విశాఖపట్నం నుంచి అమెజాన్ ద్వారా గంజాయి విక్రయం - మధ్యప్రదేశ్ పోలీసులు - BBC Newsreel

ఫొటో సోర్స్, NASTASIC
అరటి గెలల మధ్య, గ్యాస్ సిలిండర్ల లోపల, వాహనాల్లో రహస్య అరలు తయారు చేసి వాటిలో గంజాయి రవాణా చేయడం విశాఖలో ఏజెన్సీలో నిత్యం చూసేదే. అయితే తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ ద్వారా కూడా విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా అవుతుందనే విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు కనిపెట్టారు.
రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో రోడ్డు పక్కన నిర్వహిస్తున్న దాబాపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో అక్కడున్న కల్లు పావయ్య అనే వ్యక్తి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాబా నిర్వహిస్తున్న బిజేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని విచారించగా...గత నాలుగు నెలులుగా విశాఖ నుంచి మధ్యప్రదేశ్ కు అమోజాన్ ప్లాట్ ఫాం ద్వారా రూ. 1.1 కోట్లకు పైగా విలువైన గంజాయిని వీరు తరలించినట్లు తేలిందని భింద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.
దఫదఫాలుగా గత 4 నెలలుగా అమెజాన్ ద్వారా సుమారు టన్ను గంజాయి అక్రమంగా మధ్యప్రదేశ్ కు రవాణా జరిగినట్లు తమ విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ గంజాయినంతా మధ్యప్రదేశ్ లోని భోపాల్, గ్వాలియర్ నగరాలకు తీసుకుని వచ్చి అక్కడ నుంచి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, రాజస్థాన్ లోని మరికొన్ని ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.
అయితే అమెజాన్ ద్వారా జరుగుతున్న ఈ గంజాయి అక్రమ రవాణా అంతా ఆ సంస్థకు తెలియకుండానే జరిగిందా...? అనే విషయంపై వివరణ కోరుతూ అమెజాన్ సంస్థకు సమన్లు జారీ చేసినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. వీటిపై అమెజాన్ సంస్థ కూడా సోమవారం (15.11.21) స్పందించినట్లు మనీ కంట్రోల్ వెబ్ సైట్ పేర్కొంది.
"ఈ విషయం మా దృష్టికి వచ్చింది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తాం. గంజాయి సరఫరా చేశారని చెబుతున్న అకౌంట్ కరివేపాకు విక్రయదారుడి పేరుతో నమోదైంది. నిందితుడు సూరజ్ పావయ్య గుజరాత్‌కు చెందిన ఒక టెక్స్‌టైల్ కంపెనీ వివరాలతో మూలికా ఉత్పత్తులు విక్రయదారుడిగా అమెజాన్‌లో నమోదు చేసుకున్నాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం" అని అమెజాన్ కార్యలయ ప్రతినిధులు తెలిపారని మనీ కంట్రోల్ వెబ్ సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్19 వ్యాక్సీన్ వేయించుకోని వారికి లాక్‌డౌన్ - ఇల్లు వదిలి బయటకు రావొద్దన్న ఆస్ట్రియా ప్రభుత్వం
కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో టీకాలు వేసుకోని దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆస్ట్రియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
"మేము లాక్‌డౌన్ నిబంధనలను తేలికగా తీసుకోవడం లేదు. దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది" అని ఛాన్స్‌లర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ అన్నారు.
టీకాలు వేసుకోని వారు ఆహారం కొనడానికి లేదా అత్యవసర పనులవంటి పరిమిత కారణాలతో మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు.
ఆస్ట్రియా జనాభాలో కేవలం 65% మంది మాత్రమే కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. పశ్చిమ యూరోప్‌లో అత్యల్ప వ్యాక్సిన్ రేట్లలో ఇది ఒకటి.
ఇదిలా ఉండగా, వారం రోజుల కరోనా వైరస్ సంక్రమణ రేటు 100,000 మందిలో, 800 పాజిటివ్ కేసులుగా ఉంది. ఇది యూరోప్‌లోనే అత్యధికం.
మొత్తంమీద యూరప్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో పలు దేశాలు కఠిన నిబంధనలను ప్రవేశపెడుతూ, పెరుగుతున్న కేసుల గురించి హెచ్చరిస్తున్నాయి.
ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజుల పాటు అమలవుతాయని ఆస్ట్రియా ప్రభుత్వం సోమవారం తెలిపింది.
12 ఏళ్లలోపు పిల్లలకు, ఇటీవల వైరస్ నుండి కోలుకున్న వ్యక్తులకు ఈ లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
''లాక్‌డౌన్ నిబంధనలు అవసరం. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు నిండిపోతున్నాయి. మరో రెండు వారాల్లో గరిష్ట పరిమితిని చేరుకుంటామని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాము" అని వియన్నా మెడికల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎవా షెర్న్‌హామర్ అన్నారు.
