జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షాహిద్ అస్లం
- హోదా, బీబీసీ కోసం
సరిగ్గా 47 సంవత్సరాల క్రితం.. 1974 నవంబర్ 10 అర్థరాత్రి లాహోర్‌లోని షాద్‌మన్ కాలనీలోని ఒక ఇంటి ముందున్న పార్కింగ్ స్థలం నుంచి మార్క్ 2 కారు బయలుదేరింది.
రాత్రి సుమారు 12.30 అయ్యింది. చుట్టూ చిమ్మ చీకటి. కారులో నలుగురు ఉన్నారు. వాళ్లు మోడల్ టౌన్‌లో ఉన్న తమ ఇంటికి వెళుతున్నారు.
అహ్మద్ రజా కసూరి కారు నడుపుతుంటే, ఆయన తండ్రి నవాబ్ మహ్మద్ అహ్మద్ ఖాన్ కసూరి పక్క సీటులో కూర్చున్నారు. అహ్మద్ ఖాన్ కసూరి భార్య, మరదలు వెనుక సీట్లో ఉన్నారు.
కారు షాదమాన్ కాలనీ దాటి కొంచెం దూరంలో ఉన్న షా జమాల్ కూడలికి వచ్చేసరికి, కొందరు దుండగులు ఆ కారును చుట్టుముట్టారు. చేతుల్లోని తుపాకులతో మూడు వైపుల నుంచీ కాల్పులు జరిపారు.
అహ్మద్ రజా కసూరి కొంచం కిందకు వంగిపోయి, కారు వేగం పెంచారు. అప్పుడే అహ్మద్ ఖాన్ కసూరి తల పక్కనే ఉన్న కొడుకు భుజంపై వాలిపోయింది. తండ్రి శరీరం నుంచి కారుతున్న రక్తంతో అహ్మద్ రజా చేయి తడిసిపోయింది.
ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అహ్మద్ ఖాన్ కసూరిని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఆపరేషన్ చేయడానికి ముందే దాదాపు 400 మంది పోలీసులు ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/AHMED RAZA KASURI
అప్పటి ఇచ్రా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అబ్దుల్ హయీ నియాజీ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం నమోదు చేసిన తరువాత, "మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?" అని అహ్మద్ రజా కసూరిని అడిగారు.
ఆయన, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో పేరును ప్రస్తావించారు. ఆయన చెప్పింది వినగానే పోలీసు అధికారి చేతిలోని పెన్ను కింద పడిపోయింది. "మీరు ప్రధానిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?" అని ఆయన మరోసారి అడిగారు. "అవును" అని అహ్మద్ రజా కసూరి స్పష్టంగా జవాబిచ్చారు.
"ఎందుకంటే, ఆయన (భుట్టో) నాపై ఇంతకు ముందు కూడా ఎన్నో దాడులు చేయించారు. ఎఫ్ఐఆర్‌లో ఎవరు తప్పు చేశారో వారి పేరే రాయాలి కదా" అన్నారు.
అహ్మద్ రజా కసూరి 1965లో జుల్ఫికర్ అలీ భుట్టో స్థాపించిన పీపీపీవైపు ఆకర్షితులయ్యారు. తర్వాత ఆ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయ్యారు. తర్వాత పీపీపీ టికెట్‌పై లాహోర్ నియోజవర్గం నుంచి గెలిచి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అహ్మద్ రజా కసూరి బీబీసీతో మాట్లాడుతూ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
"కొంతసేపటి తర్వాత ఎస్‌హెచ్ఓ బయటకు వెళ్లిపోయారు. కాసేపటి తరువాత ఎస్ఎస్‌పీ, డీఐజీ వచ్చి.. నవాబ్ సాబ్ మీద దాడి చేసినవారు, మీ చుట్టుపక్కల వాళ్లు ఎవరో అయ్యుంటారు. కానీ, మీరు ఏకంగా ప్రధాన మంత్రి మీదనే ఆరోపణలు చేస్తున్నారు.. అని నాతో అన్నారు."

ఫొటో సోర్స్, JANG/NEWSPAPER
అహ్మద్ రజా కసూరి మామగారు అప్పట్లో సైన్యంలో బ్రిగేడియర్‌గా ఉన్నారు. ఆయన కూడా ఆస్పత్రికి వచ్చారు. రజా కసూరికి నచ్చజెప్పాలని ఆయన్ను పంపించారు.
