చైనాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన 11 నినాదాలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, జోయ్ బోయెల్
- హోదా, బీబీసీ న్యూస్
జులై 1న చైనా కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల వేడుకలకు సిద్ధమవుతోంది. 11 నినాదాలు చైనాలో కీలక మార్పులు తీసుకొచ్చాయి.
దాదాపు వందేళ్ల క్రితం మావో ఇచ్చిన నినాదాలూ ఇప్పటికీ చైనాలో ప్రతిధ్వనిస్తుంటాయి.
మూడు దశాబ్దాల పదవీ కాలంలో మావో తన రాజకీయ నినాదాలను కళాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
మావో ఇచ్చిన కొన్ని అతివాద సిద్ధాంతాలు ఆ తర్వాత వచ్చిన వారు పక్కనపెట్టేసినప్పటికీ, కొన్ని మావో నినాదాలు ఇప్పటికీ మనకు వినిపిస్తుంటాయి.
చైనాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన 11 నినాదాలపై బీబీసీకి చెందిన జోయ్ బోయెల్ అందిస్తున్న కథనం.
1. వంద పూలు వికసించనీ (1956)
చైనావాసుల ప్రసంగాల్లో మనకు అక్కడక్కడా ఈ నినాదాలు వినిపిస్తుంటాయి. రెండు, మూడు పదాలతో కనికట్టుచేసే ఈ నినాదాలుంటే అది మంచి ప్రసంగమని చాలా మంది భావిస్తుంటారు.
ఈ నినాదాలకు చైనా భాషలో ప్రత్యేక గుర్తులను ఉపయోగిస్తుంటారు.
తన సందేశాన్ని ఎక్కువమందికి చేరవేసేందుకు ప్రాచీన చైనా సాహిత్యంపై మావో ఎక్కువగా ఆధారపడేవారు. పాత కాలంనాటి నానుడిలను కూడా ఆయన ఉపయోగించేవారు.
మావో ప్రముఖ నినాదాల్లో ‘‘వంద పూలు వికసించనీ; వేయి ఆలోచనలు ఘర్షణ పడనీ’’ ఒకటి. ఇది క్రీ.పూ. 221నాటి వారింగ్ స్టేట్ పిరియడ్‌లో పురుడుపోసుకుంది.
పార్టీ విమర్శలను ఆహ్వానిస్తుందని చెప్పడానికి ఈ నినాదాన్ని మావో ఉపయోగించేవారు. అయితే, ఈ నినాదం అనంతరం విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులను విమర్శిస్తూ పెద్దపెద్ద పోస్టర్లు పెట్టేవారు. పార్టీ విధానాలను విద్యార్థులు, అధ్యాపకులు బహిరంగంగానే విమర్శించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, IISH/Stefan R Landsberger Collections
అయితే, వచ్చిన సంవత్సరానికే ఈ నినాదం కథ ముగిసిపోయినట్లు సంకేతాలు వచ్చాయి.
‘‘మార్క్స్ వ్యతిరేక సిద్ధాంతాలు, సోషలిస్టు లక్ష్యాలకు వెన్నుపోటు పొడిచేవారిపై మేం ఎలాంటి విధానాలు అనుసరిస్తాం? ఏమీలేదు.. వారి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛను వెనక్కి తీసుకుంటాం’’ అని ఓ ప్రసంగంలో మావో వ్యాఖ్యానించారు.
రానురాను తమ సిద్ధాంతాలతో విభేదించే మేధావులను బహిరంగంగానే తిరస్కరించేవారు. కొందరిని జైళ్లకు పంపించేవారు. మరికొందర్ని మారుమూల ప్రాంతాల్లో విధులకు పంపించేసేవారు.
‘‘వంద పూలు వికసించనీ అనే నినాదం ఓ కుట్ర లాంటిది. విమర్శలకు ఆహ్వానం పేరుతో తీవ్రమైన విమర్శలు చేసేవారిని బయటకు రప్పించేందుకే దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’’ అని ఇప్పటికీ చాలామంది మేధావులు చెబుతుంటారు.
