టీ20 వరల్డ్ కప్: ‘మొదటి ప్రపంచకప్‌నే గెలిచిన భారత్ ఇప్పుడు మరో దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది’

ఫొటో సోర్స్, ANI
టీ20 వరల్డ్ కప్ -2021లో ఇంకా చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. నమీబియాతో ఆడబోయే మ్యాచ్‌లో భారత్ గెలుపు ఓటములకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.
మరోవైపు సెమీ ఫైనల్‌లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో కూడా తేలిపోయింది. నవంబర్ 10న జరిగే తొలి సెమీ ఫైనల్లో గ్రూప్ 1లో టాప్ టీమ్ ఇంగ్లండ్‌తో గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉన్న న్యూజీలాండ్ ఢీకొంటుంటే.. తర్వాత రోజు(నవంబర్ 11) జరిగే రెండో సెమీ ఫైనల్లో గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్, గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో ఆడనుంది.
సెమీ ఫైనల్ విజేతలు నవంబర్ 14న జరిగే ఫైనల్లో 2021 టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం తలపడతారు.
టోర్నీ ప్రారంభంలోనే వరుస ఎదురు దెబ్బలు తిన్న కోహ్లీ సేన.. ఆ తర్వాత కోలుకుని రెండు భారీ విజయాలు సాధించగానే సగటు అభిమాని మనసులో ఆశలు మిణుకుమిణుకు మన్నాయి.
అఫ్గానిస్తాన్ ఎలాగోలా న్యూజీలాండ్‌ను ఓడిస్తే మనకు కలిసొస్తుందని.. సెమీస్‌కు చేరుకుంటే ఫైనల్ కూడా చేరుకోగలమన్న ఆశలు అభిమానుల్లో కలిగాయి.
అయితే, అఫ్గానిస్తాన్‌పై న్యూజీలాండ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఆ ఓటమి అఫ్గానిస్తాన్‌తోపాటూ, భారత్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది.
మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు చివరికి నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోవడం అనేది అభిమానులనందరినీ వేధిస్తోంది.
భారత్ విజేతగా నిలిచిన 2007 టోర్నీ నుంచి ఇప్పటివరకూ జరిగింది ఒకసారి గమనిస్తే..

ఫొటో సోర్స్, Getty Images
2007 టీ20 వరల్డ్ కప్
తొలి టీ20 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరిగింది. గ్రూప్ డీలో ఉన్న భారత్ స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్ రద్దవడంతో ఈ టోర్నీలో కూడా భారత్ మొదట పాకిస్తాన్‌తోనే తలపడింది. చివరి వరకూ ఉత్కంఠగా నిలిచిన ఈ మ్యాచ్ టై కావడంతో చివర్లో బౌల్ అవుట్ ద్వారా భారత్ విజయం సాధించింది.
ఆ గ్రూప్‌లో టాప్‌గా నిలవడంతోపాటూ సూపర్ 8లో గ్రూప్ ఈలో కూడా టాప్‌లో నిలిచింది. తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయినా.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఆ గ్రూప్‌లో టాప్ టీమ్‌గా నిలిచింది.
చివరికి నాకౌట్ మ్యాచుల్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్, ఫైనల్లో గ్రూప్ ఎఫ్‌లో రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో తలపడింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ధోనీ కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆ నాటి జట్టులో.. ఇప్పుడు జట్టులో ఉన్న రోహిత్ శర్మతోపాటూ గౌతం గంభీర్, వీరేంద్ర సింగ్ లాంటి డాషింగ్ ఓపెనర్లు.. ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్ బౌలర్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2009, 2010, 2012
తర్వాత వరసగా మూడు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా సూపర్ 8 నుంచే వెనక్కు రావాల్సి వచ్చింది.
2009లో ఇంగ్లండ్‌లో జరిగిన రెండో టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో రెండు విజయాలతో టాప్‌లో నిలిచిన భారత్ సూపర్ 8 గ్రూప్ ఈలో వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో ఆడిన మూడు మ్యాచులూ ఓడి చివరకు టోర్నీ నుంచి తప్పుకుంది.
2010లోనూ అంతే.. వెస్టిండీస్‌లో జరిగిన టోర్నీలో గ్రూప్ సీలోని భారత్ 2 విజయాలతో ఆ గ్రూప్ టాపర్‌గా నిలిచినా, సూపర్ 8లో గ్రూప్ ఈ ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో మూడు మ్యాచులూ ఓడిపోయి నాకౌట్ దశకు చేరలేకపోయింది.
2012లో శ్రీలంకలో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ ఏలో ఉన్న భారత్ రెండు విజయాలతో ఆ గ్రూప్‌లో టాప్‌లో నిలిచినా సూపర్ 8 గ్రూప్ 2లో రెండు విజయాలు, ఒక ఓటమితో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో సమానంగా నిలిచినా రన్ రేటులో వెనకబడింది.
సూపర్ 8లో పాకిస్తాన్ మీద 8 వికెట్లతో ఘన విజయం సాధించినా, ఆస్ట్రేలియా చేతిలో 15 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలవడం భారత్ కొంప ముంచింది.
అప్పుడు కూడా ధోనీనే కెప్టెన్. గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటూ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. 2012లో విరాట్ కోహ్లీ కూడా జట్టుతో చేరాడు. కానీ జట్టు సూపర్ 8 నుంచే వెనుదిరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
2014
బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మరోసారి ఫైనల్ పోరు వరకూ వెళ్లింది. 4 వరుస విజయాలతో గ్రూప్ 2లో భారత్ టాప్‌లో నిలిచింది. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ మిగతా మూడు మ్యాచుల్లో కూడా భారీ విజయాలు నమోదు చేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్లో మాత్రం శ్రీలంక ముందు భారీ స్కోరు నిలపలేక ఓటమి మూటగట్టుకుంది.
సెమీ ఫైనల్లో 72 పరుగులు చేసి విజయం అందించిన విరాట్ కోహ్లీ ఫైనల్లో కూడా 77 పరుగులు చేశాడు. కానీ అతడికి మరోవైపు అండగా నిలిచేవారే కరువయ్యారు. దీంతో భారత్ రన్నరప్‌గా సంతృప్తి చెందాల్సి వచ్చింది.
2016
భారత్‌లో జరిగిన ఆరో టీ20 వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు ఒక ఓటమితో గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచిన భారత్ సెమీ ఫైనల్లో 192 పరుగుల భారీ చేసినా గ్రూప్ 1 టాప్ టీమ్ వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఈ సెమీ ఫైనల్లో ఓపెనర్లు రాణించడంతోపాటూ విరాట్ కోహ్లీ కూడా 89 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. కానీ సిమన్స్ చెలరేగి ఆడడం(5 సిక్సర్లు, 7 ఫోర్లతో 82 నాటౌట్)తో భారత్ ఓటమి మూటగట్టుకుంది. చివరకు ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన వెస్టిండీస్ రెండోసారి టీ20 విజేతగా నిలిచింది.