కానీ, తన తండ్రిపై దాడి చేయించింది భుట్టోనే అని రజా కసూరి ఆయనతో గట్టిగా వాదించారు. తెల్లవారుజామున దాదాపు 3 అవుతోంది. అహ్మద్ ఖాన్ కసూరి మరణించారని డాక్టర్ చెప్పారు.
"ఆ మాట వినగానే నా కోపం అదుపు తప్పింది. విసురుగా బయటకు వెళ్లాను. ఆ పక్కనే ఒక కర్ర కనిపించింది. అది తీసుకుని ఎస్ఎస్‌పీ వీపుపై నాలుగు దెబ్బలు వేశాను. పరిగెత్తుకెళ్లి డీఐజీని కూడా వెనక నుంచి ఒక తన్ను తన్నాను. ఆయన కింద పడిపోతూ పోలీసుల వెనక దాక్కున్నారు" అని అహ్మద్ రజా కసూరి చెప్పుకొచ్చారు.
సుమారు 3.20కి పక్కనున్నవారి సహాయంతో అహ్మద్ రజా కసూరి ఒక రిపోర్ట్ రాశారు. అందులో తమపై గతంలో జరిగిన దాడుల గురించి కూడా ప్రస్తావించారు. తన తండ్రిని హత్యకు ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోనే కారణమని ఆరోపించారు.
చివరికి, అదే ఏడాది ఫిబ్రవరిలో తన సొంత పార్టీలోని ఒక ఎంఎల్ఏ తండ్రి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల్లో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో పేరు కూడా చేర్చారు.
అహ్మద్ ఖాన్ కసూరి శవపరీక్షను లాహోర్‌కు చెందిన లీగల్ డిప్యుటీ సర్జన్ డాక్టర్ సబీర్ అలీ నిర్వహించారు. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అక్కడ బుల్లెట్లకు సంబంధించి 24 ఖాళీ కాట్రిడ్జ్‌లు కనిపించాయి. ఆ కూడలిలో ఉన్న ఒక ఇంటి తలుపుపై కూడా బుల్లెట్ల గుర్తులు కనిపించాయి.
కారు వెనుక సీట్లో కూడా బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. ఈ ఆధారాలను బట్టి అహ్మద్ రజా కసూరి తృటిలో మృత్యువును తప్పించుకున్నారని వారికి స్పష్టమయింది.
దాడికి ఉపయోగించిన ఆయుధాలను గుర్తించేందుకు లాహోర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్ నాదిర్ హుస్సేన్ అబిదీకి ఖాళీ బుల్లెట్ కాట్రిడ్జ్‌లను అందించారు. ఆయన పరీక్షల కోసం వాటిని రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్‌కు పంపారు.

ఫొటో సోర్స్, Getty Images
పరీక్షల్లో అవి చైనాలో తయారైన 7 ఎంఎం కాట్రిడ్జ్‌లని, వాటిని ఎల్ఎంజి, ఎస్ఎంజి రైఫిల్స్‌లో కూడా ఉపయోగించవచ్చని తేలింది.
ఈ కేసు ప్రాథమిక దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ అబ్దుల్ అహద్‌కు అప్పగించారు. కానీ, 1975లో ఆయన చనిపోవడంతో ఆ బాధ్యతలను స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన మాలిక్ మహ్మద్ వారిస్‌కు అప్పగించారు.
దాంతోపాటూ, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి షఫీ ఉర్ రెహ్మాన్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది
ఈ కమిషన్ తన నివేదికను 1975 ఫిబ్రవరి 26న పంజాబ్ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ఆ రిపోర్టును బహిరంగపరచలేదు.
1975 అక్టోబరులో దర్యాప్తు అధికారి మాలిక్ మహ్మద్ వారిస్ సిఫారసు మేరకు కేసు నమోదైంది. అయితే, నిందితుల జాడ తెలియలేదని అందులో రాశారు.
1977 జూలై 5న జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆ దేశంలో మార్షల్ లా విధించారు. అప్పటి నుంచీ ఈ కేసు గురించి ఎన్నో వివాదాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికీ వాటికి ముగింపు పలికే చర్యలేవీ చేపట్టలేదు.
