అఫ్గానిస్తాన్ తాలిబాన్లను చూసి పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారా

అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చింది
ఫొటో క్యాప్షన్, అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చేసింది.
    • రచయిత, అబిద్ హుస్సేన్
    • హోదా, బీబీసీ ఉర్దూ, పాకిస్తాన్‌లోని ఒరక్జాయ్ జిల్లా నుంచి

అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు గంటలు. పదిహేడేళ్ల ఇస్రార్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగింది. అది తన జీవితంలో మరిచిపోలేని ఫోన్ కాల్ అవుతుందని అప్పటికి అతనికి తెలియదు.

రోజంతా సెక్యూరిటీ గార్డుగా పని చేసి అలసిపోయి నిద్రపోతున్నాడు ఇస్రార్. ఫోన్‌లో అటువైపు నుంచి అతని తమ్ముడు మాట్లాడుతున్నాడు.

‘‘మన ఇంటికి వచ్చిన కొందరు వ్యక్తులు నాన్నను బయటకు లాక్కెళ్లి కాల్చి చంపారు’’ అని అతను చెబుతున్నాడు.

‘త్వరగా ఇంటికి రా’ అని ఇస్రార్‌కు ఆయన సోదరుడు చెప్పాడు. ఇస్రార్ అనేది అతని అసలు పేరు కాదు. భద్రత కోసం పేరు మార్చాం.

పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో ఒకటైన ఒరక్జాయ్‌లో నేను ఇస్రార్‌ను కలిశాను. అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఉన్న చాలా ప్రావిన్సుల మాదిరిగానే ఒరక్జాయ్ ప్రధానంగా పష్తూన్ తెగల ప్రజలకు నిలయం.

ఇస్రార్ తండ్రి హత్యకు గురైన మూడు రోజుల తర్వాత దీనికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌-కె) తీవ్రవాద సంస్థ ప్రకటించింది. ఇది ఇస్లామిక్ స్టేట్‌కు ఒక శాఖ.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: ఐసిస్-కె ఏంటి? ఇది ఎందుకంత హింసాత్మకమైంది?

ఇస్రార్ తండ్రి పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫార్మర్ అని ఐఎస్‌-కె ఆరోపించింది. కానీ, ఇది నిజం కాదని ఇస్రార్ అన్నారు.

"మా నాన్న ఒరక్జాయ్‌లో ఒక షాపు నడుపుతుంటారు. ఆయన మా తెగలో చాలామందికి సాయం చేస్తుంటారు. యుద్దం కారణంగా ఇళ్లూ వాకిళ్లు కోల్పోయిన వారికి ఆయన ఎక్కువగా సాయం చేస్తుంటారు'' అని ఇస్రార్ వెల్లడించారు.

"మా నాన్నకు శత్రువులు లేరు. ఆ ప్రాంత పెద్దలలో ఆయన ఒకరు" అని అన్నారు ఇస్రార్.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్, ఐఎస్‌-కె సంస్థలు పూర్వ వైభవం కోసం పరస్పరం యుద్ధం చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌లోని ఈ ప్రాంతంలో పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది.

టీటీపీ తరచూ పాకిస్తాన్ ప్రభుత్వంపై దాడులు చేస్తుంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, టీటీపీ తరచూ పాకిస్తాన్ ప్రభుత్వంపై దాడులు చేస్తుంది.

పెరుగుతున్న హింస

ఇస్రార్ తండ్రిలాగే చాలా మంది బాధితులు ఉన్నారు. ఇస్రార్‌ తండ్రిని చంపిన రోజే ఒరక్జాయ్‌లో ఐఎస్-కె తీవ్రవాదులు మరొక వ్యక్తిని కూడా కాల్చి చంపారు. అతనిపైనా పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫార్మర్ అనే ముద్ర వేశారు. ఇది దాడి కూడా తమ పనేనని ఐఎస్-కె ప్రకటించుకుంది.

బజావుర్, మొహమాండ్, ఖైబర్, కుర్రం, ఉత్తర వజీరిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్‌తో సహా ఏడు గిరిజన ప్రాంతాలలో ఒరక్జాయ్ ఒకటి. మే 2018లో ఈ ప్రాంతం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌తో విలీనం అయ్యింది. వారంతా పాకిస్తాన్ పరిధిలోకి వచ్చారు.

ఇస్లామాబాద్ కేంద్రంగా పని చేసే పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సేకరించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో హింస పెరిగింది.

