Earth Day 2023: ఈ దేశం పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోతుందా?

టువాలు దేశ విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, న్యాయశాఖ మంత్రి సిమోన్ కోఫె

ఫొటో సోర్స్, TUVALU FOREIGN MINISTRY

ఫొటో క్యాప్షన్, టువాలు దేశ విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, న్యాయశాఖ మంత్రి సిమోన్ కోఫె

ఒక్క క్షణం ఆగి మీ ఇళ్ల గురించి ఆలోచించండి. మీ మూలాల గురించి ఆలోచించండి. ప్రపంచంలో మీరు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం గురించి ఒకసారి ఆలోచించండి.

ఒకవేళ మీకు అత్యంత ప్రియమైన ప్రాంతం, ఈ భూమి నుంచి మాయమైపోతే?

అలా ఊహించుకోవడం కూడా ఎంతో బాధగా ఉంది కదా!

కానీ, భూమిపై ఉన్న డజన్ల కొద్దీ ద్వీపాలకు ఈ భయం అనేది కేవలం ఊహ కాదు. రాబోయే కాలంలో ఇదే జరుగనున్న వాస్తవం.

వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరగడంతో ఇప్పటికే ఈ ద్వీపాలు తమ భూభాగాన్ని కోల్పోతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ నివసించే ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

వీడియో క్యాప్షన్, పర్యావరణాన్ని బాగు చేసే చిట్కాలు చెబుతున్న బామ్మలు

పసిఫిక్ మహాసముద్రంలో చిన్న ద్వీప దేశం 'టువాలు' ప్రస్తుత పరిస్థితి గురించి బీబీసీ ముండో అధ్యయనం చేసింది.

వాతావరణ మార్పు వల్ల ప్రభావితం అయిన ద్వీప దేశాల్లో టువాలు కూడా ఒకటి.

గ్రీస్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకునేందుకు కృషి చేయాలని ప్రపంచంలో అత్యధిక కాలుష్యానికి కేంద్రాలుగా ఉన్న దేశాలను ఈ ద్వీప దేశం అభ్యర్థిస్తోంది.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

మిగతా దేశాలను కోరడంతో పాటు, తాము ఎదుర్కోబోయే దారుణ సమయాలను ఎదుర్కోవడానికి కూడా ఈ దేశం సన్నద్ధమవుతోంది. ఈ దేశం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, ఎప్పుడు అది నీటిలో పూర్తిగా మునిగిపోతుందో చెప్పలేం.

వాతావరణ మార్పులను ఉద్దేశించి జరిగిన కాప్-26 సదస్సుకు తువాలు దేశ విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, న్యాయశాఖ మంత్రి సిమోన్ కోఫె ఉద్వేగపూరిత సందేశాన్ని పంపించారు.

వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సంక్షోభాల గురించి చర్చించడానికి, వాటికి తగిన పరిష్కారం వెతికేందుకు గ్లాస్గో, స్కాట్లాండ్ వేదికగా జరిగిన ఈ కాప్-26 సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు పాల్గొన్నారు.

''మేం మునిగిపోతున్నాం. కానీ, అందరికీ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది'' అని సిమోన్ వ్యాఖ్యానించారు.

తన సందేశం వెలువరించే సమయంలో సిమోన్, మోకాలి లోతు నీటిలో నిల్చున్నారు. ఆయన నిల్చున్న ప్రాంతం ఒకప్పుడు పొడిగా ఉండేది. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు అది నీటిలో మునిగిపోయింది.

''వాతావరణ సంక్షోభాల వల్ల కలిగే భయంకరమైన పరిణామాలకు ప్రస్తుత టువాలు పరిస్థితి అద్దం పడుతోంది. ఈరోజు టువాలు ఉన్న స్థితికి వాతావరణ మార్పులే కారణం. రానున్న కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి'' అని సిమోన్ పేర్కొన్నారు.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

సముద్ర మట్టాల పెరుగుదలతో ముంచుకొస్తున్న ప్రమాదం

టువాలు దేశంలో తొమ్మిది చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, హవాయిలకు ఇది 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కిరీబాతీ, సమోవా, ఫిజీ దేశాలు దీనికి పొరుగునే ఉన్నాయి.

టువాలు, సముద్రతలానికి మరీ అంత ఎక్కువ ఎత్తులో ఏమీ లేదని, ఇక్కడి అత్యంత ఎత్తయిన ప్రాంతం సముద్ర మట్టానికి 4 మీటర్ల ఎత్తులో ఉందని బీబీసీ ముండోతో సిమోన్ చెప్పారు.

26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 12,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.

