మహిళల్లో సున్తీ: ‘నాకు చేశారు.. నా కూతుళ్లకు చేయనివ్వను’

ముగ్గురు పిల్లలతో ఉన్న తల్లి, సున్తీకి సిద్ధం చేస్తున్న మరొక అమ్మాయి.

ఫొటో సోర్స్, Jilla Dastmalchi

    • రచయిత, సరోజ్ పథిరాణా
    • హోదా, బీబీసీ న్యూస్

మహిళలకు సున్తీ చేయడాన్ని 2008లో నిషేధించింది ఈజిప్ట్. కానీ ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సున్తీ ఆచారాన్ని పాటిస్తున్న దేశాల్లో ఈజిప్ట్ ఒకటి.

గమనిక: ఈ కథనంలో మహిళల్లో సున్తీ గురించి వివరించే ప్రతీకాత్మక చిత్రాలు ఉన్నాయి.

కొన్ని సంప్రదాయ ముస్లిం సమాజాల్లో సున్తీ జరగని మహిళలను అపవిత్రమైన వారిగా, వివాహానికి సిద్ధంగా లేని వారిగా పరిగణిస్తారు.

'సున్తీ' చేయడం అంటే మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం. దీన్నే ఆంగ్లంలో ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం) అని అంటారు.

ఒకవేళ డాక్టర్లు సున్తీని చేసినట్లు నేరం నిరూపణ అయితే, చట్ట ప్రకారం వారికి ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అలాగే సున్తీ చేయమని అడిగిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ విషయంలో ఇద్దరు మహిళలు తమకు ఎదురైన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. అలాగే తమ పిల్లలను దీని నుంచి ఎందుకు రక్షించాలనుకుంటున్నారో వివరించారు.

భయంతో గదిలో ఒక మూల కూర్చుని ఉన్న అమ్మాయి మీదకు వెళుతున్న ముగ్గురు మహిళల నీడలు

ఫొటో సోర్స్, Jilla Dastmalchi

'నల్లని దుస్తులు తొడిగి, దిలో బంధించి అందరూ నన్ను చుట్టుముట్టారు'

లైలాకు 11 సంవత్సరాల వయసులో సున్తీ చేశారు. ఆమెకు సున్తీ జరిగి మూడు దశాబ్దాలు కావస్తున్నా సున్తీ జరిగిన రోజునాటి చేదు జ్ఞాపకాలు ఆమె మనసులో ఇప్పటికీ ఉన్నాయి.

సున్తీ జరిగే నాటికి ఆమె స్కూలు పరీక్షల్లో పాస్ అయింది.

"నాకొచ్చిన మార్కులకు నన్ను ప్రశంసించడం మానేసి అదే రోజు మా వాళ్లు ఒక మంత్రసానిని ఇంటికి తీసుకుని వచ్చారు. నాకు నల్లని దుస్తులు తొడిగి, నన్నొక గదిలో బంధించి అందరూ నన్ను చుట్టుముట్టారు" అని ఆ రోజు జరిగిన విషయాలను లైలా గుర్తు చేసుకున్నారు.

"అందరూ కలిసి నన్ను కింద పడుకోబెట్టారు. ఆమె నా శరీరంలో ఆ భాగాన్ని కత్తిరించారు. నేను ప్రేమించిన ఈ పెద్దవాళ్ల పట్ల నేనేం తప్పుగా ప్రవర్తించానో నాకు అర్థం కాలేదు. వాళ్లు నా మీద కూర్చుని, నా కాళ్లను వెడల్పు చేసి నన్ను గాయపరిచారు. మానసికంగా అది నన్ను తీవ్రమైన కుంగుబాటుకు గురిచేసింది" అని లైలా చెప్పారు.

ఆమెకు సున్తీ చేస్తున్నప్పుడు ఆమె నానమ్మతో పాటు ఇరుగు పొరుగు వాళ్లు కూడా అక్కడ ఉన్నారు.

"నాకు ఆడుకోవాలని, స్వేచ్ఛగా తిరగాలని ఉండేది. కానీ, కాళ్లు వెడల్పుగా చేస్తే గానీ నాకు నడవడం వచ్చేది కాదు" అని లైలా అన్నారు.

ఆమె పెరిగి పెద్దయి, వివాహం చేసుకున్నాక, సున్తీ జరగకపోయి ఉండి ఉంటే జరిగే పరిణామాలేంటో ఆమెకు అర్థమయ్యాయి.