2. ధైర్యంగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు రండి (1958)
ఇది ద గ్రేట్ లీప్ ఫార్వార్డ్ కాలం నాటి నినాదం. సమష్టి వ్యవసాయం కోసం చేతులు కలపాలంటూ రెండేళ్లపాటు మావో ప్రత్యేక ప్రచారం చేపట్టారు. దీన్నే ద గ్రేట్ లీప్ ఫార్వార్డ్ కాలం అని పిలిచేవారు.
తను సూచించే మార్గంలో రైతులు నడిచేలా ‘‘ధైర్యంగా ఆలోచించండి, ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా ముందుకు రండి’’అని మావో ప్రోత్సహించేవారు.
అయితే, ఈ కాలంలోనే వ్యవసాయ రంగం కుప్పకూలింది. మావో విధానాలకు విపత్తులు తోడవడంతో దాదాపు 3 కోట్ల మంది మృత్యువాతపడ్డారు.
విధ్వంసక ద గ్రేట్ లీప్ ఫార్వార్డ్ కాలంలో పురుడు పోసుకున్నప్పటికీ ఈ నినాదాన్ని ఇప్పటికీ మావో అనుచరులు వాడుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
3. స్మాష్ ద ఫోర్ ఓల్డ్స్ (1966)
మితిమీరిన చైనా సాంస్కృతిక విప్లవానికి ఏదైనా ఉదాహరణ ఉందంటే అది ఇదే. పాతది అనిపించేది ఏదైనా పక్కన పెట్టేయండని దీని ద్వారా యువతకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆలోచనలు, సంప్రదాయాలు, సంస్కృతి, అలవాట్లను ఫోర్ ఓల్డ్స్‌గా పేర్కొన్నారు.
ఈ నినాదం విన్న వెంటనే, యువత ఆలయాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు పశ్చిమ దేశాలకు గుర్తుకువస్తాయని లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ జెన్నీఫర్ అల్టెహెంజెర్ వ్యాఖ్యానించారు. ఈ నినాదం అనంతరం చాలా మంది మేధావుల్ని హింసించారు. కొందరు మేధావులైతే మరణించారు కూడా.
సాంస్కృతిక విప్లవ సమయంలో చాలా నినాదాలే పురుడుపోసుకున్నాయి. ‘‘తిరుగుబాటు తప్పేంకాదు (టు రెబల్ ఈస్ జస్టిఫైడ్)’’ కూడా దీనిలో ఒకటి. దీనికి స్మాష్ ద ఫోర్ ఓల్డ్స్‌కు దగ్గర సంబంధాలున్నాయి.
విప్లవాన్ని శాశ్వతంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వంపై అన్ని రకాల విమర్శలకూ మావో ఆహ్వానం పలికారు. ద గ్రేట్ లీప్ ఫార్వార్డ్‌తో తనపై పడిన మచ్చను దీని ద్వారా తుడిచిపెట్టేందుకు మావో ప్రయత్నించారు.
మొత్తానికి 1976లో దీనికి ముగింపు పలికారు. అయితే, సాంస్కృతిక విప్లవం పేరుతో చోటుచేసుకున్న హింసకు లక్షల మంది బలయ్యారని చరిత్ర చెబుతోంది.

ఫొటో సోర్స్, IISH
4. స్మాష్ ద గ్యాంగ్ ఆఫ్ ఫోర్ (1976)
మావో మరణం అనంతరం, పైస్థాయిలో అధికారం కోసం పీటముడి ఏర్పడింది.
మావో తన వారసుడిగా తెరపైకి తీసుకొచ్చిన హువా గుఫెంగ్ దాదాపు అన్ని కీలక పదవులను చేజిక్కించుకున్నారు. అయితే, మావో భార్య జియాంగ్ క్వింగ్, ఆమె వెంటన నిలిచిన మరో ముగ్గురు అనుచరుల నుంచి గుఫెంగ్‌కు వ్యతరేకత ఎదురైంది.
