మావోయిస్టు హరిభూషణ్ మృతి-కరోనా లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ - Newsreel

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ (50)మృతి చెందినట్టు తెలంగాణ పోలీసులు వెల్లడించారు.
బస్తర్ అడవుల్లో గుండెపోటు లేదా కరోనాతో ఆయన మృతి చెందినట్టు తమకు విశ్వసనీయమైన సమాచారం అందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మీడియాకు తెలిపారు.
మావోయిస్ట్ విధివిధానాలను ఖరారు చేసే 'సెంట్రల్ కమిటీ' సభ్యుడైన హరిభూషణ్‌పై రూ.40లక్షల రివార్డ్ ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసులకు, యాంటీ నక్సల్ బలగాల 'మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో ఆయన ఉన్నారు.
హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మడగూడెం. ఇంటర్ చదివే రోజుల్లోనే దళంలోకి వెళ్లిన ఆయన అంచెలంచెలుగా మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ వరకు ఎదిగారు.

హరిభూషణ్ బస్తర్ అడవుల్లో 'మీనాగట్ట' అటవీ ప్రాంతంలో చనిపోయాడని, దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించినట్టు జూన్ 21న ఛత్తీస్‌గఢ్ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.
అదే రోజు కొత్తగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ మావోయిస్టు హరిభూషణ్ మరణం గురించి వెల్లడించారు.
మావోయిస్టులలో చాలామంది అగ్రనాయకులు సైతం కరోనా బారిన పడ్డారని, హరిభూషణ్ మరణంతో ఆ విషయం తేటతెల్లమైందని ఆయన అన్నారు.
కరోనాతో బాధపడుతూ అనేకమంది మావోయిస్టుల లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ, సీనియర్ నేతలు వారిని లొంగిపోనివ్వకుండా అడ్డుకుంటూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఎస్పీ సునీల్ దత్ ఆరోపించారు.
లొంగిపోయిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు.
హరిభూషణ్ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్ యుద్ధ నౌక చేరువలో వార్నింగ్ షాట్స్ పేల్చామన్న రష్యా...కొట్టిపారేసిన బ్రిటన్
నల్ల సముద్రంలో బ్రిటన్ యుద్ధ నౌక సమీపంలో రష్యన్ గస్తీ నౌక, మరో యుద్ధ విమానం హెచ్చరికగా కాల్పులు (వార్నింగ్ షాట్స్) జరిపాయని రష్యా రక్షణ శాఖను ఉటంకిస్తూ రిపోర్టులు వచ్చాయి. అయితే బ్రిటన్ మాత్రం దాన్ని తోసి పుచ్చింది.
బ్రిటన్‌కు చెందిన HMS డిఫెండర్ నౌక ప్రయాణిస్తున్న దారిలో రష్యా గస్తీ నౌక రెండుసార్లు హెచ్చరికగా కాల్పులు జరిపిందని, Su24-M జెట్ విమానం నాలుగు బాంబులు వేసిందని ఆ దేశ రక్షణ శాఖను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి.
క్రిమియాకు దక్షిణాన ఉన్న కేప్ ఫయోలెంట్ సమీపంలో బ్రిటన్ నౌక చేరువగా తాము వార్నింగ్ షాట్స్ జరిపినట్లు, తమ చర్యలతో బ్రిటన్ నౌక తన మార్గాన్ని మార్చుకుందని రష్యా చెప్పినట్లు అందులో పేర్కొన్నారు.
HMS డిఫెండర్ యుద్ధ నౌక క్రిమియా సమీపంలో రష్యా సముద్ర జలాల్లోకి ప్రవేశించిందని ఆ దేశ రక్షణ శాఖను ఉటంకిస్తూ ఇంటర్ పాక్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వార్నింగ్ షాట్స్ పేల్చారన్న వార్తలు నిజం కాదు: బ్రిటన్
దీనిపై స్పందించిన బ్రిటన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాంటి కాల్పులేవీ జరగలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తమ నౌక అంతర్జాతీయ నిబంధనలకు లోబడి యుక్రెయిన్ జలాల్లో ప్రయాణిస్తోందని కూడా రక్షణ శాఖ వెల్లడించింది. నల్ల సముద్రంలో రష్యా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోందని, ఈ మేరకు తమకు సమాచారం కూడా వచ్చిందని బ్రిటన్ తెలిపింది.
కాల్పులు జరిపినట్లు తమ దృష్టికి రాలేదని, రష్యా ప్రకటనలను తాము ఆమోదించడం లేదని కూడా బ్రిటన్ స్పష్టం చేసింది.
రష్యా 2014లో యుక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అయితే, దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించ లేదు.

లాహోర్‌లో హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు-ఇద్దరు మృతి
పాకిస్తాన్ లాహోర్ నగరంలోని జౌహర్ టౌన్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించారు. 14 మంది గాయపడ్డారు. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు లాహోర్ కమిషనర్ కెప్టెన్ (రిటైర్డ్) ఉస్మాన్ యూనిస్ ధృవీకరించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఒక పెద్ద గుంత ఏర్పడిందని ఉస్మాన్ యూనిస్ తెలిపారు.
సమీపంలో ఉన్న ఒక కారు, మోటారుబైక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన స్థలాన్ని బట్టి చూస్తే అది ఆత్మాహుతి దాడి అనిపించడం లేదని ఆయన అన్నారు.
అయితే, అక్కడకు పేలుడు పదార్ధాలు ఎలా తీసుకునివచ్చారనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సంఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని పేలుడు జరగడానికి గల కారణాలను సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు.
లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు, జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారని పాకిస్తాన్ బీబీసీ కరస్పాండెంట్ షుమైలా జాఫ్రీ తెలిపారు.
హఫీజ్ సయీద్‌కు చెందిన అన్ని ఇళ్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడ రాత్రీ పగలు పోలీసుల గస్తీ ఉంటుంది. సయీద్ ఇంటికి వెళ్లే రోడ్డులోని ఓ జంక్షన్‌లో ఈ పేలుడు సంభవింవించింది.

ఫొటో సోర్స్, EPA
యాపిల్ డైలీ: హాంకాంగ్ దినపత్రిక మూసివేత.. మీడియాపై దాడుల నేపథ్యంలో నిర్ణయం
హాంకాంగ్‌లో అధిక జనాదరణ ఉన్న ప్రజాస్వామ్య అనుకూల దినపత్రిక 'యాపిల్ డైలీ'ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
హాంకాంగ్‌లో మీడియా స్వేచ్ఛకు విఘాతమేర్పడడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో గతవారం యాపిల్ డైలీ కార్యాలయాలలో సోదాలు జరిపారు.
ఆ తరువాత ఆ పత్రిక యాజమాన్య సంస్థకు చెందిన 16.4 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశారు.
పత్రిక చీఫ్ ఎడిటర్, మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లను పోలీసులు నిర్బంధించారు.
యాపిల్ డైలీ వ్యవస్థాపకులు జిమ్మీ లాయీ ఇప్పటికే జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









