వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు

పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం

భూతాపం 1.5C దాటకుండా కట్టడి చేసేందుకు ఇదే చివరి అవకాశమని కాప్ 26 సదస్సు పిలుపునిచ్చింది.

దీనిపై సదస్సులు, ఒప్పందాలకు మించి దేశాలు చేపట్టవలసిన ముఖ్యమైన చర్యలేంటి?

1. శిలాజ ఇంధనాల తగ్గింపు

చమురు, గ్యాస్, ముఖ్యంగా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వలన గాల్లోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దాంతో వేడి పెరిగి, ప్రపంచ ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి.

భూతాపం 1.5C దాటితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టాలి.

అయితే, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, భారత్ వంటి బొగ్గు ఆధారిత దేశాలు దశలవారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించే ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాయి.

ఆవుల ఆహారాన్ని మార్చితే అవి ఉత్పత్తి చేసే మిథేన్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆవుల ఆహారాన్ని మార్చితే అవి ఉత్పత్తి చేసే మిథేన్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

2. మీథేన్ ఉద్గారాలకు కళ్లెం వేయడం

మీథేన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా అత్యవసర పరిస్థితులను నివారించవచ్చని, వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల నివేదిక సూచించింది.

చమురును వెలికితీసే ప్రక్రియలో మండుతున్న సహజ వాయువుల నుంచి అధిక స్థాయిలో మీథేన్ విడుదల అవుతుంది. అధునాతమైన సాంకేతిక ప్రక్రియల ద్వారా దీన్ని నివారించవచ్చు.

అలాగే, చెత్తను పారవేసేందుకు మెరుగైన మార్గాలను అన్వేషించాలి. కొండల్లా పేరుకుపోయే చెత్తకుప్పలు మీథేన్ ఉద్గారాలకు మూలాలు.

కాప్ 26 సదస్సులో సుమారు 100 దేశాలు మీథేన్ ఉద్గారాలను కట్టడి చేసే ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు సారథ్యం వహించాయి.

2020 స్థాయిల కన్నా 30 శాతం మీథేన్ ఉద్గారాలను తగ్గించడమే ఈ అంతర్జాతీయ మీథేన్ ప్రతిజ్ఞ లక్ష్యం.

3. పునరుత్పాదక శక్తిని వినియోగించడం

ప్రపంచ ఉద్గారాలు పెరగడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

శిలాజ ఇంధన వనరులను తగ్గించి, పునరుత్పాదక వనరుల వినియోగాన్ని పెంచడం ఈ సమస్యకు ఒక ముఖ్య పరిష్కారం.

ప్రస్తుత వాతావరణ లక్ష్యాలను చేరుకోవాలంటే డీకార్బనైజేషన్‌కు తోడ్పడే క్లీన్ టెక్నాలజీని ఆశ్రయించడమే ఉత్తమ మార్గం.

దేశాలు నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2050 కల్లా ఇంధన వనరుల్లో పవన విద్యుత్, సౌర శక్తి వాటాలు గణనీయంగా పెరగాలి.

అయితే, సవాళ్లు ఉన్నాయి.

గాలి తక్కువైతే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. కానీ, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ సహాయంతో అదనపు శక్తిని నిల్వ చేసుకుంటూ, అవసరమైనప్పుడు విడుదల చేసుకోవచ్చు.

సోలార్ పవర్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, సోలార్ పవర్

4. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని పూర్తిగా మానేయాలి

వాహనాలకు శక్తిని సమకూర్చే పద్ధతులను మార్చుకోవాలి.

పెట్రోల్, డీజిల్ కార్లను బహిష్కరించి, విద్యుత్ వాహనాలను వినియోగించడం ముఖ్యం.

లారీలు, బస్సులను హైడ్రోజన్ ఇంధనంతో నడపవచ్చు. దీన్ని పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయవచ్చు.

విమానాలకు ఉపయోగపడే క్లీన్ ఎనర్జీని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

దానితో పాటూ, ప్రజలు విమాన ప్రయాణాలు తగ్గించాలని ప్రచారకులు కోరుతున్నారు.

వీడియో క్యాప్షన్, అస్సాం టీ రంగు, రుచి మారిపోతోంది.. ఎందుకంటే..