ఈ ప్రాంతంలో హింస పెరగడానికి ప్రధాన కారణం అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ సిద్ధాంతాలకు దగ్గరగా పని చేసే తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) సంస్థ.

ఈ సంస్థ తాలిబాన్ తరహా పాలనను పాకిస్తాన్‌‌లో ప్రారంభించాలని కోరుకుంటోంది. షరియా చట్టాలకు అనుగుణంగా ఇక్కడ పాలన నిర్వహించాలని భావిస్తోంది.

పీఐపీఎస్ సంస్థ డేటా ప్రకారం టీటీపీ గత ఏడాదిలో 95 దాడులు చేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 44 దాడులు చేసి 140 మందిని హత్య చేసింది.

అఫ్గాన్‌‌లో తాలిబాన్లు విజృంభించడం ప్రారంభించిన తర్వాత, జులైలో ప్రావిన్సుల ఆక్రమణ మొదలైన తర్వాత పాకిస్తాన్‌లో టీటీపీ కూడా కార్యకలాపాలను ఉధృతం చేసింది.

జులై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో మరో 44 దాడులు చేసి 73 మంది ప్రాణాలు తీసింది. వీరిలో పాకిస్తాన్ ప్రభుత్వంలో పని చేస్తున్నవారే ఎక్కువ.

పాకిస్తాన్ తాలిబాన్ తీవ్రవాదులు స్థానికులకు ఫోన్లు చేసి డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడుతుంటారు.
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని తాలిబాన్లు స్థానికులకు ఫోన్లు చేసి డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడుతుంటారు.

బెదిరింపులు, దుశ్చర్యలు

గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతం తీవ్ర హింస, ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. తమకు పాకిస్తాన్‌తో పాటు అఫ్గానిస్తాన్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని, డబ్బు కోసం బెదిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

జులై, ఆగస్టు నెలల్లో తనకు ఇలాంటివి ఆరు కాల్స్ వచ్చినట్లు బజావుర్‌కు చెందిన వ్యాపారి అహ్మద్ (అసలు పేరు కాదు) బీబీసీకి వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఫోన్ చేసి తమను తాము తాలిబాన్‌లుగా పరిచయం చేసుకుని డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు.

"వారు కేవలం డబ్బు కోసమే కాల్స్ చేస్తుంటారు" అని అహ్మద్ చెప్పారు. "డబ్బు ఇవ్వనని చెప్పినా వారు వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నారు. డబ్బు ఇవ్వకపోతే నీకు, నీ కుటుంబానికి ప్రమాదం తప్పదని బెదిరిస్తుంటారు'' అన్నారాయన.

తాను జిల్లా అధికారులను సంప్రదించి పోలీసులు, సైనికాధికారులకు ఈ కాల్స్‌కు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించానని అహ్మద్ చెప్పారు.

"నా సమస్య గురించి వారికి పదే పదే చెప్పాను. కానీ ఇలాంటి కాల్స్ అందుకునే వ్యక్తి నేను ఒక్కడినే కాదని, బజావుర్ ప్రాంతంలో చాలామందికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అధికారులు చెప్పారు'' అహ్మద్ వివరించారు.

"ప్రతి ఒక్కరికీ భద్రతను అందించడం అసాధ్యమని వారు నాకు చెప్పారు. నాకు నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని అన్నారు. నా ఇంటి వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు" అన్నారు అహ్మద్

స్థానికులు తరచూ తమకు వచ్చే బెదిరింపు కాల్స్ గురించి బజావుర్‌లోని సైనికాధికారులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు
ఫొటో క్యాప్షన్, స్థానికులు తరచూ తమకు వచ్చే బెదిరింపు కాల్స్ గురించి సైనికాధికారులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు

తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ - (టీటీపీ) సంస్థ ఏం చేస్తుంది?

2007 చివరిలో టీటీపీని దక్షిణ వజీరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్ స్థాపించారు. ఇస్లామాబాద్‌లోని లాల్ మసీదును ఖాళీ చేయించిన సమయంలో, పాకిస్తాన్ సైనిక చర్యకు ప్రతిఘటనగా ఈ తీవ్రవాద ఉద్యమం ఏర్పడింది.

బైతుల్లాను ఒక్కోసారి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి దగ్గరి వాడిగా చెబుతారు.