మితిమీరిన సాంస్కృతిక విప్లవానికి ప్రతీకలుగా మారిన ఆ నలుగురినీ వెంటనే అరెస్టు చేశారు.
ఈ నలుగురూ దేశ ద్రోహులంటూ పెద్దపెద్ద పోస్టర్లు కూడా పెట్టారు. పోస్టర్లలో వీరి ముఖాలపై ఎర్ర రంగుతో ఇంటూ మార్క్‌లు పెట్టారు.
అయితే, హువా ప్రభుత్వాన్ని డెంగ్ జియావోపింగ్ కూలదోశారు. సంస్కరణల పేరుతో డెంగ్ జియావోపింగ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
ఆ నలుగురి కథ మాత్రం 1991 వరకు నడిచింది. కోర్టు గదుల్లో జడ్జి ముందు వారి వాదనలు టీవీల్లో చూపించేవారు. ఒక సమయంలో తనతో వచ్చిన మిగతా ముగ్గురు మావో భార్య జియాంగ్ క్వింగ్‌తో విభేదించారు. వీరందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే 1991లో జియాంగ్ క్వింగ్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5. రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ అప్ (1978)
డెంగ్ జియావోపింగ్ వస్తూనే చైనాను, ఆర్థిక వ్యవస్థను సంస్కరణల వైపు నడిపించారు. అంతకుముందు 12ఏళ్లపాటు పత్రికల్లో కనిపించిన ‘‘క్లాస్ స్ట్రగల్’’ అనే నినాదాన్ని పక్కకు తప్పించారు.
డెంగ్ జియావోపింగ్ కాలంలో ఆధునికీకరణ అనే పేరుతో పోస్టర్లు కనిపించాయి. మావో హయాంలోనే కొన్ని సంస్కరణలను ప్రతిపాదించారు. అయితే, అవి అమలుకు మాత్రం నోచుకోలేదు.
ముఖ్యంగా సోషలిజంలో చైనాకు సరిపోయేలా డెంగ్ జియావోపింగ్ మార్పులు చేశారు. దీంతో మార్క్స్ విధానాలకు కాస్త దూరం జరిగి, తమకు నచ్చిన సంస్కరణలవైపు అడుగులు వేసేందుకు వీలుపడింది.
మొత్తంగా ‘‘రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ అప్’’ నినాదం చుట్టూనే డెంగ్ జియావోపింగ్ కార్యక్రమాలు తిరిగేవి.
చైనా రాజ్యాంగ పీఠికలోనూ రిఫార్మ్ అనే పదానికి చోటు దక్కింది.

ఫొటో సోర్స్, IISH
6. సీక్ ట్రూత్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ (1978)
ఇది కమ్యూనిస్టు నాయకులకు ఎంతో దగ్గరైన నినాదం. విచక్షణను ఉపయోగించి నిజం తెలుసుకోమని దీని అర్థం.
‘‘ఇది పురాతన చైనా సిద్ధాంతాల్లో ఒకటి. కానీ సంస్కరణల కాలంలోనే ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది’’ అని జెన్నిఫర్ వివరించారు.
1930ల్లో మావో ఉపయోగించిన ఈ నినాదాన్ని, ఆ తర్వాతి కాలంలో చైనాలో అధికారంలోకి వచ్చిన నాయకులు కూడా ఉపయోగించారు.
‘‘మన ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకుని, వాస్తవాల నుంచి సత్యాన్ని గ్రహించి (సీక్ ట్రూత్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్), మన ఆలోచనలు కార్యరూపం దాల్చగలిగితే.. సోషలిస్టు ఆధునికీకరణ కార్యక్రమాలను సులువుగా అమలు చేయగలం’’ అని 1978లో డెంగ్ జియావోపింగ్ అన్నారు.
‘‘ఇదొక విశాలమైన దృక్పథం లాంటిది. ఇక్కడ మన లక్ష్యం నిజాన్ని గ్రహించడమే’’ అని జెన్నీఫర్ వివరించారు.

