పరాగ్ అగర్వాల్: సిలికాన్ వ్యాలీలో భారత సంతతి సీఈవోల ఆధిపత్యానికి కారణమేంటి?

పరాగ్ అగర్వాల్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, పరాగ్ అగర్వాల్

ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్‌ను నియమించిన తరువాత సిలికాన్ వ్యాలీలో భారతీయ సీఈవోల సంఖ్య మరింత పెరిగినట్లయింది.

మైక్రోసాఫ్ట్‌కు సత్యనాదెళ్ల, ఆల్ఫబెట్‌కు సుందర్ పిచాయ్‌లు సీఈవోలుగా ఉండగా ఐబీఎం, అడోబ్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్, వీఎం వేర్, విమియో సంస్థలకూ భారత సంతతి సాంకేతిక నిపుణులే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉన్నారు.

అమెరికా జనాభాలో భారత సంతతి ప్రజలు 1 శాతం ఉన్నారు. కానీ, సిలికాన్ వ్యాలీలో పనిచేసే మొత్తం సిబ్బందిలో మాత్రం భారత సంతతికి చెందినవారు 6 శాతం ఉన్నారు.

'ఇండియా తన పౌరులకు సమగ్ర శిక్షణ ఇచ్చినట్లుగా ప్రపంచంలో ఇంకే దేశమూ ఇవ్వలేదు' అని టాటా సన్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ అన్నారు.

'బర్త్ సర్టిఫికేట్ల నుంచి డెత్ సర్టిఫికేట్ల వరకు.. స్కూల్ అడ్మిషన్ నుంచి ఉద్యోగం పొందడం వరకు.. అరకొర వసతుల నుంచి అనేక సమస్యల మధ్య పుట్టి పెరగడమనేది భారతీయులను 'సహజ మేనేజర్లు'గా తయారుచేస్తుంది' అన్న ప్రముఖ భారతీయ కార్పొరేట్ స్ట్రేటజిస్ట్ సీకే ప్రహ్లాద్ మాటలను గోపాలకృష్ణన్ గుర్తుచేశారు.

వీడియో క్యాప్షన్, ట్విటర్ సీఈఓ స్థాయికి పరాగ్ అగర్వాల్ ఎలా చేరుకున్నారు?

పోటీ, అనిశ్చితి పరిస్థితులు వారిని సమస్యా పరిష్కర్తలుగా మార్చుతాయి. అధిక పని సంస్కృతి ఉండే అమెరికా ఆఫీసుల్లో వారు సిబ్బందిని వ్యక్తులుగా కంటే ప్రొఫెషనల్స్‌గా ప్రాధాన్యం ఇవ్వడమనేది వారికి తోడ్పడుతోంది అన్నారు గోపాలకృష్ణన్.

'ప్రపంచంలో ఎక్కడైనా అగ్రశ్రేణి నాయకుల లక్షణాలు ఇవే'' అన్నారు గోపాలకృష్ణన్.

అమెరికాలో సంపన్న, విద్యాధికులైన 40 లక్షల మంది బలమైన మైనారిటీ సమూహంలో భారత సంతతి సిలికాన్ వ్యాలీ సీఈవోలు కూడా భాగం.

వీరిలో సుమారు 10 లక్షల మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు. అమెరికా విదేశీయులకు జారీ చేసే హెచ్1బీ వీసాలలో 70 శాతం భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకే దక్కుతున్నాయి.

సియాటెల్ వంటి నగరాల్లో ఉండే విదేశీ సంతతి ఇంజినీర్లలో 40 శాతం భారతీయులే.

''1960లో అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలో తీసుకొచ్చిన భారీ మార్పుల ఫలితమే ఇది'' అని 'ది అదర్ వన్ పర్సంట్: ఇండియన్స్ ఇన్ అమెరికా' పుస్తక రచయితలు రాశారు.

సత్య నాదెళ్ల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సత్య నాదెళ్ల

పౌర హక్కుల ఉద్యమ అనంతరం దేశాల ప్రాతిపదికన హెచ్1బీ వీసాల కోటా కాకుండా నైపుణ్యాలు, కుటుంబాలు కలుసుకోవడం అనే అంశాల ప్రాతిపదికన ఇచ్చే విధానం మొదలైంది.

దాంతో ఉన్నత విద్యావంతులైన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు తొలుత అమెరికాలో అడుగుపెట్టడం ప్రారంభించారు. ఆ తరువాత సాఫ్ట్‌వేర్ డెవలపర్లు పెద్దసంఖ్యలో వెళ్లారు.

''భారత్ నుంచి వలస వెళ్లినవారిని మరే ఇతర దేశాల నుంచి వెళ్లినవారితో పోల్చలేం'' అని 'ది అదర్ వన్ పర్సంట్: ఇండియన్స్ ఇన్ అమెరికా' పుస్తక రచయితలు చెప్పారు.

అలా అమెరికా వెళ్లినవారిలో... గొప్పగొప్ప కాలేజీలకు వెళ్లి చదువుకోగలిగే ఉన్నత కుటుంబాల వారే కాకుండా అమెరికా వెళ్లి మాస్టర్స్ చేసేందుకు ఆర్థిక వనరులు సమకూర్చుకోగలిగినవారూ ఉన్నారు.

