ఆలివ్ ఆయిల్: నాణ్యమైనదా? కల్తీ అయ్యిందా? ఈ 5 పద్ధతుల్లో తెలుసుకోండి..

ఆలివ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిసిలియా బరియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మోసపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ కొనే వస్తువులను సరిగా చూడకపోవడం వల్ల అప్పుడప్పుడూ మనం మోసపోతూ ఉంటాం.

కొన్నిసార్లు తయారీదారులే మనకు నాసిరకం వస్తువులను అంటగడుతూ ఉంటారు.

ఆలివ్ ఆయిల్ విషయంలోనూ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.

ఆలివ్‌లను చెట్టు నుంచి తెంపినప్పటి నుంచి నూనె తయారు చేసి, మార్కెట్‌లోకి తీసుకురావడం వరకు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది.

ఆలివ్ నూనెలో మోసాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఆలివ్ నూనెను మరో ఆయిల్‌తో కలుపుతారు. కానీ ఆ విషయాన్ని లేబుల్‌లో పేర్కొనరని ఇటాలియన్ తయారీసంస్థ బెల్లుసిలో కలినరీ ఇన్నోవేషన్ డైరెక్టర్‌గా ఉన్న సుసన్ టెస్టా బీబీసీకి వివరించారు.

ఆలివ్ ఆయిల్‌ విక్రయాలను నియంత్రించే ఇంటర్నేషనల్ ఆలివ్ కౌన్సిల్ వంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆలివ్ నూనె ఫ్లేవర్, కలర్, నాణ్యత ఎలా ఉండాలో ఇది చెబుతూ ఉంటుంది.

కానీ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కొన్ని మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కల్తీ ఉత్పత్తుల జాబితాలో యురోపియన్ యూనియన్ ఆలివ్ ఆయిల్‌ను చేర్చింది.

కల్తీ ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని కెనడా ఆహార తనిఖీ ఏజెన్సీ -సీఎఫ్ఐఏ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మీరు కొనే ఆలివ్ ఆయిల్ స్వచ్ఛమైనదేనా అని తెలుసుకోవడానికి స్పెయిన్‌కు చెందిన ఆలివ్ ఆయిల్ నిపుణులు సుసాన రొమేరా ఐదు పద్ధతులు సూచించారు.

ఆలివ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

స్టెప్ 1

ముందుగా.. మీరు కొనే ఆలివ్ ఆయిల్‌ పేరుకు ముందు వెనక ఇంకేమైనా పేర్లు ఉన్నాయేమో చూడండి.

లేబుల్‌పై వర్జిన్ లేదా ఎక్స్‌ట్రా అని లేకపోతే, అందులో మరో నూనె కలిసి ఉండొచ్చు.

ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్ లేదా ఎక్స్‌ట్రా వర్జిన్ అత్యంత నాణ్యమైనదిగా చెబుతారు.

దీని ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది.

స్టెప్ 2

ఆలివ్‌లను పండించిన సమయం, కోసిన తేదీ కోసం లేబుల్‌పై వెతకండి.

ఒకవేళ లేబుల్‌పై ఈ వివరాలు ఉంటే ఆ కంపెనీని కొంతవరకు నమ్మొచ్చు.

ఈ మధ్యే పండించిన తాజా ఆలివ్‌లతో తయారు చేసిన నూనె మంచిది.

ఉదాహరణకు మీరిప్పుడు ఆలివ్ నూనె కొనాలనుకుంటే 2020-21లో పండించిన ఆలివ్‌లతో తయారు చేసిన నూనె మంచిది. ఈ వివరాలు చూడడం వల్ల నూనె తాజాదనం తెలుస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

స్టెప్ 3

ఇక మూడోది.. ఏ రకం ఆలివ్‌లతో నూనె తయారు చేశారో చూడండి. ఒకేరకం ఆలివ్‌లు వాడారా.. లేదంటే వేర్వేరు రకాల (బ్లెండ్) ఆలివ్‌లను కలిపి నూనె తయారు చేశారా అన్నది చూడాలి.

ఈ రెండు రకాల్లో ఏదైనా మంచిదే. కానీ నూనె ఎలా తయారు చేశారన్నది లేబుల్‌పై ఉంటే మంచిది.

దాని వల్ల మనకొక విషయం తెలుస్తుంది. నూనె తయారీకి ఆలివ్‌లు మాత్రమే వాడారని, ఇతర ఫ్యాట్స్ వాడలేదని వారు మనకు చెప్పినట్టు అవుతుంది.

