ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయి

ఫొటో సోర్స్, ETHAN PINES/THE FORBERS COLLECTION
- రచయిత, బెర్న్‌డ్ డెబస్మాన్ జూనియర్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
రోడ్డు మీద ట్రాఫిక్, వాయు కాలుష్యంతో విసిగిపోతున్న వారికి త్వరలో పరిష్కారం లభించనుంది.
ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి.
ఇప్పటికే, ఊబర్, బోయింగ్ లాంటి సంస్థలు ఎగిరే కార్లను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. వీటిని ఈవిటీఓఎల్ (ఎలెక్ట్రిక్ వెర్టికల్ టేక్-ఆఫ్ అండ్ లాండింగ్) ఫ్లైయింగ్ కార్స్ అంటున్నారు.
2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,30,000 ఎగిరే వాహనాలు సిద్ధంగా ఉంటాయని ఒక రిపోర్ట్ అంచనా వేసింది.
ఈమధ్య కాలంలో, వస్తువులను ఒకచోటి నుంచి మరో చోటికి చేరవేసేందుకు డెలివరీ డ్రోన్‌లను కూడా అభివృద్ధి పరిచి, పరీక్షిస్తున్నారు.
త్వరలో ఈ డ్రోన్‌లకు అంతర్జాతీయంగా మార్కెట్ బాగా పెరుగుతుందని, 2028 నాటి కల్లా వీటి మార్కెట్ విలువ 5.6 బిలియన్ డాలర్లకు (రూ. 42,025 కోట్లు) చేరుకుంటుందని ఒక అంచనా.
భవిష్యత్తులో డ్రోన్లకు, ఎగిరే టాక్సీలకు పెరిగే డిమాండ్‌ను అందుకోవాలంటే నగరాల్లో, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో మిని-ఎయిర్ పోర్టులు నిర్మించాల్సి ఉంటుందని సాంకేతిక రంగ నిపుణులు అంటున్నారు.
ఈ మిని-ఎయిర్ పోర్టులనే 'స్కైపోర్ట్స్' అంటున్నారు.

ఫొటో సోర్స్, BRADLEY WENTZEL
అమెరికా, బ్రిటన్‌లలో జోరందుకుంటున్న ఫ్లయింగ్ టాక్సీల తయారీ
కాలిఫోర్నియాకు చెందిన జోబీ ఏవియేషన్ సంస్థ ఫ్లయింగ్ టాక్సీలను అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంది. ఇప్పటికే ఈ సంస్థ 1,000కు పైగా ఎగిరే టాక్సీలను పరీక్షించింది.
2024 కల్లా వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు అమెరికా రెగ్యులేటరీ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి అనుమతి లభిస్తుందని ఆశిస్తోంది.
జోబీ తయారు చేసిన పైలట్ వాహనంలో నలుగురు ప్రయాణించవచ్చు. ఇది 200 ఎంపీహెచ్ (322/కిమీ/పీహెచ్) వేగంతో 150 మైళ్లు (241 కిమీ) ప్రయాణించగలదు.
"ప్రజలు నివసించే ప్రదేశాలకు, వారి కార్యాలయాలకు దగ్గర్లో మా ఫ్లయింగ్ టాక్సీ సర్వీసులు అందించాలనుకుంటున్నాం" అని జోబీ ప్రతినిధి ఆలివర్ వాకర్-జోన్స్ తెలిపారు.
"ఇతర రవాణా సౌకర్యాలకు, మా సర్వీసులు అనుసంధానంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల పక్కనే స్కైపోర్టులు కూడా వచ్చేలా నగరాలతో కలిసి పని చేస్తున్నాం."
అమెరికాకు చెందిన కార్ పార్కింగ్ నిర్వహణ సంస్థ రీఫ్ టెక్నాలజీతో జోబీ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది.
కొన్ని కార్ పార్కింగ్ ప్రదేశాల పైకప్పులను స్కైపోర్టులుగా మార్చేందుకు జోబీ సన్నాహాలు చేస్తోంది.
ఇలాంటి ఒప్పందాలే కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతో కూడా కుదుర్చుకుంది.
