హిందుత్వను ఐసిస్, బోకోహరామ్‌లతో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్... కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

కాంగ్రెస్ ముగ్గురు నేతలు మూడు భిన్నమైన ప్రకటనలు చేశారు

ఫొటో సోర్స్, GETTY IMAGES AND AFP

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ ముగ్గురు నేతలు మూడు భిన్నమైన ప్రకటనలు చేశారు
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

అయోధ్య వివాదం, సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకం విడుదలైన తర్వాత 'హిందుత్వ' అంశంపై మళ్లీ రాజకీయ వివాదం మొదలైంది. ఈ వివాదంలోకి రాహుల్ గాంధీ కూడా అడుగుపెట్టారు.

మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని ఉద్దేశిస్తూ శుక్రవారం నాడు వర్చువల్‌గా మాట్లాడిన రాహుల్ గాంధీ, హిందూ ధర్మానికి, హిందుత్వకు తేడా ఉందన్నారు. ''నిజంగా తేడా లేకపోయినట్లయితే పేర్లు వేర్వేరుగా ఉండేవి కావు. హిందువులకు హిందుత్వ అక్కర్లేదు'' అన్నారు.

''హిందూ మతం అంటే సిక్కులను లేదా ముస్లింలను చంపడమా? హిందూ ధర్మంలో చంపడం గురించి ఎక్కడైనా రాశారా? నేను ఉపనిషత్తులను చదివాను. హిందూ ధర్మానికి చెందిన ఏ పుస్తకంలో చంపమని ఉంది? నేను ఎక్కడా చదవలేదు. ఒక్క హిందుత్వలోనే ఇలా ఉంటుంది'' అన్నారాయన.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య' అనే పుస్తకంలో ఒక పంక్తి వివాదాస్పదంగా మారింది. అందులో హిందుత్వను ఐసిస్, బోకోహరామ్‌ తో పోల్చారు.

"భారతదేశంలోని ఋషులు, సాధువులు శతాబ్ధాలుగా మాట్లాడుతున్న సనాతన ధర్మం అసలైన హిందుత్వం. నేడు మతోన్మాదంతో హిందుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇస్లామిక్ జిహాదీ సంస్థలు ఐసిస్, బోకోహరామ్ లాగా నేడు హిందుత్వ కూడా రాజకీయవాదంగా మారింది"అని ఆ పుస్తకంలో రాశారు.

అయితే, ఈ రాతలపై వివాదం మొదలైంది. రచయిత సల్మాన్ ఖుర్షిద్‌పై విమర్శలు వెల్లువెత్తడంతోపాటు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం మొదలైంది.

ఆలయంలో పూజలు చేస్తున్న రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, INC TWITTER

ఫొటో క్యాప్షన్, ఆలయంలో పూజలు చేస్తున్న రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ ప్రకటనలు

గురువారం, మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ అంశంపై సల్మాన్ ఖుర్షీద్‌కు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని ఐసిస్, ఇస్లాం జిహాదీ వాదంతో పోల్చడం అతిశయోక్తి అని అన్నారు.

"సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో పేర్కొన్నట్లు రాజకీయ భావజాలంగా మారిన హిందుత్వతో మనం విభేదించవచ్చు. కానీ, హిందుత్వాన్ని, ఐసిస్, జిహాదీ ఇస్లాంతో పోల్చడం వాస్తవ విరుద్ధం, అతిశయోక్తి'' అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సి ఉంది. మొదటిది, గులాం నబీ ఆజాద్ ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూ-కశ్మీర్ నుంచి వచ్చారు. గతంలో ఆయన కాంగ్రెస్ జి-23 వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. జి-23 అంటే కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వైఖరిని అవలంబించిన వర్గం. సల్మాన్ ఖుర్షీద్‌ ఆ వర్గానికి వ్యతిరేక శిబిరానికి చెందినవారు.