అమ్మాయికి సున్తీ జరగని పక్షంలో గ్రామాల్లో ఆమెను అపవిత్రమైన మహిళగా చూస్తారని లైలా చెప్పారు. సున్తీ జరిగిన అమ్మాయిని మంచి అమ్మాయిగా చూస్తారని చెప్పారు.

"సున్తీకి ప్రవర్తనకు సంబంధమేంటో నాకు అర్థం కాలేదు" అని లైలా అన్నారు.

వీడియో క్యాప్షన్, మహిళల్లో సున్తీ: నిషేధానికి ఐక్యరాజ్య సమితి పిలుపు

'ప్లాస్టిక్ సర్జరీ పేరుతో నేటికీ కొనసాగిస్తున్నారు'

"ఈ ఆచారాన్ని ఇప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ పేరుతో కొనసాగిస్తున్నారు" అని మానవ హక్కుల న్యాయవాది, కైరోకి చెందిన వుమెన్స్ సెంటర్ ఫర్ గైడన్స్ అండ్ లీగల్ అవేర్‌నెస్ హెడ్ రెడా ఎల్డన్‌బౌకి చెప్పారు.

మహిళల తరుపున నమోదు చేసిన సుమారు 3000కేసుల్లో, ఈ సంస్థ 1800 కేసుల్లో విజయం సాధించింది. అందులో 6 సున్తీ కేసులు ఉన్నాయి.

"చట్టంలో మార్పులు వచ్చి ఉండొచ్చు. కానీ న్యాయం దొరకడం మాత్రం పూర్తిగా వేరే విషయం. నేరస్థులు పట్టుపడినా వాళ్లు ఈ చట్టాలను చాలా తేలికగా తీసుకుంటున్నారు" అని ఎల్డన్‌బౌకి చెప్పారు.

2013లో 13 సంవత్సరాల అమ్మాయికి సున్తీ చేసిన ఒక డాక్టరుకు కేవలం 3 నెలల జైలు శిక్ష మాత్రమే పడింది.

సున్తీ జరిగిన అమ్మాయి తల్లిని, డాక్టర్‌ను కూడా ఎల్డన్‌బౌకి కలిసారు.

"ఆ అమ్మాయి కాళ్ల మధ్యలో అసాధారణ పెరుగుదల ఉందని, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేశానని డాక్టర్ చెప్పారు. కానీ సున్తీ చేశానని ఒప్పుకోలేదు" అని ఎల్డన్‌బౌకి చెప్పారు.

సున్తీ చేయడం వల్ల ఆ చిన్నారి మరణించింది. అయినా కూడా తాను ఏ తప్పూ చేయలేదని ఆమె తల్లి గట్టిగా నమ్ముతున్నారు.

"ఒకవేళ మీ అమ్మాయి బతికి ఉండి ఉంటే, ఇప్పుడు కూడా తనకు సున్తీ చేయిస్తారా అని అడిగినప్పుడు, ఆమె చేయిస్తాననే సమాధానం ఇచ్చారు. సున్తీ చేస్తేనే అమ్మాయి వివాహానికి సిద్ధంగా ఉంటుంది" అని ఆమె చెప్పారు.

సున్తీ ఆచారానికి వ్యతిరేకంగా ఎల్డన్‌బౌకి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన చాలా వేధింపులకు గురవుతూ ఉంటారు.

"మేమొక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా మీద ఉమ్ము వేసి "మీరు అమెరికాలోలా మా అమ్మాయిలను వేశ్యలుగా మార్చాలని చూస్తున్నారు" అని నిందించారు అని ఎల్డన్‌బౌకి చెప్పారు.

ఎఫ్‌జిఎంకు వ్యతిరేకంగా ప్రచారం

ఫొటో సోర్స్, Jilla Dastmalchi

'ఆ గాయం నన్ను పూర్తిగా మార్చేసింది'

39 సంవత్సరాల జమీలాకు 9 ఏళ్ల వయసులో సున్తీ జరిగింది.

మా అమ్మగారు ఒక మంత్రసానిని కొంతమంది పక్కింటివాళ్లను ఇంటికి తీసుకుని వచ్చారు.

"గదిలో అన్నీ సిద్ధం చేసి, ఆమె నన్నొక్కదానిని మిగిలిన వారితో కలిపి గదిలో వదిలేసి వెళ్లిపోయారు" అని జమీలా గుర్తు చేసుకున్నారు.

