Cannabis: ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా

ఫొటో సోర్స్, Courtesy of Danielle Simone Brand
- రచయిత, జెస్సీ స్టానీఫోర్త్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
పిల్లల పెంపకంలో ఒత్తిడిని తట్టుకోవడానికి గంజాయిని ఉపయోగించే తల్లుల సంఖ్య పెరుగుతోంది. అయితే, గంజాయి వినియోగించే తల్లులపై పడుతున్న చెడు ముద్ర తొలగిపోవాలని వారు కోరుకుంటున్నారు.
2016లో పెద్దలు గంజాయి తీసుకునేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా చట్టబద్ధత కల్పించింది. అప్పటి నుంచి 42 ఏళ్ల జర్నలిస్ట్ ‘డేనియల్ సిమోన్ బ్రాండ్’ గంజాయిని వినియోగిస్తున్నారు.
అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్‌కి చెందిన బ్రాండ్.. గంజాయి తన మనసుకి, శరీరానికి ఊరటనిస్తోందని, తనని సంతోషంగా ఉంచుతోందని చెప్పారు.
చట్టబద్ధమైన గంజాయిని ఆరోగ్య సాధనంగా చూస్తూ.. తన 8, 11 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలను చక్కగా చూసుకోగలుగుతున్నానని చెప్పారు.
"ఒత్తిడి క్షణాలలో గంజాయి నాకు సాయం చేస్తుంది" అని ఆమె చెప్పారు.
"రోజులో నేను ఎదుర్కొన్న సవాళ్లు ఏవైనా, ఎంత చిరాకులో ఉన్నా, నా పనులన్నిటిని మరింత సులభంగా పూర్తి చేసుకుంటాను. నా కూతురికి హోం వర్క్‌లో ఓపికగా సాయం చేయగలను. తనకు డిన్నర్ చేసి పెట్టగలను" అన్నారామె.
‘వీడ్ మామ్: ది కన్నా-క్యూరియస్ ఉమెన్స్ గైడ్ టు హెల్దియర్ రిలాక్సేషన్, హ్యాపీయర్ పేరెంటింగ్, చిల్లింగ్ టీఎఫ్ అవుట్’ అనే పుస్తకాన్ని బ్రాండ్ రచించారు. ప్రతిరోజు బ్రాండ్ రాత్రిపూట తన పిల్లలను నిద్ర పుచ్చటానికి ప్రయత్నిస్తుంటారు.
పిల్లను త్వరగా నిద్రపుచ్చటం వల్ల తనకు కొంత విశ్రాంతి దొరుకుతుందని ఆమె ఆశ. ఇలా చేయడం వల్ల తనతో, పిల్లలు కలిసి ఉందామని అనుకునే సమయం మిస్సయ్యేదని బ్రాండ్ చెప్పారు.
వాళ్లు ఏం నేర్చుకుంటున్నారు? స్కూల్ ఎలా ఉంది? స్నేహితులతో వారికి ఉన్న సంబంధాలు తదితర ముఖ్య వివరాలను వారి నుంచి వినడాన్ని బ్రాండ్ మిస్సయ్యే వారు. రాత్రిపూట తన పిల్లల నిద్ర సమయానికి వారిని నిద్రపుచ్చటానికి, వారితో ఓపికగా మెదిలేందుకు గంజాయి సాయ పడుతుందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తనలాగే గంజాయి ఉపయోగించే తల్లులు చాలామంది ఉండటం కొత్త విషయం కాదని బ్రాండ్ తెలిపారు. చాలా ఏళ్లుగా తల్లులు గంజాయిని ఉపయోగించడం ఆమె చూశారు.
గంజాయి గురించి పెద్దగా తెలియని తల్లుల కోసం తాను ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని రాసినప్పుడు, ఇప్పటికే గంజాయి ఉపయోగిస్తున్న తల్లులు బయటకు వచ్చి దాని వల్ల కలిగే లాభాలను ఒక ఉద్యమంలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని భావించారు.
