కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో

ఫొటో సోర్స్, Getty Images
కరోనా కొత్త వేరియంట్‌ను 'ఆందోళనకరం'గా ఉందంటూ దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 'ఒమిక్రాన్' అని పేరు పెట్టింది.
ఈ కొత్త వేరియంట్‌కు పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్ ఉన్నాయని, దీనివల్ల రీఇన్‌ఫెక్షన్ ప్రమాదం పెరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
నవంబర్ 24న మొదటిసారిగా దక్షిణాఫ్రికా ఈ కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్‌వోకు తెలిపింది. అనంతరం బోత్సువానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో కూడా దీన్ని గుర్తించారు.
దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాలని లేదా పరిమితం చేయాలని పలు దేశాలు నిర్ణయించుకున్నాయి.
దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, బోత్సువానా, లెసెతో, ఈశ్వతిని దేశాల ప్రయాణీకులపై యూకే పరిమితులు విధించింది. ఆయా దేశాల నుంచి వచ్చేవారు యూకే లేదా ఐరీష్ జాతీయులు, యూకే నివాసితులు అయితేనే యూకేలో అడుగుపెట్టగలరు. మిగతావారికి యూకేలో ప్రవేశం లేదు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధికారులు కూడా దక్షిణాఫ్రికా, బోత్సువానా, జింబాబ్వే, నమీబియా, లెసెతో, ఈశ్వతిని, మొజాంబిక్, మాలావి దేశాల నుంచి విమానాలను నిషేధిస్తామని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
వైరస్ కాలక్రమేణా మారడం లేదా పరివర్తనం చెందడం అనేది అసాధారణం కాదు. కానీ ఆ పరివర్తనం అనేది వైరస్ వ్యాప్తి, తీవ్రత, వ్యాక్సీన్ల సమర్థత వంటి అంశాలపై ప్రభావం చూపినప్పుడు ఆ వేరియంట్‌ను ఆందోళనకరంగా పరిగణిస్తారు.
'చెడు వార్తే- కానీ లోక వినాశకరం కాదు'
దక్షిణాఫ్రికాకు చెందిన దాదాపు అన్ని ప్రావిన్సులలో ఈ కొత్త రకం వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోందని శుక్రవారం డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్ అని పేరు పెట్టక ముందు ఈ వేరియంట్‌ను బి.1.1.529గా పిలిచారు.
''ఈ వేరియంట్‌కు పెద్దసంఖ్యలో మ్యుటేషన్లు ఉంటాయి. అందులో కొన్ని ఆందోళన కలిగించేవి'' అని ఐక్యరాజ్యసమితి పబ్లిక్ హెల్త్ బాడీ ఒక ప్రకటనలో చెప్పింది.
''నవంబర్ 9న సేకరించిన ఒక నమూనా నుంచి తొలిసారిగా బి.1.1.529 ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించారు'' అని పేర్కొంది.
ఈ కొత్త వేరియంట్ చూపించే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. దీని వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పనిచేశారని వెల్లడించింది.
కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేయడంలో వ్యాక్సీన్లు కచ్చితంగా తక్కువ ప్రభావాన్నే చూపిస్తాయని యూకేలోని ప్రముఖ వైద్యాధికారి ఒకరు హెచ్చరించారు.
''ఇది చెడ్డ వార్తే, కానీ ఇక్కడితోనే ప్రపంచం అంతం అవ్వదు'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్ట్రక్చరల్ బయాలజిస్ట్, ప్రొఫెసర్ జేమ్స్ నైస్మిత్ అన్నారు.
''ఈ వేరియంట్ మరింత త్వరగా వ్యాప్తి చెందవచ్చునని అందులోని మ్యుటేషన్లు సూచించాయి. కానీ ట్రాన్స్‌మిసిబిలిటీ అనేది అంత సులభం కాదు. మ్యుటేషన్లు కలిసి ఎలా పనిచేస్తాయనే దానిపై పరిశోధించడం ద్వారా ఇది తెలిసింది'' అని ఆయన చెప్పారు.
ఒకవేళ ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందాలంటే, అది యూకే చేరడం అనివార్యం అని ప్రొఫెసర్ నైస్మిత్ పేర్కొన్నారు.
అమెరికా అంటురోగాల ఆసుపత్రి చీఫ్ ఆంథొనీ ఫౌసీ మాట్లాడుతూ, ''కొత్త వేరియంట్ నివేదికలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కానీ, తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా వ్యాక్సీన్లు ప్రభావం చూపుతాయి'' అని అన్నారు.
''ఈ కొత్త వేరియంట్‌ను సరిగ్గా పరీక్షించేంతవరకు... వైరస్ నుంచి మనల్ని కాపాడే యాంటీబాడీలను, ఇది నాశనం చేస్తుందా లేదా అనే విషయం మనకు తెలియదు'' అని ఫౌసీ పేర్కొన్నారు.