ఆ తరువాత వీసా విధానం మరింతగా మారి ప్రత్యేకమైన నైపుణ్యాలున్నవారికి అవకాశాలు పెరిగాయి.

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(STEM) అనేవి వీసాలకు ప్రాధాన్య రంగాలుగా మారిపోయాయి. అమెరికా హైఎండ్ లేబర్ మార్కెట్ అవసరాలు తీర్చడమే ప్రాతిపదికగా వీసాల జారీ ప్రాథమ్యాలు మారిపోయాయి.

'ఇలా వెళ్లిన నాణ్యమైన మానవ వనరులు అక్కడి సంస్థల్లో చేరుతున్నాయి. అత్యుత్తమ నైపుణ్యాలకు పట్టం కట్టే ఆయా సంస్థలలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు భారతీయులు'' అన్నారు టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యర్ వివేక్ వాధ్వా.

''భారత సంతతి టెక్కీలు సిలికాన్‌ వ్యాలీలో ఏర్పరుచుకున్న నెట్‌వర్క్ కూడా వారికి ఉపయోగపడుతోంది. వారంతా ఒకరికొకరు సహకరించుకుంటారు''

భారత సంతతి సీఈవోలు తాము పనిచేసే కంపెనీలలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగినవారని... దాని వల్ల ఇతర కంపెనీల వ్యవస్థాపక సీఈవోలతో పోల్చినప్పుడు వీరి తీరు భిన్నంగా ఉంటుందని వాధ్వా అన్నారు.

కంపెనీల వ్యవస్థాపక సీఈవోలు విజన్, మేనేజ్‌మెంట్‌ విషయంలో కొంత అహంకార ధోరణితో ఉంటారని.. భారత సంతతి సీఈవోలు అలా ఉండరని చెప్పారు.

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి వారు తమ జాగత్తయిన తీరు, మృదువైన సంస్కృతితో ఆ అత్యున్నత పదవులకు తగినవారిగా నిలిచారని వాధ్వా అభిప్రాయపడ్డారు.

''అమెరికా కాంగ్రెస్‌లో చర్చలు, విదేశీ ప్రభుత్వాలతో వివాదాల నేపథ్యంలో పెద్ద టెక్ సంస్థల ప్రతిష్ట కొంత తగ్గుతూ సిలికాన్ వ్యాలీ సంపన్నులు, ఇతర అమెరికన్ల మధ్య అగాథం పెరుగుతున్న తరుణంలో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటివారు ఆ ఉన్నత స్థానాలకు తగినవారుగా అనిపించారు'' అని వాధ్వా అభిప్రాయపడ్డారు.

'నిరాడంబరమైన, సున్నితమైన' నాయకత్వ లక్షనాలు వారికి అదనపు బలం అని 'బ్లూమ్‌బర్గ్ న్యూస్‌'కు టెక్ ఇండస్ట్రీ వార్తలు రాసే సరితా రాయ్ అన్నారు.

కష్టపడి పనిచేసే తత్వం, నైతిక విలువలు కూడా భారత సంతతి టెకీలు సీఈవోలుగా ఎదగడానికి కారణమని ఇండియన్ అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా అన్నారు.

వీటన్నిటితో పాటు మరికొన్ని కారణాలూ భారతీయులకు అదనపు అర్హతగా పనిచేస్తున్నాయి.

ఇంగ్లిష్ మాట్లాడే సామర్థ్యం ఉంటడం కూడా వారికి అమెరికా టెక్ ఇండస్ట్రీలో మనుగడ సాధించడంలో సాయపడుతోంది.

భారతీయ విద్యావ్యవస్థలో గణితం, సైన్స్‌కు అధిక ప్రాధాన్యం ఉండడం కూడా కలిసొచ్చే అంశం.

''మరో మాటలో చెప్పాలంటే అమెరికాలో భారత సంతతి సీఈవోల విజయం ఆ దేశం ఏది సరైనది అనుకుంటుందనే అంశంతో ముడిపడి ఉంటుంది.. లేదంటే కనీసం, 9/11 తరువాత ఇమిగ్రేషన్ కఠినతరం కావడానికి ముందు కాలంలో భారత్‌కు ఏది సరైనదని అమెరికా అనుకుంటుందనే అంశంతో ముడిపడి ఉంది'' అని ఆర్థికవేత్త రూపా సుబ్రహ్మణ్య 'ఫారిన్ పాలసీ మ్యాగజీన్'లో రాశారు.

సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా గ్రీన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులలో చాలావరకు పెండింగులో ఉండడం.. భారతీయ మార్కెట్‌లోనూ మెరుగైన అవకాశాలు పెరుగుతుండడమనేది విదేశీ ఆకర్షణను తగ్గించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

''ఇండియాలోనే స్టార్టప్ ఏర్పాటు చేయాలన్న కలలు అమెరికా వెళ్లాలన్న కలలను భర్తీ చేస్తున్నాయి'' అని సరితా రాయ్ అన్నారు.

భారత్‌లో 100 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ విలువన్న కంపెనీలు పెరుగుతుండడమనేది మరిన్ని టెక్ కంపెనీలు ఏర్పాటు కానున్నాయనడానికి సూచన అని నిపుణులు చెబుతున్నారు.

అయితే, అంతర్జాతీయ ప్రభావం ఎలా ఉంటుందన్నది అప్పుడే అంచనా వేయలేమనీ నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)