ఆంధ్రప్రదేశ్ - ఉద్దానం కిడ్నీ బాధితులు: ‘ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతా, అప్పులు చేసి చావడమెందుకు?’ - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం....
"నెలకు పదివేలు ఖర్చు పెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక ఇక్కడ దొరికే మందుబిళ్లలో, ఆకులో వాడుతున్నాను. నెలనెలా అంత డబ్బంటే అప్పులు పాలవడమే కానీ, వ్యాధి ఎలాగు నయం కాదు. అందుకే ఆసుపత్రుల చుట్టూ తిరగడం మానేశాను. ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతా."
ఇవి సోంపేట మండలం ఇద్దివానిపాలెంకు చెందిన సావిత్రి చెప్పిన మాటలు. ఉద్దానం ప్రాంతంలోని వేలమంది కిడ్నీ బాధితుల్లో సావిత్రి ఒకరు.
ఇద్దివానిపాలెం 4 వేల మంది ఉండే ఒక మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో 300 వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు. వ్యాధి బారిన పడిన ప్రతి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది.
అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం కంటే...ఎంతకాలం అయితే అంతకాలం బతుకుతాం అంటూ మొండిగా వైద్యం మానేస్తున్నారు కొందరు.
ఉద్దానంలోని కిడ్నీవ్యాధి బాధిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో ఏడాది బీబీసీ తెలుగు టీం పర్యటించి, ఇక్కడ పరిస్థితులను వార్త కథనాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఏడాది సోంపేట మండలంలోని కిడ్నీ వ్యాధి బాధిత గ్రామాల్లోని పరిశీలనకు బీబీసీ తెలుగు టీం వెళ్లింది. బాధిత గ్రామాల్లో సరాసరి 10% కొత్త కేసులు నమోదవుతుండగా... అదే స్థాయిలో మరణాలు ఉంటున్నాయి.
అలాగే, వ్యాధి ప్రభావిత కుటుంబాల ఆర్థిక స్థితి తలకిందులైన పరిస్థితులు కనిపించాయి.
అయితే ఇదంతా ఇక్కడ మామూలేని స్థానికులు అంటున్నారు. మరోవైపు వ్యాధి మూలాలు కనుగోనేందుకు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

కోనసీమ లాంటి ఉద్దానం...కిడ్నీ వ్యాధుల నిలయం
ఉద్దానం పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధులే గుర్తొస్తాయి. కానీ, ఇక్కడి పచ్చదనం కోనసీమ ప్రాంతాన్ని తలపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్ని ఉద్దానం అంటారు.
''ఇక్కడున్న దాదాపు లక్షమంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే. అందులో 21 శాతం మంది దశాబ్ధ కాలం కంటే ఎక్కువగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు'' అని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ చెప్పింది.
ఈ సంస్థ ఉద్దానం ప్రాంతంలో వ్యాధి మూలలను కనుగోనేందుకు పరిశోధనలు చేస్తోంది.
సాధారణంగా రక్తంలో సిరం క్రియాటినిన్ 1.2 mg/dL (మిల్లీ గ్రామ్/డెసీలీటర్ - వీటిని స్థానికులు పాయింట్లు అంటారు) కంటే ఎక్కువగా ఉంటే... మూత్రపిండాలు సరిగా పని చేయడంలేదని అర్థం.
ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటినిన్ లెవెల్స్ చాలామందిలో 25 mg/dL కూడా ఉన్నాయి.
క్రియాటినిన్ 5 దాటితే వారికి డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. దీంతో వీరికి వారానికి రెండు, మూడుసార్లు కూడా డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, శ్రీకాకుళం, సోంపేట, కవిటి, పాలకొండలలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు వెయ్యి మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఈ డయాలసిస్ చేసుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే ఈ సాయం అందుకోవడానికి కొన్ని నిబంధనలు ఉండటంతో అవసరమైన వారందరికీ ఆర్ధికంగా అండ లభించడం లేదు.
కిడ్నీ బాధితులకు 'వైఎస్‌ఆర్ భరోసా' పేరుతో ఏపీ ప్రభుత్వం రూ. 5 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. వ్యాధి తీవ్రత, క్రియాటినిన్ స్థాయి వంటి లెక్కలు, ఇతర నిబంధనలతో చాలా తక్కువ మందికి మాత్రమే సాయం అందుతోందని వ్యాధి బాధితులు వాపోతున్నారు.
వ్యాధికి గురైన వారిలో మొదటి దశలో కిడ్నీలు 35 నుంచి 50 శాతం పాడవుతాయి. తర్వాత 80 శాతం వరకు, మూడో దశలో 80 శాతం కంటే ఎక్కువ కిడ్నీలు పని చేయడం మానేస్తాయి. దాంతో వీరికి డయాలసిస్ అవసరమవుతుంది.
"వ్యాధి బాధితునికి సీరం క్రియాటినిన్ స్థాయి మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు వైద్య పరీక్షల్లో 5 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ కావాలి. అలాగే కిడ్నీ శుద్ధి సామర్థ్యం, కిడ్నీ పరిమాణం వంటి లెక్కలు కూడా ఈ ఆర్థిక సాయం పొందే అర్హతను నిర్ణయిస్తాయి. ఈ పద్ధతిలో జిల్లాలో చాలా తక్కువ మందే అర్హత సాధించే పరిస్థితి ఉంది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వైద్యడు తెలిపారు. ఆయన ఓ డయాలసిస్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

