తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు

అమరావతి సభలో చంద్రబాబు

ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మూడు రాజధానులు వద్దంటూ, అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి 180 మంది ప్రాణాలు కోల్పోయారని.. వేల మంది రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టిందని చంద్రబాబు అన్నారు.

అమరావతి రైతుల త్యాగం, పోరాటం అంతా 5 కోట్ల మంది ఆంధ్రుల కోసమేనని చంద్రబాబు అన్నారు.

అమరావతి భూములతోనే ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని, ప్రత్యేకంగా నిధులు అక్కర్లేకుండానే అక్కడ రాజధాని అభివృద్ధి చేయొచ్చని చంద్రబాబు చెప్పారు.

రఘురామకృష్ణరాజు

అమరావతే రాజధాని.. ఎలాంటి సందేహం లేదు: ఎంపీ రఘురామకృష్ణ రాజు

తిరుపతి శివార్లలోని దామినేడు వద్ద ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’కు పెద్దసంఖ్యలో రైతులు, టీడీపీ నేతలు వచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సభలో పాల్గొన్న పలువురు కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు, సీపీఐ నారాయణ, సినీ నటుడు శివాజీ, బీజేపీ నేత భాను ప్రకాష్ సహా పలువురు నేతలు, రైతు నాయకులు ఈ సభకు హాజరయ్యారు.

తర్వాత బహిరంగ సభ వేదిక దగ్గరకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అమరావతి ఐకాస నేతలు వేదికపైకి ఆహ్వానించారు.

అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ వేధికపై ఎంపీ రఘురామ కృష్టం రాజు ప్రసంగించారు.

సభకు హాజరైన మహిళలు

"ఎండనగా వాననకా ఉంటూ.. భోజనాలు చేస్తుంటే, అవి లాక్కుని, చివరికి బయో టాయిలెట్లు కూడా తీసేసి పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో పాదయాత్ర చేసి పాదాలు కందినా దేవుడి సన్నిధికి వచ్చిన ముఖ్యంగా మహిళామణులకు, రైతులకు వారి కందిన పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా’’ అని ఆయన అన్నారు.

‘‘చట్టప్రకారం ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరివల్ల కాదు.. కొన్నాళ్లు ఓపిక పట్టండి.. అమరావతే మన రాజధాని అందులో ఎలాంటి సందేహం లేదు" అన్నారాయన.

కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నారాయణ, చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రఘురామకృష్ణరాజు

కేంద్రం అన్ని రకాలుగా సాయం చేసింది: కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి రాజధాని అనే కేంద్రం అనేక విధాలుగా సాయం చేసిందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అన్ని పార్టీలూ అమరావతికి అసెంబ్లీలో మద్దతిచ్చాయని ఆయన గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారని.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు విశాఖను దోచుకునేందుకు రాజధానిని అక్కడకు మార్చాలని ప్రయత్నిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.అధికార వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అవసరం లేదని, ఒక్క రాజధాని ఉన్నా అధికార వికేంద్రీకరణ చేయొచ్చని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. రూ.5 వేల కోట్లతోనే అమరావతిని అభివృద్ధి చేయవచ్చని ఆయన చెప్పారు.

అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు కల్పవృక్షంలాంటిదని... 9 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉందని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే రూ. వేల కోట్ల ఆదాయం వచ్చేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో మాట తప్పి రాయలసీమకే మచ్చ తెచ్చారని మరో నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలూ అమరావతినే రాజధానిగా కోరుతున్నాయని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.జగన్.. రెండేళ్లుగా నిప్పుల కుంపటి రాజేశారని... ఇప్పుడు కూడా తిరుపతి సభకు వస్తుంటే అడ్డుకున్నారని... అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు తప్పుడు కేసులు పెట్టించారని రామకృష్ణ ఆరోపించారు.

సభకు హాజరైన ప్రజలు

జగన్ తోనే అమరావతి అభివృద్ధి

చంద్రబాబు మోసకారి మాటల భ్రమలో అమరావతి ప్రాంతానికి చెందిన వారు మోసపోవద్దని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన బీబీసీతో అన్నారు.‘‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ ఆలోచిస్తున్నారు. అమరావతి కూడా అభివృద్ధి అవుతుంది. శాసన రాజధానిగా కొనసాగుతుంది. అమరావతిలో రాజధాని లేదని ఎవరన్నారు ? శాసన రాజధానిగా కొనసాగుతుందని చెబుతుంటే ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా అభివృద్ధి జరగవద్దు, మొత్తం ఇక్కడే జరగాలంటే సాధ్యమయ్యేది కాదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి సీదిరి అప్పలరాజు

అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు? మూడు రాజధానుల్లో అది కూడా ఒకటి: మంత్రి సీదిరి

'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ' పేరిట తిరుపతిలో అమరావతి ప్రాంత రైతులు నిర్వహించిన సభ నేపథ్యంలో వైసీపీ నేతలు స్పందించారు.

ఈ మేరకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు, నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబులు ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజధాని అంటే 30 వేల ఎకరాలకు సంబంధించిన ప్రయోజనాల పరిరక్షణా? చంద్రబాబు బినామీల ప్రయోజనాల పరిరక్షణా? లేదంటే 6 కోట్ల ప్రజల ప్రయోజనాల రక్షణా అని వారు ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగా ఉండబోదని ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పలేదని.. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటని వారు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)