వెస్ట్‌ పాయింట్‌లోని యూఎస్ మిలిటరీ అకాడమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమీరా జాడూన్ అభిప్రాయం ప్రకారం, అఫ్గాన్, పాకిస్తాన్ తాలిబాన్‌ల మధ్య సంబంధాలు 9/11 నాటి ఘటనలతో పాటు, 2001లో అఫ్గానిస్తాన్ మొదటి తాలిబాన్ ప్రభుత్వం పతనం నాటి నుంచి కొనసాగుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం పతనం తర్వాత పాకిస్తానీ తాలిబాన్‌లు కూడా అఫ్గాన్ తాలిబాన్‌లతో కలిసి అమెరికా సైన్యంపై పోరాడారని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలో అఫ్గాన్ తాలిబాన్‌లకు ఆహారం, ఆశ్రయం ఆర్థిక సహాయం కూడా అందించారు. వారికి విధేయత ప్రకటించారు.

సంస్థగా ఏర్పడిన తర్వాత టీటీపీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.

అయితే, పాకిస్తాన్ సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది. టీటీపీ నాయకత్వాన్ని అప్గానిస్తాన్‌కు తరిమింది. అయితే, మళ్లీ 2015 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంపై చిన్న చిన్న దాడులు మొదలు పెట్టింది టీటీపీ.

గత జులైలో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు కాబూల్‌‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత ఇక్కడ టీటీపీ కూడా క్రియాశీలంగా మారింది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ విజయం మొత్తం ముస్లింల విజయమని టీటీపీ చీఫ్ నూర్ వలీ మొహసూద్ సీఎన్ఎన్‌తో అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు.

2015లో టీటీపీ దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో టీటీపీ దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్న స్థానికులు

"మా పోరాటం పాకిస్తాన్‌లో మాత్రమే, అక్కడ మేము పాకిస్తాన్ భద్రతా దళాలతో యుద్ధం చేస్తున్నాం" అని ఆయన అన్నారు.

"పాకిస్తాన్ సరిహద్దు గిరిజన ప్రాంతాలను మా కంట్రోల్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. వాటికి పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలని భావిస్తున్నాం'' అన్నారాయన

''అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ల విజయం టీటీపీకి బలాన్నిచ్చింది'' అని సింగపూర్‌లో టెర్రరిజంపై పరిశోధన చేస్తున్న అబ్దుల్ బాసిత్ అన్నారు.

"అఫ్గానిస్తాన్‌లో అమెరికాయే ఓడిపోయింది. ఇక పాకిస్తాన్‌ ప్రభుత్వం ఏం చేయగలదు అని వారు భావిస్తున్నారు'' అన్నారు బాసిత్

వీరు స్థానికంగా తెగల మధ్య ఉన్న విభేదాలను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

''పాకిస్తాన్‌కు టీటీపీ అనేది తగ్గిపోతున్న ప్రమాదం'' అని పాకిస్తాన్ జాతీయ భద్రతా మాజీ సలహాదారు జనరల్ నాసిర్ జంజువా అన్నారు.

''అమెరికాకు మద్దతిస్తున్నారన్న కోపంతో వారు పాకిస్తాన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో అమెరికా లేదు. దీంతో ఆ సంస్థ ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు కూడా తగ్గింది. వారు పాల్పడుతున్న హింస అంతా వారి మనుగడను నిరూపించుకోవడం కోసమే'' అని ఆయన అన్నారు.

అఫ్గానిస్తాన్ తాలిబాన్‌ల పాలనను పాకిస్తాన్ తాలిబాన్‌లు ఆదర్శంగా తీసుకున్నారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ తాలిబాన్‌ల పాలనను పాకిస్తాన్ తాలిబాన్‌లు ఆదర్శంగా తీసుకుంటున్నారు

మంచి తాలిబాన్, చెడ్డ తాలిబాన్

వాస్తవం ఏంటంటే, పాకిస్తాన్‌ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. తాలిబాన్‌లను గుర్తించాల్సిందిగా పాకిస్తాన్ ప్రపంచాన్ని కోరుతోంది.

కాకపోతే, కొన్ని దశాబ్దాలపాటు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ తాలిబాన్‌లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీనివల్ల అనేకమంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

అందుకే తాలిబాన్‌లను మంచి తాలిబాన్‌లు, చెడ్డ తాలిబాన్‌లుగా పాకిస్తాన్ చెప్పుకుంటుందని నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్‌లో ఉన్న తాలిబాన్‌లు చెడ్డవారు కాగా, అఫ్గానిస్తాన్‌లో ఉన్న తాలిబాన్‌లు మంచి వారని ఆ దేశం భావిస్తోందని అన్నారు.