ఫొటో సోర్స్, Ani
2021
ఇప్పుడు మరోసారి టీమిడియా నాకౌట్ దశకు చేరకుండానే సూపర్ 12లోనే ఆగిపోయింది. యూఏఈ, ఒమన్‌లో జరిగిన టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్టు తొలి మ్యాచ్‌లో, అది కూడా ప్రధాన ప్రత్యర్థి పాక్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓడిపోయి ఒత్తిడిలో పడిపోయి, రెండో మ్యాచ్‌లోనూ దాని నుంచి కోలుకోలేకపోయింది.
తర్వాత టీమిండియా తేరుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్ మీద భారీ విజయాలు గ్రూప్‌లో అత్యధిక రన్‌రేట్ తెచ్చిపెట్టినా చివరకు న్యూజీలాండ్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ మీద ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రారంభంలోనే పాకిస్తాన్, న్యూజీలాండ్‌ను ఎదుర్కోవడం వల్ల భారత్ కష్టాలు పెరిగాయని, అదే మొదట చిన్న టీమ్స్‌తో ఆడుంటే, వాటిపై విజయాలు భారత్ ఆత్మ విశ్వాసాన్ని పెంచేవని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Ani
జట్టులో ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ లేని లోటు స్పష్టంగా తెలిసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ టోర్నీలో ఎడమ చేతి పేస్ బౌలర్లు ప్రదర్శన చూస్తే ఉదాహరణకు షాహీన్ అఫ్రిదీ, ట్రెంట్ బౌల్ట్ లాంటి వారు తమ జట్టు విజయానికి కీలకంగా మారారని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మనోజ్ చతుర్వేది చెబుతున్నారు.
టోర్నీ ప్రారంభంలో భారత్ వరసగా టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేయడం, మంచు కురిసే వికెట్ మీద బౌలింగ్ చేయాల్సిరావడంతో బంతి మీద పట్టు కోల్పోవడం కూడా ఈసారీ టీమిండియా పరాభవానికి కారణమని మరో సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆదేశ్ కుమార్ గుప్తా లాంటి వారు బీబీసీకి చెప్పారు.
అన్నిసార్లూ... చూడ్డానికి జట్టు బలంగానే సమతూకంగానే కనిపించినా.. చివరికి ప్రదర్శన విషయానికి వస్తే జట్టు మొట్టమొదటి 2007 టీ20 వరల్డ్ కప్ మినహా మిగతా అన్ని టోర్నీల్లోనూ భారత అభిమానులను నిరాశపరిచింది.
కానీ, అంతమాత్రాన టీమిండియాపై భారత అభిమానులు ఆశలు వదులుకోరు. మరోసారి జట్టు సమష్టిగా తమ సత్తా చూపిస్తుందని ప్రతి పెద్ద టోర్నీకీ ఎదురుచూస్తూనే ఉంటారు. ఇక అభిమానుల ఆశలన్నీ వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా అందుకోవడం మీదే ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ నబీ
- టీ20 వరల్డ్ కప్: అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- వాయు కాలుష్యాన్ని అత్యధికంగా సృష్టిస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు వద్దన్నా ఆ టీచర్ అమ్మాయిలకు పాఠాలు ఎలా చెప్పగలుగుతున్నారు?
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
- కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