కిరీబాతి, మాల్దీవులు, ఇతర ద్వీపాల్లాగే తువాలు కూడా పగడపు దిబ్బలతో ఏర్పడింది. అందువల్లే ఇది గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

తాము నివసించే ప్రాంతంలో భూమి తక్కువ ఎత్తులో ఉందని, ఇంకా కొన్ని ప్రాంతాల్లోనైతే ఇరువైపులా సముద్రాన్ని చూడవచ్చని చెప్పారు. ఒక వైపు సముద్రం ఉంటే మరోవైపు నీటి మడుగులు ఉంటాయని ఆయన బీబీసీ ముండోతో అన్నారు.

''సముద్రమట్టాలు పెరిగిన కొద్దీ తీరప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇలా జరగడం మేం చూస్తున్నాం.''

''కొంత కాలంగా టువాలులో తీవ్ర తుపానులతో పాటు కరువు కూడా ఏర్పడుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో పగడపు దిబ్బలు కూడా నాశనం అవుతున్నాయి. తీరప్రాంత పరిరక్షణకు, చేపల పెంపకానికి ఇవి చాలా ముఖ్యమైనవి'' అని సిమోన్ అన్నారు.

కానీ, ఇదొక్కటే సమస్య కాదు.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

తాగునీటిపై ప్రభావం

కొన్నిచోట్ల సముద్రపు నీరు భూగర్భంలోకి ఇంకిపోతుందని, దీనివల్ల జలవనరులు దెబ్బతింటున్నాయని సిమోన్ వెల్లడించారు.

''సాధారణంగా మేం తాగునీటి కోసం వర్షంపైనే ఆధారపడతాం. కొన్ని ద్వీపాల్లో మాత్రం బావులను ఉపయోగిస్తారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీరు భూగర్భంలో ఇంకిపోతోంది. దీనివల్ల భూగర్భజలాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. తాగునీటి కోసం పూర్తిగా వర్షం పైనే ఆధారపడాల్సి వస్తోంది'' అని సిమోన్ తెలిపారు.

ఉప్పునీటి కారణంగా వ్యవసాయం కూడా ప్రభావితమైంది. సాగు భూమి కాస్త నిరుపయోగంగా మారింది.

టువాలులోని పరిమిత పరిస్థితుల్లో ఆహారోత్పత్తి కోసం, పైలట్ ప్రాజెక్టు కింద తైవాన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందంటే ఇక్కడి తీవ్రతను అంచనా వేయవచ్చు.

''నీటిలో లవణం స్థాయిల కారణంగా ఆహార పంటలు పండించడం కష్టంగా మారింది. దాంతో, ఆహారధాన్యాల దిగుబడులు క్రమంగా పెరుగుతున్నాయి'' అని కోఫె అన్నారు.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

ద్వీప దేశాల సంఘర్షణ

టువాలు వంటి ద్వీప దేశాలు, 30 ఏళ్లకు పైగా వాతావరణ మార్పుల నియంత్రణకు చేయాల్సిన కృషి గురించి ప్రపంచదేశాలకు పిలుపునిస్తున్నాయి.

1990లో ఆంటిగ్వా, బార్బుడా, మాల్దీవులతో పసిఫిక్ ద్వీప దేశాలు దౌత్యపరమైన కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. వాతావరణ మార్పులపై ఉమ్మడి ఫ్రంట్‌ను తయారు చేయడమే ఈ కూటమి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.

ఈ కూటమిలో ఇప్పుడు 39 సభ్య దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తెరపైకి తీసుకురావడంలో ఈ కూటమి ముఖ్యమైన పాత్రను పోషించింది.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

శాస్త్రవేత్తలు ఏం అంటున్నారు?

యునైటెడ్ నేషన్స్ ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆగస్టు 9న వాతావరణ మార్పులపై సమర్పించిన నివేదికలో, ప్రతీ ఏటా సముద్ర మట్టాలు పెరిగే రేటు 1901 నుంచి 2018 నాటికి మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏడాదికి 3.3 మి.మీ చొప్పున సముద్ర మట్టాలు పెరుగుతున్నట్లు చెప్పారు.

మానవ నాగరికతకు రెడ్ అలర్ట్

'పసిఫిక్ దీవుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది' అని వాతావరణ మార్పుల నిపుణులు, చిన్న ద్వీపాలపై చేసిన పరిశోధన 'ఐపీసీసీ' నివేదిక రచయిత డాక్టర్ మోర్గాన్ వైరియు చెప్పారు.

''దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో 1900 నుంచి 2018 నాటికి సముద్రమట్టాల సగటు పెరుగుదల 5 నుంచి 11 మి.మీ మధ్య నమోదైంది'' అని ఆయన వెల్లడించారు.

