భారత్‌లో నిజంగానే మహిళల సంఖ్య పెరిగిపోతోందా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
మహిళలు, పిల్లల ఆరోగ్యంపై భారత ప్రభుత్వం నిర్వహించిన అయిదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్) ఫలితాలు విడుదలైనప్పుడు, ఒక సంఖ్య అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ సర్వే ప్రకారం, భారత్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. అంతకు ముందు అంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం, ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు.
ఆశ్చర్యం కలిగించే ఈ నెంబర్ గురించి తెలుసుకునే ముందు, ఇది తప్పుదోవ పట్టించే అంకె అన్న విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేది 'నమూనా సర్వే'. జనగణన అందుకు భిన్నం. నమూనా సర్వేలో కొన్ని ఇళ్లను మాత్రమే లెక్కిస్తారు. కానీ, జనాభా గణనలో దాదాపు 125 కోట్లమంది జనాభాను రికార్డు చేస్తారు.
అయిదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో సుమారు ఆరు లక్షల కుటుంబాలను మాత్రమే సర్వే చేశారు.
ముంబయిలో ఆరోగ్య సంబంధిత సమస్యలపై పనిచేస్తున్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 'సెహత్' (CEHAT) కన్వీనర్ షర్మిలా రెగే మరో విషయం కూడా చెప్పారు.
"జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వలస వెళ్లిన వారిని పరిగణనలోకి తీసుకోదు. గృహాలలో సర్వే చేసినప్పుడు, ఆ ఇళ్లలోని మగవాళ్లు పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చు. అప్పుడు సహజంగానే మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది'' అని రెగే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి ఈ సర్వేలోని డేటా అంతా తప్పేనా?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, ప్రభుత్వం తరపున ఈ సర్వేను నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్'ని సంప్రదించాను.
స్త్రీ పురుష నిష్పత్తిని తెలుసుకోవడానికి జనాభా గణన ఒక్కటే సరైన విధానమని ప్రొఫెసర్ ఆర్.బి. భగత్ అన్నారు. 'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్' సంస్థకు చెందిన 'మైగ్రేషన్ అండ్ అర్బనైజేషన్ స్టడీస్'లో భగత్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
"నమూనా సర్వేలో తప్పులు ఉండే అవకాశం ఉంది. తదుపరి జనాభా గణన జరిగినప్పుడు, 2011తో పోలిస్తే లింగ నిష్పత్తి మెరుగ్గా ఉండాలి, కానీ నాకు అలాంటి సూచనలు కనిపించ లేదు'' అన్నారాయన.
‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ మాజీ డైరెక్టర్ సంజయ్ కుమార్ కూడా ఈ సర్వే ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. అయితే, సర్వే జరిపే విధానంలో మాత్రం లోపం లేదని ఆయన అన్నారు.
"నమూనా సర్వే ఒక నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం చేస్తారు. శాంపిల్స్ సేకరణ జాగ్రత్తగా జరిగితే, అది చిన్నదైనా, కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది'' అన్నారాయన.
స్త్రీ పురుష నిష్పత్తి 1020:1000ని అర్ధం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలు, గ్రామీణ-పట్టణ ప్రాంతాల ఫలితాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MINT
మరి సర్వేలో పురుషుల కంటే ఆడవారు ఎందుకు ఎక్కువగా ఉన్నారు?
పురుషులతో పోలిస్తే, స్త్రీలకు ఆయుర్ధాయం ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చని సంగీత రెగే అభిప్రాయపడ్డారు.
2013-17 సంవత్సరానికి భారత సెన్సస్ డిపార్ట్‌మెంట్ అంచనాల ప్రకారం, భారత దేశంలో స్త్రీల సగటు జీవితకాలం 70.4 సంవత్సరాలు కాగా, పురుషులది 67.8 సంవత్సరాలు.
దీనితోపాటు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సంభవించే తల్లుల మరణాల శాతం కూడా చాలా వరకు తగ్గింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోక్‌సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం, 2014-16లో ప్రతి లక్షమంది పిల్లల తల్లుల్లో 130 మంది మరణించగా, 2016-18 నాటికి ఈ సంఖ్య 113కి తగ్గిందని సర్వేలు గుర్తించాయి.
మహిళలకు సంబంధించిన మరింత సమాచారం ఈ సర్వేకు అందడం కూడా దీనికి ఒక కారణం కావచ్చని ప్రొఫెసర్ భగత్ అన్నారు.
"ఇంతకు ముందు, కుటుంబాలలో మహిళలకు ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, గత దశాబ్ద కాలంలో మహిళలపై దృష్టి సారించే అనేక ప్రభుత్వ పథకాలు రావడంతో, వారి పేర్లను అధికారికంగా నమోదు చేసుకునే అవకాశం పెరిగింది. స్త్రీలకు సంబంధించిన సమాచారం లోపం లేకుండా పోయింది. అందుకే మహిళలు ఈ సర్వేల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు '' అన్నారాయన.

ఫొటో సోర్స్, NARINDER NANU
లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు తగ్గిపోయాయా?
పుట్టినప్పుడు స్త్రీపురుష నిష్పత్తి అంటే 'సెక్స్ రేషియో ఎట్ బర్త్' (ఎస్ఆర్‌బి)ని 1020:1000 గా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. వాస్తవంగా ఇది గతంలో 929:1000 ఉండేది.
ఎస్ఆర్‌బి ని గడిచిన అయిదు సంవత్సరాలలో పుట్టిన పిల్లల జనాభా నుంచే గణిస్తారు.
‘‘లింగ నిర్ధరణలు, భ్రూణ హత్యల స్థితిని అర్ధం చేసుకోవడానికి ఎస్ఆర్‌బి అనేది ఉత్తమమైన మార్గం తప్ప, ఓవరాల్ స్త్రీ పురుష నిష్పత్తిని తెలుసుకోవడానికి ఇది సరిపోదు’’ అని ప్రొఫెసర్ భగత్ అన్నారు.
అయిదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేకు ముందు 2011లో జాతీయ జనగణన జరిగింది. అప్పుడు ఆరేళ్లలోపు పిల్లల్లో స్త్రీ పురుష నిష్పత్తి 919:1000 మాత్రమే ఉంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకటించిన డేటాను చూసి నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ రాబోయే రోజుల్లో ఇది నిజం కావచ్చన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.
''ఈ నిష్పత్తి నిజమైతే బాగుండు'' అని 'పాపులేషన్ ఫస్ట్' డైరెక్టర్, ఎ.ఎల్. శారద అన్నారు. ఈ ఎన్జీవో సంస్థ ప్రజారోగ్యం, జనాభా పై పని చేస్తుంది.
''2031 జనాభా లెక్కలపై నాకు చాలా ఆశలున్నాయి. సమాజం ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు బడికి వెళ్తున్న పిల్లలు అప్పటికి పెళ్లిళ్లు చేసుకుని తల్లిదండ్రులవుతారు. ఇప్పుడు ప్రతి పథకంలోనూ సమానత్వం గురించి బోధిస్తున్నారు. ఈ ఆలోచనలతో ఎదిగిన వారు ఈ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళతారు'' అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’
- క్రిప్టోకరెన్సీ చట్టం గురించి ఎందుకింత గందరగోళం? కీలక ప్రశ్నలు... సమాధానాలు
- 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 23 మంది మృతి.. దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే..
- ఉద్దానం కిడ్నీ బాధితులు: ‘ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతా, అప్పులు చేసి చావడమెందుకు?’
- ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529
- ‘పోలీసులకు తెలియకుండా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉంది.. ’
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








