ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ మిస్సింగ్.. ఈ ఐపీఎస్ అధికారి ఎక్కడ ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకట్లేదు?

ఫొటో సోర్స్, ASHISH RAJE
- రచయిత, సౌతిక్ బిశ్వాస్, మయాంక్ భగవత్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ముంబయి మాజీ పోలీసు చీఫ్ పరంబీర్ సింగ్ కనిపించకుండా పోయారంటూ అక్టోబర్ 1న ప్రభుత్వ వర్గాలు సంచలన ప్రకటన చేశాయి. పోలీస్ అధికారిగా పరంబీర్ సింగ్‌కు మంచి పేరుంది. 45,000 మంది పోలీసులకు నాయకత్వం వహించే బాధ్యతను ఆయన రెండేళ్ల కిందటే తీసుకున్నారు.
ప్రస్తుతం సింగ్ వయసు 59 సంవత్సరాలు. ఆయన ఆఫీసుకు రావడం లేదు. ముంబయిలోని ఆయన అపార్ట్‌మెంట్‌లోనూ కనిపించడం లేదు. ఆయన స్వస్థలం, ముంబయికి 1600 కిలో మీటర్ల దూరంలో ఉన్న చండీగఢ్‌లోనూ లేరు.
పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. కానీ, ముంబయిలో ఉంటున్న సింగ్ భార్యగానీ, ఆయన తరఫు లాయర్లుగానీ, విదేశాలలో ఉంటున్న ఆయన కుమారుడు గానీ ఆయన అదృశ్యంపై నోరు విప్పడం లేదు.
పరంబీర్ చుట్టూ వివాదం
రిలయన్స్ సంస్థ అధినేత ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు వ్యవహారం ఫిబ్రవరిలో బయట పడినప్పటి నుంచి ఈ చిక్కుముడి మొదలైంది.
అంబానీ ఇంటి దగ్గర దొరికిన వాహనం యజమాని తర్వాత శవమై దొరికారు. ఆయన్ను ఎవరో హత్య చేసి సముద్రం దగ్గర విసిరేనట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆ మరణించిన వ్యక్తి తో సంబంధం ఉన్న ఓ పోలీసు అధికారి అరెస్టు తర్వాత ఈ వ్యవహారం మరింత గందరగోళంగా మారింది.
అరెస్టయిన ఆ పోలీస్ అధికారి పేరు సచిన్ వాజే. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్.
ఆయన పథకంలో భాగంగానే అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలున్న కారును పార్క్ చేశారని, అలాగే ఆ వాహనం యజమానిని ఆయనే హత్య చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, సచిన్ వాజే మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.

ఫొటో సోర్స్, ASHISH RAJE
పరంబీర్‌కు పనిష్మెంట్..
ఇదే ఏడాది మార్చిలో పరంబీర్ సింగ్‌ను ముంబయి పోలీస్ కమిషనర్ పదవి నుంచి తప్పించి, హోంగార్డ్స్ డిపార్ట్‌మెంట్‌కు మార్చారు. ఈ శాఖ ముంబయి పోలీసులకు సహాయకారిగా ఉంటుంది. స్థానిక మీడియా అభిప్రాయం ప్రకారం పరంబీర్ సింగ్‌ను ఒక చిన్న పోస్టుకు పంపి శిక్షించారు.
"ఇది మామూలు బదిలీ కాదు. ఆయన ముంబయి పోలీస్ అధిపతిగా ఉన్న సమయంలోనే కమిషనర్ కార్యాలయంలో పనిచేసే కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేశారు. ఇవి చాలా సీరియస్ వ్యవహారాలు కాబట్టే ఆయన్ను బదిలీ చేశాం" అని అప్పటి రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు. కానీ, పరంబీర్ చేసిన తప్పులు ఏంటో మాత్రం ఆయన వెల్లడించలేదు.
పరంబీర్ సింగ్ తన పాత ఆఫీసుకు కొద్ది దూరంలో ఉన్న మరో ఆఫీసులో విధులలో చేరారు. ఆయన కార్యాలయం ఆంగ్లో గోతిక్ హెరిటేజ్ బిల్డింగ్‌లో ఉంది. విధుల్లో చేరిన వెంటనే ఆయన ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తీవ్రమైన అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. ఆయన కూడా ఎలాంటి వివరాలు చెప్పలేదు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు రాసిన ఆ లేఖలో, సిటీలోని బార్ ఓనర్లు, హోటల్ యజమానుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేయాల్సిందిగా క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే ను హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ఆ లేఖలో పేర్కొన్నారు.
కానీ, అనిల్ దేశ్‌ముఖ్ ఈ ఆరోపణలను ఖండించారు. అయితే, ఏప్రిల్ ఆరంభంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆర్ధిక నేరాల విచారణ విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆయనపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరపుతోంది.
ఇప్పటికే ఆయన అయిదుసార్లు విచారణకు హాజరయ్యారు. నవంబర్‌లో అరెస్టయ్యారు. ''నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి విదేశాలకు పారిపోయాడు'' అని అనిల్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఏడాది మేలో మెడికల్ లీవ్ పెట్టిన పరంబీర్ సింగ్ దానిని రెండుసార్లు పొడిగించారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు.
ముంబయి లోని మలబార్ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని పరంబీర్ సింగ్ ఫ్లాట్‌లో ప్రస్తుతం ఆయన భార్య, కూతురు ఉంటున్నారు. ఆయన ఆచూకి గురించి వారేమీ మాట్లాడటం లేదు. ఆయన న్యాయవాది అనుకుల్ సేథ్‌ను బీబీసీ సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడటానికి నిరాకరించారు.
సింగ్ విదేశాలకు పారిపోయారని వార్తా ఛానళ్లు ఊదరగొట్టాయి. ఆయన రష్యాలో ఉన్నారని ఒక ఛానల్, బెల్జియంలో ఉన్నారని మరో ఛానల్, ఇలా రకరకాల ఊహాగానాలను ప్రసారం చేశాయి.