కొత్త వేరియంట్‌కు భయపడి ముందస్తుగానే ప్రయాణ ఆంక్షలు విధిస్తోన్న దేశాలను డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. 'ప్రమాద స్థాయిని అంచనా వేసి, శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలని ఆయా దేశాలకు సూచించింది.
యూకేతో పాటు యూఎస్, ఈయూ దేశాలు, స్విట్జర్లాండ్ తదితర దేశాలు, దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాలకు విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశాయి.
''యూరప్‌లో ఉన్న మనమంతా తొందరగా, నిర్ణయాత్మకంగా, ఐక్యంగా కలిసి వ్యవహరించడం ఇప్పుడు చాలా ముఖ్యం'' అని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియెన్ పేర్కొన్నారు.
''బెల్జియంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించాక ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో, 27 ఈయూ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య అధికారులందరూ ఆంక్షలు విధించేందుకు ఆమోదించారు'' అని యూరోపియన్ కమిషన్ అధికార ప్రతినిధి ఎరిక్ మామెర్ చెప్పారు.
సదరన్ ఆఫ్రికాకు చెందిన ప్రయాణీకులంతా తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ పాటించాలని, ఆ సమయంలో నాలుగుసార్లు కరోనా పరీక్షలకు హాజరవ్వాలని శనివారం జపాన్ ప్రకటించింది.
దక్షిణాఫ్రికా, బోత్సువానా,హాంకాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణీకులకు చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని భారత్ ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది.
దక్షిణాఫ్రికాతో పాటు మరో ఆరు సదరన్ ఆఫ్రికా దేశాల ప్రయాణీకులపై నిషేధం విధిస్తామని ఇరాన్ వెల్లడించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ఇరానియన్లను కూడా పరీక్షించి, వారికి రెండుసార్లు నెగెటివ్ ఫలితం వస్తేనే దేశంలోకి అనుమతిస్తామని ఇరాన్‌కు చెందిన ఒక టీవీ చానెల్ పేర్కొంది.
''విమానాలపై నిషేధం అనేది సరైన చర్య కాదు'' అని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో పాలా చెప్పారు.
''ప్రయాణ ఆంక్షలు విధించడానికి సంబంధించి కొన్ని దేశాలు తీసుకుంటోన్న చర్యలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశనం చేసిన ప్రమాణాలకు, నియమాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి'' అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తమ దేశంపై ప్రయాణ ఆంక్షలు విధించడం పరిణతి లేని చర్య అని దక్షిణాఫ్రికా మెడికల్ వైద్య సంఘం చైర్ పర్సన్ ఏంజెలిక్ కోట్జీ, బీబీసీతో అన్నారు.
'' ప్రస్తుతానికైతే ఇది ఒక టీ కప్పులో తుపాను వంటిది'' అని ఆమె ఉదహరించారు.
కరోనా భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి.
యూకేలోని ఎఫ్టీఎస్ఈ 100 ఇండెక్స్ షేర్లు 3.7 శాతం పడిపోగా... జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లోని కీలక మార్కెట్లు నష్టాల్ని చవిచూశాయి.
జేమ్స్ గలాగర్ విశ్లేషణ, హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్
'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అత్యధిక ఆందోళన కలిగించే కరోనా వేరియంట్ల కేటగిరీలో టాప్ స్థానంలో ఉంది.
తాజా నిర్ణయాలు, కొత్త వేరియంట్ కారణంగా పుట్టుకొస్తున్న శాస్త్రీయ ఆందోళనలకు మరింత బలం చేకూర్చుతాయి. అంతేగానీ వాస్తవాలను మార్చలేవు.
కొత్త వేరియంట్ పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లను కలిగి ఉంది. అందులో కొన్ని మ్యుటేషన్లు, వ్యాక్సిన్ రక్షణను దాటి వైరస్ వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని పెంచుతాయని భావిస్తున్నారు.
ఇది భావనే తప్ప, దీనిపై స్పష్టమైన డేటా ఇప్పటికైతే ఏం లేదు.
ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందా? వ్యాక్సిన్లు, ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుందా? తీవ్రమైన అనారోగ్యాలకు ఇది కారణమవుతుందా అనే అంశాల గురించి కచ్చితంగా ఎవరికీ తెలియదు.
డబ్ల్యూహెచ్‌వో కూడా దీనికి ఒక పేరు పెట్టి వదిలేసింది.
కానీ, రాబోయే కాలంలో ఒమిక్రాన్ గురించి చాలా చర్చలు జరగనున్నాయని మాత్రం హామీ ఇవ్వగలను.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పు రూ. 1,10,010 కోట్లు - ప్రెస్ రివ్యూ
- చైనీస్ ఫుడ్: '8,000 రెస్టారెంట్లలో ఆహారం రుచి చూశాక నాకు తెలిసిందేంటంటే...'
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














