అఫ్గానిస్తాన్: తాలిబాన్‌ల పాలన మొదలయ్యాక ప్రజలు బ్యాంకుల్లో డబ్బు మొత్తం విత్‌డ్రా చేసుకుంటున్నారు

ఫొటో సోర్స్, WAKIL KOHSAR/AFP
- రచయిత, కరిష్మా వాస్వానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ దాదాపు పతనం అంచున ఉందని ఆ దేశంలో అతిపెద్ద బ్యాంక్ చీఫ్ ‘బీబీసీ’తో అన్నారు.
"వినియోగదారుల అసహనంతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిత్వం సంక్షోభం గుప్పిట్లో చిక్కుకుంది" అని ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ సీఈఓ సయ్యద్ మూసా అల్ ఫలాహీ చెప్పారు.
"ప్రస్తుతం జనం భారీ సంఖ్యలో డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు" అని ఆయన చెప్పారు.
కాబుల్‌లో తాలిబాన్లు ప్రవేశించిన తరువాత ఫలాహీ దుబాయి వెళ్లిపోయారు.
"ప్రస్తుతం డబ్బులు విత్ డ్రా మాత్రమే కొనసాగుతోంది. ఎక్కువ బ్యాంకులు పనిచేయడం లేదు. మొత్తం సేవలు అందించలేకపోతున్నాయి" అన్నారు.
ఆగస్టులో తాలిబాన్లు నియంత్రణ తర్వాత నుంచి అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా మారింది.

ఫొటో సోర్స్, Iba
విదేశీ సాయం కోసం ఎదురుచూపులు
అఫ్గానిస్తాన్‌లో ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా విదేశీ ఆర్థిక సాయంపైనే ఆధారపడ్డాయి. ప్రపంచ బ్యాంక్ వివరాల ప్రకారం ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 40 శాతం అంతర్జాతీయ సాయం ద్వారానే వస్తుంది.
తాలిబాన్ల ఆక్రమణ తర్వాత పశ్చిమ దేశాలు అఫ్గానిస్తాన్‌కు అంతర్జాతీయ నిధులను ఆపేశాయి. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) దగ్గర ప్రస్తుతం అఫ్గానిస్తాన్ ఆస్తులు ఉన్నాయి.
దాంతో, తాలిబాన్లు ఇప్పుడు ఆర్థిక సాయం కోసం మిగతా వనరుల వైపు చూడాల్సి వస్తోందని అల్ ఫలాహీ చెప్పారు.
"అఫ్గానిస్తాన్ ఇప్పుడు చైనా, రష్యా, పలు ఇతర దేశాలవైపు చూస్తోంది. ఇప్పుడో లేదా తర్వాతో వారి చర్చలు సఫలమవుతాయి" అని ఆయన చెప్పారు.
అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణానికి, తాలిబాన్లతో కలిసి పని చేయడానికి చైనా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది.
చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తన ఇటీవల ఒక వ్యాసంలో "అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఇందులో చైనా కచ్చితంగా ఒక ప్రముఖ పాత్ర పోషించవచ్చు" అని చెప్పింది.

ఫొటో సోర్స్, BULENT KILIC/AFP
5 శాతం ఇళ్లలో మాత్రమే కడుపు నిండుతోంది
అఫ్గానిస్తాన్‌లో ఆర్థిక సమస్యలపై తాలిబాన్లు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. దేశ కరెన్సీ అఫ్గానీ విలువ వేగంగా పడిపోతోంది. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. లేదంటే నగదు కొరత తీవ్రంగా ఉంది.
అఫ్గానిస్తాన్‌లో కేవలం 5 శాతం ఇళ్లలో మాత్రమే రోజూ తినడానికి ఆహారం అందుబాటులో ఉందని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చెబుతోంది.
ఈ సర్వేలో పాల్గొన్న సగం కుటుంబాలు గత రెండు వారాలుగా తమ ఇంట్లో కనీసం ఒకసారి ఆహారం కొరత ఎదుర్కొన్నట్లు చెప్పారు.
అందుకే, అఫ్గానిస్తాన్ మనుగడకు అంతర్జాతీయ సాయం, విదేశీ సాయం చాలా అవసరం. కానీ తమ కొన్ని షరతులు నెరవేరుతున్నట్లు కనిపించినప్పుడే తాము తాలిబాన్లతో కలిసి పనిచేయడంపై ఒక నిర్ణయానికి వస్తామని అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే చెప్పాయి. వీటిలో మహిళలు, మైనారిటీలతో తాలిబాన్లు వ్యవహరిస్తున్న తీరు కూడా ఒకటి.

ఫొటో సోర్స్, Reuters
ఇమ్రాన్ ఖాన్ ప్రకటన
"మహిళలకు తిరిగి విధుల్లోకి రావడానికి కొంత కాలం అనుమతి ఉండదని తాలిబాన్లు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మా బ్యాంకులో మహిళలు మళ్లీ విధులకు వస్తున్నారు" అని అల్ ఫలాహీ చెప్పారు.
"అఫ్గానిస్తాన్‌లో మహిళా ఉద్యోగుల్లో భయం ఉండడంతో వాళ్లు ఆఫీసులకు రాలేదు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు" అన్నారు.
అల్ ఫలాహీ చెబుతున్న విషయాలన్నీ ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనలాగే అనిపిస్తున్నాయి.
"గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాలిబాన్లు ఎలా ప్రవర్తించారనేదితో పోలిస్తే, ఇప్పుడు తాము మరింత ఆధునికంగా ఉన్నామని, మారామని ప్రపంచానికి చూపించడానికి వారు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు" అని ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
"ప్రస్తుతం వారు చాలా సౌమ్యంగా, మరింత సహకారం అందిస్తున్నారు. ప్రసుత సమయంలో వారు అత్యంత కఠినమైన నియమ నిబంధనలను అమలు చేయడం లేదు" అన్నారు.
అయితే తాలిబాన్లు మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని మహిళలు, మానవ హక్కులకు సంబంధించిన సంస్థలు అంటున్నాయి.
తాలిబాన్లు దేశంలో మహిళలు, బాలికలను ఉద్యోగాలకు, స్కూళ్లకు వెళ్లకుండా ఆపేసినట్లు క్షేత్ర స్థాయిలో అందుతున్న రిపోర్టులను బట్టి తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