పైగా, ఈ వైద్య పరీక్షల నిర్వహణ ఒకే చోట జరగదు. పీహెచ్‌సీలలో క్రియాటినిన్ పరీక్షలు చేస్తారు. మిగిలిన వాటికోసం శ్రీకాకుళంలోని సర్వజనాసుపత్రికి వెళ్లాలి. అక్కడ పింఛను అర్హతను నిర్ణయిస్తారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే ఆర్థిక సాయానికి అర్హత పొందుతున్నవారి సంఖ్య చాలా తక్కువని సదరు వైద్య నిపుణుడు అభిప్రాయపడ్డారు.
''క్రియాటినిన్‌తో పాటు ఇతర అంశాలు చాలా తక్కువ వ్యవధిలోనే మారిపోతుంటాయి. వీటి లెవెల్స్ 5 లేకపోయినా కూడా కొందరికి కిడ్నీ పరిమాణం తగ్గుతుంది''అని ఆ వైద్యడు తెలిపారు.

వైద్యం కోసం అప్పులు చేయాల్సిందే
శ్రీకాకుళం జిల్లా వైద్యశాఖ అందించిన వివరాలు ప్రకారం జిల్లాలో డయాలసిస్ చేయించుకునేవారు సుమారు 1200 మంది ఉన్నారు. వీరు ప్రభుత్వం అందించే రూ.10 వేల పింఛనుకు అర్హులు. కానీ ఇందులో కేవలం 700 మందికి మాత్రమే ఫించను అందుతోంది.
అలాగే రూ.5 వేల వైఎస్ఆర్ భరోసా ఆర్థిక సాయం అర్హత ఉన్న బాధితులు 7 వేల మంది ఉన్నారు. కానీ వీరిలో 1500 వందల మందికి మాత్రమే ఫించను అందుతోంది.
జిల్లాలో మొత్తం కిడ్నీ బాధితుల సంఖ్య దాదాపు 35 వేలు. దీని ప్రకారం చూస్తే కిడ్నీ బాధితుల్లో ఆర్థిక సాయం అందుకుంటున్నవారి సంఖ్య చాలా తక్కువ.
దీనికి తోడు ఆర్థిక సాయం కోసం అర్హత పరీక్షల చేయించుకునే కిడ్నీ బాధితులు వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. బాధితులు ఎక్కువగా ఉండే సోంపేట, కవిటి, వజ్రాపుకొత్తూరు వంటి ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని.
"వైఎస్ఆర్ భరోసా అర్హత వైద్య పరీక్షల కోసం రెండు, మూడుసార్లు తిరగాలి. అలాగే చాలా మందికి వ్యాధి ఉన్నా, అది నిర్థరణ పరీక్షల్లో విఫలమవుతుంది. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధిత గ్రామాలకు సమీప మండలాల్లో వ్యాధి నిర్థరణ పరీక్షలు చేస్తే బాధితులకు ప్రయాణం సమస్య, ఖర్చు తగ్గుతుంది. కొందరు వీటికి భయపడే వైద్య పరీక్షలకే వెళ్లడం మానేస్తున్నారు. ఒకవేళ చేయించుకున్నా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా తక్కువ మందికే పింఛను దక్కేలా ఉంది" అని గత ఎనిమిదేళ్లుగా సోంపేట సామాజిక ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ఎం. జోగినాయుడు బీబీసీతో చెప్పారు.
ఒక్కసారి విశాఖకు వెళ్లొస్తే ఖర్చు రూ.10 వేలు
కిడ్నీ బాధిత ప్రాంతాలల్లో పర్యటించి, అక్కడి బాధితులతో మాట్లడినప్పుడు, గతంలో పోలిస్తే అయిదేళ్ల నుంచి కిడ్నీ బాధితుల పై ప్రభుత్వాలు దృష్టి సారించిన విషయం అర్థమవుతోంది.
