పాకిస్తాన్: విదేశీ వధువుకు పౌరసత్వం ఇస్తారు కానీ, వరుడికి ఎందుకు ఇవ్వరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మొహమ్మద్ జుబేర్ ఖాన్
- హోదా, బీబీసీ ఉర్దూ కోసం
"పాకిస్తాన్ నా జన్మస్థలం కావడంతో 2001లో నా కుటుంబంతో కలిసి ఇక్కడికి తిరిగి వచ్చాను. నేను పాకిస్తానీ పౌరురాలిని కావడంతో, నా భర్త సయ్యద్ అమీర్ అలీకి ఇక్కడి పౌరసత్వం సులభంగా లభిస్తుందని అనుకున్నాను. కానీ, లాహోర్‌కు చేరుకుని దరఖాస్తు సమర్పించినప్పుడు కొత్త విషయాలు తెలిశాయి. విదేశీయులను వివాహం చేసుకున్న పాకిస్తానీ మహిళల భర్తలకు, వివాహం ఆధారంగా పాకిస్తాన్ పౌరసత్వం దొరకదని తెలుసుకోవడంతో గుండె జారిపోయినంత పనైంది" అని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్‌కి చెందిన అలీమా తెలిపారు.
అలీమా భర్త అమీర్ భారత పౌరుడు. వీరికి నలుగురు పిల్లలున్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో పాకిస్తాన్‌లోనే వీరంతా నివసిస్తున్నారు.
1996లో పెళ్లి చేసుకున్న తర్వాత అలీమా భారత్‌కు వచ్చారు. ఐదేళ్ల తర్వాత 2001లో భార్యాభర్తలు తమ కుటుంబంతో కలిసి పాకిస్తాన్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
అలీమా తన కుటుంబంతో కలిసి భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు వెళ్తున్నప్పుడు ఇలాంటి సమస్యాత్మకమైన పౌరసత్వ చట్టం అక్కడ ఉందని ఆమెకు తెలియదు.
తన భాగస్వామికి పౌరసత్వం పొందే హక్కు ఉంటుందని భావించినట్టు అలీమా తెలిపారు.
"మేం పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు, వివాహం ద్వారా నా భర్తకు పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదని మాకు తెలిసింది. అప్పటి నుంచి పిల్లలతో కలిసి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కోర్టులు, పాకిస్తాన్ అధికారులు మా కేసును మానవతా దృక్పథంతో కొనసాగించారు. లేకపోతే మా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది''

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో ఇలాంటివారు అనేకం
ఇది కేవలం ఒక్క అలీమా కథ మాత్రమే కాదు. పాక్‌లో ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. వారు విదేశీయులను వివాహం చేసుకుని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
తాజాగా, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా జిల్లాలోని పెషావర్ నివాసి సమియా రూహీ పెషావర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అఫ్గాన్ భర్తకు పాకిస్తాన్ పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని సమియా రూహి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె భర్త కువైట్‌లో పనిచేస్తున్నారు.
కరోనాకు ముందు పిల్లలను కలవడానికి ఆయనకు ఒక నెల వీసా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయనకు ఆ వీసా కూడా ఇవ్వడం లేదని వాపోయారు. భర్తకు వీసా నిరాకరిస్తుండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆమె చెప్పారు.
తన పిల్లల చదువుల విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమియా చెప్పారు. పిల్లలకు చట్టపరమైన అవసరాలు పెరుగుతున్నందున, వారి తండ్రి అందుబాటులో లేకపోవడం, పిల్లలకి కూడా పాకిస్తాన్ పౌరసత్వం లేకపోవడంతో పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆమె అన్నారు.
ప్రభుత్వం దగ్గరకానీ, ప్రభుత్వేతర సంస్థల వద్దగానీ ఎంత మంది పాకిస్తానీ మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే పూర్తి సమాచారం లేదు. అయితే ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయని అస్మా జహంగీర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైకోర్టు అడ్వకేట్ నిదా అలీ పేర్కొన్నారు.
"మా దగ్గరున్న సమాచారం ప్రకారం.. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలాంటి కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ పౌరసత్వ చట్టం ఏం చెబుతోంది?
పాకిస్తానీ పౌరసత్వం ఎవరు పొందొచ్చు, ఎవరు పొందకూడదు అనే అంశాలు పాకిస్తాన్ పౌరసత్వ చట్టం-1951లో పొందుపర్చి ఉన్నాయి.
ఈ చట్టంలోని సెక్షన్ 10.. వివాహం విషయంలో పాకిస్తాన్ పౌరసత్వానికి ఎవరు అర్హులు, ఎవరు కాదనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంది.
