అమ్మాయిల పెళ్లి వయసు 21కి పెంపు: "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిందూ వివాహ చట్టం (1955)ను అనుసరించి అమ్మాయిల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండేది. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది.
ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది.
అమ్మాయిల వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు.
అమ్మాయిల పెళ్లి వయసు పెంపు పై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. 21 సంవత్సరాలకు పెంచాలని ఈ కమిటీ ప్రతిపాదించింది.
ఇందు కోసం దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలు, 15 స్వచ్చంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
ఈ కమిటీకి సమతా పార్టీ మాజీ ఛైర్మన్ జయ జైట్లీ నేతృత్వం వహించారు. ఈమెతో పాటు, ఈ కమిటీలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె. పాల్, న్యాయమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.
స్కూళ్లలో లైంగిక విద్యను తప్పని సరి చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది.
ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధించేందుకు సహకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయసులోని అంతరాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Shivam Saxena/Hindustan Times via Getty Images
ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధిస్తుందా?
సమాజంలో పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషించినంత వరకూ బాలికల హోదాలో, పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రావని స్త్రీవాద పత్రిక ‘భూమిక’ సంపాదకురాలు కొండవీటి సత్యవతి అంటారు. బాలికల కనీస వివాహ వయసును ప్రభుత్వం 21 సంవత్సరాలకు పెంచడంపై ఆమె ఒక వ్యాసం రాశారు.
సామాజిక వాతావరణాన్ని ప్రక్షాళన చేయకుండా వివాహ వయో పరిమితిని పెంచడంలో అర్ధం లేదు. బాలికలపై చూపించే వివక్షకు మూలకారణాలను తెలుసుకోకుండా సమానత్వాన్ని సాధించడం కష్టమని ఆమె అంటారు.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని అంటూ లింగ సమానత్వం సాధించడానికి ఇదొక మెట్టు లాంటిదని ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ విభాగాధిపతి డాక్టర్ సుమిత్ర అన్నారు.

ఫొటో సోర్స్, WILL RUSSELL-ICC
ఈ నిర్ణయం బాల్య వివాహాలను ఆపుతుందా?
భారతదేశంలో 2019-20 నాటికి బాల్య వివాహాలు 23% ఉన్నట్లు ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇది 2015-16లో 27% ఉండేది.
బాల్య వివాహాలు శిశు మరణాలకు, ప్రసూతి మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.
చిన్న పిల్లల పెళ్లిళ్ల గురించి చర్చ మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా, నేటికీ ఇదొక సమస్యగానే ఉండిపోవడం విచారకరమని సత్యవతి అంటారు.
"చిన్న వయసులోనే రజస్వల అవ్వడం వల్ల చురుకుగా మారే హార్మోన్ల ఒత్తిడిని అమ్మాయిలు ఎలా అధిగమిస్తారు? గ్రామాల్లో హై స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడ చదివించాలనే సందేహం, ఆడపిల్లలను దూరంగా పంపించి చదివించేందుకు ఇష్టం చూపకపోవడం, అమ్మాయిలకు సురక్షిత వాతావరణం లేకపోవడం, లైంగిక వేధింపులు కూడా బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి" అని ఆమె అన్నారు.
యుక్తవయసులో ఉన్న 51% చదువు లేని అమ్మాయిలు, ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన 47%మంది అమ్మాయిలు 18 సంవత్సరాలు లోపే వివాహం చేసుకున్నట్లు యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా-2020 నివేదిక చెబుతోంది.
భారత్‌లో 1.5 కోట్ల మంది అమ్మాయిలకు 18ఏళ్లలోపే వివాహమైందని నివేదికలో జయ చెప్పారు. అయితే ఇదివరకు 46 శాతం(మొత్తం బాలికల్లో 46 శాతం మంది)గా ఉండే ఈ వివాహాలు ప్రస్తుతం 27 శాతానికి తగ్గాయని జయా జైట్లీ పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన తెగల్లో మార్పు తెస్తుందో లేదో సందేహమేనని అంటున్నారు నిర్ణయ్ స్వచ్చంద సంస్థకు చెందిన నిఖిని వర్మ. ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళలు, బాలికల విద్య కోసం పని చేస్తున్నారు.
"గిరిజన ప్రాంతాల్లో పాటించే ఆచారాలు వారి సంస్కృతి పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా, ఈ ప్రాంతాల్లో ప్రతి నిర్ణయానికి గ్రామ పెద్ద పై ఆధారపడతారు. ఈ ప్రాంతాల్లో 18 ఏళ్లు రాక ముందే పెళ్లి చేసేస్తారు. ఆ విషయం గురించి ఫిర్యాదు కూడా ఎవరూ చేయరు. పెళ్లి వయసు 21 లేదా 25కు పెరిగినా 18 సంవత్సరాలే ఉన్నా అది గిరిజన సమాజాల్లో పెద్దగా ప్రభావం చూపించదు" అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్పెషల్ మ్యారేజ్ చట్టం (1954) హిందూ వివాహ చట్టం (1955) ప్రకారం వివాహం చేసుకునేవారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది.
ఇస్లాంలో ఒక అమ్మాయికి యుక్త వయసు రాగానే వివాహానికి సిద్ధంగా ఉన్నట్లు పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, DR SUMITRA
మహిళా సాధికారత సాధించేందుకు తోడ్పడుతుందా?
