నిజ జీవితంలో ‘ఇన్‌సెప్షన్’ ప్రయోగం.. ల్యూసిడ్ డ్రీమ్స్‌తో కలల్లోకి చొరబడిన శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్టియాన్ జారెట్
- హోదా, బీబీసీ సైన్స్ ఫోకస్
బిలియనీర్లు అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాధారణమైపోయింది.
కానీ మానవ జీవితంలో అత్యంత సహజ అంశమైన కలలు శాస్త్రీయ అధ్యయనానికి చిక్కకుండా విసుగు తెప్పిస్తున్నాయి.
కలల గురించి చాలా థియరీలు ఉన్నాయి. కానీ మనం కలలు కనే విధానం, కల వచ్చేందుకు ప్రేరేపించే అంశాల గురించి మనకు అంత ఎక్కువగా తెలియదనేది నిజం.
మానవులు కలల్లో విహరిస్తున్నప్పుడు, వారు భౌతిక ప్రపంచం నుంచి ఐసోలేట్ అవుతారు. ఈ అంశమే శాస్త్రవేత్తల పరిశోధనలకు కీలక అడ్డంకిగా మారింది.
కాబట్టి పరిశోధకులు, నిద్రపోతున్నప్పుడు వారి మెదడు ఏం చేసిందో చెప్పాలని మేల్కొన్న తర్వాత ప్రజల్ని అడగడం ప్రారంభించారు. కానీ ఇదో అసంపూర్ణమైన, నమ్మదగని ప్రక్రియ.
కలలకు సంబంధించిన జ్ఞాపకాలు అసంపూర్ణంగా ఉండొచ్చు, వక్రీకరించే ఉండేలా, తప్పుగా కూడా గుర్తుండొచ్చు. అందుకే కలలకు సంబంధించిన దృఢమైన శాస్త్రాన్ని రూపొందించడం కష్టంగా మారుతుంది'' అని ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ సైకాలజిస్టు, పరిశోధకులు డాక్టర్ కెన్ ప్యాలర్ చెప్పారు.
కలలపై చేసే పరిశోధనల తీరుతెన్నులను మార్చాలంటే... నిద్రపోతున్న వారితో మాట్లాడగలిగే ఏదైనా ఒక మార్గాన్ని అన్వేషించగలగాలి.
కానీ ఇది జరిగే పనిలా కనిపించట్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ ప్యాలర్, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన కరెన్ కోన్‌కోలీ సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ పరిశోధకులతో కూడిన బృందం సరిగ్గా దీన్నే చేసి చూపించింది.
2021 ఏప్రిల్‌లో 'కరెంట్ బయాలజీ' అనే జర్నల్‌లో ఈ ఆవిష్కరణ గురించి ప్రచురించారు. ''దీనిద్వారా కలలపై సరైన మార్గంలో శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి అవకాశాలు పుట్టుకొచ్చాయి'' అని ప్యాలర్ పేర్కొన్నారు.
ఇప్పుడు కలల గురించి తెలుసుకోవడానికి మనకు చాలా మార్గాలు ఉన్నాయి.
'ల్యూసిడ్ డ్రీమింగ్' అందించే పరిశోధన అవకాశాలను అన్వేషించడం కోసం ప్రారంభమైన అనేక కొత్త ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక అరుదైన స్థితి. ఈ స్థితిలో నిద్రిస్తోన్న వ్యక్తి కళ్లను వేగంగా (ఆర్ఈఎం) కదుపుతుంటాడు. అప్పుడు అతనికి తాను కలలో ఉన్న సంగతి తెలుస్తుంది.
'ల్యూసిడ్ డ్రీమింగ్' కాన్సెప్ట్ వేల సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే.
ల్యూసిడ్ డ్రీమింగ్‌పై తాజా ఆవిష్కరణ... కలల స్వభావం, వాటి పనితీరును విశ్లేషించడానికి ఉత్తేజకరమైన అవకాశాలను కల్పించడంతో పాటుగా... క్లినికల్ ఇంటర్వెన్షన్స్, సెల్ఫ్ డెవలప్‌మెంట్, పాస్టెరింగ్ లెర్నింగ్స్, క్రియేటివిటీ వంటి ఆచరణాత్మక అవకాశాలను కూడా పెంచుతోంది.
ల్యూసిడ్ డ్రీమ్స్ అంటే ఏంటి?
