బ్రిటన్‌లో లైంగిక వేధింపులు: స్కూల్ యూనిఫాంలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి లైంగిక వేధింపులు

యూనిఫాంలో అమ్మాయిలు

బ్రిటన్‌లో స్కూల్ యూనిఫాంలో ఉన్న ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

రెండొంతుల మంది అమ్మాయిలు ఇబ్బందికర చూపులను ఎదుర్కొన్నట్లు ఆ పరిశీలనలో తేలింది.

యూకేకు చెందిన ‘చిల్డ్రన్స్ చారిటీ ప్లాన్ ఇంటర్నేషనల్’ పరిశీలనలో ఈ అంశాలు వెలుగుచూశాయి. బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురవడం అనేది ఎదుగదల ప్రక్రియలో ఓ భాగమని చాలామంది అమ్మాయిలు భావిస్తున్నట్లు ఆ పరిశీలన చెబుతోంది.

ఈ వేధింపులకు చుట్టపక్కల ఉన్నవాళ్లే స్పందించాలని ఆ సంస్థ కోరుతోంది.

బ్రిటన్‌కు చెందిన 14-21ఏళ్ల మధ్య ఉన్న వెయ్యి మంది టీనేజర్లకు ఒపీనియన్ పోల్ నిర్వహించి ఈ వివరాలను సేకరించారు. వారితో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు.

ఆ పరిశీలనలో తేలిన విషయాలివి:

  • బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందికర చూపులను, అపరిచితుల శారీరక స్పర్శను ఎదుర్కొన్నట్లు 66శాతం మంది టీనేజర్లు చెప్పారు.
  • తమను అసభ్యకరంగా తాకారని, లైంగికంగా వేధించారని 35శాతం మంది అమ్మాయిలు తెలిపారు.
  • తక్కువలో తక్కువ ఎనిమిదేళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు తెలిసింది.
  • స్కూల్ యూనిఫాం ధరించినప్పుడు అనేక రకాలైన వేధింపులకు గురైనట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు చెప్పారు.
  • అపరిచితులు అనుమతి లేకుండా తమను ఫొటోలు తీసినట్లు నాలుగోవంతు అమ్మాయిలు తెలిపారు.
మహిళ

ఈ నివేదిక కోసం తమ అభిప్రాయాన్ని పంచుకున్న వాళ్లలో 19ఏళ్ల మలికా అనే యువతి ఒకరు. తాను ఓసారి నడిచి వెళ్తున్నప్పుడు ఎవరో కారులో అనుసరించారని ఆమె చెప్పారు.

‘నేను ఫోన్ మాట్లాడుతున్నట్టు నటించి మరి కొన్ని క్షణాల్లో మా నాన్న అక్కడికి వస్తున్నట్లుగా వ్యవహరించాను. దాంతో కారులోని వ్యక్తి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి సాయంత్రాలు నేను బయటకు వెళ్లేప్పుడు మా అమ్మానాన్నా చాలా అప్రమత్తంగా ఉంటారు’ అని మలికా అన్నారు.

వీధుల్లో వేధింపులు సాధారణ విషయాల్లా మారిపోయాయని 17ఏళ్ల మరో యువతి అభిప్రాయం.

బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను మహిళలపై హింసగా గుర్తించాలని చిల్డ్రన్స్ చారిటీ కోరుతోంది. ‘స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలు ఈ స్థాయిలో వేధింపులకు గురవుతున్నారని తెలుసుకొని అవాక్కయ్యా. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం’ అని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ తాన్యా బారన్ అన్నారు.

అంత చిన్న వయసు పిల్లల్ని చూసి వెకిలిగా ఈలలు వేయడం, అసభ్యంగా తాకడం లాంటి పనులు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని ఆమె చెప్పారు. ఇలాంటి పనులను వెంటనే ఆపేయాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)