ఫొటో సోర్స్, IISH
7. తక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువ పందుల్ని పెంచండి (1979)
‘‘ఒక బిడ్డ చాలు’’ విధానంతో ముడిపడిన విపరీత నినాదాల్లో ఇదీ ఒకటి.
ఇలాంటి నినాదాలు పార్టీ అధిష్టానం నుంచి వచ్చేవి కాదు. అయితే, అత్యుత్సాహం గల కొందరు స్థానిక నాయకులు వీటిని ఉపయోగించేవారు.
‘‘పురుటినొప్పులు తగ్గించుకోండి! అదనపు బిడ్డను మాత్రం కనకండి’’, ‘‘ఒక కుటుంబంలో ఒక బిడ్డ అదనంగా పుట్టినా గ్రామం మొత్తానికీ కుటుంబ నియంత్రణే’’, ‘‘మరొక బిడ్డ అంటే, మరొక సమాధే’’ లాంటి నినాదాలు కూడా కనిపించేవి.
చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోవడంతో, ఒకే బిడ్డ చాలు విధానాన్ని సమీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ నినాదాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని 2007, 2011ల్లో నేషనల్ పాపులేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ కమిషన్ కూడా అభిప్రాయపడింది.
‘‘ఎక్కువ మంది పిల్లల్ని మోసేందుకు భూమి చాలా అలసిపోతోంది’’ లాంటి నినాదాలు అయితే మేలని సూచించింది.

ఫొటో సోర్స్, IISH
8. త్రీ రిప్రెసెంట్స్ (2000)
ఇది జియాంగ్ జెమిన్ మానస పుత్రిక. తన పదేళ్ల పదవీ కాలంలో దీనికి రాజ్యాంగ పీఠికలోనూ చోటు కల్పించారు.
2000లో తను ఇచ్చిన ప్రసంగంలో ఆయన తొలిసారిగా త్రీ రిప్రెసెంట్స్ గురించి మాట్లాడారు. పార్టీ 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని 2002లో ఇచ్చిన ప్రసంగంలో దీని గురించి ఆయన మరింత వివరంగా చెప్పారు.
‘‘చైనా ఉత్పాదక శక్తి పెరిగేందుకు అవసరమైన చర్యలు, చైనా సాంస్కృతిక అభివృద్ధికి మార్గ నిర్దేశనం, చైనా ప్రజాప్రయోజనాలను పార్టీ ప్రతిబింబించాలి’’ అని జియాంగ్ జెమిన్ అన్నారు. ఈ మూడింటినే త్రీ రిప్రెసెంట్స్‌గా ఆయన పేర్కొన్నారు.
పురాతన సాహిత్యం నుంచి మావో ఇచ్చే నినాదాల కంటే దీనికి కాస్త లోతైన అర్థాలున్నాయి.
ఒక ఇంజినీర్‌గా జియాంగ్ జెమిన్ ఆలోచనలకు ఇది అద్దంపడుతోంది.
9. హార్మోనియస్ సొసైటీ (2005)
రాజ్యాంగంలో చోటు దొరకడాన్ని బట్టి నినాదం విజయాన్ని అంచనా వేస్తే ఇది కాస్త వెనుకబడుతుంది. దీన్ని హు జింటావో ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా మారకముందే, 2005లో పార్లమెంటులో దీని గురించి ఆయన ప్రస్తావించారు. అయితే, దీనికి రాజ్యాంగంలో చోటు దక్కలేదు.
ఈ నినాదం విజయవంతం కాలేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే హార్మోనియస్ సొసైటీ పేరుతో చైనాలో చాలా విధానాలు, నిబంధనలు, సంస్కరణలు తీసుకొచ్చారు.
పశ్చిమ నగరాలైన కిన్‌హాయ్, ఉరుంఖిలలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులు ఈ నినాదం కిందే తీసుకొచ్చారు. అయితే, షిన్‌జాంగ్, టిబెట్‌లలో అణచివేతను కూడా దీని కిందే చూడాలి.
