చైనా కమ్యూనిస్టు పార్టీ ఆ దేశాన్ని ఎలా నడిపిస్తోంది...వ్యతిరేకతను ఎలా అణచివేస్తోంది?

చైనాలో పౌరుల జీవన శైలి మీద కమ్యూనిస్టు పార్టీ పాత్ర, ప్రభావం ఉంటుంది. స్కూళ్లలో కూడా విద్యార్ధులకు కమ్యూనిజం పాఠాలు నేర్పుతారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ప్రజల జీవితంపై కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

1949 అక్టోబర్ 1 నుంచి నేటి వరకు ఒకే ఒక్క పార్టీ చైనాను పాలిస్తోంది. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా.

మావో శకం నుంచి ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన ఈనాటి వరకు సాగిన ఈ ప్రస్థానంలో తనకు ఎదురైన వ్యతిరేకతను ఎప్పటికప్పుడు చైనా అణచివేస్తూ వచ్చింది.

'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్ చైనా'గా మారిన తర్వాత దేశాన్ని కమ్యూనిస్టు పార్టీ ఎలా నడిపించిందన్న విషయాన్ని సింహావలోకనంగా మీ ముందుకు తెస్తోంది బీబీసీ.

దేశ పాలనకు సంబంధించినంత వరకు కమ్యూనిస్టు పార్టీకి పూర్తి నియంత్రణ ఉంటుంది. అంటే ప్రభుత్వం, పోలీసు, మిలిటరీ ఇలా అన్ని రంగాలపై పార్టీ తన పట్టును కొనసాగిస్తోంది.

సుమారు 9 కోట్ల మంది సభ్యులున్న కమ్యూనిస్టు పార్టీలో అధికారం, బాధ్యతలు పిరమిడ్ ఆకారపు వ్యవస్థలా కొనసాగుతుంటాయి. ఇందులోనే సామాన్య కార్యకర్తలు, పొలిట్ బ్యూరో నుంచి అధ్యక్షుడి వరకు ఉంటారు.

నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌గా పిలిచే పార్లమెంటు వ్యవస్థ కూడా ఉంటుంది. అయితే ఇది కేవలం రబ్బర్ స్టాంప్‌లాగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలన్నీ పార్టీయే తీసుకుంటుంది.

పార్టీకి మీడియా మీదా, ఇంటర్నెట్ మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఎక్కడికక్కడ అణచి వేస్తుంటుంది.

దేశాన్ని ప్రేమించడం, పార్టీని ప్రేమించడం ఒకటేనన్న భావన చైనాలో ఉంటుంది.

దేశాభివృద్ధి పేరుతో ఇతర ప్రజాస్వామిక విధానాలన్నింటినీ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తుంది.

చట్టాలను అమలు చేయడం వరకే చైనా పార్లమెంటు బాధ్యత. నిర్ణయాలన్నీ పార్టీ నుంచే వస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చట్టాలను అమలు చేయడం వరకే చైనా పార్లమెంటు బాధ్యత.

ఒకే పార్టీ-ఒకే ప్రభుత్వం

ఒక్కమాటలో చెప్పాలంటే చైనాది ఏక పార్టీ ప్రభుత్వం. కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యం దేశ రాజ్యాంగంలో కూడా కనిపిస్తుంది. చిన్నచిన్న పార్టీలు ఉన్నా అవి కూడా కమ్యూనిస్టులకు మద్ధతు ఇవ్వాల్సిందే.

మావో జెడాంగ్ కాలం నుంచి సోషలిజం విధానాలనే అనుసరిస్తూ వస్తోంది చైనా. మధ్యలో గ్రేట్ లీప్ ఫార్వార్డ్ లాంటి విధానాలు, కరువు కాటకాలు, సాంస్కృతిక విప్లవంలాంటి వాటి కారణంగా లక్షల మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారు.

1976లో మావో మరణించాక, చైనా తన పాత విధానాలకు దూరం జరగడం ప్రారంభించింది. కొత్త అధ్యక్షుడు డెంగ్ షియావోపింగ్ నాయకత్వంలో సంస్కరణల బాట పట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్ 2012లో అధికారం చేపట్టారు.

అప్పటి నుంచి ప్రపంచ వేదికలపై చైనా అగ్రస్థానంలో కనిపిస్తోంది.

చైన కమ్యూనిస్టుపార్టీ విధానాలను వ్యతిరేకించినందుకు నటి ఫాన్ బింగ్ బింగ్ బహిరంగ క్షమాపణ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్టీ విధానాలను వ్యతిరేకించినందుకు నటి ఫాన్ బింగ్ బింగ్ బహిరంగ క్షమాపణ చెప్పారు.

పిరమిడ్ కంట్రోల్

చైనాలో సుమారు 7 శాతం మంది ప్రజలు కమ్యూనిస్టు పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులైన సభ్యులు. వారిలో ఎవరైనా ప్రభుత్వ, పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబించినా, విమర్శించినా వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తమను తాము కాపాడుకోవడానికి, నిర్బంధాలు, శిక్షల నుంచి తప్పించుకోవడానికి వారికి ఉన్న ఏకైక మార్గం ఇదే.

