వరదలొస్తే నీటిని పీల్చేసుకునే నగరాలు.. స్పాంజ్ సిటీలను రూపొందిస్తున్న చైనా

చైనాలోని వూజియాంగ్ నదిని ఇటీవలే ఇలా తీర్చిదిద్దారు

ఫొటో సోర్స్, TURENSCAPE

ఫొటో క్యాప్షన్, చైనాలోని వూజియాంగ్ నదిని ఇటీవలే ఇలా తీర్చిదిద్దారు
    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

చైనాకు చెందిన ప్రొఫెసర్ యు-కొంగ్జియాన్ వరదల కారణంగా ఓసారి తన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పటి రోజును అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటారు.

తన ఇంటికి సమీపంలోని వైట్ శాండ్ వాగు భారీ వర్షాలకు పొంగి పొర్లి కొంగ్జియాన్ కుటుంబం వేసుకున్న వరి పొలాలను ముంచెత్తింది.

అప్పటికి కొంగ్జియాన్ వయసు 10 సంవత్సరాలు. ఏటిలో పొంగుతున్న నీటిని చూసి ఉత్సాహంగా నదివైపు పరుగెత్తారు. అయితే, ఒక్కసారిగా ఆయన పాదాల కింద భూమి కుంగిపోయింది. నీటిలో పడి కొట్టుకుపోవడం మొదలు పెట్టారు.

అదృష్టవశాత్తు ఒడ్డు మీద గడ్డి, రెల్లు పొదలు ఎక్కువగా ఉండటంతో నది వేగం అక్కడ తక్కువగా ఉంది. వాటిని పట్టుకుని ఎలాగోలా ప్రమాదం నుంచి బయటపడ్డారు కొంగ్జియన్.

అప్పట్లో నది ఇప్పటిలాగా కాంక్రీట్ గోడలతో కట్టి ఉంటే, తాను కచ్చితంగా కొట్టుకు పోయేవాడినని కొంగ్జియన్ బీబీసీతో అన్నారు.

ఆ ప్రమాద ఘటన ఆయన జీవితాన్నే కాక, చైనాను కూడా ప్రభావితం చేసే ఘటనగా మారింది.

ప్రస్తుతం కొంగ్జియాన్ చైనాలోని అత్యంత ప్రముఖులైన నగర నిర్మాతలలో ఒకరు. పెకింగ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ కాలేజ్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్నారు.

చైనా నగరాలు వరదల బారినపడి కొట్టుకు పోకుండా కాపాడేలా ఆయన స్పాంజ్ సిటీ అనే కాన్సెప్ట్‌ను రూపొందించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ కాన్సెప్ట్‌ను స్వీకరించవచ్చునని ఆయన అంటారు.

వాతావరణ మార్పులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ స్పాంజ్ సిటీలు ఎంత వరకు పని చేస్తాయి, ఏ విధంగా ప్రయోజనకారులు అన్న చర్చ జరుగుతోంది.

స్పాంజ్ సిటీ కాన్సెప్ట్‌కు ఉదాహరణగా నిలుస్తున్న ఓ పార్క్

ఫొటో సోర్స్, TURENSCAPE

ఫొటో క్యాప్షన్, స్పాంజ్ సిటీ కాన్సెప్ట్‌కు ఉదాహరణగా నిలుస్తున్న ఓ పార్క్

'నీటితో యుద్ధం వద్దు'

వరదను చూసి భయపడే కంటే దానిని ఆలింగనం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ప్రొఫెసర్ కొంగ్జియన్ స్పాంజ్ సిటీ వెనకున్న సూత్రం.

సంప్రదాయ పద్ధతుల్లో వరద నీటి నిర్వహణకు తరచుగా పైపులు లేదా కాలువలను నిర్మిస్తారు. వీటి ద్వారా నీటిని వీలైనంత వేగంగా నీటిని తరలించడం లేదా నదీ తీరాలను కాంక్రీట్‌తో బలోపేతం లాంటి పరిష్కారాలు ఉంటాయి.

కానీ, ఒక స్పాంజ్ సిటీ దీనికి భిన్నంగా పని చేస్తుంది. వర్షపు నీటిని అడ్డుకుని ఉపరితల ప్రవాహాన్ని నెమ్మదింపజేస్తుంది.

ఇది మూడు రకాలుగా పని చేస్తుంది. మొదటి విధానంలో ఇది అనేక రంధ్రాలున్న స్పాంజ్‌లాగా వ్యవహరిస్తుంది. అంటే నగరంలో పెద్ద ఎత్తున చెరువులు లేదా సరస్సులను ఏర్పాటు చేస్తారు. ఇవి నీటి ప్రవాహాన్ని ఆపుతాయి.

రెండో విధానంలో, వరద నీటిని సరళ రేఖల్లాంటి కాలువల ద్వారా వేగంగా బయటకు పంపడానికి బదులు, వంపులు తిరిగిన కాలువలు నిర్మిస్తారు. అలాగే చెట్లు నాటతారు. దీనివల్ల వరదల వేగం తగ్గుతుంది.

