ఛత్తీస్‌గఢ్: పోలీసు శిబిరానికి వ్యతిరేకంగా 40 గ్రామాల గిరిజనులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు

పోలీస్ పోస్ట్

ఫొటో సోర్స్, Alok putul

    • రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
    • హోదా, బీబీసీ కోసం

మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలోని సిల్గేర్ గ్రామంలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు చనిపోవడంపై నిరసనలు జరుగుతున్నాయి. రోజురోజుకీ నిరసనలు చేపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

సుక్మా, బీజాపుర్ జిల్లా కలెక్టర్లతో ఆదివారం సమావేశమైన తర్వాత కూడా గిరిజనుల నినాదాలు కొనసాగుతున్నాయి. తమ ప్రాంతంలో పోలీసు శిబిరాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్)కు చెందిన 153వ బెటాలియన్ శిబిరాన్ని వ్యతిరేకిస్తూ పరిసరాల్లోని దాదాపు 40 గ్రామాల గిరిజనులు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు.

‘‘రోడ్డు నిర్మించేందుకు పోలీసు శిబిరం ఏర్పాటు చేశామని ప్రభుత్వం అంటోంది. అంత పెద్ద రోడ్లపై మేం ఏం చేస్తాం?’’అని అరలంపల్లి గ్రామానికి చెందిన సోడీ దులా అంటున్నారు.

‘‘మాకు అంగన్వాడీలు కావాలి. హాస్పిటళ్లు కావాలి. మంచి నీళ్ల పంపులు కావాలి. పోలీసు శిబిరాలు కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, ALOK PUTUL

ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్

‘‘శిబిరం మా కోసమే అయితే, కాల్పులు ఎందుకు?’’

‘‘ఆ శిబిరాన్ని మా మంచి కోసమే ఏర్పాటుచేస్తే, కాల్పులు ఎందుకు జరిపారు? ముగ్గుర్ని ఎందుకు కాల్చి చంపారు?’’అని సోడి ప్రశ్నించారు.

అయితే మావోయిస్టులు ఒత్తిడి చేయడం వల్లే గిరిజనులు ఇలా శిబిరానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారని జగదల్‌పుర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

‘‘ఈ శిబిరంతో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడుతోంది. అందుకే దీన్ని వ్యతిరేకించాలని గిరిజనులపై మావోయిస్టులు ఒత్తిడి చేస్తున్నారు’’ అని బస్తర్ ఐజీ సుందర్ వ్యాఖ్యానించారు.

మే 17న జరిగిన కాల్పుల్లో మరణించిన ముగ్గురూ మావోయిస్టులేనని పోలీసులు చెబుతున్నారు.

అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదివాసీ సమాజ్ ఛైర్మన్ ప్రకాశ్ ఠాకుర్ డిమాండ్ చేస్తున్నారు.

‘‘ఆ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో రెండు డజన్ల మంది గాయపడ్డారు. వారంతా మావోయిస్టులు కాదు.. రైతులు’’.

‘‘ఇక్కడి నుంచి చాలా మంది మిర్చి పంట కోత కోసం పొరుగునున్న తెలంగాణకు వెళ్తుంటారు. మరణించిన వారు కూడా కొన్ని రోజుల క్రితమే అక్కడి నుంచి తిరిగి వచ్చారు’’.

బస్తర్

ఫొటో సోర్స్, Alok putul

‘‘అబద్ధాలు చెబుతున్నారు’’

‘‘పోలీసులు తమని తాము సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారు. నిరసన చేపడుతున్న వారిపైకి పోలీసులు కాల్పులు జరిపారు. అయితే మావోయిస్టులు మరణించారని అంటున్నారు. ఇది ఎలా సాధ్యం. మరణించిన వారంతా రైతులే’’అని ప్రకాశ్ మీడియాతో అన్నారు.

నిరసనలు చేపడుతున్న వారితో మాజీ ఎమ్మెల్యే, గిరిజన మహాసభ నాయకుడు మనీశ్ కుంజమ్‌ కూడా కలిశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 వేలు ఉన్న కవర్లను జిల్లా పరిపాలనా విభాగం ఇచ్చిందని స్థానిక గిరిజనులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు ఆ కవర్లను వెనక్కి ఇచ్చేయాలని మృతుల కుటుంబాలు భావిస్తున్నాయి’’.

