సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, యవెట్టే ట్యాన్
- హోదా, బీబీసీ సింగపూర్ కరస్పాండెంట్
ఏదైనా అద్భుతం జరగాలని మలేషియా కు చెందిన షర్మిలా ధర్మలింగం రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ఆమె సోదరుడు నాగేంద్రన్ ధర్మలింగంను సింగపూర్‌లోని చాంగీ జైలులో త్వరలో ఉరితీయనున్నారు.
''నా సోదరుడిని తలుచుకుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. కానీ, మేం ధైర్యంగా ఉండాలి. ప్రార్ధనలు చేయాలి. ఏదైనా అద్భుతం జరగవచ్చు'' అని షర్మిల బీబీసీతో అన్నారు.
2009లో అప్పటికి 21 ఏళ్ల నాగేంద్రన్ మలేషియా నుంచి సింగపూర్‌కు హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు.
నాగేంద్రన్‌ను బుధవారం (నవంబర్ 10) ఉదయం ఉరి తీయాల్సి ఉండగా చివరి క్షణంలో శిక్షను ఆపేయాల్సి వచ్చింది. మంగళవారం జరిపిన టెస్టుల్లో ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో ఉరిని వాయిదా వేశారు.
వైద్యనిపుణులు నాగేంద్రన్ మానసిక స్థితి బలహీనంగా ఉందని భావించారు. ఆయన ఐక్యూ లెవెల్ 69 ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదనడానినికి ఈ లెవెల్ సూచికగా చెబుతారు. అయినా సరే, మలేషియా పౌరుడు నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించింది.
మంచేదో, చెడేదో తమకు తెలుసని సింగపూర్ ప్రభుత్వం అంటోంది.
సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రగ్ చట్టాలు ఉన్నాయి. స్థానికంగా ఉరిశిక్షపై పెద్ద వివాదం లేదు. కానీ నాగేంద్రన్ విషయంలో మాత్రం అక్కడి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల ఆగ్రహం
నాగేంద్రన్‌కు ఉరి శిక్ష నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడికి చేసిన విజ్జప్తిపై ఇప్పటి వరకు 60 వేల మందికి పైగా సంతకాలు చేశారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం మానసిక వికలాంగులకు ఉరిశిక్ష అమలుపై నిషేధం ఉందని పిటిషనర్లు వాదించారు.
''హింస లేని నేరంలో ఒక మానసిక వికలాంగుడికి ఉరిశిక్ష విధించడం దారుణం'' అని ఈ పిటిషన్ పై సంతకం చేసిన ఓ వ్యక్తి బీబీసీతో అన్నారు.
నాగేంద్రన్‌కు ఉరిశిక్ష రద్దు డిమాండ్‌కు సోషల్ మీడియాలో కూడా మద్దతు లభిస్తోంది. విచిత్రం ఏంటంటే సింగపూర్‌లో నాగేంద్రన్‌కు మద్ధతిచ్చేవారు, విమర్శించే వారు ఉన్నారు.
తనకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారని, దానికి తాను సిద్ధంగా ఉండాలని ఫోన్ చేసి చెబుతారని షర్మిల వెల్లడించారు.
"ఒక్కోసారి ఇంటికి వచ్చి ఇంట్లో వండిన ఆహారం తినాలని కోరుకుంటున్నట్లు చెబుతాడు. అసలు పరిణామాలన్నీ అర్ధమవుతున్నాయో లేదో తెలియదు'' అన్నారు షర్మిల.
నాగేంద్రన్‌ను ఉరితీస్తే 2019 తర్వాత సింగపూర్‌లో ఇదే తొలి మరణశిక్ష అవుతుంది.

ఫొటో సోర్స్, SARMILA DHARMALINGAM
మానసిక ఆరోగ్యంపై చర్చ
2009లో నాగేంద్రన్ మలేషియా నుంచి సింగపూర్ కు వస్తుండగా అధికారులకు పట్టుబడ్డారు. 43 గ్రాముల హెరాయిన్‌ను ఆయన తన తొడకు కట్టి తెచ్చారు.
సింగపూర్ చట్టం ప్రకారం, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌తో పట్టుబడితే మరణశిక్ష విధిస్తారు.
విచారణ ప్రారంభమైన తొలినాళ్లలో, తాను హెరాయిన్‌తో బలవంతంగా సరిహద్దు దాటాల్సి వచ్చిందని నాగేంద్రన్ చెప్పారు. తర్వాత డబ్బు కోసమే తాను ఈ నేరానికి పాల్పడ్డానని వెల్లడించారు.