ఇలా చేయడం వల్ల గంజాయిని వాడుతూనే బాధ్యతాయుతమైన తల్లులుగానూ ఉండగలం అని చెప్పారు.
"చాలా కాలంగా గంజాయి వాడే తల్లులకు సంబంధించిన చిన్న గ్రూపులు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ గ్రూపులు విస్తరిస్తున్నాయి" అని బ్రాండ్ పేర్కొన్నారు.
అమెరికాలో రాష్ట్ర-స్థాయి చట్టబద్ధత, కెనడాలో దేశవ్యాప్త చట్టబద్ధత కల్పించడంతో పెద్దల్లో గంజాయి వాడకం పెరిగింది.
ఎంత మంది తల్లులు గంజాయిని ఉపయోగిస్తున్నారో కచ్చితంగా లెక్కించడం కష్టమైనప్పటికీ, గంజాయివాడే తల్లుల కమ్యూనిటీలు ఆన్‌లైన్‌లో పెరుగుతుండాన్నిబట్టి, జీవితం సాఫీగా సాగడంలో సహాయపడటానికే ఎక్కువ మంది తల్లులు గంజాయిని స్వీకరిస్తున్నారని అర్థమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'వైన్ వాడే విధంగానే'
ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా 2018లో మొదటిసారిగా పరిశోధకురాలు హీథర్ మెక్‌ల్వైన్-న్యూసాడ్ గంజాయి వాడే తల్లుల గురించి తెలుసుకున్నారు. ఈమె ఒక ఆంత్రోపాలజీ ప్రొఫెసర్.
వెస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్శిటిలో గంజాయి సంస్కృతిలో ఇంటర్ డిసిప్లినరీ మైనర్ కోర్సును ఆమె రూపొందించారు.
కొన్నేళ్లుగా ఫేస్‌బుక్ గ్రూపుల్లో గంజాయి వాడే తల్లుల చర్చలు నడుస్తున్నట్లు న్యూసాడ్ గుర్తించారు. నేడు, ఫేస్‌బుక్‌లో ఇలాంటి రెండు డజన్లకు పైగా గ్రూపులు ఉన్నాయని, వాటిలో వేలాది మంది సభ్యులుగా ఉన్నారని ఆమె వెల్లడించారు.
''గంజాయి వాడే తల్లుల ఉద్యమం ద్వారా ఇంతకుముందు ఎవరూ మాట్లాడని కొత్త అంశాలను వీరు స్పృశిస్తున్నారు. మహిళలు, తల్లులు రోజువారీ జీవితంలో డ్రింక్స్, టింక్చర్స్, సీబీడీ తదితర ఉత్పత్తులను వినియోగిస్తున్నట్టే గంజాయిని వాడుతున్నారు'' అని మెక్‌ల్వైన్-న్యూసాడ్ పేర్కొన్నారు.
అమెరికాలో నివసించే లాట్రేస్ థామస్(40) గంజాయిని వాడుతూ, తన ముగ్గురు పిల్లలను పెంచుతున్నారు. "ప్రజలు వైన్ ఏ విధంగా తీసుకుంటారో ఇది కూడా అంతే" అని ఆమె చెప్పారు.
కరోనా సమయంలో నా ముగ్గురు పిల్లలతో రోజంతా ఉండాల్సి వచ్చేది. రోజంతా పని వల్ల అలసిపోయాక పిల్లలు నిద్ర పోయిన తర్వాత స్నానపు తొట్టిలో స్నానం చేస్తూ గంజాయిని పీల్చడం ఉపశమనాన్ని ఇస్తుంది అని థామస్ చెప్పారు.
