కాశీబుగ్గ: శవాన్ని మోసిన ఎస్.ఐ శిరీష ఎవరు? ఆమె అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఊరికి దూరంగా పొలాల్లో గుర్తు తెలియన మృత దేహం ఉందని అక్కడికి చేరుకున్నారు కాశీబుగ్గ ఎస్సై శిరీష. కుళ్లిపోయి, గుర్తు తెలియకుండా ఉన్న ఆ శవాన్ని మోసేందుకు, కనీసం చూసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఆమె ఆ శవాన్ని మోసుకుంటూ వాహనం వరకు తీసుకెళ్లారు.
పొలంలో శవమని ఫోన్..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామ పొలాల్లో ఒక శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
ఆ సమాచారం అందుకున్న కాశీబుగ్గ స్టేషన్ ఎస్సై శిరీష అడవి కొత్తూరు చేరుకున్నారు.
అయితే, పొలంలో మృతదేహం ఉన్న చోటుకి వెళ్లేందుకు దారి లేదు. పొలాల్లో నుంచి నడుచుకుని అర కిలోమీటరు పైగా వెళ్లాలి.
చేసేదేమీ లేక జీపును అక్కడే వదిలి ఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డ్ నడుచుకుంటూ మృత దేహం వద్దకు చేరుకున్నారు.
"గుర్తుపట్టలేని విధంగా ఉన్న దాదాపు 70 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం అది. స్థానికులను విచారించాను. ఎవరికీ తెలియదని చెప్పారు. శరీరం బాగా కుళ్లిపోయింది. అక్కడ ఉండానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. ఆ శరీరాన్ని మోసుకుని పొలం గట్లు దాటించి...జీపు వరకు తీసుకుని రావడానికి ఎవరైనా సాయం చేస్తారెమోనని అడిగాను. ఎవరు రాలేదు. మాతో వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మళ్లీ స్నానం చేయాలి కదా మేడం అంటూ ఇబ్బంది పడ్డారు. దాంతో ఇక నేను నాకు తెలిసిన లలితా ఛారిటబుల్ ట్రస్ట్ పర్సన్ కి ఫోన్ చేసి స్ట్రెచర్ తీసుకుని రమ్మన్నాను. ఆయన సహాయంతో ఆ మృతదేహాన్ని స్ట్రెచర్ పై మోసుకుంటూ అరకిలోమీటరు పైగా పొలం గట్లపై నడుచుకుంటూ జీపు వద్దకు చేరుకున్నాం. అక్కడ లలితా ఛారిటబుల్ ట్రస్ట్ వారికి ఆ మృతదేహాన్ని అప్పగించి...అంత్యక్రియల కోసం కొంత ఆర్థిక సాయం చేశాను" అని బీబీసీతో చెప్పారు కాశీబుగ్గ ఎస్సై శిరీష.

‘‘5 నిమిషాల తేడాలో ఎందరో బతికారు..’’
"అయితే ఇదంతా నేనేమి గొప్పగా అనుకోవడం లేదు. పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. నిజానికి ఇట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ పోలీస్ డ్యూటీ. నేను పోలీసు అయినప్పటీ నుంచి ఎన్నో యాక్సిడెంట్ కేసులను చూశాను. సంఘటనా స్థలంలో గాయాలపాలైన వారిని ఐదు, పది నిమిషాల తేడాలో ఆసుపత్రికి తీసుకుని వెళ్తే బతుకుతారని చూస్తే తెలిసిపోతుంది. అందుకు యాక్సిడెంట్ స్పాట్ లో గాయాలపాలైన వారిని వెంటనే మరో ఆలోచన లేకుండా ఆసుపత్రికి నా జీపులో తీసుకుని వెళ్లిపోతుంటాను. సమయానికి తీసుకుని వచ్చారు...వారు బతికారని డాక్టరు చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే యాక్సిడెంట్ స్పాట్ లో ముక్కముక్కలై పడి ఉన్న కొందరి శరీర భాగాలను గోనె సంచిలో మూట కట్టి తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయి" అని శిరీష చెప్పారు.
