ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ముప్పును ఇది తప్పిస్తుందా

అమెరికా నుంచి భారత్ డ్రోన్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా నుంచి భారత్ డ్రోన్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది
    • రచయిత, సచిన్ గొగోయ్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

చైనా, పాకిస్తాన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ కొన్ని అధునాతన డ్రోన్ టెక్నాలజీని ఆర్మీలో ప్రవేశపెట్టాలని ఇండియా ప్రయత్నిస్తోంది.

నవంబర్ 17న జరిగిన ఓ టెక్నాలజీ షోలో డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) 25 డ్రోన్లను ప్రదర్శించింది.

టార్గెట్‌ను చేరుకోవడం, ప్రణాళిక బద్ధంగా దాడులు చేయడంలాంటివి ఈ డ్రోన్లు చేసి చూపించాయి.

ఈ ఏడాది జనవరిలో భారతదేశం తొలిసారి డ్రోన్లను ప్రదర్శించిందని ‘హిందూస్తాన్ టైమ్స్’ వార్తాపత్రిక పేర్కొంది.

ఆ తర్వాత ఒకేసారి 75 స్వదేశీ డ్రోన్లను ఎగురవేసింది. ఈ డ్రోన్‌లు ప్రమాదకరమైన మిషన్‌లతో సహా అనేక రకాల విన్యాసాలను ప్రదర్శించాయి.

యుద్ధ ప్రయోజనాల కోసం డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

భారత సాయుధ దళాలు అనేక సంవత్సరాలుగా నిఘా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ టెక్నాలజీతో పని చేసే సంస్థలు తయారు చేసిన డ్రోన్‌లను భారత సైన్యం ఎక్కువగా ఉపయోగిస్తోంది.

అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మానవ రహిత విమానాలతో శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం కోసం భారతదేశం వేగంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇటీవలి సంవత్సరాలలో పొరుగు దేశాల నుంచి ఏర్పడుతున్న భద్రతా పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా భారతదేశానికి ఇది అవసరం కూడా .

2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌‌పై భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో డ్రోన్‌లను కూడా ఉపయోగించినట్లయితే మరింత ప్రభావవంతంగా ఉండేదని డీఆర్‌డీఓ ఒక కథనంలో అభిప్రాయపడింది.

2015లో పాకిస్తాన్ ప్రదర్శించిన బురాక్ అనే డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో పాకిస్తాన్ ప్రదర్శించిన బురాక్ అనే డ్రోన్

అజర్‌బైజాన్-అర్మేనియన్ యుద్ధం నుంచి పాఠాలు

డ్రోన్‌లను చాలా కాలంగా నిఘా కోసమే ఉపయోగిస్తున్నప్పటికీ, దాడులకు ఉపయోగించాలన్న ప్రయత్నాలను భారత్ చాలాకాలంగా చేస్తోంది.

మరోవైపు గత ఏడాది అజర్‌బైజాన్-అర్మేనియా మధ్య జరిగిన యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలు కూడా దాడులు చేయగల డ్రోన్‌లను భారత్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

ఆ యుద్ధంలో అజర్‌బైజాన్ విజయంలో డ్రోన్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక, రక్షణ నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ యుద్ధంపై భారత మీడియా కూడా అనేక రిపోర్టులు ఇచ్చింది.

అజర్‌బైజాన్ డ్రోన్ ఫ్లీట్‌లోని చాలా విమానాలు ఇజ్రాయెల్, టర్కీ తయారు చేసినవి ఉన్నాయి. భారత్ ఇప్పటికే తన గూఢచార కార్యకలాపాలలో ఇజ్రాయెల్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

టర్కీతో సత్సంబంధాల కారణంగా పాకిస్తాన్‌ ఆ దేశం నుంచి డ్రోన్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉందని జర్నలిస్ట్, రక్షణ రంగ విశ్లేషకుడు శేఖర్ గుప్తా ఒక కథనంలో హెచ్చరించారు.

ఈ ఏడాది ఆగస్టులో, భారతీయ కంపెనీ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ టర్కీ డ్రోన్ తయారీ సంస్థ జైరాన్ డైనమిక్స్‌లో 30శాతం వాటాను కొనుగోలు చేసింది.

ఈ రెండు ప్రైవేట్ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని భారత ప్రభుత్వం ప్రోత్సహించిందని అంటారు.

వీడియో క్యాప్షన్, తిరుమలలో డ్రోన్ ఎగరేయవచ్చా? శ్రీశైలంలో డ్రోన్లు ఎగరేసిందెవరు?

ఇస్తాంబుల్‌లో రెండు కంపెనీలు ఒప్పందాలపై సంతకం చేసినప్పుడు, భారత రాయబారి సంజయ్ పండా కూడా అక్కడే ఉన్నారు.

డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్, మరొక సంస్థ జెన్ టెక్నాలజీల ద్వారా భారత ప్రభుత్వం కొత్త డ్రోన్ పాలసీని మెరుగు పరుచుకోవచ్చని మీడియా రిపోర్టులు చెప్పాయి.

2030 నాటికి భారత్‌ను డ్రోన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే కొత్త డ్రోన్ పాలసీ లక్ష్యం. ఈ విధానం ప్రకారం, డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధన కోసం ప్రైవేట్ కంపెనీలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు.

డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రోన్

అటాకింగ్ డ్రోన్లపై దృష్టి పెట్టాలి

అమెరికా ప్రిడేటర్, రీపర్ డ్రోన్‌ల తరహాలో దూకుడుగా దాడి చేసే డ్రోన్‌ల సైన్యాన్ని తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది.

అందులో భాగంగానే అమెరికా నుంచి ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌కు చెందిన 20 స్కై గార్డియన్, 10 సీ గార్డియన్ వెర్షన్‌లను భారతదేశం పొందే అవకాశం ఉంది. మూడు బిలియన్ డాలర్లు ( సుమారు రూ.22వేల కోట్లు) అంచనా వ్యయంతో అమెరికా ఈ డ్రోన్‌ను భారత్‌కు అందజేయనుంది.

ఈ ఏడాది డిసెంబర్‌లోగా భారతదేశం ఈ డ్రోన్‌లను ఆర్డర్ చేయనుందని ‘దైనిక్ జాగరణ్’ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైడ్రోన్ హెరాన్‌ పై ఆయుధాలను మోహరించే ప్రక్రియను కూడా భారతదేశం ప్రారంభిస్తోందని ‘ఇండియా టుడే’ వెల్లడించింది.

దాదాపు $400 మిలియన్‌ (రూ.2975 కోట్లు) ప్రాజెక్ట్ కింద భారత్‌తో సంయుక్త ప్రాజెక్టులో ఇజ్రాయెల్ ఈ డ్రోన్‌లపై లేజర్-గైడెడ్ బాంబులను, గాలి నుండి ఉపరితల క్షిపణులను మోహరిస్తుంది. ఇవి కాకుండా యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కూడా అమర్చనున్నారు.

టర్కీ తయారీ ఎటాకింగ్ డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టర్కీ తయారీ ఎటాకింగ్ డ్రోన్

లోకల్ ఆవిష్కరణ, ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 17న ఝాన్సీలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఈ డ్రోన్‌ల గ్రూప్‌ను ప్రదర్శించారు.

భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో లోకల్‌గా నెక్ట్స్ జనరేషన్ వార్‌ఫేర్‌ను డెవలప్ చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం స్థానిక స్థాయిలో ఆవిష్కరణలు, ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. భారత ప్రభుత్వం కొత్త డ్రోన్ పాలసీ కోసం ప్రోత్సాకరమైన వాతావరణాన్ని సృష్టించింది.

"కొత్త డ్రోన్ నియమాలు ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు, యువతకు సహాయపడతాయి. కొత్త ఆవిష్కరణలు, సాంకేతికత, ఇంజనీరింగ్‌లో భారతదేశ శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఇవి దేశాన్ని డ్రోన్ హబ్‌గా మారుస్తాయి" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

భారతదేశంలో స్థానికంగా డ్రోన్‌లను తయారు చేసే అనేక ప్రణాళికలు వివిధ దశలలో ఉన్నాయి. ''డ్రోన్‌లు అత్యుత్తమ బాంబర్‌లుగా నిలవగలవు'' అని ‘ఇండియా టుడే’ నివేదిక పేర్కొంది. ఇవి అత్యంత ప్రమాదకరమని కూడా వెల్లడించింది.

ప్రస్తుతం డ్రోన్‌లు ట్రయల్స్ దశలో ఉన్నాయని, పలు ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని ‘ఇండియా టుడే’ వెల్లడించింది.

ప్రస్తుతం 'ఘాతక్' అనే పేరుగల డ్రోన్ సిద్ధమవుతోందని, ప్రయోగదశలో ఉందని, ఇది భారత్ తరఫున మానవ రహిత యుద్ధ విమానం కాగలదని ఇండియా టుడే పేర్కొంది.

ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైతే, బాంబులతో పాటు గైడెడ్ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగి, యుద్ధ విమానం పరిమాణంలో ఉండే 'ఘాతక్' డ్రోన్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా నిలుస్తుంది. ఈ డ్రోన్‌కు అధునాతన ఆయుధాలు అమర్చి ప్రయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)