ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పులు: ‘పట్టుబట్టి పోలీస్ అయ్యాడు.. మమ్మల్ని ఒంటరి వాళ్లను చేసి పోయాడు’

ఫొటో సోర్స్, ALOK PUTUL / BBC
- రచయిత, ఆలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, పండరీపానీ నుంచి, బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్‌లో మహానది ఒడ్డున ఉన్న పండరీపానీ గ్రామాన్ని ఇప్పుడు మౌనం ఆవహించింది.
ఈ ఊరిలోని ఒక వీధిలో చివరగా ఉన్న ఇంటి చుట్టూ జనం పోగయ్యారు.
ఆ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి.
ఆ ఇల్లు రమేశ్ కుమార్ జుర్రీది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ చీఫ్ కానిస్టేబుల్‌గా ఉన్నారు.
శనివారం బీజాపుర్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారు. ఆయన వయసు 35 ఏళ్లు.
ఆ ఇంటి ముందు ముగ్గురు, నలుగురు పోలీసులు నిల్చొని ఉన్నారు.
‘‘జగ్దల్‌పుర్‌లో ఇప్పుడు ఆయనకు అంతిమ వీడ్కోలు పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాంకెర్‌కు తీసుకువచ్చి, రోడ్డు మార్గంలో పండరీపానీకి తరలిస్తారు. ఇదంతా జరిగేందుకు ఇంకో రెండు గంటలు పట్టొచ్చు’’ అని వారిలో ఒక పోలీసు చెప్పారు.
కాంకెర్ జిల్లా కేంద్రం నుంచి పండరీపానీ 35 కిలోమీటర్లల దూరంలో ఉంది.
ఈ గ్రామ జనాభా సుమారు 1,900.
ఊరి మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ రోడ్డు మీద ఒక పోలీసు నిలువెత్తు విగ్రహం కనిపిస్తోంది.
ఆ విగ్రహం తామేశ్వర్ సిన్హా అనే పోలీసుదని స్థానికులు చెప్పారు.
2007, జులై 9న సుక్మా జిల్లాలోని మరాయిగూడలో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తామేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో జిల్లా పోలీసు దళంలో ఆయన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు.
రోడ్డుకు ఇంకో వైపు మరో పోలీసు విగ్రహం కూడా ఉంది.
ఈ స్థలానికి దాదాపు 200 మీటర్ల దూరంలో రమేశ్ కుమార్ జుర్రీ ఇల్లు ఉంది.

ఫొటో సోర్స్, ALOK PUTUL / BBC
అందర్ని ఒప్పించి పోలీస్ అయ్యారు..
రమేశ్ అంతిమ సంస్కారాల కోసం ఏర్పాట్లు చేయడంలో ఆయన తమ్ముడు సంజయ్ జుర్రీ తలమునకలై ఉన్నారు.
వారి ఇంటి ముందు ఉన్న పొలంలోనే సమాధి కోసం గుంత తవ్వారు.
2005లో రమేశ్ తండ్రి మేఘనాథ్ చనిపోయారు. అప్పటి నుంచి సంజయ్ తమ ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.
రమేశ్ కుటుంబానికి తమ ఊరిలో దాదాపు తొమ్మిది ఎకరాల పొలం ఉంది.
రమేశ్, సంజయ్‌లకు ఇద్దరు సోదరీమణులు. ఇక్కడికి దగ్గరి ఊర్ల వాళ్లతోనే వారికి వివాహం జరిపించారు.
తన భార్య సునీత, నాలుగేళ్ల కూతురు సెజల్‌తో కలిసి రమేశ్ బీజాపుర్‌లోనే ఉండేవారు.
రమేశ్ మరణ వార్త మొదటగా తమ ఇంటి పొరుగున ఉండే ఒక పిల్లాడి ద్వారా సంజయ్‌కు తెలిసింది.
‘‘ముందు నేను నమ్మలేదు. ఆ తర్వాత టీవీలో వార్తలు చూశా. ఇప్పుడు నేను ఒంటరివాడినైపోయా. మా అందరిలోకెల్లా రమేశే పెద్ద. అన్నీ తనే చూసుకునేవాడు. చివరగా హోళీ పండుగ తర్వాత రెండు, మూడు రోజులకు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. పిల్లల గురించి, ఇంట్లో అందరి బాగోగుల గురించి మాట్లాడుకున్నాం. అమ్మ గురించి తను బెంగతో ఉన్నాడు’’ అని చెప్పారు సంజయ్.
మొదటి నుంచి పోలీసు శాఖలో చేరాలని రమేశ్ అనుకునేవారని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంట్లో వాళ్లు భయపడ్డారని సంజయ్ చెప్పారు.
ఇంట్లో వాళ్లు ఎంత వద్దంటున్నా, వాళ్లందరిని ఒప్పించి ఆయన పోలీసు శాఖలో చేరారని వివరించారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL / BBC
‘తల్లి కోసం బదిలీ చేయించుకోవాలనుకున్నాడు’
రమేశ్ తల్లి సత్యవతి ఏడ్చి, ఏడ్చి నీరసంగా తయారయ్యారు.
చుట్టూ ఉన్న మహిళలు ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
రమేశ్ చిన్నమ్మ విద్య ఉసేండీ కాంకెర్‌లో ఉంటారు.
‘‘సత్యవతి ఆరోగ్యం బాగుండటం లేదు. తల్లి బాగోగులు చూసుకునేందుకు ఇక్కడికి బదిలీ చేయమని అధికారులను అడుగుతానని రమేశ్ మూడు, నాలుగు రోజుల క్రితమే జగ్దల్‌పుర్ వెళ్లాడు. తల్లిని, ఇంటిని, అందరినీ తనే చూసుకునేవాడు’’ అని ఆమె అన్నారు.
ఎదురుకాల్పుల వార్తను టీవీలో చూస్తున్న సమయంలోనే, బీజాపుర్‌లో ఉంటున్న రమేశ్ భార్య సునీత నుంచి తనకు ఫోన్ వచ్చిందని విద్య చెప్పారు.
‘‘కోడలు ఫోన్ చేసి, టీవీ చూడమని చెప్పింది. టీవీలో చూపిస్తున్న దృశ్యాల్లో జనంలో మా బాబు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చూశాం. కానీ, తను కనిపించలేదు’’ అని విద్య అన్నారు.
ఇలా చెబుతూనే ఆమె కన్నీటి పర్యంతమైపోయారు. పక్కనున్న మహిళలు ఆమెను ఓదార్చారు.
రమేశ్ తండ్రి బస్తర్‌లోని బైలాడీలాలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పనిచేసేవారని రమేశ్‌కు చిన్నాన్న వరుసయ్యే వ్యక్తి ఒకరు చెప్పారు.
రమేశ్ ప్రాథమిక విద్యాభ్యాసం బైలిడీలాలోనే సాగింది. కాంకెర్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు.
ఆ తర్వాత 2010లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్ష రాశారు. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమయ్యారు.
ఆ ఉద్యోగం వచ్చిన ఐదేళ్ల తర్వాత రమేశ్ పెళ్లి చేసుకున్నారు. వారి కూతురి వయసు ఇప్పుడు నాలుగేళ్లు.