"మా భాగస్వాములతో కలిసి ప్రారంభ స్కైపోర్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రోడ్డు మీద ట్రాఫిక్‌తో విసిగిపోయినవారికి ఆకర్షణీయమైన సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం" అని వాకర్-జోన్స్ తెలిపారు.
అన్ని నగారాల్లోనూ స్కైపోర్టులు సిద్ధం కావడం అనేది సుదూర స్వప్నంగా కనిపిస్తున్నప్పటికీ, అమెరికాలోని అనేక నగర పాలక సంస్థలు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి.
ఫ్లయింగ్ టాక్సీలు, అలాంటి ఇతర వాహనాల కోసం మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్, ఓర్లాండో రాష్ట్రాలు ప్రణాళికలను ప్రకటించాయి.
"ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో తమ నగరం, ఇతర స్థానిక ప్రభుత్వాలకు ఓ నమూనా కాగలదని, దీన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు తోడ్పడగలదని" లాజ్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో తొలి స్కైపోర్టును కోవెంట్రీలో రగ్బీ, ఫుట్‌బాల్ స్టేడియంకు సమీపంలో నిర్మించే ఆలోచనలో ఉన్నారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.
హ్యుందాయ్ మద్దతు ఉన్న బ్రిటన్ కంపెనీ 'అర్బన్ ఎయిర్ పోర్ట్' దీన్ని రూపొందిస్తోంది. ఇది, ఎగిరే టాక్సీలకు, కార్గో డ్రోన్‌లకు ప్రపంచంలోనే తొలి కార్యాచరణ కేంద్రంగా మారుతుందని ఆశిస్తోంది.
"ప్రపంచంలోని అతి చిన్న ఎయిర్‌పోర్ట్"గా అభివర్ణిస్తున్న ఈ స్కైపోర్టును పర్యావరణ స్నేహితంగా మలుస్తున్నారు. ఈ మోడల్‌ను ఇతర దేశాల్లోని స్కైపోర్టులు కూడా అనుసరిస్తాయని ఆశిస్తున్నారు. ఫలితంగా రోడ్డు మీద రద్దీ, కార్లు, లారీల వలన ఏర్పడే వాయు కాలుష్యం రెండూ తగ్గుతాయని భావిస్తున్నారు.
"ఇప్పుడు మనకున్న ఎయిర్ పోర్టులన్నీ చాలా పెద్దవి. 1.2 కిమీ పొడవైన రన్వేలు ఉండడం వలన వీటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలూ ఎక్కువే. వాటి టెక్నాలజీ అలాంటిది. టేక్ ఆఫ్ కోసం ఎక్కువ దూరం క్షితిజ సమాంతరంగా ప్రయాణించాల్సి ఉంటుంది.
కానీ, ఎగిరే టాక్సీలకు అలా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. అవి టేక్ ఆఫ్ కోసం నిలువుగా ఎగురుతాయి. అలాగే, కిందకు దిగుతున్నప్పుడు, సరిగ్గా కావల్సిన చోట కచ్చితంగా దిగుతాయి. దీని కోసం సరి కొత్త మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి" అని అర్బన్ ఎయిర్ పోర్ట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రికీ సంధు వివరించారు.
కోవెంట్రీలో ఈ స్కైపోర్ట్ 2022లో ప్రారంభమవుతుందని, ఇది ఒక నమూనాగా సేవలు అందిస్తుందని ఆయన తెలిపారు.
"వీటిని నిర్మించేదుకు చాలా తక్కువ సమయం పడుతుందని, అతి తక్కువ స్థలంలో అధిక సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను నిర్మించవచ్చని నిరూపించడమే మా లక్ష్యం" అని సంధు తెలిపారు.

ఫొటో సోర్స్, URBAN AIR PORT
సవాళ్లు అనేకం
అయితే, ఎగిరే కార్లు, స్కైపోర్టులు నిర్మించడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు.
