ఎగిరే కారు: ‘ఇది 2 నిమిషాల 15 సెకన్లలో విమానంగా మారిపోతుంది’

ఫొటో సోర్స్, KLEIN VISION
ఎగిరే కారు ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ఇది 35 నిమిషాల పాటు ఆకాశంలో ఎగిరింది.
ఒక విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుని మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
స్లొవేకియాలోని నిత్రా, బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ ట్రయల్ రన్‌కు వేదికలుగా మారాయి.
హైబ్రిడ్ కార్-ఎయిర్‌క్రాఫ్ట్ లేదా ఎయిర్‌కార్ అని పిలుస్తున్న ఈ ఎగిరే కారుకు బీఎండబ్ల్యూ ఇంజిన్ బిగించారు. ఇది సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది.

ఫొటో సోర్స్, KLEIN VISION
'ఈ కారు 2 నిమిషాల 15 సెకన్లలో విమానంగా మారిపోతుంది'
ఈ ఎయిర్‌కారు 8200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని దానిని తయారు చేసిన ప్రొఫెసర్ స్టీఫన్ క్లీన్ తెలిపారు. ఇప్పటి వరకు ఇది 40 గంటల పాటు గాల్లో ప్రయాణించిందని ఆయన వివరించారు.
కేవలం 2 నిమిషాల 15 సెకన్లలో ఇది కారు నుంచి విమానంగా మారిపోతుందని ఆయన అన్నారు.
కారుకు ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉంటాయి. ఎగరే ముందు ఈ రెక్కలు విచ్చుకుని ఈ కారు ఒక చిన్న విమానంలా మారిపోతుంది.
ట్రయల్ రన్‌లో ప్రొఫెసర్ స్టీఫన్ క్లీన్ దీన్ని నడిపి, రన్‌వేపై దించారు. అక్కడి నుంచి కారును నేరుగా ఊర్లోకి తీసుకెళ్లారు. ఈ ప్రయోగాన్ని చూడ్డానికి పలువురు విలేఖరులను ఆహ్వానించారు.
తాను రూపొందించిన ఎయిర్ కారులో ప్రయాణం "సాధారణంగా", "ఆహ్లాదకరంగా" సాగిందని ప్రొఫెసర్ క్లీన్ వివరించారు.

ఫొటో సోర్స్, KLEIN VISION
గంటకు 170 కిలోమీటర్ల వేగం
ట్రయల్ రన్‌లో గాలిలో ఎగిరిన తరువాత ఈ కారు గంటకు 170 కి.మీ వేగానికి చేరుకుంది.
దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఇది అత్యధికంగా 200 కిలోల బరువు మోయగలదు.
అయితే, ఇది డ్రోన్‌లా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరలేదు. ఒక విమానంలానే టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి ఈ ఎగిరే కారుకు రన్‌వే అవసరం.
ఎయిర్‌కార్ల మార్కెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 2040 నాటికి ఈ రంగం విలువ 1.5 ట్రిలియన్ డాలర్లు కావొచ్చని కన్సల్టెంట్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ 2019లో అంచనా వేసింది.
మంగళవారం జరిగిన ఒక పారిశ్రామిక వేడుకలో హుందాయ్ మెటార్స్ యూరోప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ కోల్ మాట్లాడుతూ, ఎయిర్‌కారు "మన భవిష్యత్తులో భాగం" అని అన్నారు.
ప్రస్తుతం రవాణా సదుపాయాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ ఓ సరికొత్త పరిష్కారంగా మారే అవకాశం ఉంది.
ప్రొటోటైప్ ఎయిర్‌కార్ అభివృద్ధి చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని దానిని తయారు చేసిన క్లీన్ విజన్ సంస్థ పేర్కొంది. పెట్టుబడి రెండు మిలియన్ యూరోల కన్నా తక్కువే అయిందని తెలిపింది.
గ్లోబల్ ఎయిర్‌లైన్ లేదా ట్యాక్సీల అమ్మకాల్లో కొద్ది శాతం వాటాను సాధించినా అది తమకు భారీ విజయం అవుతుందని క్లీన్ విజన్ సలహాదారుడు అంటోన్ రాజాక్ అన్నారు.
అమెరికాలో దాదాపు 40,000 విమానాలకు ఆర్డర్లు ఉన్నాయని, వీటిలో 5శాతం ఎయిర్‌కారులవైపు మొగ్గు చూపినా తమది పెద్ద మార్కెట్ అవుతుందని పేర్కొన్నారు.
ఎయిర్‌కారును "బుగాటీ వేయ్‌రాన్ (కారు), సెస్నా 172 (చిన్న విమానం)లకు పుట్టిన ముద్దు బిడ్డ"గా వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయంలో ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ స్టీఫెన్ రైట్ అభివర్ణించారు.
"ఇది చాలా బాగుందని అంగీకరించాల్సిందే. కానీ దీని సర్టిఫికేషన్‌పై నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరైనా విమానాన్ని తయారు చేయవచ్చు. కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అనేక గంటలపాటూ ఎగురుతూ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరగలిగేలా ఉండాలి. ఈ ఎగిరేకారు ఆకాశ ప్రయాణానికి సురక్షితం అని తెలిపే ధృవపత్రాల కోసం వేచి చూస్తున్నాను" అని రైట్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెనడాలో మండుతున్న ఎండలు.. వడ దెబ్బకు పదుల సంఖ్యలో మృతి
- ఇలా చేస్తే ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది..
- చైనా కమ్యూనిస్టు పార్టీ ఆ దేశాన్ని ఎలా నడిపిస్తోంది...వ్యతిరేకతను ఎలా అణచివేస్తోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- సిక్కిం: సుందర పర్వత సీమల్లో అద్భుత విమానాశ్రయం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