"2019లో నాకు ఎస్పైగా నందిగామలో మొదటి పోస్టింగ్. ఆ గ్రామంలో నలుగురు కొడుకులు.. తల్లిదండ్రులను గొడ్లపాకలో కట్టిపడేశారు. వాళ్లకి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు. దాంతో ఇక నేనే వారికి చిన్న షెడ్డు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేసి...సొంతంగా బతికే ఏర్పాట్లు చేశాను. ఇలా నాకు బాధ కలిగించిన ఏ సంఘటనలోనైనా నేను పోలీసు డ్యూటీయే కాకుండా నాకు చేతనైనంత సహాయం కూడా చేస్తాను" అని శిరీష తెలిపారు.
‘‘కానిస్టేబుల్‌గా సెలవు పెట్టాను...ఎస్సై అయ్యాను’’
"నా సొంతూరు విశాఖపట్నం. నగరంలోని రామాటాకీస్ ప్రాంతం. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. మా నాన్న తాపీ మేస్త్రీ. డిగ్రీ వరకు చదివిన నాకు 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. మద్దిలపాలెం ఎక్సైజ్ ఎస్పీ ఆఫీస్ లో ఏడాదిన్నర పని చేశాను. ఆ తరువాత ఎనిమిది నెలలు లీవ్ పెట్టి హైదరాబాద్ ఎస్సై పరీక్షల కోచింగ్ కి వెళ్లాను. పరీక్షలు రాసి...మళ్లీ కానిస్టేబుల్ గా విధుల్లో చేరాను. అయితే ఎస్సై పరీక్ష ఫలితాలు రావడం... నేను సెలెక్ట్ కావడంతో నాకు శ్రీకాకుళం జిల్లాలోని నందిగామలో తొలి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తరువాత జి. సిగడాం, ఇప్పుడు కాశీబుగ్గలో పోస్టింగ్ వచ్చింది. ఇవాళ నేను చేసిందంతా సేవ అంటున్నారు. అది సేవ కాదు బాధ్యత. అక్కడున్న స్థానికులని, నాతో పాటు వచ్చిన పోలీసు సిబ్బందిని ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు. శవం అనగానే ఎవరి సెంటిమెంట్లు వారికుంటాయి. అందుకే వారిని ఇబ్బంది పెట్టకుండా నేనే చొరవ తీసుకున్నాను" అని శిరీష వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘డీజీపీ సర్ ఫోన్ చేశారు...ఏమంటారో అని అనుకున్నా..’’
"ఈ సంఘటన వైరల్ కావడంతో డీజీపీ సర్ ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేయగానే ఏమంటారో అని అనుకున్నాను. వివరాలు అడిగారు. ఒక్కొక్కటి చెప్తున్నా. కానీ... లోపల భయంగానే ఉంది. అంతా విన్న అయన ఒక మహిళగా నువ్వు చేసిన పని గ్రేట్ అని అన్నారు. అప్పుడు నాకు భయం పోయి... ఆనందం కలిగింది. అంతేకాకుండా, సేవ చేయాల్సిన సమయం వస్తే ఎటువంటి సంకోచం లేకుండా చేయమని... అది పోలీసు డ్యూటీ కంటే గొప్పదని చెప్పారు. అలాగే తెలంగాణా పోలీసులు కూడా నా కోసం ట్వీట్ చేశారు. ఇది కూడా చాలా సంతోషించదగిన విషయం. ప్రాంతాలతో సంబంధం లేకుండా పోలీసులమంతా ఒకటే అనే భావం కలిగింది. ఇక ముందు కూడా నేను సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా" అని అన్నారు ఎస్సై శిరీష.
ఇవి కూడా చదవండి:
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోతులు పగబట్టి 200 కుక్కపిల్లలను చంపింది నిజమేనా? లవూల్ గ్రామంలో అసలు ఏం జరిగింది?
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














