అఫ్గానిస్తాన్: ‘ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ’

- రచయిత, లూసీ మేనింగ్, ఫిల్ కెంప్
- హోదా, బీబీసీ న్యూస్
పది గంటల కారు ప్రయాణం తరువాత ఆ చీకటి చలి రాత్రి బుర్హాన్ వెసల్ కుటుంబం స్కాట్లాండ్‌లోని అబర్డీన్ చేరుకుంది. అక్కడ వారి కొత్త ఇంటి దగ్గర హెల్గా మక్ఫర్లేన్ వారికోసం వేచిచూస్తున్నారు.
''మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది'' అంటూ ఆమె వారిని హత్తుకున్నారు.
ఇక నుంచి వారికది కొత్త ఇల్లు. అఫ్గానిస్తాన్ నుంచి బ్రిటన్‌కు పారిపోయి వచ్చిన వెసల్ కుటుంబానికి జర్మన్ శరణార్థి కుమార్తె చేసిన సహాయ ఫలితమే ఈ ఇల్లు.
ఈ దాతృత్వానికి 75 ఏళ్ల కిందటి మానవీయ నేపథ్యం ఉంది.

ఫొటో సోర్స్, contributor
అఫ్గనిస్తాన్‌లో బ్రిటిష్ సేనలకు బుర్హాన్ వెసల్ దుబాసీగా పనిచేసేవారు. తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తరువాత వెసల్ ప్రాణభయంతో దాక్కున్నారు. తాలిబాన్‌లు తనను, తన కుటుంబాన్ని చంపేస్తారని భయపడ్డారు.
ప్రధానమంత్రి సహాయం కోసం వేడుకున్న ఆయన్ను ఆగస్టులో జూమ్ ద్వారా మేం ఇంటర్వ్యూ చేశాం.
''నాకు, నా కుటుంబానికి భద్రత కల్పించాలని నేను వేడుకుంటున్నాను'' అని వెసల్ అన్నారు.

ఫొటో సోర్స్, contributor
తాలిబాన్ల చేతికి కనుక తాను చిక్కితే వారు ఏమాత్రం కనికరించకుండా చంపేస్తారని వెసల్ అన్నారు.
అప్పటి నుంచి మేం వెసల్‌తో టచ్‌లో ఉన్నాం. గైనకాలజిస్ట్ అయిన తన భార్య నార్సిస్, కుమారుడు సెపెహర్‌లతో కలిసి అఫ్గానిస్తాన్ నుంచి బయటపడడానికి వెసల్ చాలా రిస్క్ చేశారు.
కాబుల్ విమానాశ్రయంలో తలెత్తిన తీవ్ర గందరగోళ పరిస్థితులను భరిస్తూ వారు ఏదోరకంగా ఒక ఆర్ఏఎఫ్ విమానం ఎక్కగలిగారు. వారు అక్కడి నుంచి బయటపడిన మరునాడే కాబుల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.

ఫొటో సోర్స్, contributor
ఆర్ఏఎఫ్ విమానం ఎక్కిన తరువాత తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగిన వెసల్ తన జీవితంలో ఇది అత్యంత సంతోషకర క్షణమంటూ మాకు ఆ ఫొటోను పంపించారు.
వెసల్ కుటుంబం అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన తరువాత ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఒక హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండగా రెండోసారి మేం ఆయన్ను ఇంటర్వ్యూ చేశాం.
అప్పటికి సెపెహర్ ఆ హోటల్ గది కిటికీలోంచి బయటకు చూస్తూ గడపడం... తనతో పాటు అఫ్గానిస్తాన్ నుంచి తెచ్చుకున్న రెండు కారు బొమ్మలతో ఆడుకోవడం తప్ప కొత్త దేశంలో ఇంకేమీ చేయలేని పరిస్థితి.
సురక్షితంగా అఫ్గానిస్తాన్ నుంచి తీసుకొచ్చినందుకు గాను వెసల్.. హెల్మండ్‌లో ఉన్నప్పుడు తన సొంత దేశం కోసం సేవ చేసినట్లే ఇప్పుడు ఈ కొత్త దేశం కోసం సేవ చేస్తానని చెప్పారు.
అఫ్గానిస్తాన్ నుంచి బ్రిటన్ చేరుకున్న మిగతా వేలాదిమంది ప్రజలలాగానే వెసల్ కుటుంబం కూడా గత 100 రోజులుగా హోటల్ గదుల్లోనే ఉంది.