మీరెప్పుడైనా కల కంటున్నప్పుడు, అది మీకు తెలిసి జరిగినట్లయితే, మీరు ల్యూసిడ్ డ్రీమ్ స్థితిని అనుభవించారని చెప్పవచ్చు.
మనలో సగం మంది ఇలాంటి కేటగిరీకి చెందినవారని అంచనా. దాదాపు 20 శాతం మందికి నెలలో ఒకసారి, 1 శాతం మందికి వారంలో ఒకసారి ఇలాంటి అనుభూతి కలుగుతుందని తెలిసింది.
ల్యూసిడ్ స్థితిని అనుభవించే కొంతమంది ప్రజలు, సొంత సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు... కొన్నిసార్లు తమ కలలో ఏం జరగాలో కూడా వారే నిర్ణయించుకుంటారట.

ఫొటో సోర్స్, Getty Images
కలలను కూడా తమకు తగినట్లుగా నియంత్రించుకోగలిగే ఈ స్థాయి చేతనా స్థితి... శాస్త్రవేత్తలకు కీలకమైనది. ఎందుకంటే ఇలాంటి చేతన స్థితిలో ఉన్న డ్రీమర్‌కు మాత్రమే తాను కల కంటున్నప్పుడు కూడా దాన్ని బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది.
ల్యూసిడ్ డ్రీమింగ్ సమయంలో మెదడులో ఏం జరుగుతుందో అనే అంశంపై పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
పలు అధ్యయనాల సందర్భంగా, ల్యూసిడ్ డ్రీమింగ్ సమయంలో మానవుల మెదడు తరంగాలను ఈఈజీ ద్వారా కొలిచారు. కానీ అందులో మానవుని మెదడును సాధారణంగా స్కాన్ చేస్తే ఎలాంటి ఫలితాలో కనబడతాయో అలాంటి ఫలితాలే అక్కడ కూడా కనిపించాయి.
''ల్యూసిడ్ డ్రీమింగ్ సందర్భంగా మెదడు పనితీరులో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఇంకా మాకు తెలియదు'' అని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడీసన్‌లో పీహెచ్‌డీ చేసిన బెంజమిన్ బైర్డ్ చెప్పారు.
''ఇందులో ఫ్రంటోపరీటల్ నెట్‌వర్క్ (మెదడు ముందు, వెనుక భాగాలను కలిపే నెట్‌వర్క్. ఇది సమస్యల పరిష్కారం, శ్రద్ధ వంటి అంశాల్లో పాల్గొంటుంది) పాత్ర ఉంటుందని న్యూరోఇమేజింగ్ ప్రాథమిక డేటా సూచిస్తుందని'' ఆయన చెప్పారు. అయితే దీని పాత్రను నిర్ధారించేందుకు మరింత పరిశోధన అవసరమని ఆయన స్పష్టం చేశారు.
బైర్డ్ చెప్పిన దాని ప్రకారం, ల్యూసిడ్ డ్రీమ్స్ అనేవి ఆర్‌ఈఎం సమయంలో మెదడు చురుగ్గా పనిచేస్తున్నప్పుడు వస్తాయని స్పష్టమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ల్యూసిడ్ డ్రీమర్స్‌తో కమ్యూనికేషన్
మీరెప్పుడూ ల్యూసిడ్ డ్రీమ్ అనే స్థితిని అనుభవించి ఉండకపోతే, అసలు అది ఎలా ఉంటుంది అని మీరు ఆశ్చర్యపోతారు.
బ్రిటీష్ హాస్యనటుడు డేవ్ గ్రీన్‌కు ఈ అంశం గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే అతను, తన చిన్నతనం నుంచే స్పష్టమైన కలలు కనడం ప్రారంభించాడు.
''స్పష్టమైన కలలు అనుభూతి చెందడం అంటే, మీ ఊహా ప్రపంచంలో తిరుగుతున్నట్లే'' అని ఆయన పేర్కొన్నారు.
''మీ మెదడు సృష్టించిన వాతావరణంలో మీరు సంచరిస్తూ ఉంటారు. కానీ మీకు మాత్రం మీరు మెలకువగా ఉన్నట్లు అనిపిస్తుంది.''