రెండోది, పుస్తకం అయోధ్యపై రాయగా, 'హిందుత్వ' గురించి మాట్లాడిన నాయకులిద్దరూ ముస్లింలు. పైగా వీరిద్దరి మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యాన్ని కాంగ్రెస్ పార్టీలోని డైలమాతో ముడిపెడుతున్నాయి రాజకీయ వర్గాలు. బీజేపీ నేత స్మృతి ఇరానీ శుక్రవారం ఈ వ్యవహారంపై మాట్లాడారు.

రాహుల్, ప్రియాంకలు కొత్త హిందూ నేతలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని స్మృతీ ఇరానీ అన్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రాహుల్, ప్రియాంకలు కొత్త హిందూ నేతలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని స్మృతీ ఇరానీ అన్నారు.

స్మృతి ఇరానీ వ్యాఖ్యలు

''సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో ఏం రాశారో చదివి ఆశ్చర్యపోనక్కర్లేదు. 1984 అల్లర్లపై ఆయన 15 ఏళ్ల కిందట రాసిన పుస్తకంలో దేశ విభజన పాపాలకు హిందువులు, సిక్కులు ఇద్దరూ శిక్షను అనుభవించారని రాశారు'' అని శుక్రవారం ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.

"ఎన్నికలు వచ్చినప్పుడే గుళ్లకు గోపురాలకు తిరిగే కొత్త హిందూ నాయకులకు హిందువులు, సిక్కుల గురించి సల్మాన్ సాహెబ్ ఏం చెప్పారో తెలుసా?'' అని ఆమె అన్నారు. స్మృతి ఇరానీ నేరుగా పేర్లను ప్రస్తావించకపోయినా, ఆమె పరోక్షంగా రాహుల్, ప్రియాంక గాంధీలను విమర్శించారు.

'హిందుత్వ వర్సెస్ సెక్యులరిజం'

'హిందుత్వ' గురించి కాంగ్రెస్‌లోని ముగ్గురు నేతలు మూడు రకాలుగా మాట్లాడారు. ఒకే పార్టీలో ఒక అంశంపై భిన్నమైన అభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి?

''కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ కాదు. కేవలం నేతల గుంపుగా మారిపోయింది. పార్టీని ఐక్యంగా ఉంచే 'సూత్రధారి' లేడు. అందరికీ ఆమోద యోగ్యమైన నాయకత్వం లేదు. గత మూడేళ్లుగా పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించుకోలేక పోయింది. పార్టీ సిద్ధాంతాల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ, హిందుత్వలను ఎలా డీల్‌ చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు"అన్నారు సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌధరి.

"విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ రోజు కాంగ్రెస్ లౌకికవాదం గురించి మాట్లాడటం లేదు. ఆ అంశం వెనుకబడిపోయింది. కాంగ్రెస్ కూడా హిందుత్వను నిర్వచించడానికి పోటీ పడుతోంది" అన్నారు నీరజా చౌధరి.

"ఒక భావజాలంతో ఏకీభవించడం, విభేదించడం వేరు. హిందుత్వను ఐసిస్, బోకోహరామ్ వంటి సంస్థలతో పోల్చడం వేరు. ఈ పోలిక వెనక పూర్తి కారణాలను ఆయన తన పుస్తకంలో ఎందుకు పేర్కొనలేదు'' అన్నారామె.

బహుశా పుస్తకానికి ప్రచారం కల్పించుకోవడం కూడా దీనికి కారణం కావచ్చని నీరజా చౌధరి అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖుర్షీద్‌ను విమర్శిస్తూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఈ తరహాలోనే వ్యాఖ్యానించారు.

ఇది హిందూ మతాన్ని అవమానించడమేనని, పుస్తకానికి ప్రచారం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఖుర్షీద్ అవమానించారని ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రియాంక చతుర్వేది గతంలో కాంగ్రెస్‌లో ఉండి, ఇప్పుడు శివసేన నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. హిందూత్వ భావజాలాన్ని నమ్మే శివసేన మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది.