"ఎగిరే కార్లను అందుబాటులోకి తీసుకురావడంలో పరిశ్రమలు అనేక అడ్దంకులను అధిగమించాల్సి ఉంటుంది. వీటిల్లో ముఖ్యమైనవి.. ప్రజామోదం, అధిక పరిమాణంలో తయారీ, డిజిటల్, పవర్, మౌలిక సదుపాయాలపై పెట్టుబడి, ఎయిర్ ట్రాఫిక్‌కు కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ మొదలైనవి" అని వాషింగ్టన్ డీసీ లాయర్ జెన్నిఫర్ రిక్టర్ అన్నారు. రిక్టర్, ఎగిరే టాక్సీలు, డ్రోన్‌లకు సంబంధించిన చట్ట నిపుణులు.
రెగ్యులేషన్‌కు సంబంధించిన అంశాలు, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ ముఖ్యమైన అడ్డంకులు అని అమెరికా బిజినెస్ రీసెర్చ్ గ్రూప్ జేడీ పవర్‌లో ట్రావెల్ అండ్ టెక్నాలజీ నిపుణులు మైఖేల్ టేలర్ చెప్పారు.
"గాల్లో లక్షల ట్రాఫిక్ మార్గాలు నిర్దేశించాల్సి ఉంటుంది. బహుశా, భవిష్యత్తులో ఎగిరే కార్లు, డ్రోన్‌లకు ప్రామాణికమైన మార్గాలు, కచ్చితమైన నియమాలు తయారు చేస్తారు. ఈ నియమ నిబంధనలన్నీ ప్రపంచవ్యాప్తంగా వర్తించేలా చర్యలు తీసుకుంటారు. ప్రమాదాలను నివారించేందుకు ఇవన్నీ అవసరం."
రెగ్యులేటరీ సంస్థల నుంచి ఆమోదం పొందడం మరొక పెద్ద సవాలు.
అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటన్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా ఈ వాహనాల భద్రత, అనుమతి మొదలైన విషయాలను పరిశీలిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యం, భద్రతలకు సంబంధించిన సమస్యలు ప్రధానమైనవని ఇంజనీరింగ్, డిజైన్ సంస్థ ఆరేకాన్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ నిపుణులు ఆరోన్ బెల్బాసిస్ అన్నారు.
"ఆకాశంలో అన్ని కార్లు ఎగురుతూ ఉంటే ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. ఒకవేళ ఏదైనా ఫ్లయింగ్ టాక్సీ అనుకోకుండా పడిపోతే, అందులో ఉన్నవారికే కాక, దాని పరిధిలో ఉన్న వారందరికీ ముప్పు వాటిల్లవచ్చు."
అయితే, స్కైపోర్టులు, మౌలిక సదుపాయాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం వలన ఎగిరే వాహనాల అభివృద్ధికి కావలసిన పెట్టుబడి తగ్గుందేమోనని రికీ సంధు ఆందోళన వ్యక్తం చేశారు.
"రెగ్యులేషన్ గురించి నాకు చింత లేదు. ఈ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది."
సవాళ్లు ఉన్నప్పటికీ, అమెరికా, యూరోప్, ఆసియా దేశాల్లో ఎగిరే కార్లు, స్కైపోర్టులపై ఇప్పటికే చాలా ఆసక్తి చూపిస్తున్నారని రికీ అన్నారు.
"రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 200 అర్బన్ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, ఇవి తక్కువే. పెద్ద నగరాలకు ఇంతకన్నా చాలా ఎక్కువ స్కైపోర్టులు కావాల్సి ఉంటుంది."
ఇవి కూడా చదవండి:
- ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- సోషల్ మీడియా ఆల్గారిథంలు అణుబాంబుల్లాంటివా, పేలకుండా ఆపేదెలా?
- ఈ నాన్-స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
- ఆన్లైన్లో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడితే ఏమవుతుంది? దీనికి ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- రూ. 6 లక్షల బ్లూటూత్ చెప్పులు, టీచర్ల అర్హత పరీక్షలలో కాపీ కొడుతూ అరెస్ట్
- కళ్లజోడే స్మార్ట్ ఫోన్ - డిజిహబ్
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- 'ఈ ఇంట్లో కాఫీ మెషీన్ దానంతట అదే కాఫీ తయారు చేస్తుంది, లైట్ దానంతటదే వెలుగుతుంది'
- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మహిళలను నగ్నంగా చూపించే టూల్స్
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