1980, 1990ల్లో ఆర్థిక సంస్కరణలతో పెరిగిన అసమానతలకు పరిష్కారంగా ఈ నినాదాన్ని తీసుకొచ్చినట్లు హు జింటావో చెప్పారు. ‘‘హార్మోనియస్ సొసైటీలో ప్రజాస్వామ్యం, చట్టాలకు అనుగుణంగా పాలన, సమానత్వం, న్యాయం, నిబద్ధత, సయోధ్య, జీవకళ ఉంటాయి’’ అని 2005లో ఇచ్చిన ప్రసంగంలో ఆయన చెప్పారు.
అయితే నేడు ఈ నినాదంతో చైనా నెటిజన్లు అప్పుడప్పుడు ఛలోక్తులు విసురుతుంటారు. చైనా భాషలో చెరువు పీత అనే పదాన్ని ఇంచుమించు ‘‘హార్మొనీ’’ అనే పలుకుతారు. ఈ పదాన్ని ఉపయోగించి ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు చేస్తుంటారు.
10. త్రీ సుప్రీమ్స్ (2007)
ఇది అమెరికా మోటౌన్ మ్యూజిక్ గ్రూప్ ఆల్బమ్ పేరులా కనిపిస్తుందా? కానీ న్యాయవ్యవస్థపై నియంత్రణ కోసం హు జింటావో ఇచ్చిన నినాదమిది.
‘‘జడ్జీలు, విచారణకర్తలు అందరూ.. పార్టీ లక్ష్యాలు, ప్రజాప్రయోజనాలు, రాజ్యాంగం-చట్టాలే పరమావధిగా పనిచేయాలి’’ అని జింటావో సూచించారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం మొదలైన చర్చలకు జింటావో ముగింపు పలికారు. ఎలాంటి అనుభవమూలేని వాంగ్ షెంగ్జున్‌ను సుప్రీంకోర్టు అధ్యక్షుడిగా నియమిస్తూ అసలు చర్చలే లేకుండా చేశారు.
న్యాయవ్యవస్థ ఈ మూడు ప్రాథమ్యాలను పాటించేలా చూడటమే బాధ్యతగా వాంగ్ ముందుకువచ్చారు. అయితే, మిగతా రెండు ప్రాథమ్యాలపై ‘‘పార్టీనే పరమావధి’’అనే ప్రాథమ్యం ఇక్కడ విజయం సాధించింది.

ఫొటో సోర్స్, AFP
11. చైనీస్ డ్రీమ్ (2013)
ఇది సఫలమైందో లేదా విఫలమైందో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. కమ్యూనిస్టు పార్టీలో కొందరికి దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.
‘‘చైనా ప్రభుత్వానికి, కమ్యూనిస్టు పార్టీకి ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ నినాదాలు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించడం లేదు’’ అని వాషింగ్టన్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌లో చైనా వ్యవహారాల నిపుణుడు టామ్ కెలాగ్ వ్యాఖ్యానించారు.
‘‘చైనీస్ డ్రీమ్ పేరుతో కొత్త నినాదాన్ని ఇచ్చేందుకు జిన్‌పింగ్ ప్రయత్నించారు. కానీ చైనీస్ డ్రీమ్ ఆఫ్ కాన్‌స్టిట్యూషనలిజం లేదా చైనీస్ డ్రీమ్ ఆఫ్ సోషల్ హార్మొనీ లాంటివి ఇప్పటికే ఉన్నాయి’’
బ్రిటన్‌లోని లేబర్ పార్టీ నినాదం ‘‘ఫార్వార్డ్, నాట్ బ్యాక్’’, అమెరికాలో ఎన్నికల సమయంలో ఒబామా ఇచ్చిన ‘‘ఫార్వార్డ్’’ లాంటి నినాదమే ఇదీ.
చైనీస్ డ్రీమ్ అంటే ఏదైనా అవ్వొచ్చు. దేని గురించైనా అవ్వొచ్చు. ఇలాంటి మరిన్ని నినాదాలను జిన్‌పింగ్ ఇచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








