కోవిడ్‌తో యూరప్‌లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ -Newsreel

యూరప్ కరోనా

ఫొటో సోర్స్, Reuters

కరోనా వల్ల యూరప్‌లో వచ్చే మార్చి నాటికి మరో 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

యూరప్‌లోని 53 దేశాల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఇప్పటికే 15 లక్షలు దాటింది.

2022 మార్చి నాటికి 49 దేశాల్లోని ఆస్పత్రుల్లో ఐసీయూ యూనిట్లపై తీవ్ర ఒత్తిడి పడవచ్చని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

యూరప్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్ట్రియా మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసింది. మరికొన్ని దేశాలు కూడా కరోనా కట్టడి చర్యలకు సిద్ధమవుతున్నాయి.

ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్ సహా కొన్ని దేశాలు తమ పౌరులకు పూర్తి వ్యాక్సినేషన్‌ అయినట్లు పరిగణించడానికి బూస్టర్ డోస్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నాయి.

కానీ, చాలా దేశాల్లో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. నెదర్లాండ్స్‌లో పాక్షిక లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జనం ఆందోళనలు చేస్తున్నారు.

యూరప్ ప్రాంతంలో ఎక్కువ మరణాలకు కోవిడ్ కారణం అని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

ప్రస్తుతం నమోదవుతున్న కేసులను బట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం కరోనా మరణాల సంఖ్య 22 లక్షలు దాటవచ్చని డబ్ల్యుహెచ్ఓ మంగళవారం చెప్పింది.

కోవిడ్ వల్ల రోజువారీ సంభవించే మరణాల సంఖ్య ఇటీవల దాదాపు రెట్టింపు అయినట్లు ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్క రష్యాలోనే రోజువారీ మరణాల సంఖ్య ఇటీవల 1200 దాటిందని తెలిపింది.

టీకా వేసుకోని వారు ఇంకా అధిక సంఖ్యలో ఉండడం, కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపిస్తుడడమే యూరప్‌లో అత్యధిక సంక్రమణ రేటుకు ప్రధాన కారణం అని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.

ఇంకా టీకా వేసుకోని వారు త్వరగా కరోనా వ్యాక్సీన్ వేసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగే కోరారు.

"అనవసర విషాదం, ప్రాణనష్టాన్ని నివారించడానికి సాయం చేసే అవకాశం, ఆ బాధ్యత మనందరి మీదా ఉంది. ఈ శీతాకాలంలో సమాజానికి, వ్యాపారాలకు మరింత నష్టం జరగకుండా దానిని పరిమితం చేద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.

వీడియో క్యాప్షన్, ఏది కరోనా.. ఏది డెంగీ? తేడా ఎలా తెలుసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)