ఈ కేసు ఇప్పటికీ దేశ రాజకీయ, చట్ట, న్యాయ వ్యవస్థలను నీడలా వెంటాడుతోంది. మార్షల్ లా ప్రకటించిన తరువాత, రాజకీయ హత్యలు, అపహరణలు వంటి క్రిమినల్ కేసులను ఫెడరల్ ప్రభుత్వం ఎఫ్ఐఏకు అప్పగించింది.
అంతకుముందు ఈ కేసులన్నింటినీ జుల్ఫికర్ అలీ భుట్టో ఏర్పాటుచేసిన పారా మిలటరీ ఫోర్స్ అంటే ఫెడరల్ సెక్యూరిటీ ఫోర్స్ దర్యాప్తు చేసేది.
లాహోర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన బాంబు దాడికి సంబంధించి తెహ్రీక్-ఎ-ఇస్తిక్‌లాల్ పార్టీ అధ్యక్షుడు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అస్గర్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలపై 1975 మార్చిలో విచారణ జరిగింది.
అదే సమయంలో అహ్మద్ ఖాన్ కసూరి హత్య వెనుక ఫెడరల్ ఫోర్స్ హస్తం ఉండవచ్చని ఎఫ్ఐఏ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ ఖలీక్ అనుమానించారు.
ఈ అనుమానాల ఆధారంగా ఫెడరల్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ అర్షద్ ఇక్బాల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాణా ఇఫ్తికార్ అహ్మద్‌లను 1977 జూలై 24, 25న అరెస్ట్ చేశారు.
1977 జులై 26న ఈ ఇద్దరు అధికారులు మెజిస్ట్రేట్ ముందు తమ నేరం ఒప్పుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ మియా మొహమ్మద్ అబ్బాస్, ఇన్‌స్పెక్టర్ గులామ్ ముస్తఫాను కూడా అరెస్ట్ చేశారు. వారు కూడా సబ్ మేజిస్ట్రేట్ ముందు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల్లో ఇన్‌స్పెక్టర్ గులామ్ హుస్సేన్ కూడా చేరారు. కానీ తర్వాత ఆయన ప్రభుత్వ సాక్షిగా మారారు.
మార్షల్ లా అమలైన వెంటనే మసూద్ మహమూద్‌ను అరెస్ట్ చేశారు. ఆయన కూడా జైల్లో ఉన్న రెండు నెలలకు భుట్టోకు వ్యతిరేకంగా సాక్షి అయ్యారు. ఆ తర్వాత ఈ కేసులో సెప్టెంబర్ 3న జుల్ఫికర్ అలీ భుట్టోను కూడా అరెస్ట్ చేశారు.
భుట్టోను అరెస్ట్ చేసిన 10 రోజుల తర్వాత జస్టిస్ కేఎంఏ సమదానీ భుట్టోను బెయిల్ మీద విడుదల చేశారు. ఫలితంగా జస్టిస్ సమదానీని వెంటనే పదవి నుంచి తొలగించారని చెబుతారు. మూడు రోజుల తర్వాత భుట్టోను మళ్లీ అదే కేసులో మార్షల్ లా కింద అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, AFP
అదే సమయంలో హైకోర్టులో కొత్త జడ్డిలను కూడా నియమించారు. మౌల్వీ ముస్తాక్ హుస్సేన్‌ను లాహోర్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా చేశారు. ఆయన జనరల్ జియా ఉల్ హక్ హోంటౌన్ జలంధర్‌కు చెందినవారు.
1965లో జుల్ఫికర్ అలీ భుట్టో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, మౌల్వీ ముస్తాక్ ఆయనకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు.
ఈ కేసు 1977 సెప్టెంబర్ 11న మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చింది. సెప్టెంబర్ 13న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినతితో ఈ కేసు విచారణను లాహోర్ హైకోర్టుకు బదిలీ చేశారు.
కేసు విచారణ సమయంలో తమ ఇంతకు ముందు వాంగ్మూలం ఒత్తిడి వల్లే ఇచ్చామని మియా మొహమ్మద్ అబ్బాస్ మేజిస్ట్రేట్ ముందు మాటమార్చారు. తమకు ఏ కుట్ర గురించీ తెలీదని, గులాం హుస్సేన్, ఫెడరల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు ఎవరికీ దానికోసం ఆయుధాలు అందించాలని చెప్పలేని ఆయన కోర్టుకు తెలిపారు.