ఇప్పటికే టీకాలు వేసుకోని వారు, రెస్టారెంట్లు, సెలూన్‌లు, సినిమాలకు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి. తాజాగా, టీకాలు వేసుకోని వారు ఇంటికే పరిమితమవ్వాలనే ఆంక్షలను ప్రభుత్వం విధించింది.
"అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశాము. అయితే ఇది వ్యాక్సిన్ వేసుకోని మూడింట ఒకవంతు మందికి ముఖ్యంగా వర్తిస్తుంది" అని షాలెన్‌బర్గ్ పేర్కొన్నారు.
టీకాలు వేసుకున్నారో లేదో గుర్తించడానికి పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఈ కొత్త ఆంక్షలతో ఆస్ట్రియాలోని కొన్ని టీకా కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోంది.
అయితే ఈ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల పేరుతో ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుస్తోందని అతివాద ఫ్రీడమ్ పార్టీ ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
'దిల్లీలో లాక్‌డౌన్ విధించడానికి సిద్ధమే కానీ, ఎన్‌సీఆర్ అంతటా అమలుచేస్తేనే ఫలితం ఉంటుంది'
దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
కాలుష్య నియంత్రణకు దిల్లీలో పూర్తి లాక్‌డౌన్ విధించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ, నేషనల్ కేపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) పరిధిలోనూ అలాంటి చర్యలే తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.
కాలుష్యం నియంత్రించడానికి అత్యవసర ప్రణాళిక కింద దిల్లీలో రెండు రోజులు లాక్‌డౌన్ విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రెండు రోజుల కిందట దిల్లీ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.
దీనిపై సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం, లాక్‌డౌన్ వల్ల పరిమిత ప్రభావమే ఉంటుందని చెప్పింది. దిల్లీలాగే నగరం చుట్టు పక్కల నేషనల్ కాపిటల్ రీజియన్‌లోనూ అలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పింది.
"ప్రాంతీయ స్థాయిలో ఉద్గారాలను నియంత్రించడానికి పూర్తి లాక్‌డౌన్ అమలయ్యేలా చర్యలు తీసుకోడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి నిర్ణయం మొత్తం ఎన్సీఆర్ పరిధిలో అమలు చేస్తే, ఫలితం ఉంటుంది. దిల్లీ వరకే లాక్‌డౌన్ విధించడం వల్ల గాలి నాణ్యతపై పరిమిత ప్రభావం ఉంటుంది" అని తమ అఫిడవిట్‌లో చెప్పింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ కేసులో విచారణలు చేపట్టింది.
రాజధాని దిల్లీలో కాలుష్యం నియంత్రణ కోసం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న అన్ని వాహనాలపై తాము చర్యలు తీసుకుంటామని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
దీనికోసం 550 మంది ట్రాఫిక్ సిబ్బందిని 170 ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
దిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో పంట వ్యర్థాల దహనం వల్ల కేవలం పది శాతం కాలుష్యం ఉంటే.. పరిశ్రమలు, ధూళి, నగరంలో తిరిగే వాహనాల వల్ల 75 శాతం కాలుష్యం ఉంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పారు.
దేశ రాజధాని, ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం నియంత్రణపై దిల్లీ ప్రభుత్వం కుంటి సాకులు చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం తను వసూలు చేస్తున్న ఆదాయం ఏం చేస్తోందో తెలుసుకోడానికి సుప్రీంకోర్టు ఆడిట్ నిర్వహించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
పంట వ్యర్థాలు తగలబెట్టడం, అవవసర వాహనాల రాకపోకలు, పరిశ్రమల కాలుష్యం, ధూళి నియంత్రణ చర్యలకు అవసరమైన చర్యలు చేపట్టేలా పంజాబ్, హర్యానా, దిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో రేపు ఒక అత్యవసర సమావేశానికి పిలుపునివ్వాలని కేంద్రాన్నిఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
పరిస్థితి ఎదుర్కోడానికి కొంతకాలం పాటు ఎన్సీఆర్ పరిధిలో వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని కేంద్ర, రాష్ట్రాలను ఆదేశిస్తాం. ఈ సమావేశానికి పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలి. ఎల్లుండి జరిగే తదుపరి విచారణలో ఈ అంశంపై విచారిస్తామని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.
ఏయే పరిశ్రమలు మూయవచ్చు, ఏయే వాహనాలు, పవర్ ప్లాంట్లు నిలిపివేయవచ్చు, ప్రత్యామ్నాయం ఏంటి అనేదానిపై రేపు సాయంత్రం లోపు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడిగింది.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- టీ20 ప్రపంచకప్ ఫైనల్: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...
- బంగ్లాదేశ్ హిందువుల ఉపవాస దీక్ష, ఇజ్రాయెల్‌లో పెలికాన్ల సందడి, కొలంబోలో వరద బీభత్సం - ఈ వారం ప్రపంచ చిత్రాలు ఇవీ
- దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్... అవసరమైతే లాక్‌డౌన్ విధించాలని సూచన
- టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్‌లో ఓడిందా?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాం?
- హిందుత్వను ఐసిస్, బోకోహరామ్లతో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్... కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