మూడవది లోతట్టు ప్రాంతం. ఇక్కడి నుంచే చెరువులు, నదులు సముద్రాలలోకి వరద నీరు పారుతుంది. ఇలాంటి ప్రదేశాలలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా చూడాలి.

"మీరు నీటితో పోరాడలేరు, దానిని అలా వదిలిపెట్టాలి" అన్నారు కొంగ్జియన్.

స్పాంట్ సిటీ భావనకు ఆద్యుడిగా నిలిచిన ప్రొఫెసర్ యు-కొంగ్జియాన్

ఫొటో సోర్స్, TURENSCAPE

ఫొటో క్యాప్షన్, స్పాంట్ సిటీ భావనకు ఆద్యుడిగా నిలిచిన ప్రొఫెసర్ యు-కొంగ్జియాన్

ఇదే మొదటిదా?

దాదాపు ఇలాంటి విధానాలే ఇతర ప్రాంతాలో కూడా ఉన్నప్పటికీ, స్పాంజ్ సిటీ కాన్సెప్ట్‌లో సహజత్వం గుర్తించదగిందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన డిజైన్ నిపుణులు డాక్టర్ నిర్మల్ కిష్నాని అన్నారు.

"ప్రస్తుతం మనం ప్రకృతికి డిస్‌కనెక్ట్ అయ్యాం. ప్రకృతిలో భాగంగా మారడానికి ఒక మార్గం చూసుకోవాలి " అన్నారు నిర్మల్

కొంగ్జియన్ స్పాంజ్ సిటీ భావన చాలా వరకు పురాతన చైనా వ్యవసాయ విధానాలను పోలి ఉంటాయి.

ప్రొఫెసర్ కొంగ్జియన్ గతంలో పంటల కోసం చెరువులలో నీటిని నింపే విధానాలు నేర్చుకున్నారు. ఈ పద్ధతులను అనుసరించి, ప్రొఫెసర్ కొంగ్జియన్‌ కు చెందిన లాండ్ స్కేపింగ్ సంస్థ అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.

కొంగ్జియన్ 17 సంవత్సరాల వయస్సులో బీజింగ్‌కు వచ్చి ల్యాండ్‌ స్కేపింగ్‌ కోర్సును చదివారు. తరువాత హార్వర్డ్‌లో డిజైనింగ్‌‌లో డిగ్రీ చేశారు.

1997లో ఆయన స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, చైనాలో విచ్చలవిడిగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఇక్కడ వృథా అవుతున్న అనేక వనరులను గమనించిన కొంగ్జియన్ సంప్రదాయ చైనీస్ భావనల ఆధారంగా పట్టణ రూపకల్పన విధానాలను ప్రచారం చేయడం ప్రారంభించారు.

స్పాంజ్ నగరాలతో పాటు, సహజమైన ల్యాండ్‌ స్కేపింగ్‌‌కు ఆయన పిలుపునిచ్చారు. అతిగా అలంకరించిన పార్కులను ఆయన మహిళ కాళ్లను గొలుసులతో బంధించే పాత చైనీస్ సంప్రదాయంతో పోల్చారు.

చైనాలోని తీరప్రాంత నగరాలు, అవే పరిస్థితులు ఉన్న ప్రదేశాలలో నగర నిర్మాణానికి, స్థిరత్వం లేని మోడళ్లను స్వీకరించారని కొంగ్జియన్ అభిప్రాయపడ్డారు.

"ఐరోపా దేశాలలో పుట్టిన ఈ సాంకేతికత రుతుపవనాలకు అనుగుణంగా లేదు'' అని ఆయన అన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయి.

దేశద్రోహి ఆరోపణలు

ప్రారంభంలో కొంగ్జియన్ త్రీ గోర్జెస్ లాంటి చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా వ్యతిరేకించి విమర్శల పాలయ్యారు. ఆయన హార్వర్డ్ నేపథ్యం, పాశ్చాత్య దేశాల నుంచి ఆయనకు లభించిన ప్రశంసల కారణంగా చాలామంది ఆయన్ను పాశ్చాత్య దేశాల గూఢచారి అని, దేశద్రోహి అని విమర్శించారు.

తనను తాను సాంస్కృతిక విప్లవానికి బిడ్డగా భావించే ప్రొఫెసర్ కొంగ్జియన్, ఈ విమర్శలను పట్టించుకోలేదు. "నేను పాశ్చాత్యుడిని కాదు, చైనీస్ సంప్రదాయవాదిని" అని ఆయన నవ్వుతూ చెప్పారు.

"మాకు వేల సంవత్సరాల అనుభవం ఉంది. ఎవరు కాదనలేని పరిష్కారాలు మా దగ్గర ఉన్నాయి. మేం మా చైనీస్ విధానాలనే అనుసరిస్తాం" అన్నారాయన.