కిడ్నీ బాధితులకు ఫించన్ ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆందోళనలు కూడా సత్పలితాలు ఇచ్చాయని బాధితులు చెప్పారు. ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ. 10 వేలు, మూడో దశలో ఉన్న బాధితులకు రూ. 5 వేలు అందుతున్నాయి.
అయితే ఇది అందరి బాధితులకు అందకపోవడం, అందిన వారికి కూడా వైద్య ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యం కోసం అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు.
నెల రోజుల పాటు జ్వరం తగ్గకపోవడంతో ఇద్దివానిపాలెంకు చెందిన మహాలక్షీ విశాఖ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ వ్యాధి అని విశాఖ వైద్యులు నిర్ధరణ చేశారు. ఇది జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది.
"అప్పటి నుంచి రెండు, మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు, ట్రీట్‌మెంట్ కోసం విశాఖ వెళ్లేదాన్ని. వెళ్లడం, రావడం, వైద్యం, ఇతర ఖర్చలకు ఒకసారికి రూ. పదివేల కంటే ఎక్కువే అయ్యేది. వైద్యం కోసం దాదాపు రూ. రూ.3 లక్షల వరకు అప్పుచేశాం. అప్పులు, వడ్డీలు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఒక్కసారి కూడా విశాఖ వెళ్లలేదు'' అని 46 ఏళ్ల మహాలక్ష్మీ బీబీసీతో అన్నారు.
''మా ఆయన వేటకు వెళ్లి రోజుకు అయిదారొందలు సంపాదిస్తాడు. పైగా అన్నీ రోజులు వేట ఉండదు. నా వైద్యంతో పాటు ఇద్దరు పిల్లలను పోషించుకోలేక పోతున్నాం. ప్రభుత్వ సాయం అందుతున్నా అది సరిపోవడం లేదు'' అన్నారామె.
"నాకు కిడ్నీ వ్యాధి ఉందని తెలిసి ఇప్పటికీ 12 ఏళ్లు గడిచింది. మొదట్లో ఏవో మందులతో నెట్టుకొచ్చినా, ఇప్పుడు ఏ మందులు పని చేయడం లేదు. నాకు 4.6 పాయింట్లు ఉంది. 5 పాయింట్లు దాటి ఉంటేగానీ, కిడ్నీవ్యాధి ఫించను రాదు. ఆ పరీక్షల కోసం తిరగడానికి, మందులకు నెలకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వేటకు వెళ్లి ఏ పూటకాపూట సరిపోయేలా ఉన్న నా కొడుకు సంపాదనతో ఇవన్నీ ఎలా కుదురుతాయి. అందుకే వైద్యం కోసం వెళ్లడమే మానేశా'' అని పెద కర్రివానిపాలెంకు చెందిన 58 ఏళ్ల ప్రసాదరావు బీబీసీతో అన్నారు.
''ప్రభుత్వం అన్ని మందులు ఇవ్వడం లేదు. జబ్బు తగ్గుతుందనేమోనని మొదట్లో చాలా మందులు వాడాను. అప్పులు పెరిగిపోవడంతో అన్నీ ఆపేశాను'' అన్నారు ప్రసాద రావు.

కరోనాతో పరీక్షలు బాగా తగ్గిపోయాయి...
ఉద్దానంలోని కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధి నిర్థారణ పరీక్షలు 2017లో లక్షకు పైగా చేయించుకున్నారు. అయితే ఆ తర్వాత క్రమంగా ఆ సంఖ్య తగ్గిపోయింది. 2019, 2020లలో కాస్త పెరిగాయి. కానీ మళ్లీ 2021లో ఆ సంఖ్య లెక్కలోకి కూడా తీసుకోలేనంత తగ్గిపోయిందని జిల్లా వైద్యాధికారులు బీబీసీతో చెప్పారు.