కరోనా సమయంలో హాస్యనటుడిగా ఆయనకు పని దొరకలేదు. అప్పుడు ఆయన ల్యూసిడ్ డ్రీమింగ్‌ను ఉపయోగించుకున్నాడు. కలల్లో తనకు వచ్చే ఆలోచనలను పదిలపరచుకొని, మేల్కొన్నాక వాటి ఆధారంగా కళాకృతులను చేయడం ప్రారంభించారు.
''నేను నా కలల్లో కళాకృతులను నిర్మించడంతో పాటుగా విహారం కూడా చేస్తాను'' అని డేవ్ చెప్పుకొచ్చారు.
ల్యూసిడ్ డ్రీమింగ్‌పై తమ అధ్యయనం కోసం కోన్‌కోలీ, ప్యాలర్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్‌కు చెందిన ఇతర శాస్త్రవేత్తలు ల్యూసిడ్ డ్రీమర్ల చేతనా స్థాయి నుంచి వీలైనంత ప్రయోజనం పొందారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికోసం వారు చాలామంది ల్యూసిడ్ డ్రీమర్లను నియమించుకున్నారు. కొంతమందికి ల్యూసిడ్ డ్రీమింగ్‌పై శిక్షణ ఇచ్చి మరీ వారిపై పరిశోధనలు జరిపారు.
పరిశోధనలో భాగంగా వారంతా కలల శాస్త్రవేత్త, డాక్టర్ మిచెల్ కార్, ఆమె సహోద్యోగులు రూపొందించిన విధానాన్ని ఉపయోగించారు.
ఇందులో వ్యక్తి మెలకువగా ఉన్న సమయంలో బీప్ శబ్ధాలు, ఫ్లాషింగ్ లైట్లను ఒకదానితర్వాత ఒకటి నిరంతరం ఆన్ చేస్తూ అతను ల్యూసిడ్‌గా మారేలా సూచనలు ఇస్తూ ఉంటారు. దీనిద్వారా అతని ఆలోచనలు, అనుభూతుల గురించి తెలుసుకుంటారు. అతను కలలో ఉన్నాడా లేదా అనే దాన్ని పరీక్షిస్తారు.
కోన్‌కోలీ, ప్యాలర్ బృందం కూడా ఇవే శబ్ధాలు, లైట్లను నిద్రిస్తోన్న తమ అభ్యర్థిపై ఉపయోగించి అతను ల్యూసిడ్ డ్రీమర్‌గా మారేందకు ప్రేరేపించేవారు. మెదడులోని తరంగాలను కొలిచి అతను నిజంగా నిద్రిస్తున్నాడో లేదో నిర్ధారించుకునేవారు.
అభ్యర్థులు, ల్యూసిడ్ డ్రీమ్ స్థితికి చేరుకున్నప్పుడు, కళ్ల ద్వారా సంకేతాలు ఇచ్చి వారి స్థితి గురించి చెప్పేలా వారికి శిక్షణ ఇచ్చారు.
ఈ స్థితిలో డ్రీమర్ల కళ్ల కదలికలను బట్టి వారి కలలో జరుగుతోన్న అంశాలను బయటి ప్రపంచానికి చెప్పేందుకు పరిశోధకులు ప్రయత్నించారు.
గతంలో కూడా తరచుగా ఇదే పద్ధతిని ఉపయోగించేవారు. 1980ల్లో ల్యూసిడ్ డ్రీమింగ్‌పై జరిపిన పరిశోధనల్లో అమెరికన్ సైకోఫిజియాలజిస్ట్ స్టీఫెన్ లాబెర్జ్ దీన్నే ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ కోన్‌కోలీ, ప్యాలర్ మరో అడుగు ముందుకేశారు. కల గురించి నిజమైన చర్చ జరిగేలా ఒక పరిస్థితిని సృష్టించారు.
అధ్యయనంలో పాల్గొన్న అభ్యర్థులు, ల్యూసిడ్ డ్రీమింగ్ స్థితికి చేరుకోగానే శాస్త్రవేత్తలు వారిని లెక్కలకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలు అడిగేవారు. అంటే ఎనిమిదిలో నుంచి ఆరును తీసివేస్తే ఎంత? ఇలా ఉండేవి వారి ప్రశ్నలు. ముందు తమకు నేర్పించిన దాని ప్రకారం, అభ్యర్థులు తమ కళ్ల కదలిక ఆధారంగానే సరైన సమాధానాన్ని చెప్పేవారు.
