నాగాలాండ్ హింస: భద్రతా బలగాలపై ఎఫ్ఐఆర్.. అయిదుగురు సభ్యులతో విచారణ కమిటీ

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

నాగాలాండ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్‌లో సామాన్య పౌరులు మృతి చెందిన కేసును సుమోటాగా తీసుకుని మోన్ జిల్లాలోని తిజిత్ పోలీస్ స్టేషన్‌లో 21వ పారా మిలిటరీ ఫోర్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

"డిసెంబర్ 4న బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు తిరు నుంచి తమ గ్రామం ఓటింగ్‌కు ఒక వాహనంలో తిరిగి వస్తున్నారు. తిరు, ఓటింగ్ మధ్య ఉన్న లాంగ్‌ఖావో గ్రామం వద్దకు చేరుకోగానే ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే భద్రతా బలగాలు వారి వాహనంపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓటింగ్ గ్రామానికి చెందిన పలువురు మృతి చెందారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన సమయంలో పోలీసు గైడ్ లేదు. భద్రతా దళాల ఆపరేషన్‌లో పోలీసు గైడు అందించాలని ఏ పోలీసు స్టేషన్‌లోనూ అడిగిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి, సామాన్య పౌరులను చంపడం, గాయపరచడమే భద్రతా బలగాల ఉద్దేశమని స్పష్టమవుతోంది" అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

శనివారం రాత్రి నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఈ దాడిలో ఎంతమంది పౌరులు మరణించారన్న దానిపై అధికారిక సమాచారం లేదు. కానీ, 11 మంది మరణించినట్లు పీటీఐ పేర్కొంది.

మొత్తం 13 మంది మరణించినట్లు నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ చెబుతున్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు అయిదుగు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దర్యాప్తుకు ఒక నెల సమయం ఇచ్చింది.

Getty Images

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, Getty Images

ఆరోజు ఏం జరిగింది?

శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వారిపై పెట్రోలింగ్‌లో ఉన్న స్థానిక బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

దాంతో, ఆగ్రహం చెందిన స్థానికులు సైన్యంతో ఘర్షణ పడ్డారు. ఇందులో మరికొందరు పౌరులు, ఒక జవాను మృతి చెందారు.

నాగాలాండ్‌లో సైన్యం గత కొన్నేళ్లుగా ఉగ్రవాద సమస్యపై పోరాడుతోంది. అయితే, సైన్యం స్థానికులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు నిర్వహిస్తోందని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.

విచారణ కమిటీ

దీనిపై విచారణ జరిపేందుకు అయిదుగు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీబీసీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పినాకి దాస్ తెలిపారు.

ఏడీజీపీ సందీప్ తమ్‌గాడ్గే పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ జరుపుతుందని, నెల రోజుల్లో విచారణ పూర్తి చేస్తుందని నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

ఐపీఎస్ అధికారులు ఎల్ జమీర్, రూప ఎం., మనోజ్ కుమార్, ఎన్‌పీఎస్ అధికారులు కిలాంగ్ వాలింగ్, రెలో ఆయే ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Ben Anderson

ఫొటో క్యాప్షన్, నాగాలండ్‌లో పలుచోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తూ మృతులకు సంతాపం తెలిపారు

అనేక చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు

ఈ ఘటన తరువాత నాగాలాండ్‌లో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, రాజధాని కోహిమాతో సహా పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శన చేశారని, కోహిమాలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని స్థానిక జర్నలిస్ట్ హెచ్ఏ హోంగ్‌నవో కొన్యాక్ తెలిపారు.

మోన్ జిల్లాలో సెక్షన్ 144 విధించారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి మోన్‌కు అదనపు పోలీసు బలగాలను తరలించారని, ముఖ్యమంత్రితో సహా ఉన్నత స్థాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని కొన్యాక్ వివరించారు.

nagaland

ఫొటో సోర్స్, Getty Images

డిఫెన్స్ వింగ్ ప్రకటన

ఈ ఘటనపై ఆదివారం సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

"మోన్ జిల్లాలోని తిరు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయమైన సమాచారం అందింది. అందుకే తిరు ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించాం. జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. సామాన్య పౌరుల మృతిపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుగుతోంది. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని ఆ ప్రకటనలో తెలిపారు.

శనివారం రాత్రి నుంచి మోన్ జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు, డాటా సర్వీసులు, బల్క్ ఎంఎంఎస్‌లపై నిషేధం విధించారు.

వదంతుల వల్ల శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

నాగాలాండ్ సీఎం రియో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాగాలాండ్ సీఎం రియో

ముఖ్యమంత్రి రియో ఈ ఘటనను ఖండించారు

మోన్ జిల్లాలోని ఓటింగ్‌లో సామాన్య పౌరుల మరణం చాలా బాధాకరమని, దానిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫియు రియో ​​ట్వీట్ చేశారు.

"రిటైర్డ్ న్యాయమూర్తుల అధ్యక్షతన తక్షణమే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ ఘటనకు బాధ్యులైన భద్రతా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ ట్వీట్ చేశారు.

"ఈ ఘటనలో 14 మంది మృతి చెందారని, చాలా మంది గాయపడ్డారని మాకు సమాచారం వచ్చింది. పలువురు గల్లంతైనట్లు సమాచారం. స్పష్టమైన సమాచారం కోసం మేం ఎదురు చూస్తున్నాం" అని ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కెకోంగ్‌చిమ్ యమ్యుంగార్ తెలిపారు.

అసోం రైఫిల్స్‌పై పౌరుల దాడి

ఈ ఘటనలో ఒక జవాను కూడా మృతి చెందారని, పలువురు గాయపడ్డారని అసోం రైఫిల్స్ అధికారి ఒకరు తెలినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

సామాన్య పౌరుల మరణంతో కోపోద్రిక్తులైన గుంపు మోన్‌లో ఉన్న అసోం రైఫిల్స్ పోస్ట్‌పై దాడి చేసిందని బీబీసీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సుచిత్ర మహంతి తెలిపారు.

దాదాపు 300 మందితో కూడిన గుంపు సోమవారం అసోం రైఫిల్స్ పోస్ట్‌పై దాడి చేసింది. గుంపును చెదరగొట్టేందుకు అసోం రైఫిల్స్ సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ దాడిలో అసోం రైఫిల్స్ సిబ్బంది గాయపడ్డారని, ఆస్తినష్టం జరిగిందని అసోం రైఫిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. శాంతిని కాపాడాలని, పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ప్రజలు సహనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.

రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

కాంగ్రెస్ విమర్శలు

మోన్ జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్‌లో సామాన్య ప్రజలు మరణించడంపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

"ఇది హృదయ విదారక సంఘటన, సామాన్య ప్రజలతో పాటు భద్రతా సిబ్బందికీ రక్షణ లేనప్పుడు హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది? ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా కూడా హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు.

"నాగాలాండ్ నుంచి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలి" అని టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

"అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. ఉగ్రవాదులతో రాజీ కుదుర్చుకున్నామన్న మాటలన్నీ మోసం. నవంబర్‌లో మణిపూర్‌లో ఏడుగురు అధికారులను ఉగ్రవాదులు చంపారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి లేదు, హింస మాత్రమే ఉంది" అంటూ ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

'సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చటాన్ని తొలగించాలి '

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ను తొలగించాలని సీఎం రియో సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కొన్ని గంటల తరువాత లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ, "భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని, ఈ సంఘటనను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని" తెలిపారు.

ఇదిలా ఉండగా, నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిన్న సాయంత్రం మోన్ జిల్లాకు చేరుకుని విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)