1983 వరల్డ్ కప్: జింబాబ్వేపై కపిల్‌ దేవ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు?

కప్ సంపాదించిన ఆనందంలో కపిల్ దేవ్, అమర్‌నాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ కప్ సంపాదించిన ఆనందంలో కపిల్ దేవ్, అమర్‌నాథ్
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1983 జూన్ 25... తొలిసారి వరల్డ్ కప్‌ను సాధించిన టీం ఇండియా చరిత్రను లిఖించిన రోజు. లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ అందుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ భారత క్రికెట్ దశను దిశను మార్చి వేసింది. నేటి టీం ఇండియా విజయాలకు బలమైన పునాదిగా నిలిచింది.

వరల్డ్ కప్‌ను గెలిచిన ఆ క్షణాలు భారత క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైనవి. ఆ అద్భుతం ఇప్పుడు '83' మూవీ రూపంలో వెండి తెర మీద ఆవిష్కృతమైంది.

1983 విజయం ఎందుకంత ప్రత్యేకం?

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది 1983 వరల్డ్ కప్. ఆ గెలుపు అంత సులభంగా దక్కిందేమీ కాదు. అసలు టీం ఇండియా అప్పటికీ అండర్ డాగ్స్. భారతీయ జట్టుపై ఎవరికీ అంచనాలు కూడా లేవు. అంతకు ముందు టీం ఇండియా 1975, 79 వరల్డ్ కప్స్ ఆడింది. కానీ ఆ రెండు టోర్నమెంట్స్‌ మొత్తం మీద అది గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే.

వీడియో క్యాప్షన్, 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...

వన్డే క్రికెట్‌లో అప్పటి వరకు టీం ఇండియాకున్న అనుభవం కూడా చాలా తక్కువ. అసలు గెలుస్తామని కొందరు ఇండియా ప్లేయర్సే అనుకోలేదు. గ్రూప్ స్టేజ్‌ను కూడా దాటలేమని భావించిన కొందరు ప్లేయర్స్ ఇంగ్లండ్ నుంచి అటే అమెరికాకు హాలీడే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే చాలు అని చాలా మంది అనుకున్న తరుణంలో టీం ఇండియా ఏకంగా ప్రపంచ కప్‌ను కొట్టడం అద్భుతమే. నాడు ఫైనల్స్‌లో ది బెస్ట్ ప్లేయర్స్‌తో ది బెస్ట్ టీంగా ఉన్న వెస్ట్ ఇండీస్‌ను ఓడించి మరీ టీం ఇండియా కప్పును గెలుచుకుంది. అందుకే ఈ గెలుపు అంత ప్రత్యేకం.

వివ్ రిచర్డ్స్, క్లెయివ్ లాయిడ్స్ వంటి క్రికెట్ లెజెండ్స్ వెస్ట్ ఇండీస్ టీమ్‌కు పెట్టని కోటలుగా ఉన్నారు. వరుసగా 1975, 79 వరల్డ్ కప్స్‌ను వెస్ట్ ఇండీస్ గెలిచింది. 1983 కప్‌ను కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న ఆ టీమ్ జోరుకు కపిల్ దేవ్ కెప్టెన్సీలోని టీం ఇండియా బ్రేకులు వేసింది. అది ఎన్నో కష్టాలు, సవాళ్లకు ఎదురీది మరీ అందుకున్న విజయం. అది భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన గెలుపు. అందుకే దానికి ఇంత గుర్తింపు.

జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు

తిరుగులేని కపిల్ దేవ్ నాయకత్వం

1983 వరల్డ్ కప్ విజయంలో కెప్టెన్ కపిల్ దేవ్‌ కీ రోల్ పోషించారు. చాలా మంది టీం ఇండియా ప్లేయర్స్‌కే గెలుపై నమ్మకం లేని సమయంలో వారిలో విశ్వాసాన్ని నింపారు కపిల్ దేవ్. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లోనే వెస్ట్ ఇండీస్‌ను బీట్ చేయడం ద్వారా టీం ఇండియా బలమేంటో కపిల్ దేవ్ చూపించారు.

మనం గెలవగలం అనే నమ్మకం, పోరాడాలనే తపన ఆ విజయంతో టీం ఇండియాలో నాటుకు పోయింది.

