#MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న #MeToo ఉద్యమం బాలీవుడ్‌తో పాటు ఇతర రంగాల ప్రముఖులకు నిద్ర పట్టకుండా చేస్తోందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ అన్నారు. ఈ ఉద్యమానికి తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు.
‘ఈ దేశంలో చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దేవతలకు గుళ్లు కడతారు. ఇళ్లలో ఫొటోలు, విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు. అదే ఇంట్లో ఆడవాళ్లను వేధిస్తారు. మహిళలను లైంగికంగా వేధించేవాళ్లు తమ శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు’ అని మహేష్ భట్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
ఒక మహిళ ‘నో’ చెప్పినా కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లయితే, అది లైంగికంగా వేధించినట్లేనని ఆయన అన్నారు.
నటుడు నానా పాటేకర్ గతంలో తనను వేధించారంటూ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇప్పటిదాకా బాలీవుడ్ ప్రముఖులెవరూ దాని గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ, మహేష్ భట్ ఆ ఘటనపై నోరు విప్పారు. ఆయన తనుశ్రీ దత్తాను సమర్థించారు. తాను ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో చెప్పట్లేదని, కానీ ఎవరైనా తమ గొంతును వినిపిస్తున్నప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదని ఆయన అన్నారు.
‘నానా పాటేకర్‌ను ఒకరు వేలెత్తి చూపించారు. ఆ ఆరోపణలు చేసింది కూడా ఈ పరిశ్రమకు చెందిన మహిళే. ఆమె ఇన్నాళ్లకు మౌనం వీడింది. ఆమె చేసిన ఆరోపణలు నిజమో, కాదో తెలుసుకోవడానికి నాకు ఎలాంటి మార్గం కనిపించలేదు. కానీ, ఆమె గొంతును అణచివేసే హక్కు కూడా నాకు లేదు’ అంటారు మహేష్ భట్.

లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని భట్ చెప్పారు. ‘తనుశ్రీ ఓ నటి. నానా పాటేకర్ చాలా పేరున్న కళాకారుడు. సమాజంలో ఆయనకు చాలా గౌరవం ఉంది. సమాజ సేవ కూడా చేస్తాడు. కాకపోతే అతడి జీవన శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు’ అని ఆయన అన్నారు.
ఒకప్పుడు మహిళలు మౌనంగా ఉండేవారని, సమాజానికి భయపడి తమపై జరిగిన వేధింపులను బయట పెట్టేవారు కాదని భట్ చెప్పారు. కొన్ని ఇళ్లల్లో తల్లులే తమ కూతుళ్ల నోళ్లు మూయించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందని, అమ్మాయిలు ధైర్యంగా బయటికొస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
‘కోర్టు శిక్షల వల్లో, ప్రజల ఆగ్రహం వల్లో, లేక #MeToo లాంటి ఉద్యమాల వల్లో ఈ పరిస్థితి మారదు. మార్పు మనసులో నుంచి మొదలవ్వాలి. మహిళలతో ఎలా వ్యవహరించాలో ప్రతి మనిషికీ తెలియాలి. ఇది నైతికతకు సంబంధించిన విషయం. మనసుకు సంబంధించిన విషయం’ అంటారు భట్.

#MeToo ఉద్యమంలో భాగంగా నానా పాటేకర్‌తో పాటు వికాస్ బేల్, ఉత్సవ్ చక్రవర్తి, ఎంజె అక్బర్ లాంటి ప్రముఖుల పేర్లు బయటకొస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము గతంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి రాస్తున్నారు.
‘ఇప్పుడు మనం సోషల్ మీడియాలో జరిగే ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. కానీ, ట్విటర్, ఫేస్‌బుక్ లాంటి వేదికల్లో లేని వారి పరిస్థితి ఏంటి? వాళ్లంతా ఎక్కడికి వెళ్లాలి? ఇది దేశంలో ఈ రోజు మొదలైన సమస్య కాదు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి.
అలాగని నిజం ఏంటో తేలకముందే వ్యక్తులపైన ఓ అభిప్రాయానికి రావడం సరికాదు. నటుడు షైనీ అహూజా పైన అత్యాచార ఆరోపణలు వచ్చినప్పుడు అతడు నన్ను కలవడానికి వచ్చాడు. అతడితో మాట్లాడితే నా గౌరవం దెబ్బతింటుందని కొందరు చెప్పారు. కానీ, కోర్టులో దోషిగా తేలేవరకు మనంతట మనమే వారిని దోషులుగా తేల్చడం సరికాదని నేను చెప్పేవాడిని. నాకు షైనీ బాగా తెలుసు. అతడిని పరిశ్రమకు పరిచయం చేసింది నేనే. కానీ, తెరవెనుక అతడు ఏం చేస్తాడో నాకు తెలీదు’ అన్నారు భట్.

ఫొటో సోర్స్, iStock
సంజయ్ దత్‌కు కూడా మహేష్ భట్ మద్దతుగా నిలిచారు. ఆయన జైలుకు వెళ్లేప్పుడు భట్ కూడా అక్కడిదాకా వెంట వెళ్లారు.
‘సంజయ్ జైలుకు వెళ్లేప్పుడు పరిశ్రమ నుంచి అతడికి ఎవరూ అండగా నిలబడలేదు. అప్పుడు కూడా నన్ను అతడితో వెళ్లొద్దన్నారు. అతడితో కలిసి పని చేయొద్దని చెప్పారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం కూడా అలాంటి వాళ్లకు దూరంగా ఉంటారు. కానీ, అన్నిసార్లూ ఆరోపణలు నిజం కాలేవు. అందుకే, నాకు తెలిసిన వాళ్ల విషయంలో ఎవరెన్ని చెప్పినా నేను వెంటనే నమ్మను. అందుకే నేను సంజయ్ వెంట వెళ్లా.
ఇప్పుడు నానా పాటేకర్, తనుశ్రీ విషయంలో కూడా అంతే. ఇద్దరూ వ్యక్తిగతంగా నాకు పెద్దగా తెలీదు. పాటేకర్‌ను గతంలో కలిశా. ఇద్దరూ కూడా తాము చెప్పేది నిజమనే అంటున్నారు. ఇద్దరికీ తమ గొంతు వినిపించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. అందుకే కోర్టు ఈ విషయంలో తీర్పు చెప్పే వరకూ మనం ఎదురుచూడాలి’ అని భట్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








