నింకా సోషల్ మీడియాలో కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి ఇదేం అరుదైన ఘటన కాదు. బూతులు తిట్టుకోవడం సాధారణం అయిపోయింది. ముఖ్యంగా మీడియాలకు సైన్యాలు బయల్దేరాయి. ఎవరు ఎక్కువ తిడితే అంత గొప్ప అని ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక చానెల్‌లో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుమన్ ఒక వ్యక్తి పై చేయి చేసుకున్నారు. ఆ ఘటన తరువాత ఇదే వరస్ట్ ఇన్సిడెంట్'' అన్నారు రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి.
''ఆ మీడియా సంస్థ దీనిపై ఏదో ప్రకటన ఇచ్చారు. కానీ అది సరిపోదు. ఈ ధోరణిని తాము ప్రోత్సహించబోమని పార్టీలు చెప్పాలి. జేఏసీ అంటే అందర్నీ కలుపుకొనిపోవాలి. ఇలాంటి వాటి వల్ల టీవీ చర్చలంటే గౌరవం పోతోంది. మీడియా సంస్థలు కూడా వీటిపై కఠినంగా వ్యవహరించాలి.'' అన్నారు రవి.
వాదన వినిపించే అవకాశం ఇవ్వడానికే మళ్లీ పిలిచాం: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి
ఈ మొత్తం వ్యవహారంపై ఆ రోజు ఆ చానల్‌లో చర్చ నిర్వహించిన పాత్రికేయులు వెంకట కృష్ణ చానల్ తరఫున స్పందించారు.
చర్చల్లో వాడివేడి వాదోపవాదాలు ఉంటాయని కానీ కంట్రోల్ తప్పి, హుందాగా జరిగే డిబేట్‌లో విచక్షణ లేకుండా ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు.
ఎవరికైనా తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని.. ఒకవేళ వ్యంగ్యంగా విమర్శిస్తే అంతే వ్యంగంగా సమాధానం చెప్పొచ్చు అని కానీ ఇలాంటి ఘటన జరగడం, దుర్భాషలాడటం బాధగా ఉందని అన్నారు.
చెప్పు విసిరిన వెంటనే ఆ ప్రసారాన్ని కొనసాగించకుండా ఆపేశామని.. యూట్యూబ్‌లో కూడా ఆ క్లిప్పింగ్ పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.
లైవ్ లో లక్షలమంది చూస్తుండగా ఇలా జరగడం బాధాకరమని దీనిపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని.. విష్ణువర్ధన్ రెడ్డికి సారీ చెబుతున్నానని అన్నారు. అంతేకాదు ఇకపై డాక్టర్ శ్రీనివాసరావును తన చర్చల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఆ మరునాడే అదే సందర్భంలో చర్చకు ప్రత్యేకంగా శ్రీనివాసరావును ఆహ్వానించారు. అంతకుముందు రోజు జరిగింది దురదృష్టకరమైన ఘటనని.. విమర్శలు సాధారణమే అయినా అంతవరకూ వెళ్లకపోతే ఉంటే బాగుండేదని వెంకటకృష్ణ అన్నారు.
అయితే ముందు రోజు జరిగిన ఘటన తరువాత వెంటనే శ్రీనివాసరావును బయటకు పంపివేశామని, ఆయనకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని.. కాబట్టి ఇప్పుడు ఆయన తన వాదన వినిపించే అవకాశం ఇవ్వడం కోసం చర్చకు పిలిచినట్టు వెంకటకృష్ణ చెప్పారు.
శ్రీనివాసరావు చెప్పు విసరడం ఒక పెద్ద ట్రోల్ గా మారిందని ఈ ఘటనకు ఒక సామరస్య పూర్వక పరిష్కారం ఇవ్వటం కోసమే ఆయనను పిలిచినట్టుగా వెంకటకృష్ణ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








