విశాఖపట్నం: 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించిన గృహిణి

ప్రేరణ

ఫొటో సోర్స్, Prerana Baid

ఫొటో క్యాప్షన్, 44 ఏళ్ల వయసులో రెండు బంగారు పతకాలు సాధించిన ప్రేరణ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"బీటెక్, ఇంటర్ చదువుతున్న పిల్లలున్న నాకు నాలుగు పదుల వయసు దాటింది. ఆ వయసులో చదువుకోవాలన్న నా నిర్ణయం నాకు బంగారు పతకాలు తెస్తుందని ఏమాత్రం అనుకోలేదు." అని విశాఖకు చెందిన ప్రేరణ బేద్ అన్నారు.

విశాఖకు చెందిన ప్రేరణ బేద్ 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించారు.

ఆ వయసులో ఆమె ఎందుకు ఐఐఎంలో చేరారు..? రెండు బంగారు పతకాలు సాధించడానికి ఆమె ఎలాంటి కృషి చేశారు...?

ప్రేరణ కుటుంబం

ఫొటో సోర్స్, Prerana Baid

ఇండోనేసియాలో నాలుగో తరగతి వరకు

"మాది రాజస్థాన్. కానీ నేను నాలుగో తరగతి వరకు ఇండోనేసియాలో చదువుకున్నాను. మా నాన్నగారు అక్కడ పనిచేయడంతో నేను అక్కడే చదవాల్సివచ్చింది. నాన్న రిటైర్ అయ్యారు.

ఆ తర్వాత నేను రాజస్థాన్‌లోని జైపూర్‌లో 5 నుంచి 12 తరగతి వరకు చదివాను. నాకు చిన్నతనం నుంచి ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని ఉండేది. దాని కోసం పదోతరగతి నుంచి ప్రివేర్ అవుతూ ఉండేదాన్ని. కానీ పరీక్ష రాయాల్సిన సమయంలో మా కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో పరీక్ష రాయలేకపోయాను. ఆ తర్వాత రాజస్థాన్ యూనివర్సీటిలో బీబీఏ కోర్సులో చేరాను.

ఫైనల్ ఇయర్ చదువుతుండగానే నాకు వివాహమైంది. పెళ్లి తర్వాత అత్తగారి ఇంటికి విశాఖపట్నం వచ్చేశాను. సంప్రదాయ ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ బాధ్యతలు చూసుకోవడంతోనే సరిపోయింది.

ప్రేరణ బేగ్

ఫొటో సోర్స్, Prerana Baid

చదువు అనే ఆలోచనకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో నా భర్త ఒక ఐటీ కంపెనీ ప్రారంభించే పనిలో ఉన్నారు.

ఆ కంపెనీ బాధ్యతల్లో పాలుపంచుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇద్దరు పిల్లలు పుట్టారు. దాంతో వారి బాధ్యతలతో సమయమే సరిపోయేది కాదు.

పిల్లల చదువులు, ఆత్తమామల బాగోగులుతోనే కాలం గడిచిపోయేది".

ఐఐఎం తరగతి

ఫొటో సోర్స్, Prerana Baid

కొడుకు కోసం వెళ్లి...నేను జాయిన్ అయ్యాను

నా పెద్ద కుమారుడు బీటెక్ ఇంజనీరింగ్ చేద్దామనుకున్నాడు. అతని కోసం మంచి కళాశాల కోసం వెతకడం ప్రారంభించాం. ఆ సమయంలోనే నాకు ఆంధ్ర యూనివర్సీటీలో ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సుల కోసం తెలిసింది. ఆ విషయాన్ని నా భర్తతో చెప్పాను. ఆయన జాయిన్ అయితే బాగుంటుందన్నారు.

అప్పటీకే చదువు వదిలేసి 20 ఏళ్లు దాటిపోయింది. నాకు 40 ఏళ్ల వయసు కూడా దాటింది. ఈ సమయంలో చదవలేనని అనిపించింది. కానీ నాకు ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం చదవడం అలవాటు.

ఐఐఎం పుస్తకాలు కూడా అదే మాదిరిగా చదివితే సరిపోతుంది కదా అనిపించింది. వెంటనే ఐఐఎం ఎంట్రన్స్ రాయాలని నిర్ణయించుకున్నాను. చదవడం ప్రారంభించాను.

పిల్లలకు చదువు చెప్పడం అలవాటు ఉండటంతో అది కూడా కాస్త ఉపయోగపడింది. మొత్తానికి ఐఐఎం ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాను.

