భర్త చనిపోయాడని భార్యకు మళ్లీ పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత భారత్‌కు పాకిస్తాన్ లేఖ.. అందులో ఏముందంటే.. - ప్రెస్ రివ్యూ

మతాంతర వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

భర్త చనిపోయాడనుకుని భార్య మరో వివాహం చేసుకుంది. కానీ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు భర్త ఆచూకీ దొరికిందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

12 సంవత్సరాల క్రితం ఆయన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఆయన కోసం కుటుంబ సభ్యులు ఎంతో వెతికారు. అయినా ఆయన ఆచూకీ దొరకలేదు.

దాంతో ఆయన చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. తుది కర్మలు కూడా చేశారు. భర్త ఇక లేడని, రెండేళ్ల తర్వాత భార్య మరో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అనూహ్యంగా ఆమె భర్త ఆచూకీ తెలిసింది.

బీహర్‌లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఖిలాఫత్‌పుర్ గ్రామ నివాసి ఛావీ ముశాహర్..12 ఏళ్ల క్రితం అదృశ్యం అయ్యాడు. పాకిస్తాన్‌లోని ఒక జైలులో ఖైదీగా ఉన్నాడని ఇప్పుడు తెలిసింది.

ఈ విషయం ఎలా తెలిసిందంటే.. పాకిస్తాన్‌ జైలులో ఉన్న ఒక వ్యక్తిని గుర్తించాలంటూ భారత విదేశాంగ శాఖ నుంచి ముఫాసిల్ ఠాణాకు ఒక లేఖ అందింది.

పోలీసులు ఖిలాఫత్‌పుర్‌ చేరుకుని ఊరంతా ఆరా తీశారు. అది 12 సంవత్సరాల క్రితం అదృశ్యమైన ఛావీ ముశాహర్‌ చిత్రమని ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. తమ కుమారుడిని వెంటనే స్వదేశం తీసుకురావాలని ఛావీ తల్లి ప్రభుత్వాన్ని కోరుతోంది.

చెడ్డీ గ్యాంగ్

పగలు రెక్కీ.. రాత్రి లూటీ.. చెడ్డీ గ్యాంగ్ విధానం ఇదే

సంచలనం రేపిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారంటూ సాక్షి కథనం ప్రచురించింది.

ఈ దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.

నగర పోలీస్ కమిషనర్ టి.కే. రాణా ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు.

"గుజరాత్‌లోని దహోద్, మధ్యప్రదేశ్‌లోని జుబువా ప్రాంతాల నుంచి 10 మంది దొంగలు గత నెల 26న విజయవాడకు చేరుకున్నారు. ఈ గ్రూపు సభ్యుల రాష్ట్రాలు వేరైనప్పటికీ ఒకరికొకరు పరిచయస్తులే.

ఈ ముఠా సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి, నగర శివారు ప్రాంతాల్లోని విల్లాలు, ఖరీదైన అపార్ట్‌మెంట్లను టార్గెట్ చేస్తుంటారు.

చోరీ చేసే సమయంలో వీళ్లు బనియన్, నిక్కర్ మాత్రమే ధరిస్తారు. పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తుంటారు" అని పోలీస్ కమిషనర్ టి.కే. రాణా వివరించారు.

"ఇక్కడ చోరీలు చేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు విజయవాడ నుంచి ఈ నెల 8న తేదీన వారి సొంత గ్రామాలకు బయలుదేరారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు, వేలి ముద్రలు పరిశీలించిన అనంతరం దర్యాప్తు వేగవంతం చేశాం.

మూడు బృందాలను ఏర్పాటు చేసి గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పంపించాం. అక్కడి పోలీసుల సహకారంతో గుజరాత్‌కు చెందిన మడియా కాంజీ మేడా, సక్ర మండోడ, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేశ్ బాబేరియాలను అదుపులోకి తీసుకుని వారి నుంచి సొత్తు రికవరి చేశాం. ఈ గ్యాంగ్‌లోని మరో ఏడుగురు పరారీలో ఉన్నారు" అని సీపీ చెప్పారు.

ధ్వజస్తంభం

ఫొటో సోర్స్, ugc

స్వర్ణమయం.. యాదాద్రీశుడి ధ్వజస్తంభం

తెలంగాణలోని యాదాద్రీశుడి ఆలయ ముఖమండపం స్వర్ణకాంతిమయం కానుందని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులను శుక్రవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు.

అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారు తొడుగులను ధ్వజస్తంభం పీఠానికి బిగించారు.

1,785 గ్రాముల మేలిమి బంగారంతో చెన్నైకి చెందిన స్మార్ట్‌ క్రియేషన్‌ సంస్థ ప్రత్యేక బంగారు తాపడాలను చేసింది. రాగి పనులను మహాబలిపురానికి చెందిన శిల్పి రవీంద్రన్‌ చేశారు.

వీడియో క్యాప్షన్, యాదాద్రి: అలనాటి అనుభూతిని కలిగించే ఆధునిక నిర్మాణం

బంగారు తాపడంపై పుష్పాలు, సింహం ఆకృతులు, ఉపపీఠాల వంటి రూపాలను ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి చెక్కారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తికానున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే స్వామివారి గర్భగడి ముఖద్వారం తలుపులకు బంగారు తొడుగుల పని పూర్తి చేశారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో ఉన్న బలిపీఠానికి బంగారు తొడుగుల బిగింపు పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకోసం 1,552 గ్రాముల బంగారాన్ని వినియోగించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఉరి

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్‌లో ఫెయిలయ్యామన్న బాధతో ముగ్గురు ఆత్మహత్య

ఇంటర్‌లో ఫెయిలయ్యామన్న బాధతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటూ వెలుగు దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన జాహ్నవి రైలు కింద పడి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వరుణ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ధనుష్ ఉరి వేసుకుని ప్రాణాలు విడిచారు.

కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగలేదని, అయినా పరీక్షలు పెట్టి ఇలా ఫెయిల్ చేసి తమ బిడ్డల ప్రాణాలు తీసుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లా గాంధీనగర్ చెందిన జాహ్నవి మ్యాథ్స్‌లో ఫెయిలయింది. తాను బాగానే రాసినా ఎందుకు ఫెయిలయ్యానని కలత చెందిన జాహ్నవి శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ వద్ద రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగకు చెందిన కొల్లూరి వరుణ్ ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైనట్లు వచ్చింది. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగక ఇంటర్ పరీక్షలను వరుణ్ సరిగా రాయలేదు. దీంతో వరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు.

నిజామాబాద్ జిల్లా అర్సపల్లికి చెందిన ధనుష్ ఇంటర్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. ఇంటర్ రిజల్స్ట్స్‌ను ఇష్టమున్నట్లు ప్రకటించి పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని స్టూడెంట్ లీడర్లు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)