ఈ సెక్షన్ ప్రకారం, ఒక పాకిస్తానీ పురుషుడు విదేశీ మహిళను వివాహం చేసుకుంటే, సదరు మహిళ పాకిస్తానీ పౌరసత్వం పొందేందుకు అర్హురాలు. కానీ, ఇదే చట్టం మహిళలు ఇతర పురుషులను వివాహమాడితే మాత్రం వారికి పౌరసత్వం కల్పించలేదు.
2000 సంవత్సరంలో న్యాయవాది హీనా జిలానీ వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత, ఈ చట్టంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రకారం, పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు పాకిస్తాన్ పౌరసత్వ హక్కు ఇచ్చారు. అయితే, అదే హక్కు పాకిస్తానీ మహిళల విదేశీ భర్తలకు మాత్రం ఇవ్వలేదు.
2007లో ఈ చట్టంపై ఫెడరల్ షరియా కోర్టు స్వయంగా విచారణ జరిపింది. పాకిస్తానీ మహిళల విదేశీ భర్తలకు పాక్ పౌరసత్వం మంజూరు చేయడం వల్ల ఏ దేశమైనా తమ ఏజెంట్లను పాకిస్తాన్‌లోకి అనుమతించే అవకాశం ఉంటుందని కోర్టులో ప్రభుత్వం తరఫున్యాయవాది వాదనలు వినిపించారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదురుకావొచ్చన్నారు.
అటువంటి చట్టాన్ని అనుమతిస్తే, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ షరియా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తమ దేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడని దక్షిణాసియాలోని కొన్ని దేశాల ప్రజలకు పాక్‌లో నివసించడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారీ, సమాచార మంత్రి ఫవాద్ చౌదరిని ఇదే అంశంపై మాట్లాడాలని బీబీసీ సంప్రదించగా, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అలీమా అమీర్ కేసు చాలా 'సున్నితమైంది'
ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన వంటిదని మానవ హక్కుల న్యాయవాది అమన్ అయూబ్ పేర్కొన్నారు.
"వివాహం విషయంలో, పురుషులు, మహిళలు ఇద్దరూ తమ భాగస్వాములు పాకిస్తాన్ పౌరసత్వాన్ని పొందాలనుకుంటే, ఇద్దరూ సమాన హక్కును కలిగి ఉండాలి"
''పాకిస్తానీ పౌరులు మరొక దేశ పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తుల మధ్య వివాహానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితిలోనైనా, వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఎవరూ హరించరాదు. భారతదేశానికి చెందిన అమీర్ కేసు సున్నితమైంది''''ఉపఖండంలోని వివిధ దేశాల ప్రజలు చాలా సన్నిహిత బంధుత్వం కలిగి ఉన్నారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులో చాలా మంది దగ్గరి బంధువులు నివసిస్తున్నారు'' అని న్యాయవాది నిదా అలీ తెలిపారు.
"అదే విధంగా బంగ్లాదేశ్, భారతదేశం, చైనాలతోపాటూ కొన్ని ఇతర దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దేశాలు విడిపోయినా ఇరు చోట్ల ఉన్న బంధువులు తరచుగా వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి వివాహాలు చేస్తుంటారు. విదేశీయులను పెళ్లి చేసుకున్న పాకిస్తానీ మహిళల్లో చాలా మంది దగ్గరి బంధువులే ఉన్నారు''

ఫొటో సోర్స్, Getty Images
"పాకిస్తాన్‌లోనే కాకుండా భారతదేశంలో కూడా, పాకిస్తాన్‌కు చెందిన ఎవరైనా స్త్రీ లేదా పురుషుడిని వివాహం చేసుకోవడం ద్వారా అక్కడి పౌరసత్వం పొందాలనుకుంటే, వారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని మేము గమనించాము. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి'' అని నిదా అలీ తెలిపారు.
అయితే, వివాహం విషయంలో, భారతీయ చట్టాల ప్రకారం.. ఒక పురుషుడు లేదా స్త్రీ తన భాగస్వామి కోసం భారత పౌరసత్వాన్ని పొందవచ్చని ఆమె చెప్పారు.
పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకున్న విదేశీ పురుషుడికి మాత్రం పాక్ పౌరసత్వం లభించదని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన పాలసీ ప్రకారం, పౌరసత్వ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొందన్నారు. దీంతో చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.
ఇక మరీ ముఖ్యంగా భారతదేశ పురుషుల విషయానికొస్తే, పాక్ ప్రభుత్వ విధానాల వల్ల పరిస్థితి కాస్త 'సెన్సిటివ్'గా మారుతుందని నిదా అలీ అన్నారు. పాకిస్తానీ మహిళతో వివాహం ఆధారంగా పౌరసత్వం పొందాలనుకునే భారతీయులు మరిన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఇది కారణం అవుతుందన్నారు.