ఒకవేళ మరణించిన వ్యక్తులు మావోయిస్టులే అయితే, వారి మృతికి పరిహారం ఎందుకు ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ మరణించిన వ్యక్తులు రైతులే అయితే వారిని ఎందుకు మావోయిస్టులని ప్రచారం చేస్తున్నారు?

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, ALOK PUTUL

ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్

నిరసనలు ఎలా మొదలయ్యాయి?

సుక్మాలో ఈ నెల మొదట్లో సీఆర్‌పీఎఫ్ శిబిరం ఏర్పాటు చేస్తుండగా కొందరు గిరిజనులు వచ్చి నిరసనలు చేపట్టారు. అయితే, ఇక్కడ ఎలాంటి శిబిరం ఏర్పాటు చేయడంలేదని పోలీసులు వారికి వివరించారు. కానీ మే 12న అక్కడ శిబిరం ఏర్పాటుచేశారు.

రెండు రోజుల తర్వాత రోడ్డుపై గిరిజనులు బైఠాయించి నిరసనకు దిగారు. తమ స్థలంలో పోలీసులు శిబిరాన్ని ఏర్పాటుచేశారని వారు ఆరోపిస్తున్నారు.

అయితే, మే 17న గిరిజనులు, భద్రతా బలగాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గిరిజనులపై బలగాలు లాఠీఛార్జి చేశాయి. లాఠీఛార్జికి కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారని గిరిజనులు చెబుతున్నారు.

గిరిజనుల్లో కలిసిపోయిన మావోయిస్టులే మొదట కాల్పులు జరిపారని, అందుకే మేం కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. రెండు డజన్ల మంది గాయపడ్డారు. ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ ఎనిమిది మందిని పోలీసులు మూడు రోజులపాటు అదుపులోనే ఉంచుకున్నట్లు గిరిజనులు తెలిపారు. నిరసనలు ఆపితేనే, వారిని విడిచిపెడతామని చాలా ఒత్తిడి చేసినట్లు వివరించారు.

అయితే, కేవలం ప్రశ్నించేందుకే వారిని అదుపులోకి తీసుకున్నామని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ చెప్పారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

‘‘పేరు తెలియదు కానీ.. మావోయిస్టులు అంటున్నారు’’

‘‘గిరిజనులపై కాల్పులు జరపడం బాధాకరం. భద్రతా బలగాలు ప్రయత్నించి ఉంటే, ఇలా కాల్పులు జరగకుండా అడ్డుకోవచ్చు. కానీ అలా చేయలేదు’’అని మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజం వ్యాఖ్యానించారు.

‘‘నక్సల్స్ అంశంపై పనిచేస్తున్న పోలీసు అధికారులు.. గిరిజనులందరినీ మావోయిస్టులుగానే చూస్తారు. అందుకే గిరిజనుల్ని ఇలా చూస్తున్నారు’’.

‘‘పోలీసుల కాల్పులపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాల్సిన అవసరముంది. నేరం చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలి’’.

ఎలాంటి విచారణ చేపట్టకుండా, కనీసం పేర్లు కూడా తెలియకుండా, మృతులను మావోయిస్టులని ఎలా చెబుతారని బిలాస్‌పుర్ హైకోర్టు అడ్వొకేట్ ప్రియాంకా శుక్లా ప్రశ్నించారు.

‘‘పేర్లే తెలియనప్పుడు, వారిని మావోయిస్టులని అసలు ఎలా పిలుస్తారు?’’.

‘‘బస్తర్‌లో అందరూ ఒక విషయాన్ని చెబుతుంటారు. మొదట కాల్చేస్తారు.. తర్వాత మవోయిస్టులని ముద్ర వేస్తారని అంటారు. మావోయిస్టని చెబితే.. ఎవరూ ఏమీ అడగరు. అందుకే రైతు హత్యను కూడా మావోయిస్టు హత్యగా చెబుతుంటారు’’.