"కోవిడ్ కారణంగా ఈ ఏడాది పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. చేయించుకున్న వారిలో10 శాతం మందికి ఈ వ్యాధి ఉంటుంది. ఉద్దానం ప్రాంతంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, కిడ్నీ వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకందరికి అవగాహన కల్పించాం. 2019, 2020లతో పోల్చితే 2021లో పరీక్షలు చేయించుకన్న వారి సంఖ్య చాలా తక్కువ. కోవిడ్ దాదాపుగా తగ్గిపోవడంతో...మళ్లీ నిర్థారణ పరీక్షలకు వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది" అని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కె.లీల బీబీసీతో చెప్పారు.
'సోషల్ మీడియా' వైద్యం పెరుగుతోంది
వ్యాధి బాధితుల్లో చాలా మంది వైద్యం చేయించుకోవడం మానేయడం, స్థానికంగా దొరికే ఆకుపసరు మందులపై ఆధారపడటం ఆందోళన కలిగిస్తోందని ఉద్దానం ప్రాంత వైద్యులు అంటున్నారు.
"'సీరం క్రియేటినిన్ లెవెల్స్ 1.5 అని తేలియగానే కంగారు పడిపోయి సొంత ఖర్చులతో వైద్యం కోసం విశాఖకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి 4వ దశ వరకు స్థానికంగా మందులు వాడుకుంటూ, తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు రోగిని కాపాడుకోవచ్చు. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు వ్యాధిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది’’అని సోంపేటకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ యారాడ కృష్ణమూర్తి బీబీసీతో అన్నారు.
‘‘అలా చేయకుండా ముందు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి వెంటనే తగ్గిపోవాలని రకరకాలైన ప్రయత్నాలు, ఎందరో వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. తర్వాత విసుగుతో పూర్తిగా వైద్యాన్ని నిర్లక్యం చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు'' అని ఆయన అన్నారు.
కిడ్నీ జబ్బులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి సరైన వైద్యం, ఆహార నియంత్రణ, సరైన వ్యాయమం చేయడం ద్వారా నియంత్రణలో పెట్టవచ్చన్నారాయన.
ఉద్దానం కిడ్నీ బాధిత ప్రాంతాల్లో డాక్టర్ కృష్ణమూర్తి చేసిన పరిశోధనల వల్లే ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఇక్కడ సమస్యపై దృష్టి పెట్టారు.

కిడ్నీ వ్యాధి...సామాజిక, ఆర్థిక ప్రభావంపై పరిశోధనలు
గత మూడేళ్లుగా ఆంధ్రా యూనివర్సిటి హ్యూమన్ జెనెటిక్స్ విభాగం ఉద్దానం కిడ్నీ వ్యాధి కారణాలను పరిశోధించే ప్రాజెక్టుని చేస్తోంది. దీనితో పాటు ఈ ఏడాది కిడ్నీ వ్యాధికి గురైన కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి ప్రభావానికి గురవుతున్నారనే అంశంపై పరిశోధనలు చేస్తోంది.
''కిడ్నీ వ్యాధి కారణంగా బాధిత కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేనంత స్థాయికి చేరుకుంటున్నాయని మా పరిశోధనలో తేలింది. ఖర్చులు భరించ లేక వైద్యం మానేస్తున్న వారు చాలా ఉందే ఉన్నారు. ప్రభుత్వం నుంచి వ్యాధి బాధితులందరికీ ఆర్థిక సాయంతో పాటు,ఆ సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు" అని సోషియో, ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనే ప్రాజెక్టు చేస్తున్న స్కాలర్ పి.హరిరామ్ బీబీసీతో చెప్పారు.

రాజకీయాలు వద్దు...సహాయం కావాలి
ఏ ఎన్నికలు జరిగిన ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార అస్త్రమే. కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరించాలని 2017లో పవన్ కల్యాణ్ దీక్ష చేశారు. పవన్ దీక్ష తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షిత మంచినీరు ఏర్పాటుతో పాటు, పింఛన్ల మంజూరుకు ప్రాధాన్యత ఇచ్చారు.
అధికారంలోకి వస్తే.. ఉద్ధానం కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని, పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని, బాధితులకు రూ. 10వేల ఫించన్ ఇస్తానని పాదయాత్ర సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.
"అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ వ్యాధి బాధితులకు రూ. 5 వేలు, రూ. 10 వేలు ఫించన్లు అందిస్తున్నాం. అలాగే పలాసలో రెండు వందల పడకల ఆసుపత్రి పనులు కరోనా కారణంగా కొంత మందగించినా ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి'' అని పలాస ఎమ్మేల్యే, రాష్ట్ర మంత్రి సిదిరి అప్పల రాజు బీబీసీకి చెప్పారు.
ఉద్దానం ప్రాంతానికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, బాధితులందరికి పింఛను అందేలా చూడాలని అధికారులను ఆదేశించామని మంత్రి వెల్లడించారు.
''కిడ్నీ బాధితుల విషయంలో రాజకీయాలు మాని, బాధితులకు సహాయం చేయాలి" మంత్రి అప్పల రాజు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోలీసులకు తెలియకుండా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉంది.. ’
- ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?
- అభినందన్ వర్థమాన్కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