నాగేంద్రన్ కోర్టుకు అబద్ధాలు చెబుతున్నారంటూ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే, మానసిక ఆరోగ్యం బాగా లేనందున మరణశిక్ష నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ 2015లో నాగేంద్రన్ విజ్జప్తి చేశారు.
నాగేంద్రన్ మానసిక ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని, ఆయన మద్యానికి కూడా బానిసయ్యారని 2017లో డాక్టర్ కెన్ ఉంగ్ అనే మానసిక వైద్య నిపుణుడు వెల్లడించారు.
డాక్టర్ కెన్ ఈ వాదనలను కోర్టు అంగీకరించినట్లయితే ఆయనకు శిక్ష మీద ప్రభావం పడేది. కానీ, తర్వాత జరిగిన విచారణలో డాక్టర్ కెన్ తన వాదనను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు నాగేంద్రన్‌కు ఎలాంటి మానసిక వ్యాధి లేదని మరో ముగ్గురు సైకాలజిస్టులు కోర్టుకు తెలిపారు.
సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం నాగేంద్రన్ మానసికంగా బలహీనుడు కాదని కోర్టు తేల్చి చెప్పింది. గత ఏడాది సింగపూర్ దేశాధ్యక్షుడు కూడా ఆయన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కోర్టు నిర్ణయాన్ని విమర్శించాయి.
మలేషియాలో ప్రదర్శనలు
ఈ అంశంపై మలేషియన్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకు మద్ధతుగా ప్రదర్శనలు కూడా నిర్వహించారు. నాగేంద్రన్‌ను వ్యక్తిగతంగా క్షమించాలని మలేషియా ప్రధాని ఇజ్రాయెల్ యాకూబ్ సబ్రీ సింగపూర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
నాగేంద్రన్‌కు మరణశిక్ష విధించి పదేళ్లు అవుతోంది. నవంబర్ 10న ఆయనను ఉరి తీయనున్నట్టు సింగపూర్ జైలు నుంచి నాగేంద్రన్ సోదరి షర్మిలకు లేఖ వచ్చింది.
లేఖను అందుకున్నాక రోజంతా ఏడుస్తూనే ఉన్నానని షర్మిల చెప్పారు. అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెకు ఈ విషయం చెప్పలేకపోయానని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, SARMILA DHARMALINGAM
నాగేంద్రన్‌ని కలవడానికి సింగపూర్‌కు వచ్చేందుకు కుటుంబ సభ్యులకు రెండు వారాల గడువు ఇచ్చారు. ''హెల్త్ సర్టిఫికెట్ల నుంచి సింగపూర్‌లో ఉండటానికి హోటల్ వెతుక్కోవడం వరకు అన్నీ వారే చూసుకోవాల్సి వచ్చింది'' అని నాగేంద్రన్ కుటుంబం కోసం ఆన్‌లైన్ నిధుల సేకరణ చేపట్టిన సామాజిక కార్యకర్త క్రిస్టీన్ హాన్ చెప్పారు.
కుటుంబం కోసం సుమారు 12,600 డాలర్లు (రూ. 9.36 లక్షలు) నిధిని సేకరించారు. ఈ డబ్బు లేకుంటే తన కుటుంబం నాగేంద్రన్‌ని కలవడానికి వెళ్లగలిగేది కాదని షర్మిల చెప్పారు.
నాగేంద్రన్ కుటుంబమంతా సింగపూర్ వచ్చినా, షర్మిల రాలేదు. ఇంటి పనులు చూసుకోవడానికి ఇక్కడే ఉండాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
ఉరి కి ముందు ఆమె తన సోదరుడిని చూసే అవకాశం కలగలేదు. ఏదైనా అద్భుతం జరగాలని, తన సోదరుడు బయటకు రావాలని ప్రతిరోజూ ప్రార్థిస్తానని షర్మిల చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’
- 21 వారాలకే పుట్టాడు.. అర కిలో బరువు కూడా లేడు
- జిమ్మీ నీషామ్: ఒకప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు కానీ, ఇప్పుడు న్యూజీలాండ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- ఊహించని ప్రకటన చేసిన అమెరికా, చైనా.. ఈయూ, యూఎన్, గ్రీన్‌పీస్ ఏమన్నాయంటే..
- టీ20 వరల్డ్ కప్: సెమీస్‌లో ఆస్ట్రేలియాను పాకిస్తాన్ ఓడిస్తుందా?
- టీమిండియా టీ20 పగ్గాలు రోహిత్ శర్మకే ఎందుకు అప్పగించారు?
- కాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయా?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