చట్టంలో మార్పులు చేసినంత మాత్రాన మహిళా సాధికారత వస్తుందని చెప్పలేం, కానీ, ఇదొక మార్పుకు నాంది పలుకుతుందని డాక్టర్ సుమిత్ర అంటారు.
"సాధికారతకు సమానత్వం తొలి మెట్టు". సమానత్వ భావన అనేది సామాజికంగా వచ్చేవరకూ సాధికారత సాధ్యం కాదని ఆమె అంటారు.
ఆర్ధిక, రాజకీయ సమానత్వం కొంత వరకు సాధించాం కానీ, సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదంటారు డాక్టర్ సుమిత్ర.
"మహిళలు కూడా జెండర్ స్టీరియో టైప్స్ ను దాటి ఆలోచించగలగాలని అన్నారు. సమాజం ఒక పరిణామం చెందుతున్న దశలో ఉంది. చట్టంతో పాటు సామాజిక దృక్పధం కూడా మారాలి. కానీ, మార్పు సాకారమయ్యేందుకు చాలా సమయం పడుతుంది" అని అన్నారు.
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా వారి విద్య ఉద్యోగావకాశాలు పెరిగితే, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని సుమిత్ర అన్నారు.

ఫొటో సోర్స్, NIKHINI VARMA
అమలు చేయడంలో ఉన్న సవాళ్లేంటి?
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా పిల్లలు, మహిళల పై మాత్రమే కాకుండా కుటుంబం, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల పై ప్రభావం చూపిస్తుందని టాస్క్ ఫోర్స్ కమిటీ అభిప్రాయపడింది.
కొన్ని వెనుకబడిన వర్గాల్లో 70% బాల్య వివాహాలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. చదువును ఆపేసిన పిల్లల్లో 3 నుంచి 4 రెట్లు మందికి పెళ్లిళ్లు చేసే అవకాశముందని లేదా వారి వివాహం నిశ్చయం అయిపోయి ఉంటుందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నాటుకుపోయిన నమ్మకాలు, ఆచారాలను ఆపమని చెప్పడం చాలా కష్టమని అంటారు నిఖిని వర్మ.
"అదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరలో వధూవరులను ఎంపిక చేసుకుంటారు. మాకు దేముడు చూపించిన మనువు అని అంటూ ఉంటారు. అటువంటి వారిని 18 లేదా 21 సంవత్సరాల వరకూ పెళ్లి చేయకుండా ఆపమని ఒప్పించడం చాలా కష్టమైన పని" అని అంటారు నిఖిని.
లోహారా గ్రామంలో బాల్య వివాహాలను ఆపేందుకు పిల్లల తల్లితండ్రులను ఒప్పించడం చాలా కష్టంగా మారినట్లు వివరించారు.
"వారి సంస్కృతిని ఎత్తి చూపకుండా, ఒక ఆచారంలో ఉన్న తప్పొప్పులను వివరిస్తే, జీవనాలు ఎలా మెరుగవుతాయో వివరిస్తే కొంత వరకు వింటారు" అని తన స్వీయానుభవంతో చెప్పారు.
"గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామ పెద్దలను ఒప్పించగలగాలి. ఆ దిశగా ఈ రంగంలో పని చేస్తున్న స్వచ్చంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ కార్యక్రమాలు క్షేత్ర స్థాయి చేరేవరకూ చట్టాల అమలు కష్టమే" అంటారు నిఖిని.
"అవగాహన కార్యక్రమాల్లో చట్టాన్ని అమలు చేయాలని బలవంతపెట్టడం కంటే, ఒక పని చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలను వివరించగలగాలి. ఏదైనా కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ముందే ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి" అని చెప్పారు.
పేదరికం, నిరక్షరాస్యత, వైద్య సదుపాయాల కొరత, రవాణా సదుపాయాల కొరత లాంటి అంశాలను నిర్మూలించే వరకూ చట్టాలు ఎటువంటి మార్పులు తీసుకుని రాలేవని సత్యవతి అంటారు.
చట్టానికి, సమాజానికి నిరంతరం ఒక అవినాభావ సంబంధం కొనసాగుతూ ఉంటుంది. చట్టం సమాజం పై ప్రభావం చూపిస్తుంది. సామాజిక మార్పులను తీసుకొచ్చేందుకు చట్టం కూడా ఒక కారకంగా పని చేస్తుంది. సమాజంలో వచ్చే మార్పులు కూడా చట్టంలో ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూ ఉండాలని డాక్టర్ సుమిత్ర అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వంపై రైతుల విజయం.. ఏడాది పోరాటంలో 7 కీలక ఘట్టాలు
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- చైనాపై నిఘా కోసం హిమాలయాలపై దాచిన ప్లుటోనియం ఎలా మాయమైంది? అమెరికా, భారత్ మిషన్ ఎందుకు ఫెయిలైంది?
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్‌లో బిట్ కాయిన్‌కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్‌లోని జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ సైనికులు
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- భర్త చనిపోయాడని భార్యకు మళ్లీ పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత భారత్‌కు పాకిస్తాన్ లేఖ.. అందులో ఏముందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
