ఇక్కడ సాగుతున్న టీటీపీ కార్యకలాపాలను అణచి వేయడానికి గిరిజన ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. ఈ కారణంగా వేలాది మంది స్థానికులు భయంతో ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది.

పాకిస్థాన్ తాలిబాన్‌‌లలోని వివిధ వర్గాలతో శాంతి ఒప్పందంపై చర్చలు జరపడానికి పాకిస్తాన్ ప్రభుత్వం సంవత్సరాలుగా ప్రయత్నించింది. అయితే గిరిజన ప్రాంతాలలో ఐఎస్-కె సంస్థ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టడం పాక్ అధికారులకు తలనొప్పిగా మారింది.

గత ఏడాది దోహాలో అమెరికాతో ఒప్పందంపై సంతకం చేసినందుకు తాలిబాన్‌లపై ఆగ్రహంతో ఉంది ఐఎస్. జిహాద్‌ బాటను తాలిబాన్‌లు విడిచి పెట్టారని ఆరోపించింది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లతో ఐఎస్-కెకు ఇప్పటికే విభేదాలున్నాయి. తాలిబాన్‌లను మత భ్రష్టులుగా ఐఎస్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. వారిపై తమ యుద్ధం కొనసాగుతుందని ప్రకటించుకుంది.

''అఫ్గాన్ తాలిబాన్‌లతో విభేదాల కారణంగా పాకిస్తాన్ తాలిబాన్‌తో ఐఎస్-కె శత్రుత్వం పెంచుకుంది'' అని జిహాద్‌‌పై స్వతంత్రంగా పరిశోధన చేస్తున్న స్వీడన్‌కు చెందిన పరిశోధకుడు అబ్దుల్ సయ్యద్ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌లో టీటీపీ, ఐఎస్-కెకు చెందిన చిన్నచిన్న దళాలు పని చేస్తున్నాయని, ఇవి వేటికవి తమ లక్ష్యాల కోసం పని చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

''టీటీపీ కంటే ఐఎస్-కెకు పెద్ద లక్ష్యాలున్నాయి'' అని డాక్టర్ జాడూన్ అభిప్రాయపడ్డారు.

''ఖలిఫా పేరుతో ప్రాదేశికంగా పట్టు సంపాదించాలని ఐఎస్-కె కోరుకుంటోంది. ప్రపంచ ముస్లింలందరికీ చట్టబద్ధమైన ఏకైక నాయకుడిగా తనను తాను భావిస్తోంది'' అన్నారు జాడూన్

తీవ్రవాదులు, సైన్యం మధ్య యుద్ధం కారణంగా 2014లో లక్షలమంది స్థానికులు వలసబాట పట్టారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తీవ్రవాదులు, సైన్యం మధ్య యుద్ధం కారణంగా 2014లో లక్షలమంది స్థానికులు వలసబాట పట్టారు

చెల్లాచెదురైన స్థానికులు

మిలిటెంట్ గ్రూపుల పరస్పర యుద్ధాల కారణంగా స్థానికుల జీవితం దుర్భరంగా మారింది.

తన కుటుంబం మొత్తాన్ని అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఉన్న తన గ్రామానికి తరలించాల్సి వచ్చిందని కొన్ని సంవత్సరాల కిందట పాకిస్తాన్ మిలిటరీతో కలిసి TTPతో పోరాడిన మాజీ మిలీషియా నాయకుడు ఒకరు నాతో చెప్పారు.

"నా తండ్రి, సోదరుడు పోరాటంలో మరణించారు. మా ఇళ్లు ధ్వంసమయ్యాయి'' అని మాజీ తీవ్రవాది షెహజాద్ (అసలు పేరు కాదు) వెల్లడించారు.

బజావుర్‌‌కు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ కూడా దిగులుగా ఉన్నారు. ''ఇల్లు వదిలి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్లను'' అని నాతో అన్నారు.

ఇస్రార్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వెల్లడించారు.

"యుద్ధం ప్రారంభమైనప్పుడు మా ఇంటిని వదిలి వెళ్లడం తప్ప మాకు వేరే మార్గం లేదు. నా తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం తిరిగి వచ్చారు. కానీ, ఇప్పుడు మా నాన్నను చంపేశారు" అని ఆయన నాతో అన్నారు.

"ఈ ప్రాంతంలో శాంతి నెలకొందని, అందరూ తిరిగి రావాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ శాంతి ఎక్కడుంది'' అని ఇస్రార్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)