1983 జూన్ 18న జింబాబ్వే మీద కపిల్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. 17 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్నప్పుడు బరిలోకి దిగిన కపిల్, మరపురాని ఇన్నింగ్స్ ఆడారు. సిక్సులు, ఫోర్లతో రెచ్చి పోయిన కపిల్, 138 బాల్స్‌కు 175 రన్స్ కొట్టారు. ఆ మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచింది టీం ఇండియా.

1983 వరల్డ్ కప్‌లో ఇదొక కీలక మలుపు. వన్డే క్రికెట్ చరిత్రలో అదొక గొప్ప ఇన్నింగ్స్. ఇండియా క్రికెట్‌లో అదొక విప్లవం. ఆ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్ ఆడే పోకడను సమూలంగా కపిల్ దేవ్ మార్చివేశారు. కానీ అంతటి గొప్ప ఇన్నింగ్స్‌ను వీడియో రికార్డ్ కాక పోవడం చరిత్రలో ఒక లోటుగా మిగిలిపోయింది.

1983 వరల్డ్ కప్‌కు బీబీసీ అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్‌గా ఉంది. ఇండియా-జింబాబ్వే మ్యాచ్ రోజున సిబ్బంది స్ట్రైక్ చేయడం వల్ల ఆ మ్యాచ్‌ను బీబీసీ టెలికాస్ట్ చేయలేదు.

మ్యాచ్ అనంతరం స్టేడియంలో భారత జట్టు సందడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ అనంతరం స్టేడియంలో భారత జట్టు సందడి

భారత క్రికెట్‌లో కీలక మలుపు

లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ పట్టుకున్న 1983 వరల్డ్ కప్ ట్రోఫీ భారత్‌ క్రికెట్‌కు ఒక వెలుగు దివ్వెగా మారింది. ఒక తరానికి ప్రేరణగా నిలిచింది. సచిన్ తెందూల్కర్ అనే కుర్రాడు గాడ్ ఆఫ్ క్రికెట్‌గా మారడానికి ఆ విజయం స్ఫూర్తినిచ్చింది.

తొలి రోజుల్లో మహారాజులు, నవాబులు మాత్రమే ఇండియాలో క్రికెట్ ఆడేవారు. ఆ తరువాత వారి స్థానంలో చదువుకున్న మిడిల్ క్లాస్ బ్రాహ్మణులు వచ్చి చేరారు. వీరంతా ఎక్కువగా మహానగరాల్లో పుట్టి పెరిగిన వారు.

ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసిన కపిల్ దేవ్, పట్టణాలకు సొంతమైన క్రికెట్‌ను పల్లెబాట పట్టించారు. ఆయన నాన్-బ్రాహ్మిణ్. ఈ ఇమేజ్ ఇండియా క్రికెట్‌ను ఎంతగానో మార్చింది. చిన్న చిన్న టౌన్లలో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పుట్టిన కుర్రాళ్లు కూడా 1983 విజయంతో క్రికెట్ గురించి కలలు కనడం ప్రారంభించారు.

వరల్డ్ కప్‌ ట్రోఫీతో కపిల్ దేవ్

ఫొటో సోర్స్, DAVE CANNON/ALLSPORT

ఫొటో క్యాప్షన్, వరల్డ్ కప్‌ ట్రోఫీతో కపిల్ దేవ్

వెనుకబడిన ప్రాంతాల నుంచి టీం ఇండియాకు సెలెక్ట్ అయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇండియాకు రెండు వరల్డ్ కప్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ జార్ఖండ్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే.

1983 విజయంతో ఆట పరంగా కూడా టీం ఇండియాలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు టెస్ట్‌లతో పోలిస్తే వన్డేలకు పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. ఆ తరువాత ఈ తీరు మారింది.

ప్లేయర్స్‌ వన్డే క్రికెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయ్. ఇతర దేశాలను చూసి కొత్త వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు. జట్టులో వైవిధ్యంతోపాటు దూకుడు పెరిగింది. ఇలాంటి ఎన్నో మార్పులను తీసుకొచ్చిన 1983 వరల్డ్ కప్ ఇండియా క్రికెట్ చరిత్రలో ఒక మలుపుగా మిగిలి పోయింది.

వీడియో క్యాప్షన్, క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)