5. ఎక్కువ చెట్లు నాటాలి

భూతాపాన్ని 1.5C వద్ద కట్టడి చేయాలంటే గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడమే నిజమైన పరిష్కారమని 2018లో వచ్చిన యూఎన్ రిపోర్ట్ తెలిపింది.

కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోవడంలో అడవులు చేసే మేలు మరింకేవీ చేయలేవు.

అందుకే అటవీ నిర్మూలన తగ్గించి సహజ వృక్ష సంపదను పెంపొందించాలని శాస్త్రవేత్తలు, ప్రచారకులు పిలుపునిస్తున్నారు.

అధిక స్థాయిలో చెట్లను నాటడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు.

నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాడానికి చేస్తున్న ప్రయత్నాల వలన కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది.

వాతావరణంలో మిగిలి ఉన్న ఉద్గారాలను అడవులు పీల్చుకుంటాయి.

Climeworks, direct-air capture technology

ఫొటో సోర్స్, Climeworks

ఫొటో క్యాప్షన్, నేరుగా గాలిని గ్రహించే సాంకేతిక పరిజ్ఞానం, క్లైమ్‌వర్క్స్

6. గాలిలో నుంచి గ్రీన్‌హౌస్ వాయువులను తొలగించాలి

వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను కృత్రిమంగా తొలగించే లేదా విడుదలను రద్దు చేసే సాంకేతికత అభివృద్ధి భూతాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు టెక్సాస్‌లో కార్బన్ ఇంజినీరింగ్, స్విట్జర్లాండ్‌లో క్లైమ్‌వర్క్స్ నిర్మించిన ప్లాంట్లతో సహా అనేక సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయి.

కార్బన ఉద్గారాలను బంధించి, నిల్వ చేయడం మరో పద్ధతి.

ఉద్గారాలు ఉత్పత్తి అయ్యే స్థానం వద్దే వాటిని బంధించి గాల్లోకి విడుదల కాకుండా నివారించవచ్చు.

ఉదాహరణకు బొగ్గు ఆధారిత ప్లాంట్ల దగ్గరే ఇలాంటి ఏర్పాట్లు చేయడం ద్వారా ఉద్గారాలు గాల్లోకి విడుదల కాకుండా నివారించవచ్చు.

ఇలా బంధించి సేకరించిన కార్బన్ డయాక్సైడ్‌ను భూమి లోపల పొరల్లో ఖననం చేస్తారు.

అయితే, ఈ సాంకేతికత చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

వివాదాస్పదమైనది కూడా. ఎందుకంటే ఇది శిలాజ ఇంధనాల వినియోగానికి ఊతం అందిస్తుందని విమర్శకులు భావిస్తున్నారు.

ఎలక్ట్రిక్ కారు వినియోగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ కారు వినియోగం

7. పేద దేశాలకు ఆర్థిక సహాయ నిధిని అందించడం

2009లో కోపెన్‌హాగన్‌లో జరిగిన కాప్ సదస్సులో ధనిక దేశాలన్నీ పేద దేశాలకు ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేశాయి.

వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కునేందుకు 2020 నాటికి, ఏడాదికి 100 బిలియన్ డాలర్లు (రూ. 7,46,055 కోట్లు) అందిస్తామని హామీ ఇచ్చాయి.

ఈ ప్రమాణాలను ధనిక దేశాలు నెరవేర్చలేదు. అయితే, 2023 నాటికి ఈ నిధులు సమకూర్చేందుకు కాప్‌కు అధ్యక్షత వహిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ఇటీవలే ప్రణాళికను రూపొందించింది.

అమెజాన్ రెయిన ఫారెస్ట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెజాన్ రెయిన ఫారెస్ట్

పలు బొగ్గు ఆధారిత దేశాలు తీవ్రమైన ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా, కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యవస్థలు మళ్లీ సమస్యల పాలవుతున్నాయి. దీంతో, అట్టడుగు వర్గాలు మరింత అసమానతలను ఎదుర్కోవలసి వస్తోంది.

హరిత శక్తి వైపు మళ్లేందుకు పేద దేశాలకు ఆర్థిక సహాయం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

ఉదాహరణకు, అమెరికా, ఈయూ, బ్రిటన్ దేశాలు ఇటీవలే దక్షిణ ఆఫ్రికాలో బొగ్గు వాడకాన్ని నిలిపివేసేందుకు 8.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 63,217 కోట్లు) సహాయాన్ని అందించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)