తనకి ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పసిబిడ్డ. నల్లజాతికి చెందిన ఓ తల్లిగా, నల్లజాతి సామాజిక వర్గాలను ప్రభావితం చేసే జాతిపరమైన సమస్యల్లో ''గంజాయి తనకు, నల్లజాతి మహిళగా, పిల్లలను పెంచడంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునేలా సహాయపడుతుంది'' అని థామస్ వివరించారు.
53 ఏళ్ల బరీందర్ రసోడే కూడా కరోనా సమయంలో తీవ్ర ఒత్తిడి గురయ్యారు. బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో నివసించే ఆమెకు 28, 25, 17 సంవత్సరాల వయసు గల ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కోవిడ్-19 సమయంలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తన ఆఖరి బిడ్డకు అర్థమయ్యేలా వివరించడం కోసం ఆమె చాలా కష్టపడ్డారు.
"మీరు తన ప్రపంచం తలకిందులుగా మారిపోయిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. అందరం కలిసి ఒక చిన్న ప్రదేశంలో, ఎక్కువ గంటల పాటు గడపాల్సివచ్చింది" అని మాజీ రాజకీయవేత్త , మెడికల్-గంజాయిని ఉత్పత్తి చేసే బిజినెస్ ఇంక్యుబేటర్ గ్రోటెక్ ల్యాబ్స్‌కు సీఈఓ అయిన రసోడే అన్నారు.
గంజాయి వినియోగం కెనడాలో చట్టబద్ధం. తాను ఉత్తేజితంగా ఉండటానికి గంజాయిని ఉపయోగించేదానినని ఆమె వెల్లడించారు.
"గంజాయి వినియోగం ఆందోళనను తగ్గించడంలో సాయపడటమే కాకుండా, ఒక తల్లిగా నా సహనాన్ని మరింత పెంచింది" అన్నారామె.

ఫొటో సోర్స్, Courtesy of Latrese Thomas
'మత్తు కోసమే ధూమపానం చేస్తామనేది పెద్ద అపోహ'
రసోడ్, థామస్, బ్రాండ్‌తో సహా అనేక మంది గంజాయిని వాడే తల్లులు అందరూ ఉపయోగించేది తక్కువ మోతాదులోనే.
"మేం మత్తు కోసం పెద్ద మొత్తంలో ధూమపానం చేస్తామనేది ఒక దురభిప్రాయం" అన్నారు థామస్. ఆమెకు అమెరికాలోని పోర్ట్ ల్యాండ్‌లో హెల్త్ గంజాయి డిస్పెన్సరీ ఉంది. ఒక బ్లాగును కూడా నడుపుతున్నారు.
"నేను ఇప్పటికీ తల్లినే. ఇంకా పని చేయాలి, ఇప్పటికీ వ్యాపారాన్ని నడుపుతున్నాను. నేను రోజు పిల్లలను స్కూల్లో వదిలి ఇంటికి తీసుకువస్తుంటాను. ఇంకా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలి'' అని థామస్ అన్నారు.
''తక్కువ మోతాదులో గంజాయి వాడకం వల్ల పిల్లల పెంపకంపై నా దృక్పథం కాస్త మారుతుంది. ఇతర ఆలోచనలు, చేయాల్సిన పనులు వీటన్నింటి గురించిన చింత లేకుండా నా ఆలోచనలు నెమ్మదిస్తాయి. నేను నా పిల్లలతో మరింత సహనంగా, సృజనాత్మకంగా ఉండగలను'' అని బ్రాండ్ అన్నారు.
తక్కువ మోతాదులో గంజాయి వాడటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని ఆమె నమ్ముతున్నారు.
తక్కువ మోతాదులో గంజాయి వాడకం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి పరిశోధన ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2017లో చేసిన సమీక్షలో గంజాయి, దాని సంబంధిత ఇతర పదార్థాలతో దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్పడానికి పరిమిత ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
2018లో గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రచురితమైన పరిశోధనా పత్రం, గంజాయి వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని తెలిపింది.