అయితే, టువాలు దేశానికి సంబంధించి ప్రత్యేకమైన డేటా ఏదీ అందుబాటులో లేదు.

ఒకవేళ సముద్రమట్టంలో ఒక మీటర్ పెరుగుదల వచ్చినా... అది తీర ప్రాంతాల్లో జీవవైవిధ్యాన్ని నేరుగా ప్రభావితం చేయడంతో పాటు పరోక్షంగా అనేక అంశాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఉద్గారాల స్థాయి ఇలాగే ఎక్కువగా ఉంటే, 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సగటు సముద్రమట్టాలు 1 మీటర్ కంటే ఎక్కువ పెరిగే అవకాశముందని ఐపీసీసీ తన నివేదికలో పేర్కొంది. ఈ ఉద్గారాలను కట్టడి చేయకపోతే, 2150 నాటికి సముద్ర మట్టాలు అత్యధికంగా 5 మీటర్లు పెరుగుతాయని హెచ్చరించింది.

తువాలు దేశం

ఫొటో సోర్స్, Getty Images

ఇతర అవకాశాలపై దృష్టి

వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం తలెత్తుతోన్న పరిస్థితులను తప్పించుకోలేం. అలాగే వీటి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అందుకే టువాలు దేశ ప్రజలు తమ భవిష్యత్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

''ఇది మరింత దారుణంగా తయారు కానుంది. మేం మా ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. మా దీవులన్నీ సముద్రంలో మునిగిపోతున్నాయి.''

''అంతర్జాతీయ నియమ నిబంధనలు, మా లాంటి దేశాలకు అనుకూలంగా లేవు. వాతావరణ మార్పుల కారణంగా ఒక దేశం అదృశ్యమైనట్లు ఇప్పటి వరకు చూడలేదు'' అని బీబీసీ ముండోతో కోఫె అన్నారు.

తమ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు పొందడం కోసం టువాలు చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఒకవేళ భవిష్యత్‌లో దేశం కనిపించకుండాపోయినా, రికార్డుల్లో అయినా ఒక దేశంగా మిగిలిపోవాలని భావిస్తోంది.

''మేం చాలా మార్గాల కోసం అన్వేషిస్తున్నాం'' అని కోఫీ చెప్పారు.

''ఒకవేళ మా దేశం సముద్రంలో మునిగిపోతే, మాకు సహాయం చేయడానికి ఇతర దేశాలు ముందుకు వచ్చాయి'' కోఫీ అన్నారు.

''ఒకవేళ మా దేశం మునిగిపోతే, మేం ఏ దేశానికి వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దీని వెనక కారణమేంటంటే, మేం ఇలా ఇతర దేశాలకు బదిలీ కావడాన్ని మిగతావారు ఒక సాకుగా ఉపయోగించుకోవచ్చు. మాకు ఆశ్రయం ఇస్తున్నందున, పెద్ద దేశాలు గ్రీన్ హౌస్ ఉద్గారాలను వదలడం కొనసాగిస్తూనే ఉంటాయి.''

''వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడటం అనేది మా చివరి అవకాశం'' అని కోఫీ చెప్పుకొచ్చారు.

తువాలు దేశం

ఫొటో సోర్స్, TUVALU FOREIGN MINISTRY

పరిహారం కోసం న్యాయపోరాటం

అభివృద్ధి చెందుతోన్న దేశాల తరహాలోనే తమకు కూడా పరిహారం దక్కాలని టువాలు భావిస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల కారణంగానే వాతావరణ మార్పులు తీవ్రస్థాయికి చేరాయని, ఆ దేశాల కారణంగా తాము ఇబ్బందుల పాలవుతున్నట్లు ఆరోపిస్తున్న అభివృద్ధి చెందుతోన్న దేశాలు.. ఈమేరకు తమకు పరిహారం కావాలని డిమాండ్ చేస్తున్నాయి.

టువాలు కూడా ఇదే రీతిన పరిహారాన్ని ఆశిస్తోంది.

ఆంటిగ్వా, బార్బుడా ప్రభుత్వాలతో కలిసి టువాలు కూడా ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్ ద్వారా సముద్ర చట్టాల కోసం అంతర్జాతీయ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాలని అనుకుంటున్నట్లు కోఫె చెప్పారు.

జర్మనీలోని హామ్‌బర్గ్‌లో సముద్ర చట్టాల అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉంది. ఇది 1982 ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌ ప్రకారం సముద్ర చట్టాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది.

యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు 167 ఇతర దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. ఇందులో అమెరికా ప్రాతినిధ్యం లేదు. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను అధికంగా వెలువరించే చైనా, భారత్ ‌లాంటి దేశాలు కూడా ఈ ఒప్పందానికి సమ్మతిని తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)