ఫొటో సోర్స్, contributor
ఆ తరువాత సెపెహర్ స్కూలుకు వెళ్లడం ప్రారంభించాడు. కానీ, వారు ఉంటున్న సెంట్రల్ లండన్‌లోని హోటల్ నుంచి మిగతా శరణార్థులతో పాటు క్రాలీలోని మరో హోటల్‌కు తరలించారు. సెపహర్ ప్రస్తుతానికి స్కూలుకు వెళ్లే అవకాశం కోల్పోయాడు.
జనవరి వరకు మళ్లీ స్కూలుకి వెళ్లే పరిస్థితి లేదు.
వెసల్ కుటుంబం సెంట్రల్ లండన్‌లోని హోటల్‌లో ఉంటున్న సమయంలో నాకు ఒక ఈమెయిల్ వచ్చింది.
అబెర్డీన్‌లో ఉండే హెల్గా మక్ఫర్లీన్ ఆ మెయిల్ పంపించారు. ''మీ కథనం నన్ను కదిలించివేసింది. మా అమ్మ ఒక సెలిసియన్ శరణార్థి. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలకు ఆమె ఇంటర్‌ప్రెటర్‌గా పనిచేశారు''
''నేను వెసల్‌ను సంప్రదించాను. ఇక్కడ కొత్త ఇల్లు ఇస్తాను ఆ కుటుంబానికి. మీరు రాసిన కథనంలో వారి దుర్దశను వివరించడంతో వారికి ఏదైనా సాయం చేయాలని అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ కుటుంబం ఇక్కడ కొత్త జీవితం ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను'' అని రాశారామె.
ఆ తరువాత మక్ఫర్లీన్.. జర్మనీ నుంచి తన తల్లి బ్రిటన్ వచ్చినప్పుడు దారి పొడవునా ప్రజలు ఆమెను రక్షించడానికి, ఆహారం అందించడానికి సహాయం చేశారని.. బ్రిటిష్ రెడ్ క్రాస్ సహాయంతో ఆమె బ్రిటన్ చేరుకోగలిగారని.. అందరి కరుణ వల్లే తమ కుటుంబం బ్రిటన్ చేరుకుని ఇక్కడ కొత్త జీవితం ప్రారంభించిందని ఆమె చెప్పారు.
''మా అమ్మ, మా కుటుంబం ఇతరుల నుంచి పొందిన సహాయం, మానవతకు కృతజ్ఞతగా నేను ఇంకో కుటుంబానికి ఈ సాయం చేస్తున్నాను'' అన్నారు మక్ఫర్లీన్.

ఫొటో సోర్స్, contributor
తాము ముందెన్నడూ చూడని ఒక మహిళ తమకు ఇల్లు ఇవ్వడం, అబర్డీన్ కౌన్సిల్ కూడా అండగా ఉంటూ తమ కుమారుడి స్కూలు కోసం సాయం చేయడంపై వెసల్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది.
కానీ, ఇదంతా సులభంగా జరగలేదు.
వెసల్ కుటుంబం పీటర్‌బరోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
దీంతో వెసల్ కుటుంబం తరఫున అధికారులతో పోరాడాలని మక్ఫర్లీన్ నిర్ణయించుకున్నారు. మక్ఫర్లీన్ పార్కిన్సన్ వ్యాధి కారణంగా మంచానికే పరిమితమైనప్పటికీ వెసల్ కుటుంబం కోసం పోరాడాలని ఆమె నిశ్చయించుకున్నారు.
స్థానిక ఎంపీ సహాయంతో ఆమె వారి కోసం ప్రయత్నాలు చేశారు. దాంతో పీటర్‌బరోకి తరలించిన కొద్ది నిమిషాల్లోనే పొరపాటు జరిగిందంటూ వెసల్ కుటుంబాన్ని మళ్లీ సెంట్రల్ లండన్‌లోని హోటల్‌కి వెళ్లాలని అధికారులు సూచించారు.
మొన్న సోమవారం హోం శాఖ అధికారులు చివరకు వారిని అబర్డీన్ వెళ్లేందుకు అనుమతించారు.

ఫొటో సోర్స్, contributor
దాంతో వెసల్ కుటుంబం రెండు మూడు బ్యాగులు... కొడుకు ఆడుకునే స్కూటర్‌తో అబర్డీన్ చేరుకున్నారు. ఆ స్కూటర్ కూడా లండన్‌లోనే స్థానికులెవరో వారికి ఇచ్చారు.
దీంతో ఈ అఫ్గానిస్తాన్ కుటుంబం ఇక స్కాటిష్ కుటుంబం కానుంది.
'మీ కొత్త ఇంటికి స్వాగతం'' అంటూ మక్ఫర్లీన్ వారిని ఆహ్వానిస్తూ సెపెహర్‌కు తన గదిని చూపించారు. ఆ గదిలోని పరుపు మొత్తం బొమ్మలతో సెపహర్ కోసం సిద్ధం చేశారు.
ఫ్లాటంతా తిరుగుతూ నార్సిస్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఫొటో సోర్స్, contributor
కెరీర్‌ను, బంధువులను వదులుకుని కొత్త దేశానికి వచ్చి మూడు నెలల్లో మూడు హోటల్‌లు మారిన నార్సిస్ చివరకు ఈ కొత్త ఇంట్లో స్థిరపడ్డారు.
అక్కడి వంట గదిలో కొన్ని స్కాటిష్ వంటకాలు, టీ కేక్స్ వంటివన్నీ మక్ఫర్లీన్ సిద్ధంగా ఉంచారు.
మక్ఫర్లీన్ చేసిన ఈ సాయంతో వెసల్ కుటుంబానికి మాటలు రాలేదు. ''మీ ఉదారత, దయార్ద్ర హృదయాన్ని మేం ఎన్నటికీ మర్చిపోలేం'' అన్నారు వారు.
ఈ ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారనడానికి మీరే ఉదాహరణ'' అంటూ వారు మక్ఫర్లీన్‌ను కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.
''ఇప్పుడు మీరు మా కుటుంబంలో ఒక భాగం'' అంటూ మక్ఫర్లీన్ వారికి మరింత భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఈ దేశం ఎప్పుడు మునిగిపోతుందో చెప్పలేం...
- ఒమిక్రాన్: కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసిన బైడెన్
- యూపీఏ లాంటిదేమీ లేదని మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? ఆమె ఉద్దేశ్యం ఏంటి?
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