గులామ్ ముస్తఫా, అర్షద్ ఇక్బాల్, రాణా ఇఫ్తికార్ అహ్మద్ తాము నేరం చేశామనే మాటకు కట్టుబడ్డారు. ఆ రాత్రి తమ సీనియర్స్ గులామ్ హుస్సేన్, మియా మొహమ్మద్ అబ్బాస్ ఆదేశాలతో తాము దాడి చేశామని, ఆ దాడిలో అహ్మద్ రజా ఖాన్ తండ్రి చనిపోయారని తెలిపారు.
1978 మార్చి 2న ఈ కేసు విచారణ ముగిసింది. మార్చి 18న హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు తీర్పు వినిపించారు. లభించిన ఆధారాలను బట్టి ఫెడరల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ మసూద్ మహమూద్‌తో కలిసి అహ్మద్ రజా కసూరీ హత్యకు జుల్ఫికర్ అలీ భుట్టో కుట్ర పన్నారని, ఫెడరల్ సెక్యూరిటీ ఫోర్స్ దాడిలో ఆయన తండ్రి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కసూరీ చనిపోయారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.
ఈ కేసులో జుల్ఫికర్ అలీ భుట్టోకు మరణ దండన విధిస్తూ తీర్పు ఇచ్చారు.
నిందితులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అక్కడ 9 మంది జడ్జిలు ఉన్నారు. ఒక జడ్జి 1978 జులైలో రిటైరవగా, మరో జడ్జిని అనారోగ్యంతో సెలవులో పంపించారు. మిగతా ఏడుగురు జడ్జిలు 1979 ఫిబ్రవరిలో అపీలుపై తమ తీర్పు వినిపించారు. వీరిలో నలుగురు జడ్జిలు లాహోర్ హైకోర్ట్ తీర్పును సమర్థించగా, ముగ్గురు జుల్ఫికర్ అలీ భుట్టోను నిర్దోషిగా చెప్పారు.
సుప్రీంకోర్టు నిందితుల అపీల్‌ను కొట్టివేయడంతో 1979 ఏప్రిల్ 4న జుల్ఫికర్ అలీ భుట్టోకు ఉరిశిక్ష వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"1977 జులై 5న మార్షల్ లా విధించినప్పుడు ఈ కేసులో చాలా బలమైన వ్యక్తులు ఉండడంతో.. సెషన్స్ కోర్ట్ సరిగా విచారణ జరపలేదేమో అనిపించింది. అందుకే హైకోర్టు ఈ కేసును స్వయంగా విచారించేలా నేను హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాను" అని అహ్మద్ రజా కసూరీ చెప్పారు.
అహ్మద్ రజా కసూరీ వివరాల ప్రకారం ఒక ప్రైవేటు పార్టీ ఇంత పెద్ద కేసును నడిపించడం చాలా కష్టం కావడంతో ఆయన తన వకీలుకు చెప్పి ఈ కేసును ప్రభుత్వంతో అటాచ్ చేయించారు.
ఈ కేసును మళ్లీ తెరిపించడానికి, అప్పటి సైనిక నాయకత్వం పైరవీ చేసిందనే వాదనలను ఆయన ఖండించారు. అయితే, మార్షల్ లా అమలైన తర్వాత కేసును మళ్లీ తెరవడంతో అప్పటి ప్రభుత్వం ఈ చాలా మూర్ఖంగా ప్రవర్తించిందని ఆయన అంగీకరించారు.
మార్షల్ లా అమలయ్యే వరకూ ఈ కేసు వేగం అందుకోకపోవడం గురించి కూడా ఆయన వివరించారు.
"భుట్టో ఆ సమయంలో ఒక బలమైన ప్రధానమంత్రి. ఆయన ఉండగా దర్యాప్తు ఎలా జరుగుతుంది. అందుకే ఆయనను తప్పించగానే, నేను కూడా నా ప్రయత్నాలు పెంచాను" అన్నారు.
జుల్ఫికర్ అలీ భుట్టో ఈ కేసును పరిష్కరించుకునే ప్రయత్నాలు ఏవైనా చేశారా అనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు.