"వాళ్లు నా షార్ట్స్ తొలగించారు. మిగిలిన వాళ్లు నా కాళ్లను వెడల్పుగా చేసి పట్టుకున్నారు. ఆ మంత్రసాని ఒక బ్లేడ్ తీసుకుని వచ్చి, నా జననేంద్రియాన్ని కత్తిరించారు" అని జమీలా చెప్పారు.

భరించలేని నొప్పితో పాటు, అది మిగిల్చిన మానసిక గాయం తనను పూర్తిగా మార్చేసిందని జమీలా అన్నారు.

సున్తీ జరగకముందు స్కూల్‌లో ఆమె అందరితో మాట్లాడుతూ, ధైర్యంగా, చలాకీగా ఉండేవారు. కానీ, సున్తీ జరిగిన తర్వాత ఆమె యుక్త వయసు మహిళల నుంచి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు.

"నేను స్కూలుకు వెళ్లే దారిలో నాకు సున్తీ చేసిన మంత్రసాని ఎదురు పడుతూ ఉండేవారు. దాంతో ఆమె ఎదురుపడకుండా వేరే దారిలో స్కూలుకు వెళుతూ ఉండేదానిని. ఆమె ఎదురుపడితే నాకు మళ్లీ సున్తీ చేస్తుందేమోననే భయం వెంటాడేది" అని జమీలా చెప్పారు .

భర్తతో సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కూడా జమీలాకు ఇప్పటికీ నొప్పి వస్తూ ఉంటుంది.

ఇలాంటి అనుభవం తన కూతురుకి కలగకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. ఎల్డన్‌బౌకితో కలిసి ఆమె అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

"నేను నా కూతురుకి సున్తీ చేయించకూడదని అనుకోవడానికి ఎల్డన్‌బౌకి కూడా ఒక కారణం. నా భర్త తరుపు కుటుంబం కూడా వాళ్ళింట్లో అమ్మాయిలకు సున్తీ చేయడం ఆపేశారు.

"మొత్తం మీద తమ పిల్లలకు సున్తీ చేయించే వారు క్రమంగా తగ్గుతున్నారు" అని జమీలా అన్నారు.

సున్తీ, ఖత్నా, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నా కూతుళ్లకు ఈ బాధ వద్దు

తను పడిన బాధ తన పెద్ద కూతురు పడకూడదని లైలా అనుకున్నారు. కానీ, కూతురుకు సున్తీ చేయడానికి అన్నీ సిద్ధం చేసిన భర్తను మాత్రం ఆమె ఆపలేకపోయారు.

లైలా మిగిలిన కూతుర్లకు సున్తీ చేయించే సమయం వచ్చేటప్పటికి ఈ ఆచారం చట్టవ్యతిరేకం అయింది. అలాగే ఎల్డన్‌బౌకి ఇచ్చిన ప్రసంగాలు కూడా వారిని సున్తీకి గురి కాకుండా రక్షించుకునేందుకు ధైర్యాన్నిచ్చాయి.

తమ చుట్టుపక్కల ఉండే కొంత మంది అమ్మాయిలు సున్తీ జరిగిన తర్వాత రక్తస్రావం అయి మరణించిన విషయం కూడా ఆమెకు తెలుసు.

"నా కూతుళ్లకు అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? అది తప్పని నాకు తెలుసు. కానీ ఇతరులను ఒప్పించలేకపోయేదానిని" అని లైలా చెప్పారు.

"నేను నా భర్తతో పాటు నా అత్తమామలు, నా కుటుంబం మొత్తాన్నీ ఒప్పించాల్సి వచ్చింది. వాళ్లందరూ ఈ బాధను అనుభవించిన వారే. కానీ, నేను సున్తీ వద్దని చెప్పినప్పుడు ఈ ప్రపంచాన్ని మార్చడానికి నువ్వెవరు? అనే ధోరణిలో వాళ్లు మాట్లాడారు" అని అన్నారు.

చివరకు లైలా భర్త తన పిల్లలకు సున్తీ చేయించకుండా ఉండేందుకు అంగీకరించారు.

"కానీ నా పెద్ద కూతురు కోసం ఎప్పుడూ నా హృదయం రోదిస్తూనే ఉంటుంది. తనకి చాలా రక్తస్రావం అయింది. తనకు సున్తీ చేయకుండా నేను రక్షించుకోలేకపోయాను" అని చెప్పారు.

లైలా, జమీలా పేర్లు మార్చాం.

ఈ కథనానికి బీబీసీ అరబిక్ రీమ్ ఫతెల్ బాబ్ అదనపు సమాచారాన్ని అందించారు.

ఇల్లస్ట్రేషన్స్: జిల్లా దస్త్మల్చి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)