టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్‌లో ఓడిందా?

2015 వన్డే ప్రపంచకప్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సమీ చౌదరి
    • హోదా, క్రికెట్ విశ్లేషకులు

2015 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో క్వార్టర్స్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ వాహబ్ రియాజ్ వేసిన అద్భుత స్పెల్ గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుతుంటారు.

ఆ మ్యాచ్‌లో అతను అద్భుత స్పెల్‌తో ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దూకుడైన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను పదునైన బంతులతో భయపెట్టించాడు. వాట్సన్ అతని బంతులు ఎదుర్కోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

అదే సమయంలో వాహబ్ బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను రహత్ అలీ వదిలిపెట్టాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఇక మరో అవకాశం ఇవ్వకుండా ఆ మ్యాచ్‌లో రాణించిన వాట్సన్ అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను గెలిపించాడు.

ప్రపంచకప్‌ల్లాంటి పెద్ద టోర్నీల్లో బౌలర్ నుంచి వచ్చే ప్రతీ బంతి, బ్యాట్స్‌మెన్ ఆడే ప్రతీ షాట్, ఫీల్డింగ్‌లోని ప్రతీక్షణం ఎంతో విలువైనవి. అయితే మొత్తం మ్యాచ్ ఫలితం బాధ్యతను, కేవలం ఒక్క క్యాచ్‌పై వేయడం తెలివైన పని కాదు.

'క్యాచెస్ విన్స్ మ్యాచెస్' అనే సామెత క్రికెట్‌లో ప్రసిద్ధి. అయితే ఈ సామెత ఆధారంగా మొత్తం మ్యాచ్‌ను అంచనా వేస్తే ఈ క్వార్టర్స్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బదులుగా ఆస్ట్రేలియా ఓడిపోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఒకటి కాదు ఏకంగా మూడు క్యాచ్‌ల్ని వదిలేసింది.

మ్యాక్స్‌వెల్ వికెట్ తీశాక నిస్సందేహంగా పాకిస్తాన్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. కానీ మ్యాచ్ మొత్తంలో రహత్ అలీ వదిలేసిన ఆ క్యాచ్‌ను టర్నింగ్ పాయింట్ అని పిలువడం అవివేకం అవుతుంది.

రాత్రిపూట జరిగే మ్యాచ్‌ల ఫీల్డింగ్‌ను, ఫీల్డర్ నైపుణ్యంతో ఇంకా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఫీల్డింగ్ పొజిషన్, బంతి వేగం, మైదానంలో లైట్లు క్యాచ్‌లపై ప్రభావం చూపుతాయి. దుబాయ్ క్రికెట్ స్టేడియంలోని లైట్లు, ఎంత మంచి ఫీల్డర్‌కైనా రాత్రిపూట సవాలును విసురుతున్నాయి.

హసన్ అలీ

ఫొటో సోర్స్, Getty Images

తాజా టీ20 ప్రపంచకప్, పాకిస్తాన్ ప్లేయర్ హసన్ అలీకి నిరాశ మిగిల్చింది. కానీ అతను పాకిస్తాన్ తరఫున స్టార్ పర్ఫార్మర్ అనే సంగతి అందరికీ తెలుసు.

గాయాలతో పోరాడి అతను మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నతీరు, జట్టు విజయాల్లో అతని పాత్ర, పాక్‌కు హసన్ అలీ ఎంత కీలక ఆటగాడో తెలుపుతాయి. అతని ఫీల్డింగ్ మరీ అంత తీసికట్టుగా కూడా ఉండదని అందరికీ తెలుసు.

కానీ మ్యాచ్ అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఆశ్చర్యకరం. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ 'బహుశా, ఆ వదిలేసిన క్యాచ్ టర్నింగ్ పాయింట్ అయి ఉండొచ్చు' అని బాబర్ అన్నాడు.

మ్యాథ్యూ వేడ్ స్థానంలో మరో కొత్త బ్యాట్స్‌మన్ వచ్చి ఉంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉండేది.

''హసన్ అలీ క్యాచ్ వదిలేయడం, మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయినట్లుగా అనిపించడం లేదని'' మ్యాచ్ అనంతరం స్వయంగా మ్యాథ్యూ వేడ్ అన్నాడు.

ఈ పిచ్‌లపై వరల్డ్ కప్ జరుగుతోన్న తీరు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. రన్ రేట్ 12 చేయాల్సి ఉన్న స్థితిలో ఒక జట్టు చేతిలో 4 వికెట్లు ఉండి కూడా ఓడిపోవడం విస్తు కలిగిస్తోంది.

ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

హసన్ అలీ క్యాచ్ వదిలేయకుండా పట్టుకొని ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేదన్నది నిజమే. కానీ మ్యాచ్ మొత్తానికి ఆ క్యాచ్‌ను మాత్రమే బాధ్యత చేయడం సమంజసం కాదు.

