హైదరాబాద్: పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆపి మీ ఫోన్ అడగవచ్చా? అడిగి తీసుకున్న వెంటనే వారు మీ వాట్సప్ ఓపెన్ చేసి మీ చాట్ అంతా చూడవచ్చా? చూస్తే మీరేం చేస్తారు? పోలీసులే రోడ్డుపై వెళ్తున్న వారందర్నీ ఆపి వాట్సప్ చాట్ చూపించు అంటే? ఇప్పుడు హైదరాబాద్ లో సోషల్ మీడియాలో తిరుగుతోన్న ఒక కథనం ఇదే కలకలం రేపింది.
నగరంలోని ఒక ప్రాంతంలో పోలీసులు కొందరు యువకులను ఆపి వారి బైక్, జేబుల్లో ఉన్న వస్తువులతో పాటు.. ఫోన్ లాక్ తీసి ఇవ్వమని అడిగి వాట్సప్ చాట్స్ చెక్ చేయడం వివాదంగా మారింది.
''ఫోన్, బైక్, చాటింగ్, జేబులు అన్నీ చెక్ చేస్తున్నాం. ఫోన్ చాటింగ్‌లో గంజాయి గురించి ఏమైనా ఉంటే అప్పుడు వారిని స్టేషన్‌కి పంపిస్తున్నాం.'' అని అక్కడ విధులు నిర్వహించిన అధికారి ఆ వీడియోలో స్పష్టంగా చెప్పారు.
నిజానికి కొంత కాలంగా హైదరాబాద్‌తో పాటూ తెలంగాణ వ్యాప్తంగా గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో డీజీపీ సహా పోలీసు అధికారులు అందరితో కలసి ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపాలంటూ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
అప్పటి నుంచీ తెలంగాణ పోలీసులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అయితే ఆ క్రమంలో రోడ్డుపై వెళ్లే సాధారణ వ్యక్తులను కూడా తనిఖీ చేస్తున్నారు. వారి దగ్గర గంజాయి ఉందేమోనని చెక్ చేయడం వరకూ ఓకే. కానీ వారి ఫోన్లు కూడా ఓపెన్ చేసి, అందులో గంజాయికి సంబంధించిన చర్చ, చాటింగ్ ఉందేమోనని చెక్ చేయడం వివాదంగా మారింది.
దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ని మీడియా ప్రశ్నించింది. నేరస్తుల ఫోన్లు చూడడం పోలీసులుగా తమ కర్తవ్యం అని ఆయన అన్నారు. కానీ సామాన్యుల ఫోన్లు ఓపెన్ చేయడంపై ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు.

''అర్థరాత్రులు తిరుగుతోన్న వారి ఐడెంటిటీ తెలియనప్పుడు, అనుమానం ఉన్నప్పుడు పోలీసులు ప్రిస్కింగ్ (శరీరమంతా వెతకడం) చేయవచ్చు. ఈమధ్యే ఒక కానిస్టేబుల్ ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుంటే అతను వెంటనే జేబు లో నుంచి కత్తి తీశాడు. కాబట్టి అనుమానితులను వెతకడం తప్పదు. హైదరాబాద్ వంటి నగరం నుంచి రోజుకు 50 వేలు తక్కువ కాకుండా వీడియోలు అప్లోడ్ అవుతాయి. అన్నీ చెక్ చేయలేం. నేరాలు జరిగినా ప్రదేశంలో దొరికిన ప్రతీ వస్తువూ చెక్ చేయాలి. ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, కెమెరా.. అన్నీ డిజిటల్ ఎవిడెన్స్ కిందకే వస్తాయి. ఇలా చెక్ చేయడం పోలీసులు ప్రథమ బాధ్యత. ఇది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రజెంట్ ఎవిడెన్స్. మేం మీకు చెప్పేదొకటే వాట్సప్ లో వచ్చేవన్నీ వెరిఫై చేస్తూ కూర్చోవద్దు'' అన్నారు అంజనీ కుమార్.
''పౌరుల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) మాకు చాలా ముఖ్యం. అందుకు భంగం కలిగించే ఉద్దేశం మాకే కాదు, దేశంలో ఏ పోలీసులకూ లేదు. కానీ రౌడీ, హంతకుడు, నేరస్తుడు దగ్గర అటువంటి వస్తువులు కనిపిస్తే కచ్చితంగా చెక్ చేయడం మా బాధ్యత'' అన్నారాయన.
అయితే రోడ్డుపై వెళుతోన్న సామాన్యులను సాధారణంగా చెక్ చేసినప్పుడు కూడా ఫోన్లో మెసేజీలు చదువుతారా అన్న అంశంపై ఆయన స్పష్టంగా మాట్లాడలేదు.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. డిజిటల్ ప్రపంచంలో హక్కుల గురించి చురుగ్గా మాట్లాడే కొడాలి శ్రీనివాస్ దీనిపై స్పందించారు.
''పోలీసుల కొత్త విధానం: ఆపి మరీ ఫోన్ చాట్లు సెర్చ్ చేయడం. - గంజా వంటి పదాల కోసం ఫోన్ చాట్లు చెక్ చేస్తున్నారు పోలీసులు. ఎన్నార్సీ, మోదీ, బీజేపీ వంటి పదాల గురించి చెక్ చేసే వరకూ ఆగండి.'' అని ట్విట్టర్లో రాశారాయన. (ఇప్పుడు గంజా అంటారు. తరువాత రాజకీయాల గురించి చాట్ చేసుకున్న వారిని కూడా పట్టకుంటారు అనే ఉద్దేశంలో.)
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గాన్ కెప్టెన్
- టీ20 ప్రపంచ కప్‌లో క్రికెటర్లు మోకాళ్లపై ఎందుకు నిలబడుతున్నారు? భారత జట్టుపై విమర్శలు ఎందుకు?
- పాలస్తీనా ఎడారి కోటలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద చలువ రాతి చిత్తరువు’
- రైతుల ఆందోళన: భారత వ్యవహారాలలో కెనడా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?
- కెనడా పాఠశాల ప్రాంగణంలో బయటపడిన 215 మంది పిల్లల అవశేషాలు..
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