మొత్తంగా ఇది మరింత వివరణాత్మక పరిశోధన చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో దీనిపై ఖచ్చితంగా విశ్లేషణ చేయడానికి చాలా తక్కువ డేటా అందుబాటులో ఉంది.
ప్రస్తుత పరిశోధనల ప్రకారం, గంజాయి వాడకానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాదం ఏమిటంటే, అది తీసుకునే వ్యక్తుల వల్ల ఇతరులకు గాయాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం.
మద్యంలాగానే, గంజాయి కూడా మత్తు ఎక్కిస్తుంది. దీంతో విచక్షణ కోల్పోయి, గొడవలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే గంజాయి మత్తుతో, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ.
గంజాయి వాడకం అలవాటు లేనివారు కొత్తగా ఉపయోగించడం వల్ల ఎక్కువ మత్తుకు లోనయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎంత మోతాదులో తీసుకోవాలో అవగాహన లేకపోవడంతో వీరు ఎక్కువ గంజాయిని తీసుకునే అవకాశం ఉంది.
మునుపెన్నడూ గంజాయిని తీసుకోని వారికి ఇది అంత సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. మార్కెట్లో ఈ మత్తు పదార్థాలకు డిమాండ్ పెరుగుతున్నందున ఎక్కువ మత్తిచ్చే శక్తిమంతమైన ఉత్పత్తులు పెరుగుతున్నాయి. దీని ద్వారా వినియోగదారులకు ప్రమాదం కలగొచ్చు.

ఫొటో సోర్స్, Courtesy of Danielle Simone Brand
గంజాయి వాడకం గురించిన ప్రతి చర్చలోనూ, దాని ఉపయోగంపై వివక్ష కనిపిస్తుంటుంది. గంజాయిని వాడుతున్నట్లు అంగీకరించే తల్లులపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
తాను ఈ వివక్ష అనుభవించలేదని బ్రాండ్ చెప్పినప్పటికీ, అది ఎలా ఉంటుందో చూశారు.
"సోషల్ మీడియాలో నాకు తెలిసిన ఇతర గంజాయి వినియోగించే తల్లుల గురించి, 'నువ్వు ఒక మంచి తల్లివి కాదు', 'మీరు మీ పిల్లలకు తప్పుడు బాటను చూపుతున్నారు', 'మీరు మాదకద్రవ్యాల వాడకాన్ని సమర్థిస్తున్నారు', 'మీరు బిడ్డ తల్లి కావడం దయనీయం' లాంటి విమర్శలు వచ్చాయి.
పట్టణంలో నివసించే తల్లిగా, ఓ నల్లజాతి మహిళగా థామస్, తన గంజాయి వాడకం గురించి ఎవరికి చెప్పాలన్న విషయంలో జాగ్రత్తగా ఉంటారు. గంజాయి వాడే వారి పట్ల ఇతరులకు ఉండే అభిప్రాయం తప్పు అనిపించినా, తాను గంజాయి తీసుకుంటానని ఆమె ఎవరికీ చెప్పరు.
"మీలో వైన్ తాగే తల్లులు ఉన్నారు, బార్‌లో లేడీస్ నైట్ కోసం కలుసుకుంటారు లేదా వారి ఇంట్లో సరదాగా పార్టీలు చేసుకుంటారు. పిల్లలు చుట్టూ ఉన్నప్పుడు మద్యం అందుబాటులో ఉంటుంది. ఇదేమీ తప్పు కాదు కానీ, 'పదండి దమ్ము కొడదాం' అని నేను అంటే అప్పుడు అందరూ 'ఇంట్లో పిల్లలు ఉన్నారు!" అని అంటుంటారు అని ఆమె చెప్పారు.
"అమ్మకు ఒక గ్లాసు వైన్ కావాలి' అని చెప్పడం సామాజికంగా ఆమోదయోగ్యమైనది. కానీ, ఇప్పటికీ 'అమ్మకి కొంత గంజాయి అవసరం' అని చెప్పడం సామాజికంగా ఆమోదయోగ్యం కాదు" అని న్యూసాడ్ అన్నారు.