అలాగే వార్నర్‌పై ఇమాద్ వసీమ్‌కు ఉన్న రికార్డుల ప్రకారం చూస్తే, మ్యాచ్ 4వ ఓవర్లో ఇమాద్‌తో బౌలింగ్ చేయించి ఉండకపోతే వార్నర్ అంతలా చెలరేగి ఉండేవాడు కాదు. అప్పుడు కూడా మ్యాచ్ గతి మరోలా ఉండేది.

ఇమాద్ బౌలింగ్‌లో వార్నర్ వరుసగా 6,4,4 బాదడంతో 17 పరుగులు వచ్చాయి.

మ్యాచ్ 12వ ఓవర్‌లో ఇమాద్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. అప్పటికి అతని కోటాలో 3 ఓవర్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో ఓవర్ మిగిలి ఉంది. కానీ దాన్ని పూర్తిగా వేయించకుండా బంతిని మరో బౌలర్‌కు అప్పగించారు.

ఒకవేళ ఇమాద్ తన పూర్తి కోటా 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే, చివర్లో ఆస్ట్రేలియా రన్ రేట్ 12కు బదులుగా 16 ఉండే అవకాశం ఉంది. అప్పుడు మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియాకు మరింత కఠినంగా మారేది. కానీ అలా జరగలేదు.

19 ఓవర్‌లో అసిఫ్ అలీ అవుటయ్యాక షోయబ్ మలిక్ క్రీజులోకి వచ్చాడు. దానికి బదులుగా పేస్‌ను చక్కగా ఆడగలిగే సామర్థ్యమున్న మొహమ్మద్ హఫీజ్‌ను కెప్టెన్ బాబర్ ఆజమ్ పంపించి ఉంటే ఆ ఓవర్‌లో మరిన్ని ఎక్కువ పరుగులు వచ్చి ఉండేవి. పాకిస్తాన్‌కు మరో 10 నుంచి 15 పరుగులు ఎక్కువగా వచ్చి ఉండేవి.

పాకిస్తాన్, 19 ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది.

క్రికెట్ చాలా ఆసక్తికరమైన ఆట. ఇందులో కొన్నిసార్లు ఒక్క ఆటగాడే, మిగతా 21 మంది కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాడు. కొన్నిసార్లేమో ఒక్కరు చేసిన పొరపాటును, పది మంది ఆటగాళ్లు కలిసి కూడా పూడ్చలేకపోతారు. గెలిచిన జట్టుకు ప్రతీదీ సహాయపడుతుంది. అదే ఓడిపోయిన జట్టు తరఫున ప్రతీ అంశం, లోటుగానే కనబడుతుంది.

పాకిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

తమ సంప్రదాయానికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. కానీ మిడిల్ ఓవర్లలో పాక్ రన్‌రేట్, ఇలాంటి మ్యాచ్‌ల్లో ఉండాల్సిన స్థాయిలో లేదు.

ఈ మ్యాచ్‌లో వికెట్, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. పాకిస్తాన్ కూడా దీటుగానే ఆడింది. కానీ డెత్ ఓవర్లు వచ్చేసరికి ఆ ఊపు అంతా ఆస్ట్రేలియా వైపుకు మళ్లింది.

అలాగే రెండో ఇన్నింగ్స్‌లో కూడా, ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ మరిన్ని పరుగులు చేసి ఉంటే బావుండేది.

ఈ మ్యాచ్‌లో ఓటమితో పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియడంతో ఇప్పుడు ఈ అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి.

ఒకవేళ హసన్ అలీ క్యాచ్ వదిలేసిన తర్వాత కూడా, పాక్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిది నియంత్రణ కోల్పోకుండా కట్టుదిట్టంగా బంతులేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను నిలువరించి ఉంటే... ఈ చర్చ అంతా మరో అంశం మీదకు వెళ్లి ఉండేది.

అప్పుడు తొలి ఓవర్‌లో మెరుగ్గా బౌలింగ్ చేసిన స్టార్క్‌ను ఫించ్ ఎందుకు తప్పించాడు అనే అంశంపై చర్చిస్తూ ఉండేవారు.

ఏది ఏమైనప్పటికీ, బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో యువకులతో కూడిన పాక్ జట్టు ఈ టోర్నీలో గొప్పగా ఆడింది. టాప్-4లో నిలిచిన ఏకైక ఆసియా టీమ్ కూడా పాకిస్తానే.

ఇప్పుడు ఈ టోర్నీ నుంచి బాబర్ ఆజమ్ చాలా నేర్చుకున్నాడు. ఈ అనుభవం అంతా మరో 11 నెలల్లో అతనికి మరోసారి ఉపయోగపడుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై మరో ప్రపంచకప్ జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)