ప్రేరణ బేగ్

ఫొటో సోర్స్, Prerana Baid

పరీక్ష హాల్‌లోనేఆశలు వదులుకున్నాను

ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు ఎగ్జామ్ హాల్‌కు చేరుకోగానే ఆశ్చర్యమేసింది. అంతా చిన్న పిల్లలే కనిపించారు. ఇంజనీరింగ్, సీఏ చదివిన వారే అంతా. ఇక సీటు వస్తుందనే ఆశ వదులుకున్నాను.

ఈ వయసులో వీళ్లతో పోటీపడి రాయడం, సీటు పొందడం కష్టమే అనిపించింది. పరీక్ష రాసిన తర్వాత కాస్త నమ్మకం వచ్చింది. సీటు వస్తుందేమోనని. కానీ పరీక్ష రాసిన వాళ్లందరూ నా కన్న ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారు, బాగా చదువుకున్నవారు కావడంతో సీటు రాదనే అనుమానం ఉండేది.

ఫలితాలు వచ్చాయా లేదా అని అప్పుడప్పుడు ఎంక్వైరీ చేస్తుందేదాన్ని, నాకు సీటు వస్తుందా, రాదా అనే విషయం తెలుసుకోవాలనే తాపత్రయం ఉండది. అయితే ఫలితాలు వచ్చాయి. నేను క్వాలిఫై అయ్యాను. అయితే ఇంకా ఇంటర్వ్యూ ఉంటుందని తెలిసింది.

ప్రేరణ బేగ్ , భర్తతో

ఫొటో సోర్స్, Prerana Baid

నాది ప్రేమ పెళ్లి కావడంతో

కొన్ని రోజులకు ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. నా జీవితంలో నేను ఎదుర్కోబోతున్న మొదటి ఇంటర్వ్యూ అదే. దాంతో నాకు కొంచెం భయమేసింది.

నాది ప్రేమ వివాహం. పరిచయం ఉన్న కుటుంబాలే కాని...మేమిద్దం ప్రేమించుకున్నాం. వివాహానికి అడ్డంకులు ఏవీ రాలేదు. పెళ్లి చూపులు కూడా లేవు. దాంతో పెళ్లి చూపుల్లో ఇంటర్వ్యూ తరహా ప్రశ్నలడగం వంటి అనుభం కూడా నాకు లేదు.

ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో కనీస అనుభవం కూడా లేదు. ఇంటర్వ్యూ దగ్గర కూడా మళ్లీ పాత అనుమానాలే. ఈ టాలెంటెండ్ యూత్‌ని దాటి నేను సెలెక్ట్ అవుతానా అని. కానీ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేశారు. దాంతో నేను ఐఐఎం విశాఖలో విద్యార్థిగా మారిపోయాను.

ప్రేరణ బేగ్

ఫొటో సోర్స్, Prerana Baid

ఇంటర్నెట్, గూగుల్ పై అవగాహన లేదు

క్లాస్‌రూంకి వెళ్తే అక్కడంతా నా పిల్లల్లా కనిపించేవారు. దాంతో అక్కడికి వెళ్లి వాళ్ల మధ్య విద్యార్థినిలా కూర్చోవడం కాస్త సిగ్గేసేది. వారితో మాట్లాడిన కొద్దిసేపట్లోనే వారి టాలెంట్ ఏంటో తెలిసింది. పైగా వారంతా అప్‌డేటెడ్ గా ఉండేవారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉన్నవారు. నాకు వాటిపై పెద్దగా అవగాహన లేదు.

చాలా తక్కువగా వాడతాను. దాంతో వారితో పోటీ పడి నిలవగలనా అనిపించింది. చాలా ఎక్కువ కష్టపడితే కానీ నెగ్గుకురాలేమని అర్థమైంది.

మొదటి సంవత్సరమంతా అదే ఫీలింగ్ ఉండేది. అయితే పరీక్ష ఫలితాలు వచ్చాక ఆ భయం పోయింది. దాంతో మరింత ఎక్కువ కష్టపడటం మొదలు పెట్టాను. నా తోటి విద్యార్థుల నుంచి ఎక్కువగా తెలుసుకునే దాన్ని. వారే చాలా సార్లు నాకు కొత్త విషయాలు నేర్పేవారు. అలాగే ఐఐఎం లెక్చరర్లు కూడా నా ఉత్సాహం చూసి విసుక్కోకుండా ఎంత చిన్న ప్రశ్నకైనా సమాధానం చెప్పేవారు. నన్ను చాలా ప్రొత్సహించారు.

