ఇథియోపియా తొలి మహిళా అధ్యక్షురాలు షాహ్లె : అమ్మ తోడు.. అందరూ సుఖశాంతులతో ఉండేలా చూస్తా

ఫొటో సోర్స్, Reuters
ఇథియోపియాకు దేశాధ్యక్ష స్థానానికి తొలిసారి ఒక మహిళను ఎన్నుకున్నారు. ఆ దేశ పార్లమెంటు సభ్యులు షాహ్లె వర్క్‌జ్యూడెను దేశాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఆమె తప్ప మహిళలెవ్వరూ అధ్యక్ష స్థానాల్లో లేరు.
వారం కిందటే ఇథియోపియా ప్రధాని అమీ అహ్మద్ తన మంత్రివర్గం ఏర్పాటు చేసి అందులో సగం మంది మహిళలను తీసుకోగా.. ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్ష స్థానానికీ మహిళను ఎన్నుకుని చరిత్ర లిఖించారు.
అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం షాహ్లె పార్లమెంటులో మాట్లాడుతూ.. ఇథియోపియాలో స్త్రీపురుష సమానత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
''అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. దేశంలో శాంతి వెల్లివిరిసేందుకు కృషిచేస్తా. దీనికి ప్రజలంతా సహకరించాలి'' అంటూ పార్లమెంటులో భావోద్వేగభరితంగా ప్రసంగించారు.

మహిళా హక్కుల కోసం పోరాటం
- బెకెలా అటోమా, బీబీసీ అఫామా ఒరోమూ
ఇథియోపియా నూతన అధ్యక్షురాలు పదవి చేపట్టిన తొలి రోజు నుంచే స్త్రీపురుష సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. మంత్రివర్గంలో స్త్రీలకు సమాన ప్రాధాన్యం దక్కినప్పటికీ మిగతా రంగాల్లో మాత్రం విపరీతమైన అంతరం ఉంది. షాహ్లె ఎన్నికను సోషల్ మీడియాలో నెటిజన్లు స్వాగతిస్తున్నారు.. చరిత్రాత్మకం అంటూ ప్రస్తుతిస్తున్నారు. ఆధునిక యుగంలో ఇథియోపియాకు తొలి మహిళా దేశాధినేత ఆమెనే అంటూ... 20వ శతాబ్దపు తొలినాళ్లలో మహారాణి జ్యూదితు కూడా దేశాన్ని పాలించిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.

ములాతూ రాజీనామాతో అవకాశం
షాహ్లెకు ముందు అధ్యక్షుడిగా ఉన్న ములాతు తెషోమ్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆమెను ఎన్నుకున్నారు.
''ఇథియోపియా వంటి పితృస్వామ్య సమాజంలో మహిళను దేశాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం కేవలం ఒక ప్రమాణాన్ని నిర్దేశించడంగానే కాకుండా భవిష్యత్తులో ప్రజాజీవితంలోనూ మహిళలు నిర్ణయాధికారం గలవారిగా ఎదిగే వీలు కలుగుతుంది'' అని ప్రధాని అమీ అహ్మద్ సిబ్బంది వ్యవహారాల చీఫ్ ఫిట్సుమ్ అరెగా ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, AFP
కాగా.. షాహ్లె ఇంతకుముందు సెనెగల్, దిజిబౌటీల్లో ఇథియోపియా రాయబారిగా పనిచేశారు.
ఐరాసలోనూ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో శాంతిస్థాపక బృందం అధినేత వంటి పలు కీలక పదవుల్లో పనిచేశారు. అధ్యక్షురాలు కావడానికి ముందు వరకు ఆమె ఆఫ్రికన్ యూనియన్‌కు ఐరాస ప్రతినిధిగా ఉన్నారు.
రాజకీయ అధికారమంతా ప్రధాని చేతిలో ఉండే ఇథియోపియాలో అధ్యక్ష పదవి లాంఛనమే అయినప్పటికీ అత్యున్నత పదవి అదే.
మారిషస్ అధ్యక్షురాలిగా ఉంటూ మార్చిలో అమీనా గురీబ్ ఫకీమ్ రాజీనామా చేసిన తరువాత ఆఫ్రికా ఖండంలో దేశాధినేతలుగా మహిళలెవ్వరూ లేరు. ఇప్పుడు షాహ్లె మళ్లీ ఆఫ్రికా ఖండంలో ఆ లోటు భర్తీ చేశారు.
ఇవి కూడా చదవండి
- BBC Special: భారత బీచ్‌లలో అణు ఇంధనం... అందాలంటే 30 ఏళ్లు ఆగాలి
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- పందొమ్మిది గంటల పాటు ఎక్కడా ఆగకుండా విమాన ప్రయాణం
- అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- బ్రిటన్ కంటే భారత్‌లోనే బిలియనీర్లు ఎక్కువ: అయితే సామాన్యులకు లాభమేంటి?
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








