నాగాలాండ్ హింస: 13 మంది సామాన్యుల మృతితో సైన్యంపై ప్రజాగ్రహం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మట్టి గోడలు, రేకులతో చేసిన పైకప్పు ఉన్న ఇంటి ముందు ఏడుగురు నాగా మహిళలు మౌనంగా కూర్చుని ఉన్నారు.
లోపల మంచంపై కూర్చున్న ఒకామె మాటిమాటికీ మొబైల్‌లో ఫొటోలు చూస్తూ ఉలిక్కిపడుతున్నారు.
ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నారో ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలాయి ఇప్పుడు.
పెళ్లి అయిన పది రోజులకే మోంగ్లోంగ్ భర్త హోకుప్ మట్టిలో కలిసిపోయారు. ఆమె రోజూ ఓ మందార పువ్వు తీసుకుని ఆయన సమాధి దగ్గరకు వెళ్తారు.
"రాత్రి 12 గంటలకు ఆయన మొబైల్‌కి మెసేజ్ పెట్టాను. 'బతికే ఉన్నావా?' అని అడిగాను. జవాబేమీ రాకపోయేసరికి ఫోన్ చేశాను. ఆయన స్నేహితులు ఫోన్ ఎత్తారు. ఆయనకు చేతిలో బుల్లెట్ దిగిందని చెప్పారు. ఆయనతో మాట్లాడి తీరాలని పట్టుబట్టడంతో ఫోన్ ఆయనకు ఇచ్చారు. గాయం అయిందని ఆయన చెప్పారు. అంతే అక్కడితో అంతా అయిపోయింది. ఇప్పుడు నా భవిష్యత్తు ఏమిటి?" అంటూ 25 ఏళ్ల మోంగ్లోంగ్ వాపోయారు.

అసలేం జరిగింది?
హోకుప్ ప్రాణాలు కోల్పోవడానికి కొన్ని గంటల ముందు, డిసెంబర్ 4వ తేదీన భారత సైన్యం జరిపిన కాల్పుల్లో వారి గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు చనిపోయారు.
నాగాలాండ్‌లోని మోన్ జిల్లా భారత్, మియన్మార్ సరిహద్దుల్లో ఉంది. మోన్‌లోని బొగ్గు గనుల్లో పని చేస్తున్న కార్మికులు ఆరోజు పని ముగించుకుని ఇళ్లకు తిరిగి వస్తుండగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది.
ఈ ఘటనలో ఓటింగ్ గ్రామానికి చెందిన ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
వారిని ఉగ్రవాదులుగా అనుమానించి కాల్పులు జరిపామని, ఇది "గుర్తింపులో జరిగిన పొరపాటు" అని సైన్యం తెలిపింది.
అయితే, స్థానికులు ఈ వాదనను తిరస్కరిస్తున్నారు.
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ఓటింగ్ గ్రామంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఎనిమిది మంది గ్రామస్థులు, ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు.
వీరిద్దరినీ కలవడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆస్పత్రి సిబ్బంది అనుమతించలేదు.

నాగాలాండ్‌లో ఉద్రిక్త వాతావరణం
అస్సాంలోని సోనారీ నుంచి నాగాలాండ్ సరిహద్దుల్లోకి ప్రవేశించగానే వాతావరణం ఉద్రిక్తంగా కనిపించింది.
అన్నిచోట్లా భద్రత పెంచారు. సైనికులు బీబీసీ బృందాన్ని అడ్డగించారు. మోన్ జిల్లాకు చెందిన నాగా కౌన్సిల్ చీఫ్‌తో మాట్లాడించిన తరువాతే బీబీసీ బృందాన్ని అనుమతించారు.
ఓటింగ్ గ్రామం ఎత్తైన ప్రదేశంలో, అందమైన కొండల మధ్య ఉంది. అక్కడకు చేరుకునే దారి చదునుగా లేదు. చాలా చోట్ల రోడ్డు విరిగిపడి ఉంది.
ఇక్కడి ప్రజలు కొన్యాక్ తెగకు చెందినవారు. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు.
గ్రామస్థులు బీబీసీ బృందాన్ని ముందుగా స్మశానానికి తీసుకెళ్లారు. చనిపోయిన 13 మంది సమాధులు చూపించారు.
మధ్య వయస్కురాలైన ఒక మహిళ రెండో సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారు.
"నా భర్త చనిపోయేటప్పటికి నా కొడుకు నాంగ్ఫో రెండేళ్లవాడు. నేను కూలి పని చేసి వాడిని కష్టపడి పెంచాను. పెద్దయ్యాక వాడు నాకు తోడు ఉంటాడనుకున్నా" అంటూ ఆమె విలపించారు.