కానీ ఇప్పుడు పరిశోధకులు, నిద్రిస్తోన్న అభ్యర్థులతో రెండు వైపులా కమ్యూనికేషన్ జరిగే విధానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు.
''వేరే ప్రపంచంలో ఉన్న ఆస్ట్రోనాట్‌తో మాట్లాడేందుకు ఒక మార్గాన్ని కనిపెట్టినట్లే... మెదడులోని జ్ఞాపకాల పరంగా ఇంకో లోకంలో ఉన్నవ్యక్తితో మాట్లాడే పద్ధతిని కనిపెట్టామని'' వారు ఒక ఆర్టికల్‌లో రాసుకొచ్చారు.
ల్యూసిడ్ డ్రీమింగ్ వల్ల లాభాలు
కోన్‌కోలీ, ప్యాలర్, ఇతర సహచరులు కలిసి చేసిన అధ్యయనం... డ్రీమర్‌తో బయటి వారు కమ్యూనికేట్ అయ్యేలా రెండు వైపులా కమ్యూనికేషన్ అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది మరెన్నో కొత్త ప్రాజెక్టులకు మార్గం చూపింది. బ్రెయిన్ కలలు కనే స్వభావం గురించి మరింత ఎక్కువగా తెలుసుకునే వీలు కలిగింది. అలాగే అభ్యసనం, సృజనాత్మకతను పెంపొందించే ప్రక్రియ గురించి తెలుసుకునే అవకాశం దక్కింది.
కానీ, ఇలా రెండు వైపులా కమ్యూనికేషన్ అభివృద్ధి జరగకముందు కూడా, ఇతర పరిశోధకులు వివిధ పద్ధతుల్లో ల్యూసిడ్ డ్రీమింగ్ గురించి ప్రయోగాలు చేశారు.
ఉదాహరణకు ల్యూసిడ్ డ్రీమింగ్ అనే ఒక థెరపీ ఉన్నట్లయితే, దాని ద్వారా పీడకలల బారిన పడేవారికి ప్రయోజనం కలుగుతుంది. ల్యూసిడ్ డ్రీమింగ్ చిట్కాలను నేర్పిస్తే వారు పీడకలలు వచ్చినప్పుడు మేల్కోవడం లేదా కలను వారికి తగినట్లుగా మార్చుకునే వీలు కల్పించవచ్చు.
చలన కౌశలాలు పెంపొందించడానికి కూడా ల్యూసిడ్ డ్రీమింగ్‌ను ఉపయోగించవచ్చని ఇతర పరిశోధకులు కనుగొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైడెల్‌బర్గ్‌కు చెందిన డేనియల్ ఇర్లాచర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ ష్రెల్... ల్యూసిడ్ డ్రీమర్ల బృందానికి తమ కలలో ఒక కప్‌లోకి నాణేన్ని ఎగిరివేయాలని ఆదేశించారు.
నిజజీవితంలో తమ ప్రదర్శనతో పోల్చితే, ఈ ప్రయోగం చేసిన తర్వాత రోజు వారి నియంత్రణ చాలా మెరుగైనట్లు తెలిసింది.
మన సమస్యలకు సృజనాత్మకతతో కూడిన పరిష్కారాలను వెతుక్కోవడంలో ల్యూసిడ్ డ్రీమింగ్ ఉపయోగపడే అవకాశముంది.
కోన్‌కోలీ, ప్యాలర్ ఇతర పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ రెండు వైపులా కమ్యూనికేషన్ పద్ధతి ద్వారా ల్యూసిడ్ డ్రీమింగ్ నుంచి వీలైనంత ప్రయోజనం పొందవచ్చు.
ఉదాహరణకు, ఈ కొత్త కలల విధానం ద్వారా మానవునిలోని ఇంద్రియాలు, కలలతో అనుసంధానమై ల్యూసిడ్ డ్రీమ్ స్థితిలో సృజనాత్మకతకు సహాయపడే, నేర్చుకోవడానికి సహకరించే లక్షణాలను ఉత్పత్తి చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మీరు నిద్రిస్తున్నప్పుడు ప్రకటనలు
కానీ, ఈ తాజా పద్దతి సూటిగా లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు.
''ల్యూసిడ్ డ్రీమర్లతో కమ్యూనికేట్ చేసే ఈ చిట్కా మనం ప్రయత్నించిన ప్రతీసారి పనిచేయదు'' అని ప్యాలర్ చెప్పారు.
