విశాఖపట్నం నుంచి గంజాయి స్మగ్లింగ్.. అమెజాన్‌ ఉద్యోగులపై పోలీసు కేసు

అమెజాన్ ద్వారా గంజాయి విక్రయం

అమెజాన్ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటీవ్‌లపై పోలీసు కేసులు నమోదయ్యాయి. గంజాయి స్మగ్లింగ్ కోసం ఇద్దరు వ్యక్తులు అమెజాన్ వెబ్‌సైట్‌ను ఉపయోగించడంతో వారు ఈ అభియోగాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

విశాఖపట్నం నుంచి ఇతర రాష్ట్రాలకు 20 కేజీల గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను గత వారం మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

సహజసిద్ధ స్వీట్‌నర్ అయిన స్టేవియా ఆకులను విక్రయించే ముసుగులో వీరిద్దరూ అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని గంజాయి వ్యాపారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి ఘాటు

చట్టవిరుద్ధమైన ఉత్పతుల విక్రయాలను తమ సైట్‌లో అనుమతించేది లేదని అమెజాన్ సంస్థ పేర్కొంది.

అక్రమ సరుకుల రవాణా అంశంలో కంపెనీ నియమ నిబంధనలను ఉల్లంఘించిన విక్రయదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెజాన్ స్పష్టం చేసింది.

''సమస్య మా ముందుకు వచ్చింది. మేం ప్రస్తుతం దానిపై విచారణ చేస్తున్నాం'' అని కేసుకు ప్రతిస్పందనగా అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

'నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ ఉత్ప్రేరకాల' చట్టం కింద అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ల మీద అభియోగాలు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

''పోలీసుల ప్రశ్నలకు ప్రతిస్పందనగా కంపెనీ అందించిన సమాధానాలకు, చర్చల సందర్భంగా లభించిన వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో కేసులు మోపినట్లు'' పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఎంతమంది ఎగ్జిక్యూటీవ్‌లపై అభియోగాలు నమోదు అయ్యాయో అధికారులు చెప్పలేదు.

అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా రూ. 1.1 కోట్లకు పైగా విలువ చేసే, మొత్తం 1000 కేజీల గంజాయిని విక్రయించినట్లు అంచనా.

అమెజాన్ ఇండియా బిజినెస్ పరిష్కరిస్తోన్న తాజా కేసు ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఇది దేశంలో పోటీ విచారణను కూడా ఎదుర్కొంటోంది.

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ ఇండియా సంస్థలు కొంతమంది విక్రేతలకు అనుకూలంగా వ్యవరిస్తున్నాయనే అరోపణల నేపథ్యంలో రెగ్యులేటరీ సంస్థలు వీటిని విచారిస్తున్నాయి.

తమ సంస్థకు చెందిన ఒకరు లేదా ఇద్దరు భారతీయ ఉద్యోగులు, అధికారులకు లంచం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్‌లో అమెజాన్ సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది.

వీడియో క్యాప్షన్, లిక్విడ్ గంజాయి తీసుకుంటే ఇలా అయిపోతారు

ఇటీవల సంవత్సరాలలో, భారత్‌లో అక్రమ మాదక ద్రవ్యాల రవాణా, వాడకాన్ని నివారించేందుకు భారత అధికారులు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నారు.

దేశంలోని అనేక మంది ప్రముఖ నటులు, టెలివిజన్ ప్రముఖులపై నార్కోటిక్స్ అధికారులు గత ఏడాది నుంచి నిఘా ఉంచారు.

పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ 23 ఏళ్ల కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు భారత్‌లో మీడియా దృష్టిని తీవ్రంగా ఆకర్షించింది.

తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

వీడియో క్యాప్షన్, నైజీరియా యువతకు, దగ్గు మందే మాదక ద్రవ్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)