ఫాన్ అనే నటి విషయంలో ఇదే జరిగింది.

కింది స్థాయి నుంచి, ఉన్నత స్థాయి వరకు పార్టీ శ్రేణులు తమ నాయకత్వాన్ని ఎంచుకుంటాయి. నేషనల్ పార్టీ కాంగ్రెస్.. సెంట్రల్‌ కమిటీని ఎన్నుకుంటుంది. అది పొలిట్ బ్యూరోను ఎన్నుకుంటుంది.

ఈ ఎన్నికలన్నీ ముందు నిర్ణయించినట్లుగానే జరిగిపోతుంటాయి. పూర్తి అధికారాలు పొలిట్ బ్యూరో చేతిలో ఉంటాయి.

2017లో షి జిన్‌పింగ్‌ జీవిత కాలపు అధ్యక్షుడిగా ఉండేందుకు పార్టీ అనుమతి ఇచ్చింది. ఆయన పేరును, విధానాలను రాజ్యాంగంలో పొందు పరిచేందుకు అనుమతినివ్వడమే కాక, మావో జెడాంగ్‌కు సమానుడి హోదాను కట్టబెట్టింది.

70 సంవత్సరాలుగా చైనాను కమ్యూనిస్టు పార్టీయే పాలించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1949 అక్టోబర్ 1 నుంచి చైనాను కమ్యూనిస్టు పార్టీయే పాలిస్తోంది.

పవర్‌ఫుల్ పొలిట్ బ్యూరో

అన్నింటిలో పొలిట్ బ్యూరో శక్తివంతమైంది. పార్టీ విధానాలను పొలిట్ బ్యూరోయే నిర్ణయిస్తుంది. అంతేకాదు, దేశంలోని కీలక వ్యవస్థలను తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది.

పొలిట్ బ్యూరోలో....

1.స్టేట్ కౌన్సిల్

2.సెంట్రల్ మిలిటరీ కమిషన్

3.నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ లేదా పార్లమెంట్ అనే విభాగాలుంటాయి.

స్టేట్‌ కౌన్సిల్ అంటే ప్రభుత్వం. ఇది ప్రధానమంత్రి నాయకత్వంలో పని చేస్తుంది. ప్రధాని, ప్రెసిడెంట్‌కు జూనియర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ విధానాలను ఒక ప్రభుత్వంగా అమలు చేయడం ఆయన బాధ్యత.

రెండో ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత వచ్చిన సివిల్ వార్ కాలం నుంచి పార్టీకి, మిలిటరీకి మధ్య ఉన్న అనుబంధం తర్వాత కాలంలో వ్యవస్థీకృతమై సెంట్రల్ మిలిటరీ కమిషన్‌గా ఆవిర్భవించింది.

చైనా సాయుధ బలగాలను సెంట్రల్ మిలిటరీ కమిషన్ పర్యవేక్షిస్తుంది. దేశ అణ్వాయుధాలతో పాటు సుమారు 20 లక్షల మంది సైన్యం, ఇతర ఆయుధాల బాధ్యతను ఈ కమిషన్ చూసుకుంటుంది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాభిప్రాయంపై పట్టు

ప్రభుత్వంపై వ్యతిరేకతను చైనా కమ్యూనిస్టు పార్టీ ఏమాత్రం సహించదు. దేశంలో ప్రతిపక్ష పార్టీలే ఉండవు. ప్రభుత్వాన్ని విమర్శించే వారు అనేక నిర్బంధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వ్యతిరేక గళం వినిపించే వారిని అణచి వేయడంలో చైనా ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపదు. ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణులు మరింత పెరిగాయన్న విమర్శలు ఉన్నాయి.

ఇది కింది స్థాయి వ్యక్తులకే కాదు, పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న నేతలకు కూడా ఇదే నీతి వర్తిస్తుంది. ప్రభుత్వంలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన బో షిలాయ్ అనే నేతను 2013లో అక్రమాస్తుల కేసులు పెట్టి జైల్లో వేశారు.

తమ కఠిన విధానాల ద్వారా లక్షలమందిని పేదరికం నుంచి బయటపడేశామని, ఇలాంటి సమయంలో జరిగే మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద విషయం కాదని చైనా ప్రభుత్వంలోని నేతలు వాదిస్తారు.

చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ అధికారం చేపట్టిన తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్

మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీద ప్రభుత్వం పూర్తి స్థాయి నియంత్రణ కలిగి ఉంటుంది.

చైనాలోని గ్రేట్ ఫైర్ ‌వాల్ అని పిలిచే ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ విధానాలు ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కూడా వర్తిస్తాయి.

ఆధునిక టెక్నాలజీ కారణంగా చైనా ప్రభుత్వం నిఘా వ్యవస్థలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకుంది. మీడియా మీద ఉన్న పట్టు కారణంగా ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా మారకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)