స్మశానవాటిక నుంచి తిరిగి వస్తుండగా, ప్రస్తుతం తిరు గ్రామంలో నివసిస్తున్న తింగాయీ కొన్యాక్‌ను కలిశారు. ఆయన ఓటింగ్ గ్రామంలోనే పుట్టి పెరిగారు.
"ఓటింగ్ నుంచి తిరుకు రెండు గంటల దూరం. నేను తిరు నుంచి టిజిత్ వెళ్తున్నాను. అక్కడకు చేరుకోగానే మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. కాల్పులు జరిగాయని విన్నాం. నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? అని అడిగారు. నేను వేరే మార్గం నుంచి వచ్చానని వాళ్లకి చెప్పాను. ఆరోజు నేను ఆ దారిలో వచ్చి ఉంటే ఇవాళ నేను జీవించి ఉండేవాడిని కాను" అని తింగాయీ చెప్పారు.
కొద్ది రోజుల క్రితం వరకు ఇక్కడ అంతా క్రిస్మస్ పండుగ సన్నాహాల్లో మునిగి ఉన్నారు. ఎక్కడా చూసినా పండుగ సందడే కనిపించేది.
అందుకు గుర్తుగా, ఓటింగ్ చర్చి పైన మెరిసే నక్షత్రాలు, శాంటా క్లాస్ కటౌట్ కనిపిస్తున్నాయి.
కానీ, హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ఓటింగ్ గ్రామాన్ని విషాదంలో ముంచింది. చనిపోయినవారి కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
తిరులోని బొగ్గు గనిలో పనిచేస్తున్న కవలలు థాపువాంగ్, లాంగ్‌వాంగ్‌లు ఆర్మీ కాల్పులు జరిపిన వాహనంలోనే ఉన్నారు. వారి సోదరుడు నేన్వాంగ్ వికలాంగుడు.
"వారిద్దరి సంపాదనతోనే మా కుటుంబం గడుస్తోంది. అమాయకులైన కూలీలను అన్యాయంగా చంపేశారు. మా అన్నలిద్దరినీ తిరిగి తీసుకు రండి. నాకింకేమీ వద్దు" అంటూ నేన్వాంగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఘటనపై దర్యాప్తు
ఈ ఘటనపై నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, భారత సైన్యం చేపట్టిన ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది.
జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "తిరుగుబాటుదారులను ఎదుర్కునే దిశలో, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని, ఈ సంఘటనను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని" అన్నారు.
నాగాలాండ్ సుదీర్ఘ కాలంగా తీవ్రవాదం, హింస వంటి అంశాలతో సతమతమవుతోంది.
నాగాలాండ్‌లో 1950ల నుంచీ సాయుధ పోరాటం జరుగుతోంది. నాగా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతోంది.
నాగాలాండ్‌కు పొరుగు రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు మియన్మార్‌లో నాగా ప్రజలు అధికంగా నివసిస్తోన్న ప్రాంతాలన్నీ కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు పలు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా భారత సైన్యానికి ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం 'ఏఎఫ్ఎస్‌పీఏ' దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం అంటే?
ఏఎఫ్ఎస్‌పీఏ లేదా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది ఒక వివాదాస్పద చట్టం.
తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా భద్రతా దళాలకు శోధించే, స్వాధీనం చేసుకునే హక్కును ఇస్తుందీ చట్టం.
సైన్యం చేపట్టిన కార్యకలాపాల్లో అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదవశాత్తు సామాన్య పౌరులు చనిపోయినా, సైన్యానికి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం దుర్వినియోగం అవుతోందని, "నకిలీ హత్యలకు" సహకరిస్తోందని విమర్శకులు అంటారు.
మోన్ జిల్లాలో తాజా సంఘటన తరువాత, ఈశాన్య రాష్ట్రాల్లో ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ పెరిగింది.

ఓటింగ్ గ్రామంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మోన్ జిల్లా బీజేపీ నేత హోసియా కొన్యాక్‌తో బీబీసీ సంభాషించింది.
"భద్రతా బలగాలు పౌరుల భద్రత కోసమేనని మాకు తెలుసు. ఈ సెక్యూరిటీ యాక్ట్, దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ పూర్తిగా విఫలమయ్యాయని హోం మంత్రి అమిత్ షాకు చెప్పాలనుకుంటున్నాం. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు" అని ఆయన అన్నారు.
ఈ ఘటన తరువాత, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'హ్యూమన్ రైట్స్ వాచ్' కూడా ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కాగా, బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించాయి.
కానీ, ఏ తప్పూ చేయకుండా తమ ఆత్మీయులను కోల్పోయినవారికి ఇది ఎప్పటికీ తీరని నష్టం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఏడాదికి పైగా సాగిన నిరసనల అనంతరం ఇళ్లకు వెళ్తున్న రైతులు
- అమృత్‌సర్‌లో మొదలైన మా స్నేహం చివరి వరకు కొనసాగింది - కల్నల్ దుర్గాప్రసాద్
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
- విమానం,హెలికాప్టర్లలో ప్రయాణించే ముందు ఆర్మీ అధికారులు పాటించాల్సిన నిబంధనలేంటి?
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా.. ఇమ్రాన్ ఖాన్ తాజా నిర్ణయ ఫలితం ఎలా ఉండనుంది
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?
- జూమ్ కాల్లో ఒకేసారి 900 మందిని ఉద్యోగంలోంచి తీసేసిన బాస్
- విశాఖలో ఈ చిన్నారి విగ్రహాన్ని ముందుకొస్తున్న సముద్రం మింగేస్తుందా? -ఫోటో ఫీచర్
- ‘మహిళలైతే న్యాయం అందించడంలో ముందుంటారు’ - బీబీసీ 100 మంది మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