"బహుశా రాబోయే రోజుల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ వివక్షపూరిత చట్టం మారుతుందని మేము ఆశిస్తున్నాం" అని నిదా అలీ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
'నా భర్తను ఒంటరిగా బయటకు వెళ్లనిచ్చేదాన్ని కాదు'
''మాది పెద్దలుకుదిర్చిన పెళ్లి. మా అత్తగారు, అంటే అమీర్ తల్లికి కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఉంది. ఆమె పెళ్లి భారత్‌లో జరిగింది. అమీర్ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పెళ్లి పాకిస్తాన్‌లో జరిగింది. అమీర్ అన్నయ్య భార్యకు కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఉంది'' అని అలీమా అన్నారు.
''కోర్టు ఆదేశాల మేరకు మేం పాకిస్తాన్‌లోనే నివాసం ఏర్పరచుకుని చాలా ఏళ్లయింది. కానీ, కుటుంబంతో కలిసి మరే ఇతర నగరానికి సులభంగా వెళ్లడం నాకు సాధ్యం కాదు. చాలా చోట్ల పోలీసు అధికారులు ఐడీ కార్డులు అడుగుతుంటారు. అలాంటి సమయాల్లో నేను నా ఐడి కార్డ్‌ని చూపించి, అమీర్ ఐడి కార్డ్ ఇంట్లో మర్చిపోయామని సాకుగా చెబుతుంటాను''
అమీర్‌ని ఒంటరిగా బయటకు వెళ్లనివ్వనని అలీమా చెప్పారు. బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఆయనతోనే ఉంటాను. ముఖ్యంగా పాకిస్తాన్‌లో తీవ్రవాదంపై యుద్ధం ముమ్మరంగా సాగుతున్న సమయాల్లో మేం ఎదుర్కొన్న సమస్యలను ఎప్పటికీ మరచిపోలేము. ఆ సమయంలో భద్రతను చాలా కట్టుదిట్టంగా ఉండేది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ ఉండేదన్నారు.
"అమీర్ వద్ద ఐడీ కార్డ్ లేనందున ఎటువంటి వ్యాపారం లేదా ఉద్యోగం చేయలేరు. భారత్ నుంచి భూములు, ఆస్తులు అమ్ముకుని పాకిస్తాన్‌కు వచ్చిన మేం పోగుచేసుకున్న సొమ్ము కొద్ది నెలల్లోనే అయిపోయింది" అని ఆమె చెప్పారు.
'మా నాన్న గుర్తింపు కార్డు అడుగుతారేమోనని భయంగా ఉండేది'
స్కూళ్లు, కాలేజీల్లో తమ పిల్లలు పాకిస్తానీలని నమ్మించడం చాలా కష్టమని అలీమా చెప్పారు. దీంతో పిల్లల విలువైన విద్యా సంవత్సరాలు వృథా అయ్యేవి.
జీవితాన్ని నడపడానికి నేను చాలా సంవత్సరాలు నిశ్శబ్దంగా క్యాటరింగ్ పని చేశాను అని ఆమె చెప్పారు. నా నలుగురు పిల్లలూ సంకట పరిస్థితుల్లో నాకు చేదోడువాదోడుగా ఉండేవారు. నా పెద్ద కూతురు, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
అలాగే నా కొడుకులు కూడా రకరకాల పనులు చేసేవారని ఆమె అన్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే.. మిగతా పిల్లలు బాగా చదువుకుంటే ఈరోజు ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, నా కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగలిగింది అని అలీమా అన్నారు.
ఉన్నత విద్య కోసం వారి కుమార్తె స్కాలర్‌షిప్ పొందగలిగారు. "తన తండ్రి ఐడి కార్డ్ అడిగితే ఏం జరుగుతుందో, స్కాలర్‌షిప్ ఎక్కడ ఉపసంహరిస్తారో అని నేను ఎప్పుడూ భయపడేదాన్ని'' అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- ‘డుగ్ డుగ్' బుల్లెట్ బండిపై సినిమా, ఇంతకూ రాయల్ ఎన్ఫీల్డ్కు గుడి ఎందుకు కట్టారు
- నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..
- చెన్నై వరదలు: భారీ వర్షాలకు జలమయమైన నగరం
- పీవీ సింధు: పద్మభూషణ్ అవార్డు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
- టీ20 వరల్డ్ కప్: 2007లోనే చాంపియన్‌గా నిలిచిన భారత్ 2021లో ఎందుకు చతికిలపడింది
- ప్రజలంతా ఆయుధాలు పట్టాలని కోరుతున్న దేశం, కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