మహిళల ఆరోగ్యంపై గంజాయి దీర్ఘకాలిక ప్రభావాల గురించి మనకు ఇంకా ఏమీ తెలియదు. గంజాయి కలిగించే ప్రతికూల ప్రభావాలపై నిరంతరం దృష్టి పెట్టడం, గంజాయి నిషేధంపై ఉన్న రాజకీయ పట్టుకు నిదర్శనమని న్యూసాడ్ చెప్పారు.
గంజాయి వల్ల కలిగే వైద్యపరమైన లాభాలను ఎవరూ గట్టిగా చెప్పరని అన్నారు"
సమాజం, రాజకీయ నాయకులు గంజాయి చెడ్డదని నమ్ముతున్నంత కాలం, దాని దుష్పరిణామాలపై మాత్రమే పరిశోధనలు జరుగుతాయి, ప్రసవానంతర డిప్రెషన్‌ను సమర్థంగా ఎదుర్కొవడానికి గంజాయిని వాడొచ్చనే అంశాలపై పరిశోధనలు జరగవు" అని న్యూసాడ్ అన్నారు.
గంజాయికి చట్టబద్ధత కల్పించడం వల్లే దానికి సమాజంలో ఆమోదం లభిస్తుందని, చట్టబద్దత కల్పించినప్పటికీ ఆయా సమాజాల్లోని ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు గంజాయి వినియోగంపై ప్రభావం చూపుతాయని ఆమె అంటున్నారు.

'క్రమంగా తగ్గుతున్న అపోహలు'
గంజాయి ఇప్పుడు చట్టబద్ధంగా ఉన్న దేశాలలో గంజాయి గురించిన సామాజిక అవగాహనను మార్చడానికి కొంత వరకు సహాయపడింది. కొన్ని దశాబ్దాల క్రితం గంజాయిని, కొకైన్, హెరాయిన్ అంత ప్రమాదకారిగా భావించేవారు. దీనిలోని ఔషధ గుణాల గురించి అప్పట్లో ఎవరికీ తెలియదు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు గంజాయి వాడకానికి నెమ్మదిగా చట్టబద్దత కల్పిస్తున్నాయి. ఇదే సమయంలో గంజాయిని వినియోగించే తల్లులు కూడా గంజాయి వినియోగంపై ఉన్న అపోహలపై తమ గళాన్ని వినిపిస్తున్నారు.
తరతరాలుగా గంజాయి పట్ల ఉన్న వైఖరి మారడం ప్రారంభమైంది అని న్యూసాడ్ అన్నారు. ఇది తల్లులు గంజాయి వినియోగించడంపై ఉన్న అపోహలు తొలగించడానికి సరైన సమయం అని న్యూసాడ్ నమ్ముతున్నారు.
‘‘యువత తటస్థ వైఖరితో ఉంటారు కాబట్టి గంజాయి వినియోగించే తల్లులపై వీరిలో అపోహలు కలగకుండా చేయవచ్చు’’ అని న్యూసాడ్ నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి:
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- నిజ జీవితంలో ‘ఇన్సెప్షన్’ ప్రయోగం.. కలల్లోకి చొరబడిన శాస్త్రవేత్తలు
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- వైఎస్ జగన్: ‘అమరావతి అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మే బెటరా? ఈ పోలిక ఎందుకు?
- వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోదీ
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- ‘చేసింది కొంతే.. చేయాల్సింది చాలా ఉంది’
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- విశాఖ నుంచి గంజాయి స్మగ్లింగ్.. అమెజాన్ ఉద్యోగులపై పోలీసు కేసు
- రాణి కమలాపతి ఎవరు? హబీబ్‌గంజ్ స్టేషన్‌కు ఆమె పేరెందుకు పెట్టారు?
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