సాయుధ బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు’’

సామాజిక ఉద్యమకర్త, న్యాయవాది డాక్టర్ బెలా భాటియా, బస్తర్‌లో ఏళ్లుగా నివసిస్తున్న ఆర్థికవేత్త జీన్ డ్రెజ్‌లు ఘటన స్థలానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురిని కూడా ఓ పోలీస్ స్టేషన్ దగ్గర నిలిపివేశారు. వారి కార్ తాళాన్ని తీసుకెళ్లిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి. మనీశ్ కుంజంను కూడా ఘటన స్థలానికి వెళ్లకుండా తొలుత అడ్డుకున్నారు. గిరిజన ఉద్యమకర్త సోని సూరీ అక్కడకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు.

సిల్గేర్‌కు వెళ్లకుండా సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదుల్ని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ఏమైనా దాచాలని ప్రయత్నిస్తోందా? అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ ఆలోక్ శుక్లా వ్యాఖ్యానించారు.

భూపేశ్ భగల్

ఫొటో సోర్స్, BHUPESH BAGHEL/FACEBOOK

కాంగ్రెస్, బీజేపీ మౌనం

‘‘ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్.. రెండు పార్టీలూ ఈ విషయంపై స్పందించడం లేదు. దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’అని ఆలోక్ శుక్లా అన్నారు.

గిరిజనుల్ని మావోయిస్టులని పిలవడం ద్వారా.. అందరి గిరిజనుల్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘మావోయిస్టులు చెబితేనే, గిరిజనులు ఆ నిరసనలు చేపడుతున్నారని అనుకుందాం. అదే నిజమైతే, ప్రభుత్వం సంతోషపడాలి. ఎందుకంటే మావోయిస్టులు ప్రజాస్వామ్య విధానంలో నిరసనలు చేపడుతున్నారని అనుకోవాలి. అలాకాకుండా కాల్పులు జరపకూడదు’’.

బస్తర్‌లో గత ఏడాది ఇలా భద్రతా బలగాల శిబిరాలను వ్యతిరేకిస్తూ డజనుకుపైగా ఉద్యమాలు జరిగాయి. కొన్ని నిరసనలు కొన్ని రోజులపాటు కొనసాగాయి. అయితే, మావోయిస్టుల ఒత్తిడిపైనే గిరిజనులు ఈ నిరసనలు చేపడుతున్నారని పోలీసులు అంటున్నారు.

డ్రెజ్

ఫొటో సోర్స్, Alok putul

ఫొటో క్యాప్షన్, డ్రెజ్

‘‘స్కూళ్లు, హాస్పిటళ్లు కావాలి.. శిబిరాలు కాదు’’

‘‘ఇక్కడ పెట్టాల్సింది శిబిరాలు కాదు. స్కూళ్లు, హాస్పిటళ్లు కావాలి. అప్పుడే మాకు మంచి జరుగుతుంది. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల కిందకు బస్తర్ వస్తుంది. ఇక్కడ గ్రామ సభ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదు. అయితే, ఎలాంటి గ్రామ సభ అనుమతులు లేకుండానే ఇక్కడ శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు’’అని ఆగరట్ట బొడ్డిగూడ గ్రామానికి చెందిన సోయం సుబ్బా వ్యాఖ్యానించారు.

‘‘గిరిజనులు వద్దు అన్నప్పుడు, అక్కడ శిబిరాన్ని వెంటనే తొలగించాలి. అక్కడ శాంతి ఉండాలని అనుకుంటే శిబిరం ఏర్పాటు చేయకూడదు’’అని ప్రకాశ్ ఠాకుర్ అన్నారు.

మృతులకు న్యాయం జరిగేందుకు కోర్టుకు వెళ్లాలని గిరిజన సంఘాలు భావిస్తున్నాయి.

మరోవైపు నిరసనకారులు వెనక్కి వెళ్లాలని ఐజీ సుందర్ అభ్యర్థించారు. ‘‘వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. కరోనా ముప్పు కూడా పెరుగుతోంది. నిరసనకారులు వెనక్కి వెళ్లాలి’’.

గిరిజనులు చెప్పేవన్నీ తాము ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని సుక్మా జిల్లా కలెక్టరు వినీత్ నందన్వర్ చెప్పారు.

ఇంతకీ సిల్గేర్‌లో శిబిరం ఉంటుందా? లేదా దాన్ని తొలగిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడా దొరకడం లేదు.

ఇప్పటివరకు ఇలాంటి శిబిరం ఒక్కదాన్ని కూడా బలగాలు తొలగించకపోయినప్పటికీ.... గిరిజనులు మాత్రం తమ నినాదాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)