స్పాంజ్ సిటీల కోసం లాబీయింగ్‌లో చైనా అధికారుల ముందు దేశభక్తి భావాన్ని తెలివిగా ఉపయోగించారు. ఇటీవలి సంవత్సరాలలో బీజింగ్, వూహాన్‌లలో సంభవించిన వరదల సమయంలో ఆయన ఆలోచనలకు మీడియా నుంచి కూడా మంచి ప్రచారం లభించింది.

ఇవన్నీ ఫలించి, 2015లో అధ్యక్షుడు షి జిన్‌పింగ్ స్పాంజ్ సిటీ ప్రణాళికలకు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. 2030 నాటికి 80 శాతం చైనా మున్సిపాలిటీలు స్పాంజ్ సిటీ మోడల్‌కు మారాల్సి ఉంటుంది. కనీసం 70% వర్షపు నీటిని రీసైకిల్ చేయాలి.

క్లైమేట్ ఛేంజ్ కారణంగా రాబోయే రోజుల్లో నగరాలు వరద సమస్యలను ఎదుర్కొంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్లైమేట్ ఛేంజ్ కారణంగా రాబోయే రోజుల్లో నగరాలు వరద సమస్యలను ఎదుర్కొంటాయని నిపుణులు చెబుతున్నారు.

మ్యాజిక్ బుల్లెట్?

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు, నగరాలు తీవ్ర వర్షపాతం కారణంగా వరదలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను శాస్త్రవేత్తలు క్లైమేట్ ఛేంజ్ అంటున్నారు.

భవిష్యత్తులో వర్షపాతం గతంలో ఊహించిన దానికంటే మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ, భారీ తుపానులకు స్పాంజ్ సిటీలు నిజంగా పరిష్కారమవుతాయా ? కొంతమంది నిపుణులు ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు.

"స్పాంజ్ సిటీలు తేలికపాటి వర్షాలకు మాత్రమే పనికొస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న అత్యంత తీవ్రమైన వాతావరణంలో ఇంకా మరిన్ని కాలువలు, పైపులు, ట్యాంకుల వంటి మౌలిక సదుపాయాలను జోడించాల్సి ఉంటుంది" అని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హమ్‌ నింగ్బో చెందిన వరద నీటి నిర్వహణ నిపుణుడు ఫెయిత్ చాన్ చెప్పారు.

జన సాంద్రత, స్థలాల ఖరీదు ఎక్కువగా ఉన్న నగరాలలో ఇలాంటి వరద నీటి మేనేజ్‌మెంట్ విధానాల అమలు కష్టమని ఆయన అన్నారు.

కోట్ల యువాన్లు ఖర్చు చేసినప్పటికీ, చైనా ఇప్పటికీ వరదల సమస్యలను ఎదుర్కొంటోంది. గత వేసవిలో వరుసగా వచ్చిన వరదల కారణంగా 397 మంది మరణించారు.

కానీ, ప్రాచీన చైనీస్ విధానాలను తప్పుబట్టడం సరికాదని ప్రొఫెసర్ కొంగ్జియన్ అంటున్నారు. వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం, లేదా అరకొరగా అమలు వల్లే ఈ వైఫల్యాలని ఆయన అన్నారు.

"ఒక స్పాంజ్ సిటీ ఎలాంటి వరదనైనా తట్టుకోగలదు. అలా జరగకపోతే అది స్పాంజ్ సిటీయే కాదు" అని ఆయన అన్నారు.

స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ నిజంగా బయటి ప్రపంచం కూడా అనుసరించదగిందా అనేది మరొక ప్రశ్న.

బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా వంటి వరద పీడిత దేశాలు ఈ మోడల్ నుండి ప్రయోజనం పొందవచ్చని, సింగపూర్, యు.ఎస్., రష్యా వంటి కొన్ని ప్రదేశాలు ఇలాంటి ఆలోచనలను అమలు చేయడం ప్రారంభించాయని ప్రొఫెసర్ కొంగ్జియన్ చెప్పారు.

చైనాలో స్పాంజ్ సిటీల విస్తరణ విజయవంతం కావడానికి దాని కేంద్రీకృత ప్రభుత్వం, రాష్ట్ర ఖజానాల నుంచి లభించే అధిక నిధులే కారణమని చెబుతారు.

అంతా చక్కగా చేయగలిగితే, సంప్రదాయ పద్ధతిలో అయ్యే ఖర్చులో పావు వంతు ఖర్చుతోనే ఈ స్పాంజ్ సిటీలను నిర్మించవచ్చని కొంగ్జియన్ అన్నారు. పైపులు, ట్యాంక్‌లను ఏర్పాటు చేయడానికయ్యే ఖర్చుకన్నా, వరదల కోసం భూమిని కేటాయించడం చౌక అని ఆయన వాదిస్తారు.

వరదలను ఆపడానికి కాంక్రీటును ఉపయోగించడం అంటే "మీ దాహాన్ని తీర్చుకోవడానికి విషం తాగడంలాంటిది'' అంటారు కొంగ్జియన్.

"వాతావరణానికి అనుగుణంగా మన జీవన విధానాలను మార్చుకోవాలి. లేదంటే మనం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాం'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)