మీరు కొనే నూనెలో ఆలివ్‌లు కాకుండా ఇతర మిశ్రమాలు, కొవ్వు పదార్థాలు కలవలేదని నిర్ధరించుకోవడానికి లేబుల్‌ను జాగ్రత్తగా చదవడం చాలా అవసరం.

స్టెప్ 4

వర్జిన్ లేదా ఎక్స్‌ట్రా ఆలివ్ ఆయిల్ ధరలు సమంజసంగా ఉండాలి. ధర మరీ తక్కువగా ఉంటే అందులో ఏదో తేడా ఉందని అనుకోవాలి.

ఆలివ్ ఆయిల్‌ తయారు చేయడం ఖర్చుతో కూడుకున్నది. ధర తక్కువగా ఉందంటే మీరు అనుమానించాల్సిందే.

ఆలివ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

స్టెప్ 5

ఆలివ్ ఆయిల్‌ సీసా మూత తెరవకుండా ఈ పని చేయలేము. స్వచ్ఛమైన వర్జిన్ లేదా ఎక్స్‌ట్రా ఆలివ్ ఆయిల్ తప్పనిసరిగా ప్రకృతిని గుర్తుకు తెచ్చే సువాసనలను కలిగి ఉండాలి. అంటే పండ్లు, గడ్డి, పూలు.. ఇలా ఆలివ్ రకాన్ని బట్టి ఈ సువాసన ఉంటుంది.

నూనెకు సహజ వాసనలు ఉండాలి. కానీ అసాధారణ లేదా అసహ్యకరమైన వాసనలు ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు.

ఇవి కూడా ముఖ్యమే..

ఆలివ్ ఆయిల్ బాటిల్ డార్క్ గ్లాస్‌తో చేసిందో కాదో కూడా చూడాలని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. డార్క్ గ్లాస్‌తో చేసిన బాటిల్ ఆలివ్ ఆయిల్ నాణ్యత కోల్పోకుండా ఉంచుతుందని అంటున్నారు. లేదా ఆ బాటిల్ ఎక్కడ తయారైందన్న స్పష్టమైన సమాచారం దానిపై ఉండాలని చెబుతున్నారు.

కొన్ని కంపెనీలు దిగుమతి చేసుకున్న దేశం పేరును హైలెట్ చేస్తుంటాయి. అలాకాకుండా అదెక్కడ తయారైందో కూడా దానిపై స్పష్టంగా ఉండాలి.

అసిడిటీ ఎంతనేది కూడా బాటిల్‌పై రాసి ఉంటుందని, మంచి ఆయిల్‌లో అసిడిటీ చాలా తక్కువగా (0.8 డిగ్రీల కంటే తక్కువ) ఉంటుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న ధరలు

గత కొన్ని సంవత్సరాలుగా మధ్యధర ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలివ్ ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఒకవైపు ధరలు పెరుగుతుండగా, వినియోగం మాత్రం తగ్గుతోంది.

2016-17 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆలివ్ ఆయిల్ వినియోగం దాదాపు 6శాతం తగ్గిందని అంతర్జాతీయ ఆలివ్ కౌన్సిల్ చెబుతోంది. ఇక యూరప్‌లో ఈ తగ్గుదల 12శాతం వరకు ఉంది.

పెరుగుతున్న ముడి సరుకుల ధరల నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఆలివ్ నూనె తయారీలో వాడే పదార్థాల్లో మార్పులు చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆలివ్ ఆయిల్‌లో మోసాలు జరుగుతున్న మాట నిజమేనని రొమేరా చెప్పారు.

ఆలివ్ నూనె నాణ్యత గురించి వినియోగదారులకు పెద్దగా తెలియదు. కంపెనీలు తక్కువ నాణ్యత గల నూనెను ఎక్కువ ధరకు విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉంటే మోసపోయే అవకాశం తగ్గుతుందని రొమేరా అన్నారు.

2025 నాటికి గ్లోబల్ ఆలివ్ ఆయిల్‌ మార్కెట్, అమెరికాను మించిపోతుందని కన్సల్టింగ్ సంస్థ హెక్సా రిసెర్చ్ పేర్కొంది. ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, చైనా నుంచి ఆలివ్ నూనెకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. ఆలివ్ ఆయిల్ వాడకంలో మిలీనియల్స్ ముందున్నారని వివరించింది.

వీడియో క్యాప్షన్, వేరు శెనగ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఆలివ్ ఆయిల్.. ఏ నూనె ఆరోగ్యానికి మంచిది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)