హిందుత్వ విషయంలో పార్టీలో గందరగోళం స్పష్టంగా కనిపిస్తుందంటారు కాంగ్రెస్ పార్టీని వ్యవహారాలను కవర్ చేస్తున్న చాలామంది జర్నలిస్టులు.

మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత శివసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అయితే, పశ్చిమ బెంగాల్‌లో అబ్బాస్ సిద్ధిఖీ పార్టీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. కానీ, ఆ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. దీనిపై పార్టీలో కూడా అసంతృప్తి స్వరాలు వినిపించాయి.

అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం

ఫొటో సోర్స్, PENGUINE

ఫొటో క్యాప్షన్, సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం

2014 తర్వాత కాంగ్రెస్

''2014 నుంచి కాంగ్రెస్ నిరంతరం 'గందరగోళం'లోనే నడుస్తోంది. హిందుత్వపై ఏ వైఖరిని అనుసరించాలో వారికి ఇప్పటికీ అర్థం కావడం లేదు'' అన్నారు ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టు ఔరంగజేబ్ నక్ష్‌బందీ

ఇందుకు ఆయన చాలా ఉదాహరణలు కూడా చెప్పారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని సమీక్షించేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఒక కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ ముస్లిం బుజ్జగింపు ధోరణేనని ఆంటోనీ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.

దీని కారణంగా హిందువులు పెద్ద సంఖ్యలో పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక ప్రభావంతో 2014 తర్వాత కాంగ్రెస్ 'ఉదారవాద హిందుత్వ కార్డు' ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీ ఈ దిశగా కొంత కార్యాచరణను కూడా చేపట్టారు. పలు ఆలయాల్లో పూజలు చేస్తూ కనిపించారు.

"బాబ్రీ మసీదుపై కోర్టు తీర్పు తర్వాత ఆలయ నిర్మాణానికి క్రెడిట్ తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. రామ మందిరానికి శంకుస్థాపన చేసింది రాజీవ్ గాంధీయేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు'' అని ఔరంగజేబ్ నక్ష్‌బందీ అన్నారు.

''మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది''' అన్నది ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించిన విధానం. ఇది వారి అయోమయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ఆలయంలో పూజలు చేస్తున్న ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, ఆలయంలో పూజలు చేస్తున్న ప్రియాంకా గాంధీ

2014కు ముందు కూడా సందిగ్ధత

హిందుత్వ విషయంలో కాంగ్రెస్‌లో ఇంతకు ముందు నుంచీ డైలమా ఉందని నీరజా చౌధరి అంటున్నారు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత బహిరంగమైంది.

1992 డిసెంబరు 6న అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి సమీపంలో ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు దేశానికి ప్రధానమంత్రి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా నరసింహారావు ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చని అప్పటి కాంగ్రెస్ నేతలు కొందరు భావించారు. కానీ ఆయన అలా చేయలేదు.

బాబ్రీ మసీదు పతనం తర్వాత, ప్రభుత్వం మసీదును బాగు చేయిస్తుందని నరసింహారావు హడావిడిగా ప్రకటించారు. అయితే, గుడి తాళం తెరవడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఉందనే విషయం తెరపైకి వచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం

ఈ చర్చ అయోధ్య నుంచి మొదలై హిందుత్వ వైపు మళ్లింది. కాబట్టి ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల అంశంగా మారకుండా ఎలా ఉంటుంది? వచ్చే యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఈ అంశం వల్ల లాభం కలుగుతుందని అలహాబాద్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బద్రీనారాయణ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''వాస్తవానికి బీజేపీని ప్రజలు నిలదీసే అవకాశం వచ్చింది. కానీ, దీనితో ద్రవ్యోల్బణం, ఉద్యోగ సమస్యలు పక్కకు పోతాయి. కరోనా సమయంలో వైఫల్యాలు ఇప్పుడు ఎవరికీ గుర్తుకు రావు'' అన్నారు నీరజ చౌధరి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షం ఐక్యంగా లేదని, కాంగ్రెస్ ప్రభావం కనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)