''ఈ పద్ధతులను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నాం. సుదీర్ఘ కాలంలో అవి ఎంతవరకు విశ్వసనీయంగా ఉంటాయో నాకు తెలియదు.''
ఈ పద్ధతినే అనుసరించి చాలా దూరం వెళ్లకుండా ప్యాలర్ హెచ్చరించారు.
''భవిష్యత్‌లో ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉండాలనే నేను ఉన్నదున్నట్లుగా చెబుతున్నా'' అని ఆయన పేర్కొన్నారు.
దీనిలో ఉన్న మరో సవాలు ఏంటంటే నైతిక సమస్యలు.
ఇప్పుడు పరిశోధకులు మన కలల్లోకి వచ్చి, మన కలలను ప్రభావితం చేయగలిగినప్పుడు అది ఇతర వ్యక్తులకు కూడా మన కలల్ని ప్రభావితం చేసే అవకాశమిస్తుంది. ఉదాహరణకు స్మార్ట్ స్పీకర్లు, ఇతర పరికరాల ద్వారా మనం నిద్రపోయినప్పుడు ప్రకటనదారులు కూడా మన కలల్ని ప్రభావితం చేయొచ్చు.
వాస్తవానికి ఇలా జరిగింది కూడా. 2021 ప్రారంభంలో అమెరికా బీర్ల కంపెనీ కూర్స్, తమ ఉత్పత్తుల గురించి వాలంటీర్లు కలలు కనేలా ప్రయోగాలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఘటనతో, కలలపై పరిశోధనల పురోగతిని ప్రకటనదారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశముందని నైతిక హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవలే స్లీప్ సైంటిస్టుల భారీ సమూహానికి సారథ్యం వహిస్తోన్న హార్డర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ స్టిక్‌జోల్, యూనివర్సిటీ ఆఫ్ మోంటేరాకు చెందిన డాక్టర్ ఆంటోనియో జద్రా ఈ నైతిక ప్రకటనలను విడుదల చేశారు.
''బ్రెయిన్ సైన్స్ ఆధారంగా సెల్‌ఫోన్ల దగ్గరి నుంచి సోషల్ మీడియా వరకు వివిధ వ్యసన సాంకేతికతలు రూపొందాయి. మనం నిద్ర నుంచి మేల్కొన్నాక, మన అధిక సమయాన్ని ఇవే నడిపిస్తున్నాయి. ఇప్పుడు నిద్రలో కూడా ఇలాంటివి జరగాలని మేం కోరుకోవట్లేదు'' అని వారు రాసుకొచ్చారు.
ఈ నైతిక హెచ్చరికల ప్రకటన జారీ చేసిన బృందంలో ప్యాలర్, కోన్‌కోలీ కూడా ఉన్నారు. వారి పని వల్ల కలిగే ముఖ్యమైన నైతిక చిక్కుల గురించి కూడా వారికి అవగాహన ఉంది.
''నిద్రలో ఉన్న వ్యక్తికి సందేశాలు పంపించడం సరైనది కాదు. అది చట్టవిరుద్ధం కూడా'' అని ప్యాలర్ చెప్పారు.
''ఇప్పటివరకు డ్రీమ్ థెరపీలు తటస్థంగా ఉన్నాయి. మానసిక రుగ్మతలు నయం చేయడానికి, సృజనాత్మకతను పెంచడానికి వీటిని ఉపయోగిస్తామని వాగ్దానం చేస్తున్నప్పటికీ, వాటిని ఇతర అనుచిత పద్ధతుల్లో ఉపయోగించే అవకాశం కూడా ఉంది'' అని జద్రా వివరించారు.
సైన్స్ మనల్ని అంతరిక్షంలో, భూమిపై ఉన్న ప్రతీ ప్రాంతంలోకి తీసుకువెళ్లింది. అలాగే కొన్ని నైతిక సమస్యలకు కారణంగా నిలుస్తోంది. ఇప్పుడు పరిశోధకులు, నిద్రపోతున్న మన మనస్సుల అన్వేషణను వేగవంతం చేస్తున్నారు. ఇది మరికొన్ని సవాళ్లను మన ముందుకు తీసుకురానుంది.
ఇవి కూడా చదవండి:
- హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి, 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- ‘భారీ వర్షాలతో టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