"జుల్ఫికర్ భుట్టో 1976లో తన భార్య నుస్రత్ భుట్టోను మా ఇంటికి పంపించారు. నేను ఆమెను చాలా గౌరవించాను. మీరు మా సోదరిలాగే భావిస్తున్నానని, గతంలో ఉన్న కేసులపై మళ్లీ ఆలోచిస్తానని చెప్పాను. కానీ ఆ కేసు మాత్రం ఉపసంహరించుకోలేదు".
"1977 జనవరి 7న కొత్తగా ఎన్నికలు జరిపించడానికి భుట్టో అసెంబ్లీని రద్దు చేశారు. ఆరోజు ఆయన నాతో ఎఫ్ఐఆర్ వెనక్కు తీసుకోవాలని చివరిసారి చెప్పారు. భుట్టో నాకు ఒక కాగితం ఇచ్చారు. దానిపై సంతకం చేయమన్నారు. ఆ పత్రాల్లో.. రాజకీయ ప్రత్యర్థులు చెప్పడంతోనే నేను నా తండ్రి హత్య ఆరోపణల్లో భుట్టో పేరును చేర్చాను. ఇప్పుడు వాస్తవాలు బయటకు రావడంతో నా ఆరోపణలు వెనక్కు తీసుకుంటున్నాను అని రాసుంది"
"సర్, నేను ఈ ప్రకటనపై సంతకం చేస్తా. కానీ పత్రికల్లో ఈ వార్త వస్తే నా ఇమేజ్ పాడవుతుంది. మీరు ఇంత పెద్ద నిందలు వేశారేంటి అని మా వాళ్లు కూడా నన్ను అడుగుతారు. జనం ఏమంటారని నాకు బాధ లేదు. కానీ, నేను మా వాళ్ల గురించే ఆలోచిస్తున్నా. వాళ్లకు నేను ఏ సమాధానం చెప్పాలి. అందుకే, నేను సంతకం పెట్టనని చెప్పేశా"
భుట్టో తన అహంకారం వల్లే ప్రాణాలు కోల్పోయారని, అహ్మద్ రజా కసూరీ ఇంటికెళ్లి, ఆయన్ను క్షమాపణలు అడిగితే తన ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆయన భావించారని అహ్మద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"నవంబర్ 11న ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది... అది జరిగుండకూడదు" అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చౌధరి మంజూర్ అన్నారు.
పాకిస్తాన్ న్యాయ చరిత్రలో హైకోర్టులో విచారణ జరిగిన మొదటి కేసు అదే. అక్కడ సాక్షుల కోసం బాక్సులు కూడా తయారు చేశారని ఆయన చెప్పారు.
"అహ్మద్ రజా ఖాన్, భుట్టో మధ్య పరిష్కారం జరిగింది. కానీ, 1977లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్యా మళ్లీ వివాదం తలెత్తింది. అహ్మద్ రజా ఖాన్‌కు ఎన్నో కుటుంబ గొడవలు ఉన్నాయి. వాళ్లపై ఆ దాడి ఆయన ప్రత్యర్థుల్లో ఎవరైనా చేసుండచ్చు" అంటారు చౌధరి మంజూర్.
"భుట్టో కోపిష్టే, ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను సవాలు కూడా చేసేవారు. కానీ ఎవరినైనా చంపడం లేదా చంపించడం లాంటి వాటితో ఆయనకు నిజానికి వా సంబంధం లేదు. భుట్టో అలాంటి నేత అయ్యుంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఎన్నో కేసులు నమోదయ్యేవి. కానీ అలా జరగలేదు" అన్నారు.
"ఈ కేసును రివ్యూ చేసి, ఈ కేసులో కమ్ముకున్న వివాదాలు తొలగిపోయేలా అధ్యక్షుడి సూచనతో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాలి. భుట్టోను తిరిగి ఎలాగూ తీసుకురాలేం. కానీ, వాస్తవాలు ఏంటో తెలిసేలా, భుట్టోపై వచ్చిన ఆరోపణలను తొలగిపోయేలా దీనిపై ఒక తీర్పు వెలువరించాలి" అని చౌధరి మజుందార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా పిల్లల్ని అమ్మేస్తాం, కొంటారా?’
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
- ‘మాకు తెలియని మా దేశాన్ని చూస్తున్నాం’
- ‘టీ20 కెప్టెన్సీ రోహిత్‌కు అప్పగించడానికి ఇదే సరైన సమయం’ - విరాట్ కోహ్లీ
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..
- విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- ప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