ఫొటో సోర్స్, ASHISH RAJE
కొనసాగుతున్న సెర్చ్
''మేం ఆయన కోసం వెతుకుతున్నాం. ప్రభుత్వాధికారిగా అనుమతి లేకుండా ఆయన విదేశాలకు వెళ్లలేరు. ఒకవేళ వెళ్లినా అది కరెక్ట్ కాదు’’ అని కొత్త హోంమంత్రి దిలీప్ వాల్సె పాటిల్ మీడియాతో అన్నారు.
ఈ కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తమను డబ్బు కోసం బెదిరించారంటూ రియల్టర్లు, హోటళ్ల వ్యాపారులు, బుకీలు దాఖలు చేసిన నాలుగు క్రిమినల్ కేసులను పరంబీర్ సింగ్ ఎదుర్కొంటున్నారు.
ఇక మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మీద ఇంకా అభియోగాలు నమోదు కాలేదు. నవంబర్ 12 వరకు ఆయనకు రిమాండ్ విధించారు.
విచారణ కమిటీ పరంబీర్ సింగ్‌కు సమన్లు పంపగా, వాటికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తనకు బదులుగా లాయర్ల ద్వారా ఆయన తనపై విచారణను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ కమిటీకి పరంబీర్ సింగ్ సమాచారం పంపుతున్నారని, ఆయన చట్టం నుంచి తప్పించుకుని పారిపోలేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఆయన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన తాజాగా పరంబీర్ సింగ్‌కు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చిక్కు ముడులు
వాస్తవానికి ఈ కేసులో అనేక చిక్కుముడులు ఉన్నాయి. ఇందులో ఆరోపణలపై స్పష్టమైన సమాచారం లేదు.
పేలుడు పదార్ధాలున్న వాహనం కేసుకు, ఈ కేసుతో ఏదైనా సంబంధం ఉందా? పరంబీర్ సింగ్ ను బదిలీ చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మంత్రి మీద ఆరోపణలు చేసిన తర్వాత పరంబీర్ సింగ్ ఎందుకు అదృశ్యమయ్యారు? కేసు దర్యాప్తు చేస్తున్న ప్యానెల్ ముందు సింగ్ ఎందుకు హాజరు కావడం లేదు ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.
సోషియాలజీలో మాస్టర్స్ చేసిన పరంబీర్ సింగ్ ఓ ప్రభుత్వోద్యోగి కుమారుడు. మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. క్రికెట్ ఆట పట్ల ఆసక్తి ఎక్కువ.
తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన గ్రామీణ ప్రాంతాలలో మావోయిస్టులతో, నగరాల్లో గ్యాంగ్‌స్టర్‌ల విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించారు.
1990లలో అండర్ వరల్డ్ ముఠా సభ్యులను ఏరిపారేసే బృందంతో పరంబీర్ సింగ్ కలిసి పని చేశారు. ఆ సమయంలో ముంబయి నగరంలో మాఫియా గ్యాంగ్‌లు బెదిరింపులు, కిడ్నాప్‌లతో చెలరేగిపోతుండేవి.

ఫొటో సోర్స్, EPA
వ్యాపారవేత్తలు, సినీ నటులు, నిర్మాతలను బెదిరించే గ్యాంగ్‌లను ఏరివేసే అనధికారిక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ బృందాలతో ఆయన పని చేశారు.
పరంబీర్ సింగ్‌తోపాటు, మరో అధికారికి నగరంలోని మాఫియా ముఠాలను ఏరివేసే బాధ్యతను అప్పజెప్పారని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ ఒక సందర్భంలో వెల్లడించారు. వీరిద్దరు మూడు ఎన్‌కౌంటర్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్డించారు.
పరంబీర్ సింగ్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయబోతున్నారు. ''నేను ఇండియాలోనే ఉన్నాను. ఎక్కడికీ వెళ్లలేదు'' అని ఆగస్టులో తనతో మాట్లాడిన ఓ జర్నలిస్టుతో అన్నారు పరంబీర్. ప్రస్తుతం తన సొంత డిపార్ట్‌మెంట్ కు కూడా ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు.
ఇవి కూడా చదవండి:
- ‘మా పిల్లల్ని అమ్మేస్తాం, కొంటారా?’
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
- ‘మాకు తెలియని మా దేశాన్ని చూస్తున్నాం’
- ‘టీ20 కెప్టెన్సీ రోహిత్‌కు అప్పగించడానికి ఇదే సరైన సమయం’ - విరాట్ కోహ్లీ
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..
- విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- ప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