గోల్డ్ మెడల్ అందుకుంటున్న ప్రేరణ

ఫొటో సోర్స్, Prerana Baid

ఫంక్షన్లు. సరదాలకు దూరం

2018-2019లో ఐఐఎంలో ప్రొఫెషనల్స్ కోసం పెట్టిన పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సు పూర్తి చేశాను. 2019లో ఎంబీఏలో చేరాను. ఆ కోర్సును 2021లో పూర్తి చేశాను. ఐఐఎంలోని పిల్లలతో పోటిపడి చదివాను. వారి కూడా నాకు చాలా సహాయం చేసేవారు. మూడేళ్లు ఐఐఎం కోర్సులలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.

నేను చదువుకోవడంలో నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ చేశారు. మాది సంప్రదాయ కుటుంబం కావడంతో బంధువుల ఇళ్లల్లో కార్యక్రమాలకు హాజరవడం తప్పనిసరి.

కానీ చదువుకు ఇబ్బందవుతుందని వాటికి దూరంగా ఉన్నాను. ఇక వీకెండ్ సరదాలు, టూర్లు అన్నింటిని వదులుకున్నాను. ఎవరు ఎక్కడికి రమ్మనా వెళ్లేదాన్ని కాదు.

అలా మూడేళ్లు పాటు కుటుంబానికి, సరదాలకు దాదాపు దూరంగానే ఉన్నాను. కొన్ని సార్లు నా భర్త తప్పదు రమ్మని ఫోర్స్ చేసినా...కుదరదని సీరియస్ గానే చెప్పేదాన్ని.

వీడియో క్యాప్షన్, కొడుకు కాలేజ్ సీటు కోసం వెళ్లి విద్యార్థినిగా మారి గోల్డ్ మెడల్ సాధించిన గృహిణి

గోల్డ్ మెడల్స్ సాధిస్తానని ఊహించలేదు

నాకు ఐఐఎంలో బంగారు పతకాలు రావడం అసలు ఊహించలేదు. నాకు చదువంటే ఇష్టం. అందుకే చదువుకున్నాను.

అంతేకానీ గోల్డ్ మెడల్స్ అనే విషయాన్ని ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత నాకు రెండు విభాగాల్లో బంగారు పతాకాలు వచ్చాయని చెప్పినపపుడు నమ్మలేకపోయాను.

నేను రెండు బంగారు పతకాలు సాధించానంటే అది నాకు కలగానే అనిపిస్తుంది. ఒకటి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మొదటి ర్యాంకు సాధించినందుకు... మరొకటి ఓవరాల్‌ పెర్‌ఫార్మెన్స్‌కు లభించింది.

చదువుకోవడమే కష్టం అనిపించి...చదువుదామా వద్దా అని మొదలు పెట్టిన నేను బంగరు పతకాలు సాధించడం నాకు కొత్త ఉత్సాహన్ని ఇచ్చింది. ఇప్పుడు మా బంధువులు, తెలిసిన వాళ్ళు మా పిల్లల్ని ప్రేరణ పిల్లలని, నా భర్తని ప్రేరణ భర్త అని పిలుస్తున్నారు.

అలా చెప్పడం వారికి కూడా చాలా సంతోషంగా ఉంది.

ప్రేరణ కుటుంబంతో

ఫొటో సోర్స్, Prerana Baid

విజయాలకు వయసు అడ్డుకాదు

22 ఏళ్ల క్రితం నన్ను ఎవరైనా 40 ఏళ్లు వయసు దాటిన తర్వాత చదువుతావా అని అడిగితే నవ్వేదాన్నేమో.

కానీ నేను 40 ఏళ్లు దాటిన తర్వాత కాలేజీకు వెళ్లి...పిల్లలతో కలిసి చదువుతానని అనుకోలేదు. చదువుకోవాలనే నా కల నన్ను ఇంత వరకు తీసుకొచ్చిందని నమ్ముతాను.

మనం ఏదైనా నమ్మితే అది నిజం చేసుకోడానికి వయసు అనేది అడ్డేకాదు. మన కలని నిజం చేసుకోడానికి వయసుకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు నేను పీహెచ్‌డీ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఒక స్టార్టప్ కూడా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాను.

"జీవితంలో ఎప్పుడూ కూడా నేర్చుకోవడం ఆపకూడదని, నిరంతరం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలని" ఐఐఎం నాకు నేర్పిన పాఠం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)