ఫొటో సోర్స్, ALOK PUTUL / BBC
గౌరవ వందనం...
రమేశ్ ఇంటికి కొంత దూరంలో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో ఆయనకు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ పాఠశాల మైదానంలో ఓవైపు టెంటు వేశారు. కొన్ని వందల మంది మహిళలు అక్కడ కూర్చొని ఉన్నారు. కొందరు పురుషులు అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నారు.
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది అక్కడ ఉన్నారు. సమీప ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చేరుకుంటున్నారు.
ఆ ప్రాంగణంలోకి రెండు, మూడు వాహనాలు వచ్చాయి. రమేశ్ భార్య సునీత, కూతురు సెజల్ బీజాపుర్ నుంచి వచ్చారని అక్కడున్న పోలీస్ ఒకరు చెప్పారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే కొంత మంది యువకుల బృందం బైక్‌లపై ‘జై జవాన్... జై కిసాన్’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకుంది. ఆ బైకుల వెనుక కొన్ని వాహనాలు ఉన్నాయి. వాటిలో రమేశ్ మృతదేహాన్ని తీసుకువచ్చిన ఒక అంబులెన్స్ కూడా ఉంది.
వెంటనే అక్కడున్న జనం లేచి నిల్చున్నారు. అప్పటివరకూ కుదురుగా కూర్చొని ఉన్నట్లున్న జనం... రమేశ్‌ను కడసారి చూసేందుకు ఒక్కసారిగా పోటీపడ్డారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL / BBC
ఏడుస్తున్న నానమ్మను తదేకంగా చూస్తున్న చిన్నారి...
నినాదాల హోరు, పూల జల్లుల నడుమ రమేశ్ మృతదేహాం ఉన్న శవపేటికను అక్కడున్న వేదికపై పెట్టారు.
పోలీసులు రమేశ్‌కు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రమేశ్ కుటుంబ సభ్యులు, ఇతరులు వచ్చి పుష్ప గుచ్ఛాలు, పూల దండలు సమర్పించారు.
తనను రమేశ్ మొహం చూడనివ్వాలని ఆయన భార్య అడుగుతూ ఉన్నారు. మహిళా పోలీసులు ఆమె కన్నీళ్లు తుడుస్తూ, సముదాయిస్తూ ఉన్నారు.
నాలుగేళ్ల సెజల్ ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో, మౌనంగా అందరినీ చూస్తూ ఉండిపోయింది. ఏడుస్తున్న నానమ్మ ఒడిలో కూర్చొని, ఆమెనే తదేకంగా చూస్తోంది.
రమేశ్‌కు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం దాదాపు గంట పాటు సాగింది. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం వారి పొలంలోకి తీసుకువెళ్లారు.
రమేశ్ ఇంటి ముందు నిల్చున్న ఒక పోలీసు తనకు వాట్సాప్‌లో వచ్చిన ఓ వీడియో చూస్తున్నారు. ఎదురుకాల్పుల ఘటన తర్వాత అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో అది.
‘‘ఈ ఘటన తర్వాత మేం పోరాటాన్ని తీవ్రం చేస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ పోలీసులు అమరులయ్యారు. వారి కుటుంబ సభ్యులకు నేను...’’ అంటూ అమిత్ షా మాటలు వినిపిస్తుండగానే ఆ పోలీసు ఆ వీడియోను ఆపేశారు.
‘‘మీరు జర్నలిస్టే కదా... రాసి పెట్టుకోండి. అసలేమీ జరగదు’’ అని ఆ పోలీసు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








